Pages

19 August 2017

కన్యాశుల్కం (సంక్షిప్తం) - 1 - మృత్యుంజయరావు పిన్నమనేనిప్రథమాంకము
మ.రా.శ్రీ. యన్. గిరీశం టక్కరి. మోసకారి. ఏ డిగ్రీలూ లేకపోయినా బొట్లేరు ఇంగ్లీషు ముక్కలతో బాగా చదువుకున్నవాడి లాగా అందరినీ వాక్చాతుర్యంతో మభ్యపెట్టగలడు. విజయనగరంలోని ఒక పూటకూళ్ళ వితంతువును ఉంచుకొని ఆమె ఇంట్లో చేరి అరవచాకిరీ చేస్తుంటాడు. కాదు, పూటకూళ్ళమ్మే అతన్నుంచుకొని వేళ కింత గంజి బోస్తుందని కొందరంటారు. సంతలో సామాను కొనిపెడతానని అబద్ధం చెప్పి పూటకూళ్ళమ్మ దగ్గర డబ్బు లాగేశాడు. నిజం తెలిసిన పూటకూళ్ళమ్మ అతగాడు దొరికితే చావగొట్టే ఆలోచనలో ఉంది. వెంకుపంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఆమె తాలూకువాళ్ళు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేసేలా ఉన్నారు. ఊళ్ళో దొరికిన ప్రతివాడి దగ్గరా అప్పులు చేసి ఉండటంతో వాళ్ళూ దొరికితే తన్నేలా ఉన్నారు. మరో చోటికి వెడితే తిండికి జరిగేదెలాగా అని ఆలోచిస్తున్న గిరీశానికి కృష్ణరాయపురం అగ్రహారం నుంచి వచ్చి విజయనగరంలో చదువు కుంటున్న వెంకటేశం అనే కుర్రాడు అప్పనంగా దొరికాడు. ఆ పిల్లవాడు పరీక్ష తప్పి, ఇంట్లో తెలిస్తే తండ్రి తంతాడేమోననే భయంలో ఉన్నాడు. గిరీశం వాడికి ధైర్యం చెప్పి వాడితో కలిసి చదువు చెప్పే మిష మీద వాడి వూరికి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. వేకువనే బయల్దేరేందుకు వీలుగా బండి సిద్ధం చెయ్యమని చెప్పి ఆ రాత్రికి తానుంచుకున్న వేశ్యని చూసేందుకు ఆమె ఇంటికి బయల్దేరాడు.
మధురవాణి విజయనగరంలో పేరెన్నికగన్న వేశ్య. డిప్టీకలెక్టరుగారబ్బాయిని ఆకట్టుకోవడంతో ఆయన మండిపడి కొడుకుని పైచదువుల మిషతో ఊరికి పంపి ఈమె మీద నిఘా ఉంచాడు. దాంతో పెద్దమనిషనే వాడెవడూ మధురవాణి గుమ్మం తొక్కేందుకు సాహసించలేదు. ప్రస్తుతానికి గిరీశం ఆడాలో వుంది కానీ, డబ్బుకు కటకటగా ఉంది. ఈ గోలనుంచి తప్పుకొని కొన్నాళ్ళపాటు వేరే ఊరిలో తలదాచుకోవాలనుకుంటున్న మధురవాణికి రామచంద్రాపురం అగ్రహారంలో నివసించే రామప్పంతులు తారసపడ్డాడు. అతనితో ఉండటానికి నెలజీతం మీద బేరం కుదుర్చుకుంది. గిరీశానికి ఒక్క మాట చెప్పి అతనితో తెగదెంపులు చేసుకోవడమే ఇక మిగిలి ఉంది.

