Pages

14 October 2020

శ్రీ శ్రీ శ్రీ రాజ రాజ కవిశేఖరా ! నీకెందుకయ్యా ఈ కవిత్వం ? : Abdul Rajahussain

 

వుల‌ మీద,కవిత్వం మీద కె.భాస్కర్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు !!

కె.భాస్కర్ ను ఇన్నాళ్ళు ఎలా మిస్సయ్యానో తెలీదు.ప్రొఫైల్ లోకి వెళ్ళి చూశాక నా నిర్లక్ష్యానికి
నన్ను నేను తిట్టుకున్నాను.ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి వచ్చాడీ కవి. కవిత్వ జవజీవాలు
బాగా తెలిసినవాడు.అందుకే కవులపై,కవిత్వం పై తనదైన శైలిలో అస్త్రాలు సంధించాడు.ఏది
కవిత్వం?ఏది కవిత్వం కాదు? ఎవరు కవి? ఎవరు కాదు.అన్న సందేహాల సందోహంలో ఈయన
రాసిన రెండు కవితలు నాకైతే పెద్ద రిలీఫ్ ఇచ్చాయి. రెండు కవితల్లో కవిత్వ ‘ విశ్వదర్శనం ‘
తోపాటు యువకవులకు మార్గనిర్దేశం చేయించాడు .మీరూ చదవండి.ముఖ్యంగా...మరీ ముఖ్యంగా
వర్థమాన కవులు తప్పకుండాచదవండి.మీకు నచ్చుతాయి .మీ చేయిపట్టుకొని ముందుకు నడిపిస్తాయి.‌
1.మొదటి కవిత.” నిస్తేజం “ !!
“ నీకెందుకోయీ, కవీ…. కవిత్వం
వదులుకోలేవటోయీ, నీవా పైత్యం.
వ్యాకరణాల టక్కు టమారం
వృత్తగంధీ వచనపు సొగసులు
వేల శైలులా కవితా శిల్పం
విభిన్న రీతుల కావ్య లక్షణం
గణాల, గుణాల గందరగోళం
చంధస్సు, యతి ప్రాసల గరళం.
తెలుసా నీకేమైనా ?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా ?
నీకెందుకోయీ, కవీ,... కవిత్వం
వదులుకోలేవటోయీ, నీవా పైత్యం.
స్వప్నలోకపు స్వేచ్ఛాయానం
యధార్థజగత్తు దుఃఖపు గానం
కొట్టుకొచ్చిన సృజనాత్మక రాతలు
ఎత్తుగడలలా ఎత్తులలోన
కూరుకుపోయిన అసలు రహస్యం
ధగధగ మెరసే కవుల తలలకు
వెనకనవున్న ఎన్నో సొట్టలు
తెలుసా నీకేమైనా?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా ?
నీకెందుకోయీ, కవీ.... కవిత్వం
వదులుకోలేవటోయీ, నీవా పైత్యం.
హెర్బర్ట్ రీడు సర్రయలిజం
అధివాస్తవికత అయోమయం
కొత్తపుంతల ప్రాహ్లాద కవిత్వం
క్రోపాట్కిన్ అనార్కిజం
బుఖారిన్ చారిత్రక బౌతికవాదం
విశాల విశ్వపు సిద్ధాంతాలు
పిచ్చెక్కించే పదబంధాలు
తెలుసా నీకేమైనా?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా?
నీకెందుకోయీ, కవీ,... కవిత్వం
వదులుకోలేవటోయి, నీవా పైత్యం.
కవుల గుంపులా కుళ్లు అసూయలు
కృత్రిమ వెలుగుల చీకటిరాజ్యం
విమర్శకత్తుల కరాళ నృత్యం
