Pages

16 September 2012

ఓజోన్ పొర మనకేం ఇచ్చింది ??


ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణా దినోత్సవ శుభాకాంక్షలు



ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. భూమ్మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్నిరూపొందించారు.
తర్వాత 1995 నుంచి ప్రతి సంవత్సరం  ఓజోన్ పొర రక్షణ కోసం రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్‌పై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఈ తేదీని ఓజోన్ పరిరక్షణ దినంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు.

సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల 
బారినుండి, సకలజీవరాశులును కాపాడుతున్న 
రక్షణాకవచం ఓజోన్ పొర.మూడు ఆక్సిజన్ 
పరమాణువులు కలసి ఓజోన్ అణువుని 
ఏర్పరుస్తాయి.
భూమి పై నుంచి 20నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటో ఆవరణం కింది భాగంలో ఓజోన్ పొర 
వుంటుంది.మొదటి సారిగా 1913లో దీనిని గుర్తించిన  
ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు హెన్రీ  బైసన్  మరియు  చార్లస్ ఫాబ్రే లు. 
తరువాత బ్రిటిష్ శాస్త్రవేత్త డబ్సన్ దీనిపైన విస్తృతమైన 
పరిశోధనలు నిర్వహించారు. ఆయన గౌరవార్థం ఓజోన్
 
శాతంను డబ్సన్ యూనిట్లలో కొలుస్తారు.
సూర్యుని నుండి  వెలువడే  ప్రమాదకర  కిరణాలను
 
97 నుంచి 99 శాతం వరకు
 అడ్డుకుంటాయ్. 
ఓజోన్‌ తరిగి పోయే విధానం ప్రధానంగా
మూడు దశలలో  జరుగుతుంది.
మొదటి దశః మానవ సంబంధిత కార్య కలాపాల 
వల్ల ఈ సి.ఎఫ్‌.సి ఉత్పత్తి జరిగి వాతావరణంలోని 
ఓజోన్‌ పొరకు చేరతాయి .
రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సి ని విచ్చిన్నం చేసి  క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.
మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ పొర తరిగి పోయేటట్లు చేస్తాయి.
మనం మితిమీరిన స్థాయిలో ఇంధనాల్ని వాడడం వల్ల నత్రజని ఆక్సైడ్‌లు వాతావరణంలో పేరుకుపోతాయి. మితిమీరిన మోతాదులో ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వాడితే అందులో ఉపయోగించే ఫ్రియాన్‌ వంటి ఫ్లోరీన్‌ సంబంధిత వాయువుల పరిమాణం గాలిలో ఎక్కువ అవుతుంది. టైర్లు, రబ్బర్లు, ఇతర ఆధునిక ప్లాస్టిక్కుల వాడడం వల్లనూ, వాటిని కాల్చినపుడు క్లోరీన్‌ సంబంధిత సేంద్రియ పదార్థాలు వాతావరణంలో పెరుగుతాయి. ఇలా నత్రజని, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ పదార్థాలు ఎక్కువయితే వాతావరణంలో మునుపెన్నడూ జరగని విధంగా రసాయనిక చర్యలు జరుగుతాయివాటి కారణంగా ఓజోన్ పొర పలుచబడుతుంది. 



15 September 2012

వేయిరూపాయల నాణెం చూసారా !!!



రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు త్వరలో వేయి రూపాయల నాణెం ను విడుదల చేయబోతున్నారు.
తంజావూరు బృహదీశ్వరాలయం నిర్మించి వేయి సంవత్సరాలైన సందర్భంగా దీనిని ముద్రిస్తామని రెండేళ్ళుగా ఊరిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు ఈ నాణెం బుకింగ్ ను ప్రారంభించింది.



ఇండియన్ గవర్నమెంటు మింట్, ముంబై వారు ముద్రిస్తున్న ఈ నాణెం ప్రూఫ్ సెట్      ( ఒక వేయి రూపాయిలు మరియు ఐదు రూపాయల నాణెలు) ఖరీదు 4875 రూపాయలు. అన్ సర్క్యూలేటెడ్ సెట్ ఖరీదు 4535 రూపాయలు. ఈ ఐదు రూపాయల నాణెం ఇప్పటికే చలామణీలో వుంది. కావలసిన వారు ఈ లింక్ ను చూడండి.

ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు

ఇంజనీరింగ్ దిగ్గజం శ్రీ మెక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టంబర్ 15 వ తేది వెంకమ్మ, శ్రీనివాస శాస్త్ఱ్రి దంపతులకు జన్మించారు. వారి పుట్టినరోజునే మనం  ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నాం.
ఆధునిక భారతదేశంను తీర్చిదిద్దిన తొలితరం మహానుభావుడు విశ్వేశ్వరయ్యకు 
జన్మదిన శుభాకాంక్షలు.









 తపాలా శాఖ వారు విశ్వేశ్వరయ్యగారి పై విడుదల చేసిన స్టాంప్ మరియు ఫస్ట్ డే కవర్
















1955 వ సంవత్సరంలో  పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతులుమీదగా  భారత రత్న అవార్డు అందుకుంటున్న విశ్వేశ్వరయ్య గారు.

14 September 2012

అలుపెరగని పయనం.


నవ్వుకుంటూ,
నీతో నువ్వు మాట్లాడుకుంటూ,
ఈ శుష్క ప్రపంచాన్నొదిలి,
పరుగెడుతూ, గెంతులేస్తూ
అలుపెరుగక పయనిస్తున్నావ్.
ఎక్కడికో మరి....
మెత్తని చేతుల్లోకా....
చెక్కిళ్ళ మెరుపుల్లోకా.....
ఆ హృదయపు లోతుల్లోకా.....
ఎక్కడికో మరి....

13 September 2012

జ్వాలా జలము


జ్వాల వలే వేదనను,
జలము వలే స్వాంతనను,
ఏక కాలంలో
పరిచర్యా, పరితాపాలను
చూపగల నేర్పు,
నీ ప్రేమ జ్వాలా జలమునకు తప్ప
అన్యులకు సాధ్యమా,.. సుమా!!

12 September 2012

తేనెల తేటల మాటలు


 


 " తేనెల తేటల మాటలతో "  అంటూ మా పాఠశాల విద్యార్థినులు  ఆలాపించిన గీతం వీడియో  ఇది. 
  ఓ చిన్న ప్రయత్నం చేశాను, ఇలా కొన్ని మంచి పాటలను చిత్రీకరించి , కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన
శ్రీ గుంటూరి భాస్కర రావు గారు మా పాఠశాలకు బహుకరించిన ప్రోజెక్టర్ సహాయంతో  చుట్టుపక్కల గ్రామాలలో ప్రదర్శించాలని 
అనుకుంటున్నాము. అక్షరాస్యత, పర్యావరణం, మద్యపానం లాంటి అంశాలతో వారి పిల్లలపై   
చిత్రీకరించిన పాటలు,
తల్లిదండ్రులను కొంత ఆలోచింపచేస్తాయని ఆశ.
చిత్రీకరణ ఎలా వుందో మీరే చెప్పాలి,.......

10 September 2012

మా పాఠశాలలో ఆటలపోటిలు



జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, దిరిశవంచ గ్రామంలో జరిగిన ఆరు మండలాల ఆటలపోటీల సందర్భంగా తీసిన వీడియో ఇది. దాతలందరికి మా కృతజ్ఞతలు.

6 September 2012

నీడల లోతులు.



పయనించే మబ్బుల వెనక,
ఏ విషాదపు వేదనున్నదో,.
రగులుతున్న నిప్పుల సెగలో,
ఏ దుఃఖపు నీడలు కలవో,.
స్వప్నించే రంగుల వలలో,
ఏ మోసపు లోతులు కలవో,.

5 September 2012

my teacher, happy teachers day


మా సార్

ముళ్ళ పొదల్లో  ఇరుక్కున్న
నా ఆలోచనలకు
వెలుగు బాటను చూపి ,
తానక్కడే మిగిలి పోతాడు.

తన స్వప్నాల్ని
నా బుర్ర లోకి నెట్టి
నిశ్శబ్ధం గా  నలిగి పోతాడు.

నా జీవితాన్ని
నా చేతుల్లో పెట్టి
నా వంక చూడకుండానే
వెళ్లి పోతాడు.

నా లక్ష్యంనా మార్గం,
నా స్వప్నంనా జ్ఞానం,
అన్నీ  తానై,
మౌనం గా మురుస్తూ ,
మనసులో మెరిసిపోతాడు.
ఓ జ్ఞాపకం గా మిగిలి పోతాడు.