గిరీశం చిన్నప్పటినుండీ రామప్పంతులుకి తెలుసు. రామచంద్రాపురంలో ఉండే లుబ్దావధాని పినతల్లి కొడుకే గిరీశం. లుబ్దావధాని విధవ కూతురుతో రామప్పంతులికి చీకటి సంబంధం ఉంది. ఆ చనువుతో గిరీశం గురించి మధురవాణి దగ్గర తేలిక మాటలు మాట్లాడాడు రామప్పంతులు. సరిగ్గా అదే సమయానికి గిరీశం అక్కడికి వచ్చాడు. అతడు రావడం చూసి పంతులు భయంతో మంచం కింద దాక్కున్నాడు. గిరీశం మధురవాణితో సరససల్లాపాలు మొదలెట్టాడు. అంతలో అతణ్ణి వెదుక్కుంటూ చీపురుకట్ట తీసుకొని పూటకూళ్ళమ్మ అక్కడికి వచ్చింది. ఆమె రావడం చూసి గిరీశం కూడా రామప్పంతులు దూరిన మంచం కిందే దూరాడు. ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నవాళ్ళు కావడంతో మనసు విప్పి మాట్లాడుకున్నారు. బయట పూటకూళ్ళమ్మ నానా యాగీ చేస్తోంది. మధురవాణి కళ్ళతో సైగ చేసి గిరీశం మంచం కింద ఉన్న సంగతి బయటపెట్టింది. పూటకూళ్ళమ్మ ఆవేశంతో రగులుకుపోతూ చీపురుకట్ట తిరగేసి మంచం కింద బాదింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికే రామప్పంతుల్ని ఇవతలికి లాగి తానవతలి పక్కకి తప్పుకున్నాడు గిరీశం. దాంతో చీపురు దెబ్బ రామప్పంతులుకి తగిలింది. పంతులు కోపంతో బయటికి వచ్చి పూటకూళ్ళమ్మను తిట్టాడు. పూటకూళ్ళమ్మ అతణ్ణి చూసి నిర్ఘాంతపోయింది. ఈ సందట్లో గిరీశం అక్కడినుంచి పారిపోయాడు. అతని వెనకే పూటకూళ్ళమ్మ వెళ్ళిపోయింది. మధురవాణి రామప్పంతుల్ని సముదాయించింది.

16 November 2016

ఖలీల్ జిబ్రాన్ అనువాదం :మృత్యుంజయరావు పిన్నమనేని

3:21

గత శాశ్వతత్వం నుండి
 శాశ్వతత్వం వైపు ప్రవహించే వెలుగుల నది
 మానవ పరంపర

3:22

 వర్ణ రహిత ద్రవంలో వసించే ఆత్మలకు
 మానవుడి వేదన చూసి ఈర్ష్య పుట్టదా?

3:23

 “పవిత్ర నగరానికి దారి నిజంగా ఇదేనా!?”
 అని నాకు తారసపడిన తైర్థికుడిని అడిగాను.
 “నాతోరా!
ఒక్కరోజులో నిన్నక్కడికి చేరుస్తానుఅన్నాడతను.
రోజుల తరబడి నడిచినా మేము గమ్యం చేరలేదు. ఆశ్చర్యమేమంటే...
నన్ను దారి తప్పించినందుకు
అతడే నామీద కోపగించాడు.

 3:24

 భగవాన్... నన్నొక సింహానికి ఆహారంగా వెయ్యి లేదా నాకొక కుందేలును ఆహారంగా ఇవ్వు

3:25

 చీకటి దారిని తప్పించి
 వేకువ నెవ్వడూ చేరలేడు

3:26

నీ గతం ఇక్కడే నివాసముంది,
 నన్నువదలకుఅంటుంది నాయిల్లు.
 “రా, నన్ననుసరించు,
నేను నీ భవిష్యత్తునుఅంటుంది రహదారి.
నాకు గతం లేదు, భవిష్యత్తూ లేదు
నేనిక్కడ నిలిస్తే ఆ నిలకడలో గమనముంది
నేనక్కడికి గమిస్తే ఆ గమనంలో నిలకడుంది
 ప్రేమ, మరణం మాత్రమే అన్నిట్నీ మారుస్తాయి

3:27

 జీవన న్యాయం మీద నమ్మకమెలా పోతుంది? కటికనేలపై శయనించేవాడికంటే
 హంసతూలికా తల్పంపై నిద్రించేవాడు
 అందమైన కలలేమీ కనడం లేదు కదా!

 3:28

విచిత్రమేమిటంటే ...
 కొన్ని సుఖాల పట్ల నాకున్న వాంఛే
 నా బాధలలో ఒక భాగమౌతోంది.

