Pages

25 December 2018

ఆమె ....... బేకారీలు -- చిన్న పరిచయం

చాలా రోజులుగా ఎదురు చూస్తున్న "ఆమె" కవితా పుస్తకం ఈ బుక్ ఫెయిర్ సందర్భంగా విడుదలయ్యింది.

"బేకారీలు" పేరుతొ భాస్కర్ కె  2013 నుంచి కవితలు రాస్తున్నారు. బేకారీలు అన్న పదానికి నిగూఢమైన అర్ధం ఏమి లేదు, వ్యర్ధమైనది ,ఉపయోగం లేనిది!

 ఏ ఉద్దేశ్యం బేకారీలు అన్నారో కానీ ఈ కవితలది ఒక నూతన వొరవడి . అన్ని కవితల వస్తువు "అతను","ఆమె" మధ్య సంభాషణ... తెలుగు కవిత్వంలో ఇలా కేవలం రెండు పాత్రల మధ్య సంబాషణ కేంద్రంగా వొచ్చిన కవిత్వం మరేదైనా ఉందేమో నాకు తెలియదు.

ఈ పుస్తకానికి ముందు మాట రాసిన Katta Srinivas అన్నయ్య చెప్పినట్లు బేకారీల కవిత్వం ఏదో ఒక సిద్దాంతానికో విధానానికో కట్టుబడిన పట్టుబడిన ఆలోచనకాక అలవోకగా జీవితంలో ఎదురయ్యే వేర్వేరు సంఘటనలను అచ్చంగా కొత్తగా చూడటం వాటిపై అప్పటికే సాంప్రదాయ బద్దంగా ఇచ్చిన వివరణలను పునః సమీక్షించడం వాద ప్రతివాదాలకు సమన్వయంగా సమవాదం వినిపించినట్లు ఒక్కోసారి ఒక ముగింపు ప్రతిపాదన వుండటం మరోసారి ప్రశ్ననే ముగింపుగా వదిలేయడం.

ఉదాహరణకు,
ప్రపంచం ప్రశ్నలడుగుతుంటుంది
జీవితం సమాధానాలు ఇస్తూ ఉంటుంది
ఏ మనిషికైనా ప్రశ్నలు మారవు
సమాధానాలే మనిషిమనిషికి మారిపోతుంటాయి
అన్నాడతను కాస్తంత గంభీరంగా
ప్రతి ప్రశ్నను బొట్టుపెట్టి లోపలి పిలవకు
జీవితం ప్రశ్నార్థకమై మిగులుతుంది, జాగర్త అంటుందామె
నవ్వుతు అతని మెటికలు విరుస్తూ

కవిత్వం అంటే ఏమిటి?నాలుగు వాఖ్యాలను విడదీసి రాయటమా?భావావేశం కవిత్వంగా మారుతున్న ఈరోజుల్లో భాస్కర్ అన్న లాగా పాత్రలన్నింటినీ తనలోకి లాక్కొని మధించుకొని కవితలు రాస్తే అది కాంతివంతం అవుతుంది. భాస్కరన్న ఉద్దేశ్యంలో కథ విపులీకరణ -కవిత సూక్ష్మీకరణ.

ఈ కవితలు అన్ని భౌతికమైన అంశాల చుట్టే తిరుగుతాయి. రోజువారీ జీవితంలో మనుషుల ప్రవర్తన మీద అతను అర్దోక్తిలోనో, ఆత్రుతలోనే అడిగే ప్రశ్నకో ,చేసే వాఖ్యానానికో ఆమె సరైన మెలికలో సమాధానాన్ని పరిపూర్ణం చేస్తుంది,ఈ కవిత చూడండి,

అతనడిగాడు
నా ప్రతిభకు గుర్తింపేదని
ప్రతిభకైనా, దేహానికైనా
మోయడానికి కొన్ని భుజాలు కావాలి
నలుగురు మోసేటప్పుడు
దేహం ఎంత నిశ్చలంగా వుంటుందో
ప్రతిభ కూడా అంట నిస్పర్శగా ఉండగలిగినప్పుడే
కోరుకో దాన్ని అటుందామె .

.. "నిస్పర్శగా ఉండగలిగినప్పుడే "-- మనసుకు తగిలిన ఎదుర్రాయి. ఆలోచనల్లో ఎదో మూల మిగిలిన గర్వం అవశేషాలను Dettol పెట్టి కడిగేసే సమాధానం.

ఒక కవితలో వాస్తవాన్ని,దృష్టికోణాన్ని సూత్రీకరిస్తూ ఇలా అంటారు ,

జీవితం గ్లాసులో నీటిని నింపుకోవడం లాంటిది

సంతృప్తి ,అసంతృప్తిని
నువ్వు పట్టుకున్న గ్లాస్ సైజు నిర్ణయిస్తుంది
అదృష్టం,దురదృష్టలను
నువ్వు తిప్పిన కొళాయి ట్యాంకులో నీటి పరిమాణం
అంటుందామె,అతనికి దప్పికై మిగులుతూ

ఈ కవిత్వం చదివిన తరువాత అతను ,ఆమే ఎవరు?ఇద్దరు ఒకరేనా? అన్న అనుమానం రావటం సహజం... ఈప్రశ్నను ఊహించొ లేక యాదృఛ్చికంగానో ఇలా రాశారు,

అతనడుగుతాడు
నువ్వు రాసే ప్రతి అక్షరంలో
కనిపిస్తున్నది నేనే కదా అని
నిజానికి అబద్దానికి మధ్య మౌనంగా ఆమె !

ఒకసారి రచయితను ఇదే విషయం అడిగితె నవ్వేశారు... నాకు గీతాంజలి అనువాదంలో చలం రాసిన ఈ వాక్యాలు గుర్తొస్తాయి
అదీ కాదు,అనుభవించేది నేను కాదు .నేను నువ్వు కలిసి
అదీకాదు,నువ్వు నేను భేదమే లేదు.అంతా నువ్వే ,నేను లేను.
నువ్వేకాని, నేను కాని ఉన్నది ఒక్కరే ! .... బేకారీల వరకు ఉన్నది ఒక్కరే -అది "సంభాషణ"!

అతడొక వజ్రాన్ని కొన్నాడు
గదంతా కాంతి పరుచుకుంది
ఆమొక వాక్యాన్ని కనుగొంది
జీవితం ప్రకాశవంతమైంది
నిజమే ,వాక్యపు వెలుగు వజ్రానికెప్పటికీ రాదు
..

అవును బేకారీలలో "ఆమె" వాక్యాలు వెలుగు చాలాకాలం ప్రజ్వరిల్లుతుంది- అభినందనలు భాస్కర్ అన్న.
బేకారీల కవితా పుస్తకం "ఆమె" మంచి పుస్తకం వారి స్టాల్ #84,85లో దొరుకుతుంది.

No comments:

Post a Comment