తోటి కవులను తొక్కేసే వైనం
ప్రచురణకర్తల కళావిలాపం
మిగిలిపోయినా కట్టలగుట్టలు
ఫుట్ పాతుకి చేరే విషాదసత్యం
తెలుసా నీకేమైనా?
తొంగి చూసావా, అటు నీవెపుడైనా?
జీవితకాలపు వ్యర్ధప్రయత్నం
ఎందుకు నీకీ అమాయకత్వం
సిద్ధించదులే నీకమరత్వం.
నీకెందుకోయీ, కవీ.... ఆ కవిత్వం
వదలుకోలేవటోయీ, నీవా పైత్యం.
ఓరకంగా ఇది వ్యంగ్య రచనే.కవులకు కవిత్వం ఎందుకంటూ ప్రశ్నించడం వెనుక ఆంతర్యం
కవిత్వ నిజ సందర్శనం చేయించడమే.కవీ....నీకెందుకయ్యా ఈ కవిత్వం? ఎందుకయ్యా
ఈ పైత్యం? కవిత్వం అంటే మాటలా? అబ్బో ! వ్యాకరణాల టక్కుటమారం తెలిసుండాలి.
వృత్తాల సొగసులు,శైలి,కవితా శిల్పం,విభిన్న రీతుల కావ్య లక్షణాలు,గుణాల,గణాల గందర
గోళం, ఛందస్సు,యతుల గరళం ఒక్కటా, రెండా ఎన్నో లక్ష్య లక్షణాల సమన్వితం కవిత్వం.
మర కవిత్వం రాసే వాళ్ళు వీటి వంక ఎవరైనా తొంగి చూశారా? లేక చూడకుండానే కవిత్వం
రాస్తున్నారా? కొత్త పుంతల ప్రాహ్లాద కవిత్వం,
ఇవేనా? ఇంకా వున్నాయి.రియలిజం,సర్రియలిజం,అథివాస్తవికత అయోమయం,అనార్కిజం,
చారిత్రక భౌతిక వాదం,విశాల విశ్వపు సిద్ధాంతాలు,పిచ్చెక్కించే పదబంధాలతో నీకు పరిచయం
వుందా? లేక వీటితో పరిచయం లేకుండానే కవిత్వం రాస్తున్నావా?
ఇంకా..ఇంకా..అవే స్వప్నలోకపు స్వేచ్ఛాయానం,యదార్థ జగత్తు దుఃఖపు గానం,సృజనాత్మక
రచనలు,ఎత్తుగడలు,ఎత్తులలో కూరుకుపోవడం,ధగధగ మెరిసే కవుల తలలకు వెనుక వుండే
సొట్టలు తెలుసా? ఎప్పుడైనా వీటిని వీక్షించారా? లేక అనుభవంలోకా తెచ్చుకున్నారా?
అది సరే కానీ ..కవిలోకంలో కుళ్ళును ఎప్పుడైనా చూశావా?విశ్వాన్ని దర్శించే కవి ఈసునసూయ
లతో సతమతం కావడం ఎప్పుడైనా నీ అనుభవంలోకొచ్చిందా? కృత్రిమశవెలుగుల చీకటి రాజ్యం
విమర్శ కత్తుల కరాళ నృత్యం నీకు ఎదురై వుండాలే.తోటి కవుల్ని తొక్కే వైనం,ప్రచురణ కర్తల కళా
విలాపం.మిగిలిపోయిన కట్టల గుట్టల కవిత్వం ఫుట్ పాత్ లకు చేరే విషాద సత్యం నీకు తెలుసా ?
ఇంత చిందర వందర గందరగోళాల మధ్య కవీ‌! నీకీ కవిత్వం ఎందుకయ్యా? కవిత్వాన్ని పట్టుకొని
వేలాడితే అమరత్వం ఏం సిద్ధించదు. మరెందుకయ్యా! ఈ కవిత్వం మీద నీకంత పిచ్చి.పైత్యం?
ఈ కవితలో కవిత్వం ఎంత కష్టమైందో? ఈ ముళ్ళబాటను తొక్కుకుంటూ కవిత్వం రాసి కవి అని
పించుకోవాల్సిన అవసరం వుందా? అన్నది భాస్కర్ ప్రశ్న.అయితే ఇంత కష్టపడుతూ కూడా కవులు