3:29

 పరిపూర్ణ సత్యం గురించి నాకేమీ తెలియదు
నా అజ్ఞానం ముందు నేను వినయంగా ఉంటాను అందులోనే
 నాకు గౌరవ పురస్కారాలు లభిస్తాయనుకుంటాను

 3:30

స్వప్నానికీ సాఫల్యతకీ మధ్య అంతరముంటుంది.
 మనిషి యొక్క తీవ్రమైన తపన దానిని తుడిచేస్తుంది.


14 November 2016

ఖలీల్ జిబ్రాన్ - అనువాదం :మృత్యుంజయరావు పిన్నమనేని

3:11

ముత్యం...
ఇసుకరేణువును చుట్టి వున్న
వేదన నుంచి నిర్మితమైన ఆలయం.

మరిమన దేహాలను
ఏ ఆరాటం ఏ రేణువు చుట్టూ నిర్మించింది?

3:12

 దైవం నన్నొక చిన్న గులకరాయిని చేసి
 ఈ అద్భుతమైన సరస్సులోకి విసిరినప్పుడు
 దీని ఉపరితలాన్ని
 అసంఖ్యాకమైన వలయాలతో చికాకు పరిచాను
అడుక్కంటా చేరగానే అచేతనమై పోయాను.


3:13

నాకు నిశ్శబ్దాన్నివ్వు
ఈ నిశిరేయి అంతు చూస్తాను.

 3:14

నా దేహాత్మలు
పరస్పరం ప్రేమించుకొని పెళ్లాడినప్పుడు
 నేను ద్విజుడి నయ్యాను

3:15

గతంలో నాకు తెలిసిన మనిషొకడుండేవాడు
అతనివి పాము చెవులు కానీ పాపం మూగవాడు
యుద్ధంలో అతని నాలుక తెగిపోయింది
ఒక గొప్ప నిశ్శబ్దం ఏర్పడే ముందు
 మనిషి ఎలాంటి పోరాటాలు చేస్తాడో నాకప్పుడు తెలిసింది.

అతను చనిపోయాడు
  నాకదేసంతోషం.
ఈ ప్రపంచం మా యిద్దరికీ చాలినంత పెద్దది కాదు.

3:17
స్మృతి సంయోగానికి మరో రూపం

3:18
విస్మృతి స్వేచ్ఛకు మరో రూపం

3:19

మేము...
అసంఖ్యాక సౌర చలనాలతో కాలాన్ని కొలుస్తాము
వాళ్ళు...
చినచిన్న జేబుల్లోని బులిబుల్లి యంత్రాలతో గణిస్తారు.
ఇప్పుడు చెప్పండి..
వారికీ మాకూ ఒకే స్థలకాలాల్లో కలయిక సాధ్యమా!?

3:20

భూమికీ భానుడికీ మధ్యనుండే దూరం
 దూరం కానే కాదని
 పాలపుంత గవాక్షం నుండి

క్రిందికి చూసేవాడికి తెలుస్తుంది.

ఖలీల్ జిబ్రాన్- అనువాదం: మృత్యుంజయరావు పిన్నమనేని

ఇసుక-నురుగు   

ఇసుకా నురుగుల మధ్యన
ఈ తీరాల వెంబడి అనాదిగా నడుస్తున్నాను
 పెనుకెరటం నా పాదముద్రలను తుడిపేస్తుంది
పెనుగాలి నురగను ఊదేస్తుంది
 సముద్రమూ తీరమూ మాత్రం
 ఎప్పటికీ అలాగే ఉంటాయి. 3:1

 గుప్పిట్లో పొగమంచును మూశాను
 తెరిస్తే అదొక క్రిమిగా మారింది
 మళ్ళీ మూసి తెరిచాను, అదొక క్రిమిగా మారింది
మళ్ళీ మూసి తెరుద్దును గదా
 అక్కడొక మనిషి
దిగులుగా పైకి చూస్తూ నిలబడి ఉన్నాడు
 మళ్ళీ మూసి తెరిస్తే అక్కడేమీ లేదు పొగమంచు తప్ప
కానీ.... నేనొక అతిమధురమైన సంగీతం విన్నాను. 3:2

జీవగోళంలో లయతప్పి కంపిస్తున్న
 చిన్నితునక లాగా నన్ను నేను ఊహించుకున్నాను. 
ఇప్పుడు తెలుస్తోంది ... నేనే ఒక గోళాన్ని
 జీవమంతా చిన్న తునకలుగా
నాలోనే లయబద్ధంగా కదులుతోంది. 3:3

