Pages

30 June 2015

బాహుబలి సినిమా పాత్రల పేర్లు - చారిత్రిక కోణం.

                               బాహుబలి సినిమాలో మూడు ప్రధాన పాత్రలకు పెట్టిన పేర్లు చారిత్రకంగా చాలా ప్రముఖమైనవి. ఈ మూడు పేర్లు(బాహుబలి, భల్లాలదేవ,బిజ్జలదేవ) కర్ణాటక ప్రాంతానికి చెందినవి కావడం కూడా ఒక విశేషంగా కనిపిస్తుంది. టైటిల్ బాహుబలి జైన మతసాహిత్యంతోను,  భల్లాల దేవ, బిజ్జల పేర్లు  కర్నాటక చరిత్రతోను ముడిపడి కనిపిస్తాయి. చరిత్రలో ఈ పేర్ల యొక్క ప్రాముఖ్యతను సంక్షిప్తంగా ఒక్కసారి చూద్దాం. చరిత్రలోనుంచి ఎన్ని పేర్లు తీసుకున్నారో, ఏఏ అంశాలనుంచి స్ఫూర్తి పొందారో సినిమా చూస్తే మరంతగా అర్థమవ్వచ్చు.
బాహుబలి
                                   జైనపురాణాల ప్రకారం మొదటి తీర్థాంకరుడైన ఋషభనాథుడి రెండవ భార్య కొడుకు ఈ బాహుబలి.
              అన్న భరతుడితో జరిగిన యుద్దలో  గెలిచి, అతన్ని చంపే సమయలో హఠాత్తుగా కలిగిన జ్ఞానోదయం వల్ల రాజ్యాన్ని అతనికే త్యాగం చేసి అడవులకు వెళ్లిపోయి తపస్సు చేస్తు అదే ముద్రలో విగ్రహమైపోతాడు బాహుబలి.  శ్రావణబెళగోళాలో  58 అడుగుల ఎత్తైన గోమఠేశ్వర విగ్రహంగా పూజలందుకుంటున్నాడు, ఈ బహుబలి. శ్రావణబెళగోళ, మరియు  బాహుబలి విగ్రహాలు జైనులకు అత్యంత పూజనీయమైనవి.
భల్లాలదేవ (పరిపాలనాకాలం 1173–1220)
                                   హోయసల సామ్రాజ్యాన్ని దక్షిణభారతదేశపు నలుమూలలకు విస్తరింపచేసి, తన తాత విష్ణువర్థనుడు సంపాదించిన స్వతంత్ర్యాన్ని సుస్థిర పరిచిన మహావీరుడు, త్రిభువన మల్లుడిగా , దక్షణ చక్రవర్తిగా పేరుగాంచిన హోయసల రాజు భల్లాల II . శాసనాలలో తనను తాను భల్లాల దేవ (god bhallala) గా( గణపతి దేవాలాగా)  కీర్తించుకొన్న మహారాజు. అత్యంత పరాక్రమవంతుడిగా, నిరంకుశుడిగా, రాజకీయ చతురుడిగా, సాహిత్య పోషకుడిగా, దేవాలయాల నిర్మాతగా కర్ణాటక చరిత్రలో కీలకమైన స్థానం భల్లాలదేవది.
 క్రీ.శ 1173 వ సంవత్సరంలో హలిబేడులో తండ్రి నరసింహ 1 పై జరిపిన తిరగుబాటుతో సింహాసనాన్ని అథిరోహిస్తాడు. దేవగిరి యాదవులను, మధుర పాండ్యులను, దక్షిణ కలచూరిలను జయించి వీరభల్లాలగా ప్రఖ్యాతి చెందుతాడు. చోళరాజులకు సహాయం చేసి చోళరాజ్యప్రతిష్టాపనాచార్య బిరుదుతోపాటు, వారి బంధుత్వాన్ని కలుపుకుంటాడు. కన్నడ సాహిత్యంలో పేరెన్నిక గన్న కవులు కవిచక్రవర్తి గా కీర్తిగాంచిన జన్న, నేమిచంద్ర, రుద్రభట్టలాంటి కవులు ఈయన ఆస్థానంలో వుండేవారు. యశోధర చరిత్ర, లీలావతి ప్రబంధ, జగన్నాధ విజయం లాంటి గ్రంథాలు ఆ కాలంలో వెలవడ్డాయి. హోయసల దేవాలయాలలో మూడోవంతు ఈయన హయంలో కట్టబడినవే. హళిబేడులోని కేదారేశ్వర ఆలయం, బిళవాడిలోని వీరనారాయణాలయం, మోసాలలోని చెన్నకేశవ,నాగేశ్వర జంట దేవాలయాలు, అమృతపురం లోని అమృతేశ్వరాలయం వీటిలో చెప్పుకోదగ్గవి. 
బిజ్జల II (పరిపాలనాకాలం 1130–1167)
                         సినిమాలో పేరు బిజ్జలదేవ,. బహుశా భల్లాలదేవ తో రిలేషన్ కోసం ఇలా మార్చి వుంటారు. దక్షిణ కలచూరి(kalachuri) రాజులలో ప్రఖ్యాతి గాంచినవాడు. కల్యాణి చాళుక్యులకు సామంతులుగా వున్న కలచురులను,1162లో స్వతంత్ర ప్రభువులుగా మార్చడమే కాకుండా వారి రాజధాని కల్యాణిని తనదానిగా చేసుకుంటాడు. వీరశైవ మత స్థాపకుడు బసవేశ్వరుడుగా  ఈయనకు ప్రధానమంత్రిగా పని చేసాడు. స్వతంత్ర్య రాజుగా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించి హత్యకు గురవుతాడు. వీరశైవులతో వున్న విబేధాల కారణంగా వీరశైవ అనునూయిలు ఇతన్ని హత్యచేసారని చెబుతారు.
                      ఇవి కాకుండా కట్టప్ప( వీరపాండ్య కట్టబ్రహ్మన్న నుంచి), కాలకేయ ( "కాల" మగధీర సెంటిమెంట్), అస్లామ్ ఖాన్ ( షేర్ ఖాన్ లాగ,, నార్నియా సినిమాలో సింహం పేరు నుంచి), శివుడు( వీరశైవం నుంచి)స్ఫూర్తి పొందినట్లుగా వుంది.
                                 అన్నదమ్ముల వైరం, తమ్ముడు త్యాగం, తండ్రిపై తిరుగుబాటు, యుద్దాలు, కుట్రలు, కుతంత్రాలు, నిరంకుశత్వం,కళాపోషణ, వీరభక్తి లాంటి అనేక  చారిత్రిక అంశాల దృశ్యాలు  కొంచెం అటుఇటుగా చిత్రకథలో సాక్షత్కరించే అవకాశాలు లేకపోలేదు.

