Pages

25 December 2018

ఆమె..... బేకారీలు...... పరిచయం - కట్టా శ్రీనివాస్

బేకారీలు ఈ పేరు కేవలం తిట్టుగానో, ఆక్షేపణగానో వినడంనుంచి ఆ పేరు ఒక తాత్విక సంవాదానికి కేంద్రమైన కవిత్వానికి చిరునామాగా చెప్పిన సహజకవి భాస్కర్.కె గారి బేకారీలు ‘‘ఆమె’’ పేరుతో ఒక పుస్తకం రూపంలో వెలువడ్డాయి. ఆముచ్చట్లు మీతో కొన్ని పంచుకుంటాను.
******

వృత్తిరీత్యా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా తనదైన ముద్రతో విద్యార్ధులను తీర్చిదిద్దుతూనే మరోపక్క చరిత్రకారుడిగా ఫోటో గ్రాఫర్ గా మరీ ముఖ్యంగా తన విలక్షణ తాత్త్వికతను అందమైన అల్లికలో అందించే కవిగా పదాడంబరాలో, ఢాంబికాలో లేని సహజత్వంతో తనను తాను వెలిబుచ్చుకోవడంలో విభిన్నమైన వ్యక్తి భాస్కర్. సరళంగానే కాదు ఒక్కోసారి ఏమీ ఎరగని వాడిలా ఉండే తనని అర్ధం చేసుకోవాలంటే మరోసారి ఎంతో క్లిష్టంగా కూడా అనిపిస్తుంది. తీరా చూస్తే ఆ క్లిష్టత తనలో కాక చూసే మన దృష్టికోణంలోని సాంప్రదాకతదేమో అని మరింకోసారి రుజువవుతుంటుంది. అలాటిదొక ఉదాహరణ చెప్తాను.
******
నిన్న తెల్లవారు జామున రెండున్నరకు హైదరాబాదునుంచి ఖమ్మం చేరగానే తన కొత్తపుస్తకం చేతిలో పెట్టారు. కవర్ పేజీ అబ్ స్ట్రాక్ట్ పెయింట్ లా అపిపిస్తోంది. ఎడిటర్లుగా మృత్యుంజయరావుగారు. శ్రీసుధామోదుగు గారు వున్నారు కదా వారిద్దరూ ఏం ఆలోచించారా అని చూస్తున్నాను. పుస్తకం పేరు "ఆమె" అన్నారు కదా అని ఎడమ వైపు తిరిగిన హిప్పోకాంపస్ నిండు చూలాలి గుండ్రని పొట్టాలా వుంది కవర్ పేజీ అనుకుంటున్నాను. హిప్పో కాంపస్ మెదడు లోని ఒక భాగం మాత్రమే కాదు ఒకరకం జీవి పేరు కూడా. ప్రపంచాన్ని మోసే "ఆమె" అంటున్నారా? ఆలోచనలను మోసే "ఆమె" అంటున్నారా? ఆలోచిస్తూ ఎందుకులే ఎదురుగా వున్నారని భాస్కర్ నే అడిగాను. ఎప్పటిలా ఒక సరళమైన చిరునవ్వు నవ్వుతూ తను చెప్పాడు. అర్ధం కాలేదా ఒకసారి