కవిత్వం రాస్తున్నారు.వారి రచనల వెనుక ఎంత విషాదం వున్నా భరిస్తూ కవిత్వాన్ని పట్టుకొని
వేలాడుతున్న కవుల గురించి న ప్రశంసా వున్నాయి.అలాగే కవిత్వం గందరగోళమే కాదు..కవిలోకంలో
వున్న ఈర్ష్య,అసూయ కుళ్ళు,ఎదుటి వాడిని తొక్కేయాలన్న దుర్మార్గాన్ని బయటపెట్టి ఎండగట్టాడు.
ఇక కవిత్వం రాసే కవిపడే పాట్లను భాస్కర్ మరో కవితలో ఎలా తెలుపుతున్నారోచూద్దాం!
*రా(త)దారి
రాసేదంతా కవిత్వమేనా అని సందేహమెందుకు
కాకపోనూవచ్చు, భయమెందుకు మిత్రమా !
ఉబికి వచ్చే అక్షరాన్ని
గొంతు నులిమి, అనుమానంతో
అనవసరంగా చంపడం ఎందుకు ?
తరువాత తీరిగ్గాఏడవడమూ ఎందుకు ?
భావాలతో అక్షరాలకులంకె కుదరక
కనెక్టివిటి కోసంగిలగిలలాడుతున్నావా ?
అదే ఓ కవి జననమని గుర్తుంచుకో నేస్తమా!
బొడ్డూడని బిడ్డ బాధ
ఏ ఎదిగినోడికీ అర్థమూ కాదు.
తలనెరిసినవాడి తాత్వికత
పురిటి కంపును ఆపనూలేదు.
దేనికవే సమాంతరాలు,అటునుంచి ఇటు దూకేదాక.
కళ్లూ చెవులే కాదు, ఇక్కడ పనిచేయాల్సింది
నిన్ను నువ్వు తెరుచుకోవాలి.
లోపలి అగాధాలలో అన్వేషించుకోవాలి.
ఒక్కో వాక్యాన్ని వలవేసి చేజిక్కించుకోవాలి.
నిర్భయంగా అక్షరమైపో, అజరామరమై మిగలడానికి.
నిలకడగా రాసుకుపో, నువ్వు నువ్వుగా నిలబడటానికి.
అది చాలు కవిత్వానికి.
ఇక వ్యాఖ్యలంటావా ?
పైకి లాగే వాడే పామై కరవావచ్చు
క్రిందికి నెట్టేవాడే, నిచ్చెనై మిగలావచ్చు.
కవిగా మిగుల్తావో,కనుమరుగైపోతావో
అది మరో పార్శ్వం.
కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కళ
కవిగా మిగలడమూ, వెలగడమూ.
కవి రాసేదంతా కవిత్వం కావచ్చు.కాకపోనూ వచ్చు.అయితే తాను రాసేది కవిత్వం కాదని
తెలుసుకున్నప్పుడు మాత్రం నిరుత్సాహ పడాల్సిన పని లేదంటున్నాడు భాస్కర్. కవిత్వం
కాదన్న సందేహంతో ఉబికొచ్చే అక్షరాన్ని గొంతు నులిమి చంపొద్దంటున్నాడు.ఒక వేళ
రాసింది కవిత్వమేనని తెలిశాక బాధపడి ప్రయోజనం వుండదంటున్నాడు.
భావాలతో అక్షరాలకు లంకె కుదరక సతమతమవుతూ ,కనెక్టివిటీ కోసం గిలగిల్లాడటం అంటే
అదే కవికి “నిజమైన జననం” అని గుర్తించుకోమంటున్నాడు. కొత్త కవులంటే పాత కవులకు.జూనియర్లంటే సీనియర్లకు ఎప్పుడూ అలుసే.అయితే బొడ్డూడని బిడ్డ బాధ..ఎదిగిన వాళ్ళకెలాతెలుస్తుందంటున్నాడు.కొత్త కవికి పురిటి కష్టాలు తప్పవన్నది భాస్కర్ అభిప్రాయం.అయినా
