Pages

28 February 2015

అనవసరం


వొలికిపోతున్న ఊపిరిశబ్థాలను
వెచ్చగా అక్కున చేర్చుకొని
చిరురోమాల పులకరింతల మధ్య
మరంత గట్టిగా అదుముకుంటాను
నిన్ను హృదయపు లోతుల్లలోకి.

ఇక్కడ భాష శరీరాలది కాదు
అని చెప్పడానికి సాక్ష్యం లేదు.
అమలిన ప్రేమభావనల
ఋజువుల ప్రకటనలకై
ఆరాటం అసలే లేదు.

ఒక స్పష్టమైన విభజన రేఖల
ఒప్పంద పత్రాలపైన సంతకాలు
చేసినట్టే లేదా చేయనట్టే.

అయోమయం మొదలైయ్యేది
ఒక గందరగోళ దృశ్యాన్ని
విప్పి చూపుకోలేని మనసుల నుంచే.

చెరిగిపోయిన కలల రాతను
మళ్లీ రాసుకునేంత మురిపం లేదు.
అసలు దానికై ఎలాంటి ప్రయత్నం లేదు.

మరి  ఇప్పుడు హఠాత్తుగా ఇదేంటని అడిగతే

చెప్పడానికి సరైన సమాధానమూ లేదు.

27 February 2015

ట్రాష్


నాకర్థంకాదు
నీలో రెండు మనిషి
నాకు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.
ఒక్కో పార్శ్వంలో ఒక్కో రూపాన్ని
నువ్వంత జాగ్రత్తగా
ఎలా హాండిల్ చేస్తున్నావో నన్న
విషయం నాకిప్పటికి.

ఇప్పటికిప్పుడే మనం
ఎదో ఒకటి మాట్లాడుకుందాం
అవగాహన రాహిత్యాల గురించో
ఫెయలైన  పరఫెక్షన్ గురించో,
నాన్సెన్సికల్ పర్టిక్యులారిటీ గురించో
పర్వర్షన్లలో ప్యూరిటి గురించో
ఆ, ఇప్పుడకి మాట్లాడుకుందాం.

మొన్న మధ్యాహ్నం కలిసినప్పుడు
ఎలా వున్నామో,
ఇప్పుడూ అలానే ఉన్నందుకు
పొల్లికింతలతో దుఃఖిద్దాం.
మారకుండా కొట్టుకుపోతున్నందుకు.

 చివరగా
ఓ నిర్ణయమైతే తీసుకోవాలి,
ఆ రెండో మనిషి కనబడకుండా
గంతలు కట్టుకొని బతకడం గురించి.

ఆలోచించు.

26 February 2015

ద టచ్



ఉవ్వెత్తున ఎగసిపడుతున్న
అలల వేదన లాంటిదై
మూసివున్న కనుల మీద
తెరవనివ్వని బలమైన కాంతిలాంటిదై
ఆ స్పర్శ.

బాధతో కూడిన నవ్వునిచ్చే
కరుకు చక్కలిగిలిలాంటిదై
ఆమడపిల్లల ఆలనలో
ఆవిరైన రాత్రిలాంటిదై
ఆ స్పర్శ.

లేత చేతులపై
ఎర్రెర్రగా కాల్చిన లోహపు రేకుదై
నీరు పోసిన చెట్టుకొమ్మ
చర్మాన్ని చీరేసిన గాటులాంటిదై
ఆ స్పర్శ.

గుండెను చీల్చుకు చొరబడుతున్న
ఆ అభావపు స్పర్శ
మగదో, ఆడదో తెలియట్లేదు కాని,
ఆ సంవేదనలోని నిరంతర సంగమాన్నే
ఇక జీవితంగా మార్చుకోవాలేమో.