పుస్తకాన్ని అడ్డంగా తిప్పిచూడండి. మామూలుగా కన్ను కనిపిస్తుంది. "దృష్టికోణం" అనేదే నా వుద్దేశ్యం. పుస్తకంలో చెప్పదలచుకున్నది అదే కదా అని పెట్టాను. ఏం బాగాలేదా? ఓ నాలుగు కవర్లలో మృత్యుంజయరావుగారు ఇది బావుందన్నారు నేను సరేనన్నాను అంటూ ఆలోచనల్లోనూ మాటల్లోనూ ఏ బరువూ లేకుండా తను చెప్తుంటే అనిపించింది. చివర్లో తన కవిత్వంలోని ఆవిడ మాట్లాడితే ఇలాగే అంటుందేమో. ‘‘ తన కవిత్వాన్ని అర్దం చేసుకునేప్పుడూ అంతే కదా. లోతైన విషయాన్న తను ఎంతో సరళంగా,సాదాగా చెప్తుంటే. దాన్ని మరింత ఇష్టంగానైనా క్లిష్టంగా అర్దంచేసుకుంటూ కష్టపడతా0 ’’.
******
బేకారీ అంటే నిర్వ్యాపారత, నిరుద్యోగము, పనికిమాలినతనము అని వ్యర్థం, నిరుపయోగం అనీ అర్ధాలున్నాయి. ఈ తాత్త్విక సంవాదం లో కూడా ఏదో ఒక సిద్దాంతానికో విధానానికో కట్టుబడిన పట్టుబడిన ఆలోచనకాక అలవోకగా జీవితంలో ఎదురయ్యే వేర్వేరు సంఘటనలను అచ్చంగా కొత్తగా చూడటం వాటిపై అప్పటికే సాంప్రదాయ బద్దంగా ఇచ్చిన వివరణలను పునః సమీక్షించడం వాద ప్రతివాదాలకు సమన్వయంగా సమవాదం వినిపించినట్లు ఒక్కోసారి ఒక ముగింపు ప్రతిపాదన వుండటం మరోసారి ప్రశ్ననే ముగింపుగా వదిలేయడం గమనిస్తాం. నిజానికి భారతీయ తాత్త్వికతలో సంవాదరూప జ్ఞానసముపార్జన ఎప్పటినుంచో వున్నాదే కానీ దానికి కవిత్వ సొబగులు, సంక్షిప్తతా సౌందర్యాన్ని అద్దిన వాడు భాస్కరుడు. మండన మిశ్రుడి కాలం నుంచి పరాంప్రేయసీ (Yasaswi)యశస్వి వరకూ జీవిత సహచరితో ముచ్చట్లను సాహిత్య ప్రక్రియగా మార్చిన నేర్పరులే కానీ జీవితపు తాత్త్వికతలో ఎదురయ్యే అనేక మౌళిక ప్రశ్నలకు ఈ సంభాషణనేపద్యంలో సమాధానాలను వెతికించిన వాడు భాస్కరుడు. తత్త్వమూ కవిత్వమూ అంటే ఎంత కొరుకుడకుండా వుంటాయోమోననే అపప్రదను తొలగిస్తూ అందమైన సింగారపు(శృంగారపు) సందర్భాలను సైతం ఈ నేపద్యానికి అనుభందంగానే సృష్టించగలిగిన వాడు భాస్కరుడు.
******

