Pages

3 September 2018

కన్యాశుల్కం ( సంక్షిప్తం)


కన్యాశుల్కం 

-    మృత్యుంజయరావు పిన్నమనేని


ప్రథమాంకము

మ.రా.శ్రీ. యన్. గిరీశం టక్కరి. మోసకారి. ఏ డిగ్రీలూ లేకపోయినా బొట్లేరు ఇంగ్లీషు ముక్కలతో బాగా చదువుకున్నవాడి లాగా అందరినీ వాక్చాతుర్యంతో మభ్యపెట్టగలడు. విజయనగరంలోని ఒక పూటకూళ్ళ వితంతువును ఉంచుకొని ఆమె ఇంట్లో చేరి అరవచాకిరీ చేస్తుంటాడు. కాదు, పూటకూళ్ళమ్మే అతన్నుంచుకొని వేళ కింత గంజి బోస్తుందని కొందరంటారు. సంతలో సామాను కొనిపెడతానని అబద్ధం చెప్పి పూటకూళ్ళమ్మ దగ్గర డబ్బు లాగేశాడు. నిజం తెలిసిన పూటకూళ్ళమ్మ అతగాడు దొరికితే చావగొట్టే ఆలోచనలో ఉంది. వెంకుపంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఆమె తాలూకువాళ్ళు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేసేలా ఉన్నారు. ఊళ్ళో దొరికిన ప్రతివాడి దగ్గరా అప్పులు చేసి ఉండటంతో వాళ్ళూ దొరికితే తన్నేలా ఉన్నారు. మరో చోటికి వెడితే తిండికి జరిగేదెలాగా అని ఆలోచిస్తున్న గిరీశానికి కృష్ణరాయపురం అగ్రహారం నుంచి వచ్చి విజయనగరంలో చదువు కుంటున్న వెంకటేశం అనే కుర్రాడు అప్పనంగా దొరికాడు. ఆ పిల్లవాడు పరీక్ష తప్పి, ఇంట్లో తెలిస్తే తండ్రి తంతాడేమోననే భయంలో ఉన్నాడు. గిరీశం వాడికి ధైర్యం చెప్పి వాడితో కలిసి చదువు చెప్పే మిష మీద వాడి వూరికి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. వేకువనే బయల్దేరేందుకు వీలుగా బండి సిద్ధం చెయ్యమని చెప్పి ఆ రాత్రికి తానుంచుకున్న వేశ్యని చూసేందుకు ఆమె ఇంటికి బయల్దేరాడు.
మధురవాణి విజయనగరంలో పేరెన్నికగన్న వేశ్య. డిప్టీకలెక్టరుగారబ్బాయిని ఆకట్టుకోవడంతో ఆయన మండిపడి కొడుకుని పైచదువుల మిషతో ఊరికి పంపి ఈమె మీద నిఘా ఉంచాడు. దాంతో పెద్దమనిషనే వాడెవడూ మధురవాణి గుమ్మం తొక్కేందుకు సాహసించలేదు. ప్రస్తుతానికి గిరీశం ఆడాలో వుంది కానీ, డబ్బుకు కటకటగా ఉంది. ఈ గోలనుంచి తప్పుకొని కొన్నాళ్ళపాటు వేరే ఊరిలో తలదాచుకోవాలనుకుంటున్న మధురవాణికి రామచంద్రాపురం అగ్రహారంలో నివసించే రామప్పంతులు తారసపడ్డాడు. అతనితో ఉండటానికి నెలజీతం మీద బేరం కుదుర్చుకుంది. గిరీశానికి ఒక్క మాట చెప్పి అతనితో తెగదెంపులు చేసుకోవడమే ఇక మిగిలి ఉంది.
గిరీశం చిన్నప్పటినుండీ రామప్పంతులుకి తెలుసు. రామచంద్రాపురంలో ఉండే లుబ్దావధాని పినతల్లి కొడుకే గిరీశం. లుబ్దావధాని విధవ కూతురుతో రామప్పంతులికి చీకటి సంబంధం ఉంది. ఆ చనువుతో గిరీశం గురించి మధురవాణి దగ్గర తేలిక మాటలు మాట్లాడాడు రామప్పంతులు. సరిగ్గా అదే సమయానికి గిరీశం అక్కడికి వచ్చాడు. అతడు రావడం చూసి పంతులు భయంతో మంచం కింద దాక్కున్నాడు. గిరీశం మధురవాణితో సరససల్లాపాలు మొదలెట్టాడు. అంతలో అతణ్ణి వెదుక్కుంటూ చీపురుకట్ట తీసుకొని పూటకూళ్ళమ్మ అక్కడికి వచ్చింది. ఆమె రావడం చూసి గిరీశం కూడా రామప్పంతులు దూరిన మంచం కిందే దూరాడు. ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నవాళ్ళు కావడంతో మనసు విప్పి మాట్లాడుకున్నారు. బయట పూటకూళ్ళమ్మ నానా యాగీ చేస్తోంది. మధురవాణి కళ్ళతో సైగ చేసి గిరీశం మంచం కింద ఉన్న సంగతి బయటపెట్టింది. పూటకూళ్ళమ్మ ఆవేశంతో రగులుకుపోతూ చీపురుకట్ట తిరగేసి మంచం కింద బాదింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికే రామప్పంతుల్ని ఇవతలికి లాగి తానవతలి పక్కకి తప్పుకున్నాడు గిరీశం. దాంతో చీపురు దెబ్బ రామప్పంతులుకి తగిలింది. పంతులు కోపంతో బయటికి వచ్చి పూటకూళ్ళమ్మను తిట్టాడు. పూటకూళ్ళమ్మ అతణ్ణి చూసి నిర్ఘాంతపోయింది. ఈ సందట్లో గిరీశం అక్కడినుంచి పారిపోయాడు. అతని వెనకే పూటకూళ్ళమ్మ వెళ్ళిపోయింది. మధురవాణి రామప్పంతుల్ని సముదాయించింది.

