Pages

14 October 2020

వాస్తవం, సత్యాల తాత్విక సమ్మేళనం - ఆమె : SRISUDHA MODUGU

'ఆమె' పుస్తకం చేస్తున్నప్పుడు మొదట జరిగే సెలక్షన్ లో భాగంగా, ఇందులో ప్రతి బేకారీ ఒకటికి రెండుసార్లు చదవడం జరిగింది, అలా చదువుతున్నప్పుడు
చాలాసార్లు ఈ కోట్ గుర్తొచ్చింది
'We know what we are, but know not what we maybe.'
పుస్తకం అతడు, ఆమె అనే ఒక వినూత్న ప్రక్రియతో మొదలవుతుంది. కొంత జాగ్రత్తగా పరిశీలిస్తే. అలా ఎన్నుకోవడం ఒక పరిపూర్ణత్వాన్ని సూచిస్తూ,ప్రకృతిలో స్త్రీ పురుషుడు విడదీయలేని భాగాలని , రెండు భిన్న పార్శ్వాలు, దృక్పధాలు, భిన్న హృదయాలని, వారిద్దరినీ కలుపుకుంటూ ముందుకు వెనక్కు వెళ్ళేదే లోకం, ఇంకా జీవితం అని చెపుతున్నట్లు అనిపిస్తుంది. అసలు పరిపూర్ణత్వమే ఒక అసంపూర్ణత్వం అనినవ్వుతూ చెప్పే ఆమె మనకి కనిపిస్తుంది.
ఆమె, అతడు ఇద్దర్ని సమానంగా పోటాపోటీగా వాళ్ళ స్థానాల్లో పాఠకులు దగ్గరికి తీసుకుంటారు అనిపిస్తది .
జీవితం, ప్రేమ, ఆలోచన, అవగాహన, వ్యక్తిత్వం ఇంకా చాలా అంశాలు ఇందులో తారసపడతాయ్. రచయిత పరిశీలనా శక్తి అబ్బురపరుస్తుంది. సందర్భానుసారంగా మారిపోయే వాస్తవాలను కాచి వడపోశారనిపిస్తది. సత్యం, నిజంలాంటి అంశాలు కాలాతీతంగా నిలుస్తాయా అన్నప్రశ్న మనకి మనమే వేసుకుంటాం. ఇలాంటివి చూస్తే లోతైన ఆలోచన, తాత్వికత వుంటే కానీ ఇలా రాయడం సాధ్యపడదు అనిపిస్తది.
భిన్నమైన మౌలిక అస్తిత్వ ప్రశ్నల్లో కూడా
అదృశ్య ఏకత్వాల వైపుగా
నీ దర్శనాన్ని కొనసాగించినప్పుడు
నీలాంటి ప్రపంచాలను
ప్రపంచంలాంటి నిన్ను
కోట్లసార్లు కలుసుకుంటావ్
ఓదార్చుకుంటూ తిరుగుతుంటావ్
ఏ వాదాలకు సమయం చిక్కనంతగా
నిజానికి, అంతకంటే ఏమిలేదిక్కడ
అంటుందామె, సెలయేరై సాగిపోతూ.
మనం దిగబడి, మనల్ని ఉచ్చులో బిగించే ఎన్నో అంశాలు ఎక్కడో తగిలి ఉలిక్కిపడేలా చేస్తాయి. ఆశ, మోహం, కీర్తి, కాంక్ష, అసూయ, స్వార్ధం, ద్వేషం చాలా అంశాలు. మనల్ని ఒక చూపు చూసి దాటెళ్ళి పోకుండా రగిలించి పోతాయి ఇలా
* అతనడిగాడు
నా ప్రతిభకు గుర్తింపేదని
ప్రతిభకైనా, దేహానికైనా
మోయడానికి కొన్ని భుజాలు కావాలి
నలుగురు మోసేటప్పుడు
దేహం ఎంత నిశ్చలంగా వుంటుందో
ప్రతిభకూడా అంత నిస్పర్శగా వుండగలిగనప్పుడే
కోరుకో దాన్ని, అంటుందామె
అతన్ని కఠినపరుస్తూ.
* వ్యక్తులను ప్రేమించే స్థాయినుంచి
వ్యవస్థలను ప్రేమించే స్థాయికి ఎదిగాడు వాడు
అన్నాడతను ఆరాధనగా
అవును, వ్యక్తులను వాడుకోవడంలో
మంచి అనుభవాన్ని సంపాదించాడు కదా, అందామె చిరాగ్గా.
కవి ప్రభావితం కాబడ్డవి ఎంత నిజాయితీగా బట్టబయలు చేస్తే ఆ అక్షరం అంత నిర్భీతిగా నిశ్చలంగా ఉదాత్తంగా నిలుస్తుంది. ఆకాశం లో ఎన్నో వేల నక్షత్రాల్లో, కొన్ని నక్షత్రాలు మరింత ప్రకాశవంతం గా మెరుస్తాయి. వాటి వెలుగులో దారి ఇంకా స్పష్టంగా కనపడుతుంది.