ప్రేమంటే ముందుకెళ్ళడం 
ద్వేషమంటే వెనక్కి మళ్ళడం 
అన్నాడతను కాస్తంత తాత్త్వికంగా ముఖం పెట్టి
జీవితమంటే 
ముందు వెనకల ఊగిసలాటేనోయ్ 
 అంటుందామె, అలై అల్లుకుంటూ.

మచ్చుకి పైన ఉదహరించిన ఒక కవిత చూడండి ఇప్పటివరకూ సైద్దాంతికంగా భావిస్తున్నదాని ప్రకారం అతడొక విషయం ప్రస్తావించాడు. ప్రేమంటే ఒక పాజిటివ్ అంశం అని ద్వేషించడం అంటే పెద్ద నెగిటివ్ అంశం అని ప్రేమవుండటం అంటే ముందుకు వెళ్ళడం అని ద్వేషం వుంటే వెనక్కి మళ్ళడం అనీ మరికొన్ని పోలికలు సైతం మనం చెప్పుకుంటూనే వుంటాం అదే విషయం అంటాడు అతను. కానీ చాలా సులభంగా ఆవిడ ఈ వాదనకు మరింత పరిపూర్ణత తీసుకు వచ్చింది. ప్రేమ ద్వేషం రెండూ వుండటమే కదా జీవితం అనడాన్ని ముందు వెనకల ఊగిసలాటగా చెప్పేసింది. అయితే భాస్కరుడి చమత్కారం ఆమె అలై అల్లుకుంటూ చెప్పడం వల్ల మరింత కొత్తగా ఆహ్లాదంగా భాసిస్తుంది.
*****
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కవితకు దాని పొడవుకు మించిన వివరణ ఇస్తూ మరింత పొడవైన రెన్ అండ్ మార్టిన్ గైడ్ తయారు చెయ్యాలేమో.మీరే స్వయంగా భాస్వర ప్రకాశం చూడాలంటే పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోండి. మంచిపుస్తకం సురేష్ గారు ఇష్టంగా ప్రచురించిన ఈ పుస్తకం కాపీలు ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మంచిపుస్తకం స్టాల్ నంబర్ 84,85 లలో దొరుకుతాయి. ఎక్కడా పేజీలను వృధాపోనివ్వకుండా, అలంకరణలతో ఎడాపెడా నింపకుండా 104 పేజీలలో 280 బేకారీలున్న పుస్తకం ఇది. విషయాన్ని పాఠకులు అర్ధంచేసుకునేందుకు ముందుమాటలూ, వెనకరాతలూ అవసరం లేదనే నిర్ణయంతో అచ్చంగా బేకారీలు మాత్రమే వున్న విభిన్నమైన పుస్తకం వీలయినంత త్వరగా మీ స్వంతం చేసుకోండిమరి. అప్పటిదారా మరికొన్ని బేకారీలు రుచిచూడాలంటే భాస్కర్ కె ఫేస్ బుక్ వాల్ కూడా చూడొచ్చు

ఆమె ....... బేకారీలు -- చిన్న పరిచయం

చాలా రోజులుగా ఎదురు చూస్తున్న "ఆమె" కవితా పుస్తకం ఈ బుక్ ఫెయిర్ సందర్భంగా విడుదలయ్యింది.

"బేకారీలు" పేరుతొ భాస్కర్ కె  2013 నుంచి కవితలు రాస్తున్నారు. బేకారీలు అన్న పదానికి నిగూఢమైన అర్ధం ఏమి లేదు, వ్యర్ధమైనది ,ఉపయోగం లేనిది!

 ఏ ఉద్దేశ్యం బేకారీలు అన్నారో కానీ ఈ కవితలది ఒక నూతన వొరవడి . అన్ని కవితల వస్తువు "అతను","ఆమె" మధ్య సంభాషణ... తెలుగు కవిత్వంలో ఇలా కేవలం రెండు పాత్రల మధ్య సంబాషణ కేంద్రంగా వొచ్చిన కవిత్వం మరేదైనా ఉందేమో నాకు తెలియదు.

ఈ పుస్తకానికి ముందు మాట రాసిన Katta Srinivas అన్నయ్య చెప్పినట్లు బేకారీల కవిత్వం ఏదో ఒక సిద్దాంతానికో విధానానికో కట్టుబడిన పట్టుబడిన ఆలోచనకాక అలవోకగా జీవితంలో ఎదురయ్యే వేర్వేరు సంఘటనలను అచ్చంగా కొత్తగా చూడటం వాటిపై అప్పటికే సాంప్రదాయ బద్దంగా ఇచ్చిన వివరణలను పునః సమీక్షించడం వాద ప్రతివాదాలకు సమన్వయంగా సమవాదం వినిపించినట్లు ఒక్కోసారి ఒక ముగింపు ప్రతిపాదన వుండటం మరోసారి ప్రశ్ననే ముగింపుగా వదిలేయడం.

ఉదాహరణకు,
ప్రపంచం ప్రశ్నలడుగుతుంటుంది
జీవితం సమాధానాలు ఇస్తూ ఉంటుంది
ఏ మనిషికైనా ప్రశ్నలు మారవు
సమాధానాలే మనిషిమనిషికి మారిపోతుంటాయి
అన్నాడతను కాస్తంత గంభీరంగా
ప్రతి ప్రశ్నను బొట్టుపెట్టి లోపలి పిలవకు
జీవితం ప్రశ్నార్థకమై మిగులుతుంది, జాగర్త అంటుందామె
నవ్వుతు అతని మెటికలు విరుస్తూ

కవిత్వం అంటే ఏమిటి?నాలుగు వాఖ్యాలను విడదీసి రాయటమా?భావావేశం కవిత్వంగా మారుతున్న ఈరోజుల్లో భాస్కర్ అన్న లాగా పాత్రలన్నింటినీ తనలోకి లాక్కొని మధించుకొని కవితలు రాస్తే అది కాంతివంతం అవుతుంది. భాస్కరన్న ఉద్దేశ్యంలో కథ విపులీకరణ -కవిత సూక్ష్మీకరణ.