ద్వితీయాంకము

కొడుకు వెంకటేశం రాక కోసం కృష్ణరాయపురం అగ్రహారంలో వెంకమ్మ ఎదురుచూస్తోంది. ఆమె భర్త అగ్నిహోత్రావ ధానులు జంధ్యాలు వడుక్కుంటూ కూర్చొని ఉన్నాడు. వాళ్ళకు ముగ్గురు పిల్లలు. పెద్దపిల్ల బుచ్చమ్మ. ఆమెను 15 వందల రూపాయలు కన్యాశుల్కం తీసుకొని ఎందరు చెప్పినా వినకుండా ఒక ముసలివాడికి కట్టబెట్టాడు అగ్నిహోత్రావ ధానులు. ఆమె కొద్దిరోజులకే తలచెడి, పుట్టిల్లు చేరి ఇక్కడే ఉంటోంది. పిల్లని అమ్మడం వల్ల మొగుడు చచ్చినా ఆమె భుక్తికి లోటు లేకుండా ఉందని, ఆమె అత్తింటివారి మీద భూముల కోసం దావా వెయ్యడం జరిగిందని, ఆ విధంగా అంతా లాభమే నని, అగ్నిహోత్రావధానులు వితండవాదం చేస్తాడు. బుచ్చమ్మ తరువాతివాడు వెంకటేశం. అతని తరువాత ఎనిమిదేళ్ళ పిల్ల సుబ్బి.
ఆ రోజు వెంకమ్మ అన్నగారైన కరటకశాస్త్రి తన శిష్యుడు మహేశంతో సహా వచ్చి అక్కడే ఉన్నాడు. కొడుకు చదువుకి ఇల్లు గుల్లవుతోందని అగ్నిహోత్రుడు విసుక్కుంటున్నాడు. బాగా చదువుకొని, పెద్ద ఉద్యోగం చేసి బోలెడు సంపాదిస్తాడని వెంకమ్మ సమాధానం చెప్తోంది. ఆ సమయానికి గిరీశంతో కలిసి వెంకటేశం ఇంట్లో అడుగు పెట్టాడు. గిరీశం రావడంతోనే కరటకశాస్త్రిని పరిచయం చేసుకున్నాడు. తనని ఇంట్లో ఉండటానికి వీల్లేదన్న అగ్నిహోత్రుణ్ణి కాకా పట్టి బుట్టలో వేశాడు. కోర్టుకాగితాలను గిరీశం చేత ఉచితంగా తర్జుమా చేయించుకోవచ్చని అగ్నిహోత్రుడు కూడా మెత్తబడ్డాడు. తర్వాత మాటలమీద అగ్నిహోత్రుడు సుబ్బికి మంచిసంబంధం వచ్చిందని చెప్తాడు. పెళ్ళికొడుకు రామచంద్రాపురం అగ్రహారానికి చెందిన లుబ్దావధాని అనీ, 18 వందలు కన్యాశుల్కంతో పెళ్లి కుదిర్చాననీ చెప్తాడు. లుబ్దావధాని అరవయ్యేళ్ళ ముసలివాడని గిరీశం చెప్తాడు. అది విని వెంకమ్మ లబో మంటుంది. కరటకశాస్త్రి కోపంతో మండిపడతాడు. అగ్నిహోత్రుడు వాళ్ళను లెక్కచెయ్యకుండా ‘తాంబూలాలిచ్చేశాను ఇహ తన్నుకు చావండ’ని చెప్పి అక్కడినుంచి లేచిపోతాడు. వెంకమ్మ ఏడుస్తుంది. ఈ సంబంధం ఎలాగైనా తప్పించమని తోబుట్టువు కరటకశాస్త్రిని వేడుకుంటుంది. లుబ్దావధానికి నచ్చచెప్పి ఆయన ఈ సంబంధం వదులుకునేలా చెయ్యమని గిరీశాన్ని బతిమాలుతుంది. కరటకశాస్త్రి వెంకమ్మను ఓదారుస్తూ ఆమెను లోపలి ఇంట్లోకి తీసుకుపోతాడు. ఆ సమయానికి భోజనం సిద్ధమైందని చెప్పడానికి అక్కడికి వచ్చిన బుచ్చమ్మ అమాయకమైన అందాన్ని చూసి గిరీశం మోహంలో పడిపోతాడు.
ఆ రోజు సాయంత్రం కరటకశాస్త్రి తన శిష్యుడిని గుడికి తీసికెళ్ళి సుబ్బి పెళ్లి తప్పించేందుకు సాయం చెయ్యమని అడుగుతాడు. పథకం ఏమిటంటే, కరటకశాస్త్రి మారువేషం వేసుకొని లుబ్దావధాన్ల దగ్గరకు పోయి చవగ్గా పిల్లనిస్తానని చెప్తాడు. అతడు పిసినారి కనుక అగ్నిహోత్రుడి సంబంధాన్ని వదులుకొని తన సంబంధానికి ఒప్పుకుంటాడు. మహేశం ఆడపిల్లలాగా వేషం వేసుకొని లుబ్దావధాన్లని పెళ్ళాడతాడు. పెళ్లి హడావిడి ముగిసిపోగానే శిష్యుడు వేషం విప్పేసి పారిపోయి వస్తాడు. అతనా సాయం చేస్తే, ఇంగ్లీషు చదువు చెప్పిస్తాననీ, తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేస్తానని కరటకశాస్త్రి ఆశ పెడతాడు. శిష్యుడు ఒప్పుకుంటాడు. ఒకవైపు బుచ్చమ్మను వల్లో వేసుకునేందుకు గిరీశం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సుబ్బి జాతకం మంచిది కాదని ఆమెని చేసుకుంటే అరిష్టమని గిరీశం లుబ్దావధానికి ఉత్తరం రాస్తాడు.