4 September 2012

మౌన రోదన


నాలోకి నేను
తొంగి చూసుకున్నప్పుడల్లా,
అప్పుడే విచ్చుకున్న పువ్వుల్లా,
నీ జ్ఞాపకాలు గుభాళిస్తునేవుంటాయ్,.
నన్ను నేను ప్రశ్నిచుకున్నప్పుడల్లా,
నీ నవ్వులు జలపాతపు హోరై,
నా నోటిని మూయిస్తునే వుంటాయ్,.
నాకర్థం కావని,
దూరంగా నెట్టేసినప్పుడల్లా,
లీలగా నాకేదో
అర్థమవుతావనిపిస్తుంది,
నాకేదో అర్థమైందని,
హత్తుకున్నప్పుడల్లా,
నా అజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ,
మౌనంగా నిష్క్రమిస్తావనిపిస్తుంది.
అన్నీ ఇచ్చినపుడు,
దేనిని పొందాలనుకోలేదు.
ఇక్కడేమి లేనపుడు,
అన్ని కావలనుకుంటాను,
ఎంత అవివేకినో కదా నేను.
నీకేం కావాలో,
నాకేమీ తెలియనప్పుడు,
నేనేం తీసుకోవాలో,
నాకే చేతకానప్పుడు,
ఏ ప్రశ్నకు నా దగ్గర,
సమాధానం లేనప్పుడు,
నువ్వు మాత్రం
చేయగలిగినదేముంది, సుమా!!
మౌనంగా రోధించడం తప్ప.

3 September 2012

పరమార్ధం


నీ చూపుల వలపు,
నా గాయాల సలుపు,
రెండు ఒకటేనా?
నీ చెక్కిలి ఎరుపు,
నా కన్నీటి ఛారిక,
విలువకటేనా?
నీ పెళ్ళిమేళం,
నా చావుబాజా,
పరమార్ధం ఒకటేనా?

2 September 2012

అంతరాత్మ - అడ్డదారి


నిశివెలుగు,
పరుచుకున్నబతుకు బాట,
నల్లగా మిసమిసలాడుతూ,
కాంతి వంతంగా మెరుస్తుందిప్పుడు.
గుంటల్లో, మిట్టల్లో
ఎగుడుదిగుడు బాటల్లో,
జీవితం మెత్తగా,సాగిపోతూ....
ఆనందంగా వున్నప్పుడు,
ఇన్ని నసుగుల్లెందుకు,
ఇన్ని ఆలోచనలెందుకు,
వేల అంతరాలెందుకంటావ్ !
 నీకు నాకు మధ్య.

1 September 2012

శ్రమించిన శరీరాలు,


ఏ ఆచ్ఛాదనలు లేని,
ఆ దేహాల మధ్య,
నిర్లజ్జగా ప్రవేశించలేక,
స్తంభించిపోయిందేమో,కదా!!
ఆ చల్లని చిరుగాలి.
శ్రమించిన శరీరాలు,
అలసిసొలసి.
నిదురకన్నులతో,
అక్కడ స్వేదాన్ని స్రవిస్తున్నాయ్.

30 August 2012

మెరుపుల మెప్పులు


వాగులు వంకలు,
ఎన్ని హోయలతో సాగినా,
చివరకు వాటికి,
చినుకే కదా, గతి.
తళతళ మెరిసే,
మెరుపుల మెప్పులు,
శాశ్వితమనుకొని మురిసావంటే,
తప్పదు నీకు అధోగతి.

26 August 2012

ఘనీభవించిన స్పందన


ఇక్కడేదో ప్రాబ్లెమ్ వుంది,
కనికనిపించకుండా వున్నా,
తీవ్రమైనదేలావుంది.
డయాగ్నైస్ చేయడం వీలవుతుందా !
E.C.G లు, X-ray లు గట్రా తీయించాలా !!
ఓ రెండు మాత్రలతో నయమవుతుందా ?
పెద్దాపరేషన్ చేయించాలా ?
అప్పటికైన బాగువుతుందా…….
ఏమో మనం ఏం చేయగలం,
మంచిని ఆశించడం తప్ప!
దేవుని పై భారం వేయడం తప్ప!!
ప్రశ్నలతో మనసు తిప్పుతుంది.
ఇలా ఎందుకయ్యిందనో,
ఎలా మొదలైందనో………..
అభావమైన భావం,
మళ్ళీ చిగురిస్తుందా ?
ఘనీభవించిన స్పందన
మళ్లీ ప్రవహిస్తుందా ?