                               ఏదేమైన చారిత్రక వ్యక్తులను గుర్తుచేస్తూ ఒక గొప్ప సినిమాను రూపొందిస్తున్న రాజమౌళి గారిని అభినందించాల్సిందే.

26 June 2015

బలం ( 8th class PS)

నెట్టడం, లాగడం వంటి చర్యలను బలం అంటారు.
బలం  ద్రవ్యరాశి Χ త్వరణం.
బలానికి ప్రమాణాలు న్యూటన్ లు ( N ) ( kg m / s2)
--------------------------------------------------
బలాలు ప్రధానంగా రెండు రకాలు.
1) స్పర్శాబలం 2) క్ష్రేత్రబలం

1) రెండు వస్తువులు ఒకదానితో ఒకటి తాకుతూ పనిచేసే బలాలను స్పర్శాబలాలు అంటారు. వీటికి ఉదాహరణ  కండర బలం, ఘర్షణబలం, అభిలంబబలం,తన్యతాబలం మొదలైనవి.

కండరబలం :: కండరాల వలన కలిగే బలాన్ని కండరబలం అంటారు.   అన్నీ జీవులు తాము తిన్న ఆహారాన్ని           కండర బలంగా మార్చుకొని పనులు చేయగలుగుతాయి.
ఘర్షణ బలం  :: స్పర్శలో వున్న రెండు వస్తు తలాల మధ్యగల సాపేక్షచలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణబలం అంటారు.
ఘర్షణ కొన్నిసార్లు మనం చేసే పనులకు మంచి మిత్రుడుగాను, కొన్ని సార్లు విరోధిగాను వుంటుంది.
అభిలంబ బలం ::  ఒక వస్తువు పై లంబ దిశలో పనిచేసే బలాన్ని అభిలంబ బలం అంటారు.
తన్యతా బలం ::  తాడు లేదా దారంలో గల బిగుసుదనాన్ని తన్యతాబలం అని అంటారు.

2) రెండు వస్తువులు ఒకదానినొకటి తాకకుండా పనిచేసే బలాలను క్షేత్రబలాలు అంటారు. వీటికి ఉదాహరణ అయస్కాంత బలం, స్థావరవిద్యుత్ బలం, గురుత్వాకర్షణబలం మొదలైనవి

క్షేత్రం :: ఎంత దూరం వరకు క్షేత్రబలం పనిచేస్తుందో ఆ ప్రాంతాన్ని ఆ వస్తువు యొక్క క్షేత్రం అంటారు. ఉదా : అయస్కాంత క్షేత్రం.