వారు మెలకువతో ఉండి నాకో మాట చెప్పారు
నువ్వూ, ఈ నీ ప్రపంచమూ
 అనంతమైన సముద్రతీరంలోని ఒక ఇసుక రేణువు”.
నా కలలోనుంచి నేను వారికి బదులిచ్చాను
 “నేనొక అనంతమైన సముద్రాన్ని
విశ్వాలన్నీ నా తీరంలోని ఇసుకరేణువులు” 3:4

 నేను ఒకేఒక్కసారి మూగబోయాను.
నువ్వెవరు? అని నన్నెవరో అడిగినప్పుడు. 3:5

దేవుడి తొలి తలపు ఒక దేవత
 అతడి తొలి పలుకు ఒక మనిషి 3:6

గాలీ అడవీ 
మనకు మాటలు నేర్పకముందు
 కొన్ని లక్షలేళ్ళు
మనం తడబడుతూ, పరిభ్రమిస్తూ, ఆరాటపడ్డ జీవులం
మరి నిన్న మొన్న నేర్చిన మాటలు 
మనలోని ప్రాచీనతను ఎలా వ్యక్తీకరించగలవు? 3:7

 సింహిక ఒక్కసారే మాట్లాడింది.
 “ఇసుకరేణువంటే ఎడారి
ఎడారంటే ఇసుకరేణువు.
 మరిక మాట్లాడక ఊరుకోండి
నేనది విన్నాను కానీ ఏమీ అర్ధం కాలేదు. 3:8

 నేనొకసారి ఒక స్త్రీమూర్తి ముఖం చూశాను
 ఆమె కింకా కలగాల్సిన సంతానం ఉన్నారనుకున్నాను
అదే ఒక స్త్రీ నాముఖం చూసి
 తను పుట్టకముందే చనిపోయిన
 నా తండ్రి తాతల గురించి తెలుసుకోగలిగింది 3:9

మేధోజీవులు నివసించే గోళంగా
 నన్ను నేను మార్చుకోకపోతే
 నేనొక పరిపూర్ణ మానవుణ్ణి కాలేను


 ప్రతిమనిషి గమ్యమూ అదే కదా! 3:10 

19 September 2016

బేకారీలు 101

101
చెవులకు పెదాలు అన్చి
రహస్యపు చక్కలిగింతల మధ్య
ఆమె అంటుంది

నీ ఒక్కో మోజుకో, ఆశకో, ఉద్వేగానికో
మూలమై నిలిచి, నీలో చలిస్తూ
నిన్ను నడిపుతూ
నీలోపల లెక్కపెట్టలేనంత మంది
మనుషులు ఉంటారు తెలుసా అని.
ఒక్కో మోజు మరణించే కొద్ది
దాని ప్రాతినిధ్యపు మనిషి కూడా కాలం చేసేస్తుంటాడు.
లోపల మనుషులెవ్వురూలేకుండా
నువ్వొక్కడివే మిగలడాన్నే మోక్షం అంటారేమో
అంటుందామె, చెవి సౌఖ్యాన్ని భంగపరుస్తూ.
010916

30 March 2016

బేకారీులు 101-125

101
తిండితో పాటు,
నంజుడికి ఓ బుర్ర దొరికింది,.
ఇంకేం కావాలి,.

 జీవితానికి,...
102
మోయాలి,.
మోయించుకోవాలి.,.
మోత మహోన్నతం,

తెలుసుకోవాలి,..
103
ఒక రోదనతో మొదలై
కొన్ని ఏడుపులతో

ముగిసిపోతుంది
జీవితం.
104
ఎంత కప్పినా తప్పును
గిల్టి కాన్షస్

గిల్లుతూనే వుంది.
105
వ్యాకరణాన్ని వెతికి
వాక్యానికి విలువకట్టే వాడు
పండితుడనుకోకు

106
జీవితాన్ని
నువ్వంగీకరించలేవు.
జీవితం
నిన్ను ప్రతిఫలించలేదు.

