Pages

5 August 2014

నరేష్కుమార్//కాలమూ-మనుషులూ-నేననబడే నువ్వూ//



1.
ఎందుకూ...? అనడిగితే ఏం చెప్పగలం 

కొందరలా రాలిపడతారంతే. 
జీవితం ఇరుకు దారుల గుండా
సాగుతున్నప్పుడు 
నాలుగు దిక్కుల్నీ చొక్కా జేబుల్లో దాచుకొని
దుస్తులకంటుకునే పల్లేరు కాయల్లా
కొందరలా బతుకులని హత్తుకుంటారంతే

2.
 నీదే దేశం? నువ్వెవరూ?

అని వాళ్ళు నిన్ను ప్రశ్నించరు
వారి చేతుల్లో ఉన్న కొన్ని
సూర్యుడి ముక్కలని 
నిశ్శబ్దంగా నీ నోటికందిస్తారు
అకలి తీరిందా?

అనికూడా వాళ్ళు ప్రశ్నించరు.

వారికి సమాధానాలు తీస్కోవటం
నచ్చదేమో అనుకుంటావ్ నువ్వు

3.
పాత్రలనిండు గా మరిగే నీటిలో

నువ్వు ఊహించే కొన్ని తృణ దాన్యాలను
నీ మనసులో చల్లుతూ
వెలుగురేఖలని నాలుగు వైపులా పాతి
మార్మిక వ్యవసాయ క్షేత్రాలుగా
వాళ్ళు పరుచుకుంటారు 
మళ్ళీ ఎప్పుడు మొలకెత్తుతారూ
అన్న ప్రశ్నగా నువ్వు నిలబడి పోతావు


4.
హఠాత్తుగా తమ మొహాలపై

ముసుగులు తొలగించిన కొందరు
ఒకనాడు మరణించిన నీ ప్రేయసి మాటలుగా
నీ పెదవులపై కాస్త చోటుని వెతుక్కొని
తమ వెచ్చని కంబళ్ళలో దాచిన
కొన్ని కలల్ని నీ కను రెప్పలపై సున్నితంగా అద్దుతారు
తమ తలల్ని కదిలించే గడ్డిపరకలకి
కొంత వేసవినిచ్చి బదులుగా
కాస్త శీతాకాలాన్నితీస్కొని నిద్రిస్తూ... 
మనుషులను తీవ్రంగా ప్రేమించాలని 
నిశ్చయించుకుంటావు

5.
ఒక్కొక్క సారి జనం తప్ప మనుషులెవరూ లేని

నగరాల విశాల విఫణుల్లో 
నువ్వు సంచరిస్తున్నప్పుడు
నీ హృదయం దొంగిలించ బడుతుంది 
"గుండెలేని వాడుగా ఎవరూ నన్ను 
ఎవరూ నిందించరేం..? " 
అన్న నీ ప్రశ్నకి మర్రి చెట్టు పైని గబ్బిలం
ఫక్కున నవ్వుతుంది

6.
కాలం ఆగిన కొన్నిసంవత్సరాలకి

నీ జీవితం ఒక ఆకలి పాటగా 
యుద్దభూమిలోని చివరి సైనికుడి గొంతునుండి
గాలికి బహుమతిగా ఇవ్వబడుతున్నప్పుడు
మనిషి మనిషిగానే బతికేందుకు ఆకలి అత్యావశ్యకము
అనే తీర్మాన పత్రంగా మారిపొయి
కొన్ని నిశ్శబ్దాల పాటు నిలిచి పోతావ్

చివరిగా కాలం మళ్ళీ
అరిగిన బండి ఇరుసులా శబ్దం చేస్తూ కదిలాక
కొండపై పశువులు మేపే పిల్లవాడొకడు
నిన్ను గాలిపటంగా ఎగరేస్తాడు.


4 August 2014

అనేకాలు


దాటుకొచ్చిన దూరాలు ఎప్పుడూ సగాలే.
తాబేలా, కుందేలా అనేది చరిత్రకొదిలెయ్.