తృతీయాంకము

ఇక అటు రామచంద్రాపురం అగ్రహారంలో రామప్పంతులతో లేచివచ్చిన మధురవాణికి పంతులు వ్యవహారం అంతా పైన పటారం లోన లొటారం అని అర్ధమయ్యింది. చెయ్ చిక్కినంత సొమ్ము చిక్కించుకొని పెందరాళే మరో కొమ్మ పట్టు కోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం రామప్పంతులుతో ఏదో ఒక విషయంలో జగడం పెట్టుకొనేందుకు ఎత్తువేసింది. రామప్పంతులు లుబ్దావధానికి పెళ్లి కుదురుస్తున్నాడని తెలిసి ఆ పెళ్లి చెడగొట్టమని సతాయించడం మొదలేసింది. ఆ ప్రయత్నంలో లుబ్దావధాని పెళ్లి వెనక ఎంత కుట్ర ఉందో ఎంత మోసం ఉందో అర్థం చేసుకుంది. అది మోసమంటే రామప్పంతులు ఒప్పుకోడు. నమ్మిన చోట చేస్తే మోసం నమ్మని చోట చేసేది లౌక్యం అని సమర్థించుకుంటాడు. నిజాన్ని పోలిన అబద్ధమాడి డబ్బు సంపాదించడం తప్పు కాదంటాడు. అంతలో పోలీసుస్టేషన్ నించి కబురొచ్చి రామప్పంతులు బయటికి పోతాడు. ఆ వ్యవధానంలో కరటకశాస్త్రి మారువేషంతో వచ్చి మధురవాణి ఇంటి తలుపు కొడతాడు. తలుపు తీసిన మధురవాణి కరటకశాస్త్రిని వెంటనే గుర్తిస్తుంది. అతడామెకి పాత విటుడే. మధురవాణి మంచితనం తెలిసినవాడు కావడంతో కరటకశాస్త్రి తన ప్రణాళిక మొత్తం ఆమెకు చెప్తాడు. ఆడవేషం వేసుకొచ్చిన తన శిష్యుణ్ణి చూపిస్తాడు. ముందే కుదిరిన సంబంధం తప్పిపోవాలంటే ఎవరెవరిని ఆకట్టుకోవాలో ఎవరెవరికి ఎంతెంత ముట్ట జెప్పాలో మధురవాణి కరటకశాస్త్రికి విశదంగా చెప్తుంది. రామప్పంతుల్ని లొంగదీసే బాధ్యత తను చేపడుతుంది. అదే సమయానికి రామప్పంతులు ఇల్లు చేరతాడు. స్టేషన్ లో కట్టాల్సిన డబ్బు కోసం ఒక జవాను కూడా అతనితో వస్తాడు. డబ్బు కోసం మధురవాణిని అడిగి లేదనిపించుకుంటాడు. కరటకశాస్త్రి తన దగ్గరున్న డబ్బు తీసిచ్చి గండం గడుపుతాడు. లుబ్దావధానికి కుదిరిన పెళ్లి చెడగొట్టి తన కూతుర్ని అంతకంటే తక్కువ శుల్కానికి చేసుకొనే లాగా వ్యవహారం కుదిర్చేందుకు రామప్పంతులుతో బేరం కుదుర్చుకుంటాడు. సంబంధం మానుకున్నామని అగ్నిహోత్రావ ధానులు రాసినట్టుగా ఒక ఫోర్జరీ లేఖ సృష్టించి లుబ్దావధాన్లకు పంపుతాడు రామప్పంతులు.
 అక్కడ కృష్ణరాయపుర అగ్రహారంలో అగ్నిహోత్రావధానులు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. రామచంద్రాపుర అగ్రహారంలో మారుతున్న పరిస్థితుల గురించి అతనికేమీ తెలియదు. పెళ్లి ఇష్టం లేని వెంకమ్మ బావిలో దూకింది. గిరీశం ఆమెని రక్షించాడు. దాంతో అతనికి ఊళ్ళో మంచి పేరొచ్చింది. దాంతో అతను బుచ్చమ్మతో చనువుగా మాట్లాడినా ఎవరూ తప్పుగా అనుకోవట్లేదు. విధవలు పెళ్లి చేసుకోవడం తప్పు కాదని నిదానంగా బుచ్చమ్మకి నచ్చచెప్పి రామవరం లేపుకు పోయి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇదేమీ తెలియని అగ్నిహోత్రుడు పెళ్లి పనుల బాధ్యత నంతా గిరీశం నెత్తిన పెట్టేశాడు. గిరీశం నిదానంగా  బుచ్చమ్మతో చనువు పెంచుకోవడం మొదలెట్టాడు.  వెంకటేశాన్ని తడికలాగా అడ్డు పెట్టుకుని ఆమె దృష్టిని తనతో పెళ్లి వైపు మరల్చేందుకు కృషి చేస్తున్నాడు.

చతుర్ధాంకము

ఇంట్లో తీరి కూర్చుని మధురవాణితో సరసమాడుతున్నాడు రామప్పంతులు. ఆ సమయానికి లుబ్దావధాని ఒక ఉత్తరం చేతబట్టుకొని ధుమధుమలాడుతూ వచ్చి నాకీ పెళ్ళీ వద్దూ పెడాకులూ వద్దు అన్నాడు. రామప్పంతులు తన పాచిక పారిందనుకున్నాడు. పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఏమిటి సంగతన్నాడు. ఇదంతా నీ కల్పనే! నేను పోయి అగ్నిహోత్రావధానులుతో మాట్లాడతాను అన్నాడు లుబ్దావధాని. లుబ్దావధాని అగ్నిహోత్రుడిని కలిస్తే తన గుట్టు బయట పడుతుందని రామప్పంతులు భయపడ్డాడు. మధురవాణి చక్రం అడ్డేసింది. వెళ్ళిపోతున్న లుబ్దావధానిని వెనక్కు పిలుచుకొచ్చింది. తీరా చూస్తే అది రామప్పంతులు బనాయించిన ఉత్తరం కాదు. గిరీశం రాసింది. తర్జనభర్జనల తర్వాత అగ్నిహోత్రావధానులు సంబంధం మానుకొని చవగ్గా దొరికే మరో సంబంధం చూసుకోవాలని నిర్ణయించారు. ఆ విధంగా కరటకశాస్త్రి ఎత్తుగడ ఫలించేందుకు మధురవాణి కూడా దోహదం చేసింది. ఇక పనిలోపనిగా లంచాలు తిన్న సిద్ధాంతి, కరటకశాస్త్రి కూతురు అయిదవతనం, ఐశ్వర్యం, సిరిసంపదలతో తులతూగ గలిగిన జాతకురాలని తేల్చేశాడు. రామప్పంతులు పెళ్లిపనులు నెత్తినేసుకున్నాడు. బంగారునగ పెట్టడానికి లుబ్దావధాని తటపటాయిస్తే, రామప్పంతులు మధురవాణి మెడలోని కంటె తీసుకెళ్ళి పెళ్లికూతురుకు అలంకరించమని ఇస్తాడు. త్రయోదశి నాడు రాత్రికి లగ్నమైతే, కరటకశాస్త్రి సిద్ధాంతిని, పూజారినీ ఆకట్టుకొని ఉదయం పూట లగ్నమని చెప్పిస్తాడు. రామప్పంతులు లేకుండా చూసి గబుక్కున పెళ్లి జరిపించేసి శుల్కం డబ్బు పట్టుకొని ఉడాయిస్తాడు. సాయంత్రానికి రామప్పంతులు తాషామార్ఫా, బాజా, బోయీల వాళ్ళను తీసుకొని పెద్దిపాలెం నుంచి వస్తాడు. అప్పటికే పెళ్లి జరిగిపోయి ఉండటం చూసి నిర్ఘాంతపోతాడు. కరటకశాస్త్రి డబ్బు పట్టుకుపోయాడని తెలిసి లుబ్దావధాని మీద మండిపడతాడు. తనకు రావాల్సిన డబ్బు జారిపోయిందని అర్ధమై కరటకశాస్త్రి మోసగాడనీ, రెండోపెళ్ళిపిల్లనో శూద్రపిల్లనో లుబ్దావధానికి అంటగట్టి డబ్బు నొల్లుకు పోయాడనీ అల్లరి మొదలు పెడతాడు. సిద్ధాంతి మధ్యవర్తిత్వం చేసి లుబ్దావధానికీ రామప్పంతులికీ సఖ్యత కుదురుస్తాడు.
అక్కడ కృష్ణరాయపుర అగ్రహారంలో చెల్లి పెళ్లి తప్పించమని గిరీశాన్ని అడుగుతుంది బుచ్చమ్మ. బుచ్చమ్మ అంటే తనకు ప్రాణమని, ఆమెను పెళ్లాడలేకపోతే తన జీవితం వృధా అనీ గిరీశం చెప్తాడు. బుచ్చమ్మ అందుకు అంగీకరించలేక పోతుంది. అప్పుడిక ఆఖరి ప్రయత్నంగా సుబ్బి పెళ్లి తప్పించడం బుచ్చమ్మ చేతిలోనే ఉందని, తనతో బుచ్చమ్మ లేచొస్తే పెళ్లాగిపోతుందని సమయం చూసి పాచిక వేస్తాడు గిరీశం. సుబ్బి పెళ్ళికి తరలి వెళ్ళేటప్పుడు బుచ్చమ్మ ఎక్కిన బండిని దారి తప్పించి రామవరం చేరి పెళ్లి చేసుకోవాలని, బుచ్చమ్మ లేచిపోయిన విషయం తెలిసి సుబ్బి పెళ్లి ఆగిపోతుందని గిరీశం నమ్మబలుకుతాడు. అమాయకురాలైన బుచ్చమ్మ చెల్లి జీవితం నాశనం కాకూడదని గిరీశం ప్రతిపాదనకు అర్ధమనస్కంగానే ఆమోదిస్తుంది.