తలపండిన వాడికీ,తల నెరిసిన వాడికి పురిటి వాసన ఎలా తెలుస్తుంది? ఎంత పెద్ద కవైనా..
ఆరంభంలో తప్పటడుగులు వేసిన పసివాడే అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలంటున్నాడు.
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో?
మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమన్న
సామెతను ఓ సారి గుర్తు తెచ్చుకుంటే ఈ శషభిషలకు తావుండదంటున్నాడు.ఎవరూ పుట్టుకతోనే బిరియాని తినరు.అన్నప్రాశన,వంటి లాంఛనాలు పూర్తికావాల్సి వుంటుంది.ఆ తర్వాత
పళ్ళొచ్చి,బిరియానీని జీర్ణం చేసుకునే వయసూ,
శక్తి రావాలి.అలాగే కవుల ఎదుగుదలకూడా
అనుభవాన్ని బట్టి వుంటుంది.ప్రారంభంలోనే గొప్పకవిత్వం ఆశించడంలో అర్థం లేదన్నది
భాస్కర్ అభిప్రాయం.చెట్టునుబట్టే గాలి,..
ఎదుగుదలనుబట్టే కవిత్వమూ పండుతుంది.
కవిత్వం రాయడానికి కళ్ళూ చెవులూ‌మాత్రమే పనిచేస్తే సరిపోదు.నిన్ను నీవు తెరుచుకోవాలి.
తెలుసుకోవాలంటున్నాడు భాస్కర్.లోపలి అగాధాల్ని అన్వేషించి,ఒక్కో వాక్యాన్ని వలవేసి
నేర్పుగా పట్టుకోవాలి. అప్పుడే అక్షరాలు కవిత్వమవుతాయి.కావల్సింది ధైర్యంగా,నిర్భయంగా
రాయడమే.అప్పుడే అక్షరం కవిత్వంలో స్నానం చేసి అజరామరమై నిలిచిపోతుంది.నిర్భయంగా,
నిస్సందేహంగా రాసుకుపోతుంటే నువ్వు నువ్వుగా నిలబడతావు.అదే కవిత్వం అవుతుంది.
ఇక కవిత్వం పై వ్యాఖ్యలూ,విమర్శలు సరేసరి.ఈ లోకంలో పైకి పోయేవాడ్ని కిందకు లాగే వాడుంటాడు.
అలాగే పైకి లాగుతూ కూడా పామై కరిచేవాడూ వుంటాడు.ఒక్కోసారి కిందకు నెట్టేవాడే నిచ్చెనలా ఉపయోగపడవచ్చు.ఇన్ని జరిగాక కూడా కవిగా నిలబడటం,లేక కనుమరుగై పోవడం అది వేరే విషయం.
రాసేవాళ్ళంతా కవులు కారా? అంటే అది వారి నిబద్ధతపై ఆధారపడి వుంటుంది. నిజానికి కవిత్వమవడం
కొద్దిమందికి మాత్రమే తెలిసిన విద్య.కవిగా మిగలడం,కవిగా వెలగడం కొందరికి మాత్రమే సాధ్యమయ్యే గొప్ప కళ.
మొదటి కవితలో కవిత్వంలోని శషభిషలు చెప్పాడు.రెండో కవితలో కవిగా ఎలా ఎదగాలో,
నిలబడాలో చెప్పారు. భాస్కర్.ఈ రెండు కవితల సారాన్ని సమన్వయించుకుంటే ముఖ్యంగా వర్థమాన కవులకుఎంచక్కా చుక్కానిలా ఉపయోగపడుతుంది.
భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుంది.!!
**
ఎ.రజాహుస్సేన్..!!

No comments:

Post a Comment