ఈ కవితలు అన్ని భౌతికమైన అంశాల చుట్టే తిరుగుతాయి. రోజువారీ జీవితంలో మనుషుల ప్రవర్తన మీద అతను అర్దోక్తిలోనో, ఆత్రుతలోనే అడిగే ప్రశ్నకో ,చేసే వాఖ్యానానికో ఆమె సరైన మెలికలో సమాధానాన్ని పరిపూర్ణం చేస్తుంది,ఈ కవిత చూడండి,

అతనడిగాడు
నా ప్రతిభకు గుర్తింపేదని
ప్రతిభకైనా, దేహానికైనా
మోయడానికి కొన్ని భుజాలు కావాలి
నలుగురు మోసేటప్పుడు
దేహం ఎంత నిశ్చలంగా వుంటుందో
ప్రతిభ కూడా అంట నిస్పర్శగా ఉండగలిగినప్పుడే
కోరుకో దాన్ని అటుందామె .

.. "నిస్పర్శగా ఉండగలిగినప్పుడే "-- మనసుకు తగిలిన ఎదుర్రాయి. ఆలోచనల్లో ఎదో మూల మిగిలిన గర్వం అవశేషాలను Dettol పెట్టి కడిగేసే సమాధానం.

ఒక కవితలో వాస్తవాన్ని,దృష్టికోణాన్ని సూత్రీకరిస్తూ ఇలా అంటారు ,

జీవితం గ్లాసులో నీటిని నింపుకోవడం లాంటిది

సంతృప్తి ,అసంతృప్తిని
నువ్వు పట్టుకున్న గ్లాస్ సైజు నిర్ణయిస్తుంది
అదృష్టం,దురదృష్టలను
నువ్వు తిప్పిన కొళాయి ట్యాంకులో నీటి పరిమాణం
అంటుందామె,అతనికి దప్పికై మిగులుతూ

ఈ కవిత్వం చదివిన తరువాత అతను ,ఆమే ఎవరు?ఇద్దరు ఒకరేనా? అన్న అనుమానం రావటం సహజం... ఈప్రశ్నను ఊహించొ లేక యాదృఛ్చికంగానో ఇలా రాశారు,

అతనడుగుతాడు
నువ్వు రాసే ప్రతి అక్షరంలో
కనిపిస్తున్నది నేనే కదా అని
నిజానికి అబద్దానికి మధ్య మౌనంగా ఆమె !

ఒకసారి రచయితను ఇదే విషయం అడిగితె నవ్వేశారు... నాకు గీతాంజలి అనువాదంలో చలం రాసిన ఈ వాక్యాలు గుర్తొస్తాయి
అదీ కాదు,అనుభవించేది నేను కాదు .నేను నువ్వు కలిసి
అదీకాదు,నువ్వు నేను భేదమే లేదు.అంతా నువ్వే ,నేను లేను.
నువ్వేకాని, నేను కాని ఉన్నది ఒక్కరే ! .... బేకారీల వరకు ఉన్నది ఒక్కరే -అది "సంభాషణ"!

అతడొక వజ్రాన్ని కొన్నాడు
గదంతా కాంతి పరుచుకుంది
ఆమొక వాక్యాన్ని కనుగొంది
జీవితం ప్రకాశవంతమైంది
నిజమే ,వాక్యపు వెలుగు వజ్రానికెప్పటికీ రాదు
..

అవును బేకారీలలో "ఆమె" వాక్యాలు వెలుగు చాలాకాలం ప్రజ్వరిల్లుతుంది- అభినందనలు భాస్కర్ అన్న.
బేకారీల కవితా పుస్తకం "ఆమె" మంచి పుస్తకం వారి స్టాల్ #84,85లో దొరుకుతుంది.