Pages

30 June 2015

బాహుబలి సినిమా పాత్రల పేర్లు - చారిత్రిక కోణం.

                               బాహుబలి సినిమాలో మూడు ప్రధాన పాత్రలకు పెట్టిన పేర్లు చారిత్రకంగా చాలా ప్రముఖమైనవి. ఈ మూడు పేర్లు(బాహుబలి, భల్లాలదేవ,బిజ్జలదేవ) కర్ణాటక ప్రాంతానికి చెందినవి కావడం కూడా ఒక విశేషంగా కనిపిస్తుంది. టైటిల్ బాహుబలి జైన మతసాహిత్యంతోను,  భల్లాల దేవ, బిజ్జల పేర్లు  కర్నాటక చరిత్రతోను ముడిపడి కనిపిస్తాయి. చరిత్రలో ఈ పేర్ల యొక్క ప్రాముఖ్యతను సంక్షిప్తంగా ఒక్కసారి చూద్దాం. చరిత్రలోనుంచి ఎన్ని పేర్లు తీసుకున్నారో, ఏఏ అంశాలనుంచి స్ఫూర్తి పొందారో సినిమా చూస్తే మరంతగా అర్థమవ్వచ్చు.
బాహుబలి
                                   జైనపురాణాల ప్రకారం మొదటి తీర్థాంకరుడైన ఋషభనాథుడి రెండవ భార్య కొడుకు ఈ బాహుబలి.
              అన్న భరతుడితో జరిగిన యుద్దలో  గెలిచి, అతన్ని చంపే సమయలో హఠాత్తుగా కలిగిన జ్ఞానోదయం వల్ల రాజ్యాన్ని అతనికే త్యాగం చేసి అడవులకు వెళ్లిపోయి తపస్సు చేస్తు అదే ముద్రలో విగ్రహమైపోతాడు బాహుబలి.  శ్రావణబెళగోళాలో  58 అడుగుల ఎత్తైన గోమఠేశ్వర విగ్రహంగా పూజలందుకుంటున్నాడు, ఈ బహుబలి. శ్రావణబెళగోళ, మరియు  బాహుబలి విగ్రహాలు జైనులకు అత్యంత పూజనీయమైనవి.
భల్లాలదేవ (పరిపాలనాకాలం 1173–1220)
                                   హోయసల సామ్రాజ్యాన్ని దక్షిణభారతదేశపు నలుమూలలకు విస్తరింపచేసి, తన తాత విష్ణువర్థనుడు సంపాదించిన స్వతంత్ర్యాన్ని సుస్థిర పరిచిన మహావీరుడు, త్రిభువన మల్లుడిగా , దక్షణ చక్రవర్తిగా పేరుగాంచిన హోయసల రాజు భల్లాల II . శాసనాలలో తనను తాను భల్లాల దేవ (god bhallala) గా( గణపతి దేవాలాగా)  కీర్తించుకొన్న మహారాజు. అత్యంత పరాక్రమవంతుడిగా, నిరంకుశుడిగా, రాజకీయ చతురుడిగా, సాహిత్య పోషకుడిగా, దేవాలయాల నిర్మాతగా కర్ణాటక చరిత్రలో కీలకమైన స్థానం భల్లాలదేవది.
 క్రీ.శ 1173 వ సంవత్సరంలో హలిబేడులో తండ్రి నరసింహ 1 పై జరిపిన తిరగుబాటుతో సింహాసనాన్ని అథిరోహిస్తాడు. దేవగిరి యాదవులను, మధుర పాండ్యులను, దక్షిణ కలచూరిలను జయించి వీరభల్లాలగా ప్రఖ్యాతి చెందుతాడు. చోళరాజులకు సహాయం చేసి చోళరాజ్యప్రతిష్టాపనాచార్య బిరుదుతోపాటు, వారి బంధుత్వాన్ని కలుపుకుంటాడు. కన్నడ సాహిత్యంలో పేరెన్నిక గన్న కవులు కవిచక్రవర్తి గా కీర్తిగాంచిన జన్న, నేమిచంద్ర, రుద్రభట్టలాంటి కవులు ఈయన ఆస్థానంలో వుండేవారు. యశోధర చరిత్ర, లీలావతి ప్రబంధ, జగన్నాధ విజయం లాంటి గ్రంథాలు ఆ కాలంలో వెలవడ్డాయి. హోయసల దేవాలయాలలో మూడోవంతు ఈయన హయంలో కట్టబడినవే. హళిబేడులోని కేదారేశ్వర ఆలయం, బిళవాడిలోని వీరనారాయణాలయం, మోసాలలోని చెన్నకేశవ,నాగేశ్వర జంట దేవాలయాలు, అమృతపురం లోని అమృతేశ్వరాలయం వీటిలో చెప్పుకోదగ్గవి. 
బిజ్జల II (పరిపాలనాకాలం 1130–1167)
                         సినిమాలో పేరు బిజ్జలదేవ,. బహుశా భల్లాలదేవ తో రిలేషన్ కోసం ఇలా మార్చి వుంటారు. దక్షిణ కలచూరి(kalachuri) రాజులలో ప్రఖ్యాతి గాంచినవాడు. కల్యాణి చాళుక్యులకు సామంతులుగా వున్న కలచురులను,1162లో స్వతంత్ర ప్రభువులుగా మార్చడమే కాకుండా వారి రాజధాని కల్యాణిని తనదానిగా చేసుకుంటాడు. వీరశైవ మత స్థాపకుడు బసవేశ్వరుడుగా  ఈయనకు ప్రధానమంత్రిగా పని చేసాడు. స్వతంత్ర్య రాజుగా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించి హత్యకు గురవుతాడు. వీరశైవులతో వున్న విబేధాల కారణంగా వీరశైవ అనునూయిలు ఇతన్ని హత్యచేసారని చెబుతారు.
                      ఇవి కాకుండా కట్టప్ప( వీరపాండ్య కట్టబ్రహ్మన్న నుంచి), కాలకేయ ( "కాల" మగధీర సెంటిమెంట్), అస్లామ్ ఖాన్ ( షేర్ ఖాన్ లాగ,, నార్నియా సినిమాలో సింహం పేరు నుంచి), శివుడు( వీరశైవం నుంచి)స్ఫూర్తి పొందినట్లుగా వుంది.
                                 అన్నదమ్ముల వైరం, తమ్ముడు త్యాగం, తండ్రిపై తిరుగుబాటు, యుద్దాలు, కుట్రలు, కుతంత్రాలు, నిరంకుశత్వం,కళాపోషణ, వీరభక్తి లాంటి అనేక  చారిత్రిక అంశాల దృశ్యాలు  కొంచెం అటుఇటుగా చిత్రకథలో సాక్షత్కరించే అవకాశాలు లేకపోలేదు.

                               ఏదేమైన చారిత్రక వ్యక్తులను గుర్తుచేస్తూ ఒక గొప్ప సినిమాను రూపొందిస్తున్న రాజమౌళి గారిని అభినందించాల్సిందే.

No comments:

Post a Comment