అయస్కాంత బలం :: అయస్కాంత వస్తువుల మధ్య వుండే ఆకర్షణ, వికర్షణ బలాలను అయస్కాంత బలాలు అంటారు.
ప్రతి అయస్కాంతానికి ఉత్తర దృవం, దక్షిణదృవం అనే రెండు దృవాలు వుంటాయి. సజాతి దృవాలు వికర్షించుకుంటాయి. విజాతి దృవాలు ఆకర్షించుకుంటాయి.

స్థావర విద్యుత్ బలాలు :: ఒక ఆవేశ వస్తువు, వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగుచేసే బలాన్ని స్థావరవిద్యుత్ బలం అంటారు. విద్యుత్ ఆవేశాలు రెండు రకాలు.
ధనావేశం మరియు ఋణావేశం. సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి. విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి.

గురుత్వాకర్షణ బలం :: ద్రవ్యరాశులు గల వస్తువుల మధ్య వుండే బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. భూమికి వుండే గురుత్వాకర్షణ బలం వల్లనే పైకి విసిరిన ఏ వస్తువునైనా తన వైపుకి లాగగలుగుతుంది.
------------------------------------------------------
ఫలిత బలం :: ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.
బలం అనేది పరిమాణం మరియు దిశ కలిసిన సదిశ రాశి.
ఫలితబలాన్ని కనుగొనేటప్పుడు బలం యొక్క దిశ ముఖ్యపాత్ర వహిస్తుంది.
స్వేచ్ఛావస్తుపటం( free body diagram... FBD)
ఒక వస్తువుపై వనిచేసే అన్నీ బలాలను చూపుతూ గీసిన పటాన్ని స్వేచ్ఛావస్తుపటం (FBD) అంటారు.

వస్తువు చలన స్థితిపై బలం ప్రభావాన్ని చూపుతుంది.
బలం ఒక వస్తువు యెక్క ఆకారాన్ని మార్చగలదు.
వస్తువు యెక్క స్థితిని(నిశ్చల/చలన) మార్చగలదు.
వస్తువు కదిలే దిశలోను, దాని వడిలోను మార్పుతేగలదు.

పీడనం
ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని పీడనం అంటారు.
స్పర్శావైశాల్యం తగ్గితే పీడనప్రభావం పెరుగుతుంది.
( చీల చివర సూదిగా వుండటం వల్ల తొందరగా లోపలకు దిగుతుంది, కత్తి కోసుగా వుంటే తొందరగా తెగుతుంది)
స్పర్శావైశాల్యం పెరిగితే పీడన ప్రభావం తగ్గుతుంది.
( పెద్ద లారీలకు ఎక్కువ టైర్లు, స్కూలు బాగులకు వెడల్పు పట్టీలు వుండటం వల్ల అవి ఎక్కువ బరువు వున్నప్పటికి తక్కువ పీడనాన్ని కలుగచేస్తాయి)
పీడనం = బలం / వైశాల్యం
దీనికి ప్రమాణాలు న్యూటన్ / మీటర్2
(8వ తరగతి బౌతికరసాయన శాస్త్రంలో మొదటి యూనిట్ నోట్స్ ఇది)



20 June 2015

ఎరలు


కాళ్లకు బంధాలేసుకొని
కళ్లకు గుర్రపుగంతలేసుకుని
లక్ష్యాలవైపుకి పయనించడం
అద్భుతం అని కొనియాడబడుతుంది.

సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు
వీటన్నింటి గురించి  ఏమీ మాట్లాడకు.
గద్దెకి అనించి కూర్చోవడాన్ని
మించిన విలువ ఇక్కడేం లేదిప్పుడు.

పిడికిలి పైకెత్తి పెల్లుబికే పోరాటాలలో
క్రియాశీలకాలే, కరవాలాలకు ఎర్ర కళనిస్తాయి.
పులిజూదంలో పావులైనాక
పసికందైనా, పులినోట్లో పలావుముక్కే.

జీవితాన్ని అజ్ఞాతంలో మగ్గపెట్టినా
మరణాన్ని మెరిపించడం
పాతదైనా, ఇప్పటికి లేటేస్ట్ ఫ్యాషనే.

నేలపాలైన ఓ పాలస్వప్నమా!
తప్పిపోయిన తోవలను
తిరిగి దొరకపుచ్చుకోవడం

 ఏ సమాధికి వీలుకాదు.

15/6/2015