ఓహ్, ఎంత దురదృష్టం.
261015

107
నువ్వు
మనుషుల గురించి మాట్లడతావ్
నాకు

జంతువులే గుర్తొస్తుంటాయ్
క్షమించు,..
108
మనసులోపల నీకు విషమెంత వున్నా,..
మాటలలో మర్యాద,

మన్ననలనిచ్చు
వినుకోరా చిన్నా,..లోకం తీరు కనరా కన్నా,..
109
కాలమెన్నడు నీకు కలసి రానే రాదు,.
తెగువ లేక నువ్వు బతికినప్పుడు,...
వినుకోరా చిన్నా,..లోకం తీరు కనరా కన్నా,..


110
ఘర్షణలేకుండా చలనాలు
సంఘర్షణ లేకుండా మార్పులు

సులభమని ఊహించుకోకు.
అందులోను
ఇట్లాంటి చోట్ల.

111
బడికి పొమ్మంటే
ఏడుస్తుంది అజ్ఞానం.
ఎంత పసి హృదయం!
112
అమ్మఒడి,
కమ్మనిబడి
రెండు స్వర్గాలు భూమి మీద.
113
ఆలోచనలు పసిపిల్లలు
ఎటుపోతాయో
వాటికే తెలియదు.
114
స్వార్ధం చెప్పే సుద్దులు
స్థిర పడుతున్నాయ్.
సర్దుబాటు సాధ్యమేనా!
115
గమ్యమెప్పుడో
నిర్ణయించబడే వుంది.
దిగులంతా
దారి గురించే.
251015
116
ప్రశ్నించడం గొప్ప మలుపన్నా !
బలుపు కాదా?
అన్నాడు,  ఇంకొకడు.
117

భుజం పై బరువు మోయలేకేమో
స్పందనలనిప్పుడు

బాల్యం వదుల్తుంది.

118
ఎక్కడోడో అయితే
పొగిడి పైకెక్కిస్తాం,.
పక్కనోడైతే ఏకిపారేస్తాం,..

119
నువ్వెవ్వడివనేది
నిర్ణయించుకొనే కొద్దీ
లేదా నిర్ణయించబడే కొద్దీ

నువ్వు జీవించే చోటు
కుంచిచుకుపోతుంటుంటుంది.
281015
120

ఆరామ్గా కూర్చొని
ఖుషిచేద్దామనుకున్నప్పుడు
దునియా మొత్తం తిప్పేస్తాది.

ఉత్సుకతతో శక్తినంతా కూడదీసుకొని
లోకాన్ని తిరిగేద్దామంటే
కట్టడి చేసి, ఓ  మూల బంధీని చేసేస్తుంది

జిత్తులమారి కదా,. ఈ జీవితం.
121

స్థిరత్వం
సహజమా, అసహజమా
విడమర్చుకొని చెప్పుకుంటున్నా అర్థంకాలా.

విఫల తాత్వికతల
సఫల ప్రయాణమా ?
 లేక
సఫల తాత్వికతా విఫల ప్రయాణమా? 
ఏమో!
అంతా ఉత్త ఆలోచనలే,

 కేవలం నిమిత్తమాత్రుత
అంతకంటే ఏం లేదు
జీవితం
311015
122 
మోసం చేయాలనుకున్నప్పుడు.
ముందు,
నమ్మకంగా కొన్ని మాటలు చెప్పాలి.

మొత్తంగా దోచుకోవాలనే
దూరదృష్టున్నప్పుడు
భ్రమల మానియాల్లో
మెదడుని ముంచేయ్యాలి.

టార్గట్కి అర్థమవ్వనంత వరకు ఓ.కే.
ఖర్మకాల్తే, ఆ తరువాత కథ మారిపోద్ది.
123 
నేను నమ్మే
అబద్దం పట్ల
నాకు విశ్వాసం వుంది.

నిజం పట్ల నీకున్న
గౌరవంకంటే ఎక్కువగా.
124
భావం స్థిరపడటం
 బలం అనుకోకు.

గుంజకు కట్టబడ్డ
గానుగెద్దే ఇక,  ఆ తరువాత

041115
125
మాటల్లో సుమూర్ఖత్వమో
వాక్యాల్లో సుమేధావీతనమో
సమజ్ కాకపోతే సమస్యేం లేదు.

అవకాశవాదం
అర్థం చేసుకోచాలు,
లక్షణంగా బతికిపోతావ్.

031115