23 August 2012

ఒకానొక ఫీలింగ్ – 35



నిను చూడాలని,
ఇంత కాలము, వేచి వేచి
ఎదురు చూసిన, ఈ కన్నులు,
అనుకోని ఆనందపు దాడికి,
తట్టుకోలేకేమో సుమా!
ఇలా భావరహితముగా,........




20 August 2012

గ్లోబల్ వామింగ్ – భారతదేశం పై ప్రభావం ( 1st part )




గత కొన్ని సంపత్సరాలుగా  పర్యావరణ స్పృహ కలిగిన వారందరిలోను రగులుతూ, ఆందోళన రేపుతున్న రేపటి మహాసమస్య, అత్యంత వేగంగా విస్తరిస్తూ భయపెడుతున్న పెను ప్రమాదం గ్లోబల్ వామింగ్.

మన భూమిని ఆవరించివున్న,  వాతావరణంలోని వాయువుల సమతుల్యత, ఈ భూగోళాన్ని  కోటానుకోట్ల జీవరాశులకు ఆవాసయోగ్యంగా  మార్చగలిగింది. ఈ విశాల విశ్వంలో జీవగ్రహంగా భూమికి,  ప్రత్యేకతను ఆపాదించగలిగింది. ఈ భూమిని అత్యంత వేడిగాను లేదా అతి శీతలంగాను కాకుండా ప్రాణులకు తగినంత ఉష్ణోగ్రతను అందించుటలో ఈ వాతావరణం పాత్ర చాలా ముఖ్యమైనది.

భూవాతావరణంలో  నైట్రోజన్, ఆక్సిజన్ వాయువులు
99 శాతం వరకు ఉన్నప్పటికి, చాలా చాలా తక్కువ మోతాదులలో వుండే కార్భన్ డై ఆక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్ వంటి కొన్ని వాయువులు, భూమిని వెచ్చగా వుంచడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భూమి నుంచి పరావర్తనమై, తిరిగి అంతరిక్షంలోనికి వెళ్లిపోయే  సూర్యుని  ఉష్ణశక్తిని, భూవాతావరణంలోనే నిల్వవుండే విధంగా చేయడం ఈ వాయువులు చేసే ముఖ్యమైన పనులలో ఒకటి. దాని వలన భూమి జీవావరణానికి అనుకూలమైన పరిస్థితులను కలిగి వుండి, తగినంత వెచ్చగా వుండగలిగింది. ఈ వాయువుల సహకారం లేకపోతే భూమి ఇంకా, మంచు యుగంలోనే వుండి వుండేది. అందువలననే ఈ వాయువులను, హరితవాయువులు అని అంటారు.
ఈ వాయువులు కలుగచేయు ప్రభావాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. 

ఇంత ఉపయోగకరమైన ఈ హరితవాయువులు, మనకిప్పుడు ఎందుకు ప్రాణాంతకంగా పరిణమించబోతున్నాయో, తెలుసుకోవలసిన సమయమిది. అత్యంత సహజమైన ఈ గ్లోబల్ వామింగ్ ప్రక్రియ, ప్రకృతిలో మానవుని మీతిమీరిన జోక్యంతో పెరుగుతూ, సకల జీవులకు ఎలా అనర్ధదాయకంగా మారబోతుందో 
అర్ధంచేసుకువాల్సిన తరుణమిది.

18 August 2012

నీ దేహపు స్పర్శా ప్రసాదం......



నీవు పలికిన
అర్థం లేని మాటలు కూడా,
వేణునాదమై, వీణావాదమై
ఈ బీడుకి తొలకరి జల్లై,
ఈ నాటికి, అలవోకగా అలాఅలా,
జీవాన్ని విత్తుతూనే వున్నాయ్,
నీ, నా జ్ఞాపకాలై........

ఇరుకిరుకు రోడ్లల్లో,
నీతో పాటు నడుస్తున్నప్పుడు,
నీ దేహపు స్పర్శా ప్రసాదం,
ఈ దాహార్తికి, అమృతమై,
నన్నింకా, వోత్తుకుంటున్నట్లే వుంది, సుమా!!