కొన్ని బేకారీలలో మనతో పాటు చింతించే, మనలాగే తాపత్రయపడే మామూలు మనిషి కనిపిస్తాడు. మనిషి బ్రతుకు చింత లో ఎదురయ్యే సామాన్య అనుభవాలను చిక్కించుకొని గుండెను మెలిపెట్టిన కష్టం తొంగి చూస్తుంది.
* నీది కాని సమస్యను నీ మెడకు చుట్టి
ఇక వెనక్కి తిరిగి కూడా చూడకుండా
నిన్ను వంటరిగా వదలివెళ్లిపోతాడే
వాడి కంటే గ్రేట్ఎస్కేపిస్ట్
ఎవరుంటారంటుందామె
కాస్తంత రుద్దమైన కంఠంతో.
నిజమే కదా అది ఎంత మామూలుగా జరిగే విషయం. మన రోజువారీ అనుభవాల్లో చాలా సామాన్యంగా తగులుతుంటారు నిన్ను సమస్యలోకి తోసి తప్పుకొనే ఇలాంటి వాళ్ళు
* దేవుడు మనిషికొక రక్షకతంత్రం
మనిషి దేవుడి అస్థిత్వ రక్షకుడు
ఏ హేతువూ వీళ్లను విడదీయలేదు
మనిషికి మతం ఉపశమనమై మిగిలినంతకాలం
కొంతమందికిదే బతుకుతెరువైనంతకాలం
అంటుందామె,
మతపు మరకను ఉతికే ప్రయత్నంలో
మరోసారి విఫలమవుతూ.
మతపు మరకను ఉతికే ప్రయత్నం అంట ,సామాన్యమైన పదంతో లోతు ని పలికే వాక్యం. అందులో కవి నిగూఢత తెలుస్తుంది మతం చేసిన మరక మనిషిపై ,దేవునిపై , మనిషి బతుకుపై .
* ఆమె దేవుడికి దండేసినందుకు
అతని నాస్తిక మనసు కుతకుతలాడిపోయింది
ఓ పది దండలతో ఇంటికొచ్చి
కవేరా, పీపీ, నోలం, ఆవో, బాలిన్ వగైరా
ఫోటోలను మాలలతో అలంకరించి
వాటి ముందు భక్తితో బోర్లాపడేదాకా.
నాస్తికత్వంలో వ్యక్తి పూజని నిలువునా ఖండించిన వాక్యాలు. ఇలాంటివి చాలా ఉంటాయి సంఘం పైన సూటి ప్రశ్నలు .
సంక్లిష్టంగాలేకుండా సరళంగా జీవించడమెంత అందం.
* పరమార్థాలు
చేయాల్సిన మహత్కార్యాలు
చూడాల్సిన లోకకళ్యాణాలు తెలుసుకొని
అటు నడవాలోయ్
లేకుంటే, ఇక జీవితమెందుకన్నాడతను
జీవితం జీవించడం కోసమే కాని
ఏదో సాధించుకోవడం కోసం కాదనుకుంటానోయ్
అంటుందామె ప్రకృతైపోతూ.
జీవితం జీవించడం కోసమే అనేది సాధారణంగా అనిపించే ఉన్నతమైన నిర్వచనం. ' ప్రకృతై పోతూ’,చాలా సహజత్వం ధ్వనించే విలువైన మాట. ఈ వాక్యాలలో ప్రతిపదం విలువైనదే. ఏదీ మాములుగా తీసుకోలేం.
సరళీకరించుకుంటూ, సంస్కరించుకుంటూ చివరిగా నేర్చుకుంటూ మనల్ని మనమో సారి తడుముకోనో తరిచి చూసుకొనో హా.. అనుకొనే ఆలోచనలో పడేసే పుస్తకం ఆమె.
బహుశా సామాన్య పాఠకుడికి కొంచం భిన్నమైన అంశం ఏదైనా ఉంటె కవులపైన, కవిత్వంపైన కవి చూపించిన ప్రేమాభిమాన ఇష్టాయిష్టాలు.
చదువుతుంటే అనిపించింది అవి కవులకే కాదు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని. లోపల దాగిన మరో మనిషికే చెపుతున్నట్లు అనిపిస్తాయి.
అక్షరాల వలేసేకొని భుజాన నువ్వు
ఒక వ్యూహంతో కదులుతున్నప్పుడు
పెద్దపెద్ద చేపలనే కలలు కంటావు