పంచమాంకము

పెళ్ళయితే బాగానే చేసుకున్నాడు కానీ, ఆ మరుక్షణం నుంచీ తాను చేసుకున్నది రెండోపెళ్లిపిల్ల నేమోనని లుబ్దావధానికి గిలి పట్టుకుంది. దీంతో అతనికి నిద్రాహారాలు లేకుండా పోయాయి. ఆ పిల్ల మొదటి మొగుడు దెయ్యమై వచ్చి తనని పీడిస్తాడేమోనని భయపడుతున్నాడు. ఆ పిల్ల నడిగి నిజం కనుక్కోమని కూతురు మీనాక్షిని అడుగుతాడు. మీనాక్షి ఆ పిల్లను కొట్టి నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆ సందట్లో పెళ్లి కూతురు లాగా మారు వేషంలో ఉన్న శిష్యుడు మీనాక్షి చెయ్యి కొరికి పారిపోయి మధుర వాణి యింటికి చేరతాడు. అక్కడ కంటె మధురవాణి కిచ్చేసి, ఆడపిల్ల వేషం తీసేసి దాసరి వేషం వేసుకొని అక్కడి నుంచి తన గురువు దగ్గరికి బయల్దేరతాడు.
పొరుగూరు వెళ్ళిన రామప్పంతులు రాత్రికి ఇల్లు చేరాడు. మధురవాణి తలుపు తియ్యకుండా తన కంటె తనకు తెచ్చివ్వమని పేచీకి దిగుతుంది. కంటె కోసం రామప్పంతులు లుబ్దావధాని ఇంటికి బయల్దేరాడు. అక్కడ పెళ్లికూతురు ఎటు పోయిందో తెలియక లుబ్దావధాని కంగారు పడుతున్నాడు. నూతిలో గోతిలో పడితే పోలీసులు ఇల్లు గుల్ల చేస్తారని భయపడుతున్నాడు. ఈ తిప్పలన్నిటికీ కారణం రామప్పంతులేనని గొణుగుతున్నాడు. సరిగా అదే సమయానికి రామప్పంతులు లుబ్దావధాని ఇంటికి వచ్చాడు. కంటె కోసం అడిగాడు. పెళ్లికూతురు కంటెతో సహా ఉడాయించిందని తెలిసింది. లుబ్దావధాని కంటె సంగతి తనకేమీ తెలియదు పొమ్మన్నాడు.
రామచంద్రాపురం అగ్రహారంలో సారాయి దుకాణమొకటి ఉంది. దాన్ని ఆనుకొని పెద్ద తోట. అక్కడికి గ్రామ మునసబు సోమినాయుడు, జంగం వీరేశ, సాతాని మనవాళ్ళయ్య, హవల్దారు అచ్చన్న లాంటి గ్రామ ప్రముఖులు చీకటి పడేసరికి చేరుకుంటారు. అక్కడ శుష్క వేదాంత చర్చలూ, ఊళ్ళో జరిగే విశేషాల గురించి వ్యాఖ్యానాలు నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ హెడ్ కానిస్టేబుల్ కూడా వస్తుంటాడు. ఆ రోజు అతను కూడా ఉన్నాడు. లుబ్దావధాని పెళ్లి విషయం అక్కడ చర్చకు వచ్చింది. ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికి హెడ్ కానిస్టేబులు ఇష్టపడలేదు. పోలీసోళ్ళకీ అక్కర్లేక, బాపనోళ్ళకీ అక్కర్లేక ఎదవముండని బాపనాడు పెళ్లాడితే లోకవంతా ఊరుకోవడమేనా అని మునసబు పాయింటు లేవదీస్తాడు. గవనరుమెంటూ, దేవుళ్ళూ, బ్రాహ్మలూ వారి నేరాలు వారివి. వాటితో మనకి పనిలేదు. మన భక్తి మనకుండాలి అని హవల్దారు సర్ది చెప్తాడు. ఆ సమయానికి రామప్పంతులు అక్కడికి వచ్చి హెడ్ కానిస్టేబుల్ని ఎడంగా తీసుకుపోయి తన కంటె తనకు వచ్చే మార్గం చూడమని అడుగుతాడు. అవసరమైతే లుబ్దావధాని మీద కూనీ కేసు బనాయించమని చెప్తాడు. కేసు పెట్టాలంటే సాక్షులు కావాలంటాడు హెడ్డు. సారా దుకాణందారు, అక్కడున్న ఒక బైరాగీ సాక్ష్యం పలకడానికి ముందుకొస్తారు. కొంత ఎంక్వైరీ చేసింతర్వాత కూనీ కేసు పెట్టడం సాధ్యం కాదని హెడ్డు చేతులెత్తేస్తాడు. ఆ సరికి అర్ధరాత్రైంది. మధురవాణి ఇంట్లోకి రానివ్వదు. ఆకలి దహిస్తోంది. లుబ్దావధాని విధవ కూతురు మీనాక్షితో తనకున్న అక్రమసంబంధం పురస్కరించుకొని అక్కడికి వెళ్ళాడు రామప్పంతులు. పనిలో పనిగా కంటె సంగతి కూడా తేల్చుకోవచ్చని అనుకున్నాడు.
తీరా అక్కడికి వెళ్ళాక మీనాక్షి తనను లేపుకుపోయి పెళ్లి చేసుకోమని రామప్పంతులు వెంటపడుతుంది. రామప్పంతులు పరుగెత్తుకుంటూ ఇల్లు చేరతాడు. మధురవాణి తలుపు తియ్యక పోగా మీనాక్షిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది. రామప్పంతులు మీనాక్షికి దొరక్కుండా సమయం చూసి అక్కడి నుంచి పారిపోతాడు. ఊరొదిలి ఎటన్నా పోయి కాస్త అల్లరి తగ్గాక తిరిగి రావాలనుకుంటాడు.