ఎంతగా విస్తరిస్తావో, అనేది ముఖ్యం కాదు 
ఎంతగా కురుస్తావు అనేది ఎదురుచూపుల ప్రశ్న.

స్వాగతించు రాయలేకపోవడాన్ని,
నీ వరకు నీవైనా,.
దాన్నే హత్తుకోవడానికీ ప్రయత్నించు.

ఇంతకాలం రాసి రాసి, దేన్ని ఉద్దరిస్తున్నావో
ఏ భ్రమల్లో పడి అక్షరాల్లో దొర్లుతున్నావో.

ఇక ఇప్పుడైనా,.. నీకింద పడి 
ముక్కలైన జీవితాల శాపనార్థాలు వింటుండు.

బద్దలుకొట్టుకున్న హృదయాల్లో ఏమీ మిగలదు.
కొట్టుకుపోతున్న దేహాల్లో ప్రాణమూ వుండదు.
అదే వదిలిపోయాక, కవిత్వమూ విగతమే.
Oh,. still are you available ?

2 August 2014

ఫ్యూజ్ లెస్



మళ్లీ అలాగే చెప్పుకుందాం
అదీ ఏ జన్మానిదైనా అంతేకదా!
కొన్ని రాకల వెనుక కారణాల మీద
ఎన్ని పిచ్చి గీతలు గీసుకున్నా
మధుర గీతాలు రాసుకున్నా
ఎవడికొరిగేది ఏంటో ఎవడు నిర్థారిస్తాడు?

ఒక అశోకుని లెక్క యుద్ద వీరుడై
 దుఃఖపు దారిని ఎన్నుకుని
శవాల కుప్పల మధ్య కుములుతున్న
జనుల గుండెల రగిలింతల గాయమైన
దేశపు దేహాల సందోహాల సందేహ హేల భరిస్తూ.

తధాగతా, మళ్లీ ప్రేమ గురించే మాట్లాడు
ఒక మంత్రగాడి మాదిరి ఈ జనుల చెవుల్లో
పదే పదే తడుతు హృదయపు తలుపులను.
లంజల దిబ్బల మతపూతలు మట్టికొదిలి.

యేసు దేవా, ముళ్లకిరీటపు రక్తదాహాల నేల
ఇంకా అలాగే చెర్నాకోలై చెలరేగుతూనే వుందే,
పొరుగువాడి మిస్సైల్ల దాడికి చెదిరిన
అవయపు చెత్తకుప్పల
శత సహస్ర సంప్రోక్షణల్లో
నిరంతర విషాద స్తోత్రమై, జీవితం.

ఇక చెప్పడానికి, ఏం వుంటుది ప్రవక్తా!
చీకట్లలో నెలవంకవై నువ్వు చూస్తూనే వున్నప్పుడు.


1 August 2014

లోల్


అచ్చులో అక్షరం వెలిగిపోయిదా,
ముందు మాటల సొల్లు తడిపిపోయిందా.

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

తాగితూగి నువ్వు మందు పార్టీలల్లో
వీరకృత్యాల్ చేసి శోభించినావా
కుళ్లు జోకుల మీద శయనించినావా

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

సన్మాన పత్రాలు రాయించుకున్నావా
ప్రశంసలా పూలెన్నో చల్లుకున్నావా.

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

పుస్తకం అచ్చేసి
అవార్డులను పట్టి
ఫోటోలు తీయించి
పేపర్లో వేయించి
ఫేసుబుక్కుల వాలు ఎక్కించినావా
విజిటింగ్ కార్డులా పంచి పెట్టావా

నువ్వెట్ట కవివిరా సోదరా
కనికట్టు కనరా మిత్రుడా!

ఎవడైన దండేసి దండమెట్టాడా
 ఓ శాలువా కప్పి నీ కళ్లు తుడిచాడా

నువ్వెట్ట కవివిరా సోదరా

కనికట్టు కనరా మిత్రుడా,.,