ఆ చేపలే నీకేయబడిన ఎరలని
వాటి నోళ్లల్లో దాంకున్న పాములు
నీకు కనబడవని
నీకంటే ముందే మొదలెట్టి
ఈ వేటలో అవి రాటుదేలిపోయాయని
నీకంత త్వరగా అర్థం కాదు
ఎందుకంటే
నువ్విప్పుడే కదా ఈ ఆటలో అడుగెట్టింది
అత్యుత్సాహంతో ఫలహారమైపోకు వాటికి
అంటుందామె, అతని కలలతో తొక్కుడుబిళ్లాడుతూ
ప్రతిహేతు బద్దమైన ఆలోచన లోంచి హేతువు తీసివేసి జీవితాన్ని చూడాలనే తపన లోలోపల కనిపిస్తుంది. పుస్తకం ప్రేమ అనే అంశం తో మొదలు పెట్టి జ్ఞానతత్త్వంతో ముగించి ప్రపంచం పైన జీవితంపైన ప్రేమను విశ్వాసాన్ని నమ్మకాన్ని పదిల పరుచుకోవాలన్నట్లు అనిపిస్తుంది.
*ఇప్పుడు ఏమి దొరికింది ఏం మిగిలిందని
విస్తుపోతున్న అతన్ని చూసి
దొరకకపోవడం, మిగలకపోవడం లోనే
సంతోషముందేమోనయ్, అంటుందామె కొంటెగా.
ఇంత నిరాడంబరంగా నిర్భీతి వాక్యం రాయడం అందరికీ చేతవ్వదు. ఆమె పుస్తకం మనకి అందుబాటులో ఉన్న షెల్ఫ్ లో పెట్టుకొని ఏ పేజీ నుంచి చదివినా ఆసక్తిగా చదివించగలిగే పుస్తకం.
*జింకను, పులిని ఒకలాగే చూసే దృష్టిని
సమదృష్టి అనుకొని భ్రమపడుతుంటారు
వెర్రి జ్ఞానులు, అంటూ నవ్వుతుందామె
జింకపట్ల జింకలా, పులిపట్ల పులిలా ఉండటమే
సమస్థాయి దృష్టని మరిచి, అంటూ. .
ఇలాంటి ఆణిముత్యాలు పుస్తకం నిండా ఉంటాయి.
చెపుతూ వెళితే ప్రతి బేకారీ ప్రస్తావించాలి
నిర్దష్టతకు నిర్వచనం ఇచ్చుకోలేని క్షణం క్షణం మారుతున్న కాలానికి, పరిగెడుతున్న ప్రపంచంలో, ఇది నిజమా, అబద్దమా, సత్యమా, అసత్యమా అని లేకుండా,
ప్రపంచాన్ని , నిన్ను నువ్వు చూసుకొనే దృక్కోణం ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎంత డ్రమటిక్ మారిపోతదో చెప్తూ జీవితాన్ని చూసే భిన్నంగా దృక్కోణాలని విభిన్నంగా వ్యక్తీకరించిన ప్రత్యేకమైన పుస్తకమిది.
సోక్రటీస్ కొటేషన్ ఒకటి ఉంది
I cannot teach anybody anything,
I can only make them think.
ఒక పుస్తకం మనలో ఆలోచన రేకెత్తించడం అనేది చేయగలిగిందంటే అది ఒక ప్రామాణికత ఉన్న పుస్తకం.
అందరికీ ఒక్కసారైనా తటస్థించి తారసపడాల్సిన, ఒక్కసారన్నా చదవాల్సిన పుస్తకం.
Don`t miss to read ‘ ఆమె '
మంచిపుస్తకం, సికిందరాబాద్ వాళ్ళ దగ్గర ఈ బుక్ దొరుకుతుంది .
చిత్రంలోని అంశాలు: 'ఆమె... బేకారీలు అజ్జానానికి జ్ఞానానికి మధ్య కొన్నిప్రశ్నలు ఉంటాయి ఎంతటి జ్ఞానికైనా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉంటాయి. కిటికీలో నుంచి ప్రపంచాన్ని చూడు స్వతంత్రుడివి అవుతావు కిటికీనే ప్రపంచమనుకుంటే మూర్ణుడివి అవుతావు. ఆమె... మార్చే సత్యం తర్కమే క్ఞానం ప్రశ్నేమార్గం సత్యజ్ఞానమార్గమే జీవితం విజ్జానప్రచురణలు బేకారీలు' అని చెప్తున్న వచనం

No comments:

Post a Comment