షష్ఠాంకము

రామప్పంతులు ఊరి పొలిమేర చేరేసరికి పీచు పీచుగా తెల్లారుతోంది. రామచంద్రాపురం అగ్రహారంలో జరిగిన విషయాలేమీ తెలియని అగ్నిహోత్రావధానులు పెళ్ళికి తరలి వచ్చి అక్కడ చెరువు ఒడ్డున బళ్ళు దింపిస్తున్నాడు. లుబ్దావధాన్లకి పెళ్ళయిపోయినట్టు రామప్పంతులు అతనితో చెప్పాడు. అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడై లుబ్దావధాని ఇంటికి వెళ్లి అతణ్ణి చెడామడా బాదేసి వచ్చాడు. పెళ్లి ఎగ్గొట్టినందుకు లుబ్దావధాని మీద క్రిమినల్ కేసు పెట్టాలని రామప్పంతులుతో కలిసి ఆలోచన చేశాడు. చేతిలో డబ్బు లేదు. బుచ్చమ్మ నగ ఒకటి తీసుకొని ఊళ్ళో తాకట్టు పెట్టాలని, కేసు విషయంలో గిరీశాన్ని కూడా సంప్రదించాలనీ అనుకున్నాడు. తీరా చూస్తే గిరీశం బుచ్చమ్మను లేవదీసుకుపోయాడని తెలిసింది. అగ్నిహోత్రుడికి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టైంది. అయినా మొండివాడు కావడంతో రామప్పంతులు సాయంతో ఆ ఊళ్ళో పోలిశెట్టి దగ్గర డబ్బు బదులు తీసుకొని విశాఖపట్నం చేరి గిరీశం మీద కేసు పెట్టాడు.
లుబ్దావధానికీ తిప్పలు తప్పలేదు. పెళ్లికూతురు ఆచూకీ తెలియకపోవడంతో కూనీ కేసు నెత్తి మీద కూర్చుంది. అతడు విశాఖపట్నం వచ్చి సౌజన్యారావు పంతులనే ఒక మంచి ప్లీడరును ఆశ్రయించాడు. తనను కొట్టినందుకు అగ్నిహోత్రావ ధానులు మీద కేసు పెట్టాడు. ఈ తిప్పలతో అతనికి పశ్చాత్తాపం కలిగింది. కేసులోంచి బయటపడితే కూతురుకొక మంచిదారి ఏర్పాటు చేసి తాను కాశీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కేసు కంతా మూలమైన గుంటూరు శాస్త్రులు (కరటకశాస్త్రి) ఎవరో తెలుసుకో డానికి సౌజన్యారావు పంతులు శ్రమిస్తున్నాడు.
ఈ కేసు ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియక కరటకశాస్త్రి అల్లాడుతున్నాడు. లుబ్దావధాని దగ్గర తెచ్చిన డబ్బు, శిష్యుడు తెచ్చిన కంటె కలిపి లుబ్దావధానికి పంపేస్తే, కూనీ కేసు మాఫవుతుందని ఆలోచించి కంటె కోసం మధురవాణి దగ్గరకు వచ్చాడు. అలా చేస్తే మరి నా కంటె మళ్ళీ నాకెలా వస్తుందని మధురవాణి అడిగింది. సౌజన్యారావుపంతులు బహు న్యాయమైన మనిషి అనీ, కేసు భోగట్టా తేలిపోతే ఆ కంటె మళ్ళీ మధురవాణికి తిరిగి ఇచ్చేస్తాడనీ కరటకశాస్త్రి చెప్పాడు. అతనంత మంచివాడా అని మధురవాణి అడిగింది. అంతకంటే మంచివాడు మరిక లోకంలో ఉండడని, సాని వాళ్ళ మొహం కూడా చూడడని కరటకశాస్త్రి చెప్పాడు. మనుషుల్లో ఊరకుక్కలనూ, సీమకుక్కలనూ మాత్రమే చూసిన మధురవాణికి సౌజన్యారావు మంచితనాన్ని గురించి వినడం ఆసక్తి కలిగించింది. కరటకశాస్త్రికి కంటె ఇచ్చి పంపేసి తాను మారువేషంలో సౌజన్యారావును చూడబోయింది.
సౌజన్యారావు అగ్నిహోత్రావధానుల్ని పిలిపించి బుచ్చమ్మ ఆస్తి బుచ్చమ్మ కిచ్చివెయ్యమని, ఆమెను గిరీశం కిచ్చి పెళ్లి చెయ్యమని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా చేస్తే లుబ్దావధాన్లు పెట్టిన కేసు తీసేయిస్తానని చెప్పాడు. అగ్నిహోత్రావధాని వినలేదు.
సప్తమాంకము

లుబ్దావధాని పెళ్లి చేసుకున్న పిల్ల ఆచూకీ గానీ, ఆ పిల్ల తండ్రి ఆచూకీ గానీ హెడ్ కానిస్టేబులు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు.
ఆ రోజు రాత్రి లుబ్దావధాని కేసు గురించి సౌజన్యారావు పంతులు గిరీశంతో మాట్లాడుతున్నాడు. గుంటూరు శాస్త్రుల్లు (గుంటూరు శాస్త్రులు పేరుతో చలామణి అయిన పిల్ల తండ్రి) ఆచూకీ ఎలా పట్టుకోవాలా అని చర్చిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి మధురవాణి నిండా శాలువ కప్పుకొని మారువేషంతో వచ్చింది. గిరీశం ఆమెను చూసి గుర్తుపట్టి నిర్ఘాంతపోయాడు. సౌజన్యారావుతో ఏకాంతంలో సంభాషించాలని మధురవాణి అడిగింది. గిరీశం అక్కడి నుంచి తప్పుకున్నాడు. లుబ్దావధానులు కేసులో సహాయం చెయ్యగల వ్యక్తి ఒకరు తనకు తెలుసని, ఐతే ఆ వ్యక్తి ఒక వేశ్య అని మధురవాణి చెప్పింది. కోరినంత డబ్బిస్తానన్నాడు సౌజన్యారావు. డబ్బుకు ఆవిడ లొంగదనీ, ఆమెను సౌజన్యారావు ఉంచుకునేటట్లైతే లేదా పెళ్లిచేసుకునేటట్లైతే అంగీకరిస్తుందనీ చెప్పింది. ఇదంతా విన్న సౌజన్యారావు అసలా వచ్చిన వ్యక్తి ఎవరో చెప్పమన్నాడు. మధురవాణి కప్పుకున్న శాలువా తీసేసి కట్టి ఉంచిన జుట్టు వదిలేసింది. తనపేరు మధురవాణి అనీ, తానొక వేశ్యననీ చెప్పింది. సౌజన్యారావు పంతులు కోపంతో ఆమెని వెళ్ళిపొమ్మని గదమాయించాడు కానీ ఆమె వల్ల సాయం జరగాల్సి ఉండటం గుర్తొచ్చి ఆమె కోరిక తీర్చడానికి సిద్ధపడ్డాడు. సౌజన్యారావు మంచితనం చూసి మధురవాణి తన కోరిక ఉపసంహరించుకొని, లుబ్దావధాని పెళ్లి విషయంలో ఉన్న గుట్టునంతా విప్పిచెప్పింది. పనిలో పనిగా గిరీశం కపటి అని కూడా చెప్పింది. కేసు తేలిపోయింది. సౌజన్యారావు వెంటనే గిరీశాన్ని పిలిచి చివాట్లు పెట్టి బుచ్చమ్మను విడోహోమ్ కు పంపిస్తానని, ఆమె చదువు పూర్తయ్యాక ఆమెకు ఇష్టమైతే అప్పుడు గిరీశం ఆమెను పెళ్ళాడవచ్చని చెప్పి అతణ్ణి గెంటేశాడు. మధురవాణి మంచితనాన్ని గుర్తించి ఆమెతో కరచాలనం చేశాడు. ఆ విధంగా నాటకం సమాప్తమౌతుంది.

నాటకంలో ప్రాచుర్యం పొందిన కొన్ని డైలాగులు

పూర్రిచర్డు చెప్పినట్టు పేషెన్సు ఉంటే గానీ లోకంలో నెగ్గలేం.
ఇటీజ్ ఉమన్ దట్ సెడ్యూస్ ఆల్ మాన్కైండ్.
యేమివాయ్ మైడియర్ షేక్స్పియర్! మొహం వేలాడేశావ్?
మీవల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే.
మనవాళ్లుత్త వెధవాయలోయ్. చుట్ట కాల్చడం నేర్పినందుకు థాంక్ చెయ్యక తప్పు పట్టుతున్నావ్?

ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పోంగి చుక్క భూమిని రాలెన్
పొగచెట్టయి జన్మించెను
పొగతాగని వాడు దున్నపోతయి పుట్టున్
నీ దగ్గర కాపర్సు ఏవైనా ఉన్నవా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నవి గానీ మార్చలేదు.
నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటల్లా వింటూ ఉంటే, నిన్ను సురేంద్రనాథ్ బానర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను.
ఆత్మానుభావం అయితే గానీ తత్త్వం బోధపడదు.
వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారూ? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా?
వాడి బతుక్కి వాడు పూటకూళ్ళమ్మను వుంచుకోవడం కూడానా! పూటకూళ్ళమ్మే వాడి నుంచుకొని యింత గంజి బోస్తూంది.
వాడికల్లా ఒకటే ఉద్యోగం దేవుడు రాశాడు. యేమిటో తెలిసిందా? పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవ చాకిరీ చెయ్యడం.
నేను ఉడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా!? సానివాళ్ళకి కర్ణపిశాచి ఉంటుంది కాబోలు.
ఆడదాన్ని నోరుబెట్టుకు బతకమనే దేవుడు చేశాడు.
దొంగలంజ! సరసుణ్ణి దాచిందోయ్ మంచం కింద. ఇదేమిటో మంచిమనిషి అని భ్రమించాను.
నన్నడిగితే ఇలాంటి లంజల్ని యిరవైమందిని మీకు కన్యాదానం చేతునే!
నాకు దాచటం ఖర్మమేమి? నేను మొగనాల్ని కాదు, వెధవముండనీ కాదు. నాయింటి కొచ్చేవాడు మహారాజులాగ పబ్లీగ్గా వస్తాడు.
గవరనుమెంటు జీతమిచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం?
మనవాడికో మునసబీ అయినా పోలీసు పనైనా ఐతే రుణాలిచ్చి ఈ అగ్గురారం బూవులన్నీ కొనేస్తాడు.
మీలాగే వాడు కూడా జంఝాలు వొడుక్కుంటూ బతకాలని ఉందా యేమిషి?
ఇంటికి పెద్దమనిషొస్తే అపృచ్ఛపు మాటలాడుతావేమిటి బావా?
అల్లుడు చచ్చిపోయాడంటే అందువల్ల ఎంత లాభం కలిగిందీ! బూవులకు దావా తెచ్చామా లేదా!?
తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో తెలుగు పద్యాలమీద ఖాతరీ లేదండి.
గొట్టికాయలాడకుండా మావాణ్ణి ఖాయిదా చేస్తే ఎంత చదువైనా వొస్తుంది.
ప్రతి గాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నాయింట జేరి నన్ననేవాళ్ళే! తాంబోలాలిచ్చేశాను. ఇహ తన్నుకు చావండి.
మైడియర్ షేక్స్పియర్! నీతండ్రి అగ్గిరావుడోయి. మీయింట్లో యవళ్ళకీ అతణ్ణి లొంగదీసే యలోక్వెన్సు లేదు.
ఏవైనా డిఫీకల్టీలొచ్చినప్పుడు ఒక ఠస్సా వేశావంటే బ్రహ్మభేద్యంగా ఉండాలి.
పూజాపునస్కారాల్లేక బూజెక్కున్నాను గానీ, మనకంట్రీయే ఇండిపెండెంట్ అయితే గ్లాడ్స్టన్ లాగా దివాన్గిరీ చలాయిస్తును.
నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాసీ కట్టడం కాళిదాసుకేం తెలుసు? తెల్లవాడిదా మహిమ.
యీ వెథవ ఇంగ్లీషు చదువునుంచి బ్రాహ్మణ్యం చెడిపోతూంది. దేవభాషలాగా భోజనాల దగ్గర కూడా ఆమాటలే కూస్తారు.
పెద్ద మీటింగులు చెయ్యాలంటే డప్పులు బజాయించి, నోటీసులు కట్టి, బజార్లు కాసి తోవంటబోయే వాళ్ళను యీడ్చుకు వచ్చినా యాభైమంది కారు. విలేజెస్ లో లెక్చర్లు యంత మాత్రం కార్యం లేదు.
ఒపీనియన్స్ అప్పుడప్పుడూ ఛేంజి చేస్తుంటేనే గానీ పోలిటీషియన్ కానేరడు.
ఇన్ఫెంటు మారేజీలు అయితే గాని యంగ్ విడోజ్ ఉండరు. యంగ్ విడోజ్ ఉంటేనే గాని విడో మారియేజ్ రిఫారంకి అవకాశం ఉండదు గదా? సివిలిజేషన్ కల్లా నిగ్గు విడో మారియేజ్ అయినప్పుడు యిన్ఫెంటు మారేజీల్లేకపోతే సివిలిజేషన్ హాల్టవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పక యిన్ఫెంటు మారియేజి చెయ్యవలసిందే. ఇది ఒహ కొత్త డిస్కవరీ.
ఫెమినైన్సు ఫూల్సన్నాడు. పడుపడు అన్న నా సవితే గాని, పడ్డనా సవతి లేదందిట వెనకెవర్తోను.
పెళ్ళనేది మంచి పదార్థమైతే, ‘అధికస్య అధికం ఫలం’ అన్నాడు కనుక చిన్నపిల్లని ఒక ముసలివాడికి పెళ్ళిచేసి వాడు చస్తే మరోడికి, మరోడు చస్తే ఇంకోడికి, ఇలాగ పెళ్లి మీద పెళ్లి పెళ్లి మీద పెళ్లి అయి వీడి దగ్గరో వెయ్యి వాడి దగ్గరో వెయ్యి మరోడి దగ్గర మరో వెయ్యి రొట్టె మీద నెయ్యి నేటి మీద రొట్టె లాగ ఏకోత్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి తుదకు నాలాంటి బుద్ధిమంతుణ్ణి చూసి పెళ్లాడితే చెప్పావ్ మజా!? ఇహ సౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహ సౌఖ్యం ఉంటే పరసౌఖ్యం కూడా సాధించామే అన్నమాట. ఎలాగో తెలిసిందా? ఈజ్మెంట్ హక్కు యష్టాబ్లిష్ అవుతుంది.
నెవ్వర్ డూ బై హావ్సన్నాడు. చేస్తే శుద్ధ క్షౌరమే గాని, తిరుపతి మంగలాడి క్షవరం చెయ్య కూడదు.
కోవిల్లో చుట్ట కాల్చ వచ్చునా? కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీని పొగ ముందర సాంబ్రాణి, గుగ్గిలం యేమూల?
నాకూ కంట్రీ లైఫ్ ఇష్టమే గానీ, సీమలో లాగా బ్యూటిఫుల్ షెపర్డెస్లూ లవ్ మేకింగూ ఉండవోయ్. గ్రాస్ గరల్స్ తగుమాత్రంగా ఉంటారు గానీ మాడర్టీస్మెల్.
ఏం చిత్రంగా మాట్లాడుతారు పంతులుగారూ! నాకు డబ్బే ప్రధానమైనట్టు మీమనసుకు పొడగడుతూంది కాబోలు. నాకు డబ్బు గడ్డిపరక. మీరు ఖర్చువెచ్చాలు తగ్గించుకొని సంసారం బాగుచేసుకోకపోతే నేనుమాత్రం ఒప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకొని బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ట. మాయింటి సంప్రదాయం యిది పంతులుగారూ! అంతే గానీ లోకంలో సాన్లమచ్చని ఊహించకండి.
చట్లకి చావ నలుపు. మనిషికి చావ తెలుపూ, అనగా చీకట్లో నక్షత్రాల్లాగా అక్కడక్కడా తెల్లవెంటుక తగిల్తేనే చమక్.
లౌక్యవంటే మరేమిటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చేయడమే కదూ!
నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం.
లౌక్య వృత్తి యెటు వంటిదీ! నిజాన్ని పోలిన అబద్ధమాడి ద్రవ్యాకర్షణ చేసేది.
ఈ జడతో కొడతాను. శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధమిది.
విద్య వంటి వస్తువు లేదు, నిజమే – ఒకటి తప్ప. అదేమిటి? విత్తం. డబ్బుతేని విద్య దారిద్ర్యహేతువ.
యీ వూళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరు.
తనకు రొట్టా, ఒహడికి ముక్కానా?
ఆడది మెచ్చిందే అందం. మగాడి కన్ను మసక.
నాలాంటి వాళ్లకి నూరుమందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరీ శిష్యుడు? ఈ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్టవాసన కొడుతూంది.
బుద్ధికి అంతా అసాధ్యమే కానీ డబ్బుకి యక్కడా అసాధ్యం లేదు.
ఈరోజుల్లో వైదీక మంత్రాల మహిమ పోయిందండి. మంత్రమంటే నియ్యోగప్రభువుదే మంత్రం.
సొగసుకత్తెలకి అలక కూడా అదో శృంగారం సుమండీ శాస్తుల్లు గారూ!
మీవాళ్ళు లంచాలు పుచ్చుకోవడం చాతకాక, పతివ్రతలమని వేషం వేస్తారు.
అదే పతకమైతే అమ్ముకు బతకనా?
అట్లాంటి పిల్లే నాకు ఉంటే మూడు నాలుగు వేల కమ్ముకుని ఋణాలూ పణాలూ లేకుండా కాలక్షేపం చేసి ఉందును.
అట్టర్లీ ఇన్నోసెంటు విడోని వొప్పించి తీసుకుపోయి పెళ్లాడితే మజా ప్రయోజకత్వమూ గాని, రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకాడితోనో దూదేకులాడితోనో లేచిపోవడానికి సిద్ధంగా ఉన్న దండుముండల్ని విడో మారియేజి చేసుకుంటే హెల్. పూటకూళ్ళమ్మ లాంటి ముండని పెళ్ళాడ్డం విడోమారియేజి అనిపించుకోదు. అది దొంగముండా మారియేజి.
తొందరపడి హాజీ సాయిబు తురకల్లో కలిసిపోయాడన్నట్టు నావంటి బుద్ధిమంతుడు యేపనీ చెయ్యకూడదు.
మనిషిని ముస్తాబు చేసి యదట నిలబెడితే ఇది పునిస్త్రీ ఇది విడో అని చెప్పగలిగిన పెద్దమనిషి యెవడు? ఒహడూ లేదు. కనక విడో అనే వస్తువు ఎక్కడుందయ్యా? వెక్కిరించే వెధవల నోళ్ళలో ఉంది.
ఊరంతా నన్ను సత్యహరిశ్చంద్రుణ్ణిగా భావిస్తున్నారు. అడుగడుక్కీ బుద్ధి దాట్లేస్తుంటుంది గాని, నేనంతవాణ్ణి కానా యేమిటి?
దేరీజ్ నాట్ యాన్ ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ ఉచ్ డజ్ నాట్ సెర్వ్ సం యూజ్ ఫుల్ పర్పస్.
అమెరికాలో మనుషులు బుర్ర కిందికీ కాళ్ళు పైకీ పెట్టి నడుస్తారు.
పెళ్లాడితే లోకోపకారానికి అవకాశం ఎంతమాత్రం ఉండదు.
మీకే ఇంగ్లీషు వస్తే భాష్యం అయ్యంగార్లా అయిపోరా!
మాటలు నేర్చిన శునకాన్ని వేటకు పంపి ఉసుకోమంటే ఉసుకోమందిట.
రేపు పెళ్ళైన తరువాత అక్కగారిని వీథితలుపు గడియవేసి మరీ ముద్దెట్టుకుంటారేమో చూస్తాను.
వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ!
గాడిద అందిట అందానికి నేనూ పాటకి మా అప్పా అని.
మీలాంటి శిష్టులు సానివాళ్ళ శరీరం తాకకూడదు. అది చిన్నతనం చేత మొఖం మీద మొఖం పెడితే ‘పిల్లా యడంగా నిలబడి మాట్లాడు’ అని చెప్పాలి.
ఉంచుకున్న ముండాకొడుకు యదట మరో మగాణ్ణి పట్టుకొని ‘వీడిదండలు కమ్మెచ్చులు తీసినట్టున్నాయి, వీడి ఛాతీ భారీగా ఉంది’ అని చెవిలో నోరుపెట్టి గుసగుసలాడుతుంటే అగ్గెత్తుకొస్తుందా రాదా?
సంసార్లకి సౌందర్యంతో యేంపని?
పామంటి దానికి విరుగుడుంది, పంతులి కుండదా?
బోయీలొహళ్ళూ బాజావాళ్ళోహళ్ళూ ఊరుచేరేటప్పటికి కోలాహలం లావు చేస్తారు.
బావా! మనం ఏదైనా వేషం వేశామంటే ఒకడు చూస్తున్నాడని అనుకున్నప్పుడూ, ఒకడు చూస్తూ వుండలేదని అనుకున్నప్పుడూ కూడా, వోక్క మోస్తరుగా వేషం నడిపిస్తే సేఫ్ సైడ్.
ఏమందోయి నీ ఉపనిషత్తు? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే బ్రహ్మ అని తెలుసుకోవోయీ వెధవాయీ అంది.
చమకంలో ఎవడికి యిష్టమైన వస్తువులు వాడు కలపవచ్చును. కందిగుండాచమే, ఇంగువసూనాచమే ... దీనినే రెలిజియస్ రిఫార్ము అంటారు.
యెంత శెడ్డా బాపనాడి శాపనాకారం మా శెడ్డది.
అన్నసారం ద్రేహంలో పడితేగానీ పరవాత్మ పెజ్జలించదు.
బ్రాహ్మల్లో కూడా మహానుభావులుంటారు. కనుక్కోగలిగిన జ్ఞానికి గంగానది అంతా సారాయి కాదా!?
పోలీసోళ్ళకీ అక్కర్లేక బాపనోళ్ళకీ అక్కర్లేక ఎదవముండని బాపనాడు పెళ్లి చేసుకుంటే లోకం అంతా ఊరుకోవడమేనా!?
నీతికి పోలీసోణ్ణీ ఘానానికీ సాతానోణ్ణీ అడగమన్నారు.
గవునర్ మెంటూ, దేవుళ్ళూ, బ్రాహ్మలూ వారి నేరాలు వారివి. వాటితో మనకి పని లేదు. మన భక్తి మనకుండాలి.
జ్ఞానికి జ్ఞానపత్రి, తాగుబోతుకు సారాయి.
బెమ్మానందవంటే యేటి? కడుపునిండా సారా, ముక్కునిండాపొగ, సక్కని పడుచుపిల్లా కదా?
కూనీకేసని నాకేదైనా ఆశ వుంటే పోలీసోణ్ణి, నేనూరుకుంటానా?
ఆడది నీతి తప్పిన తరవాత అంతేమిటి, ఇంతేమిటి? తెగించినదానికి సగుడు మోకాలు బంటి.
చెడ్డవారివల్ల చెప్పుదెబ్బలు తినొచ్చుకానీ మంచివారివల్ల మాటకాయడం కష్టం.
బ్రాహ్మల్లో ఉపదేశం లావూ, ఆచరణ తక్కువా, ఖరారేనా?
బ్రాహ్మలు కాగానే దేవుడి కంట్లో బుగ్గి పొయ్యలేరు.
ఈ తెల్లవాళ్ళు చేసే విద్యలన్నీ మన గ్రంథాల్లోంచి యెత్తి కెళ్ళినవే. యీ రెయిళ్ళూ గియిళ్ళూ యావత్తూ మన వేదంలో ఉన్నాయిష.
శ్రీ కృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా అండి? శ్రీకృష్ణుడు యాంటీ నాచి కాడా అండి?
మంచి చెడ్డలు వేరు పరచ గలిగిన వాడెవ్వడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది. చెడ్డలోనూ మంచి ఉంటుంది.
వకీళ్ళు అబద్ధాలాడిస్తే న్యాయం కనుక్కోడానికి జీతం పుచ్చుకునే జడ్జీ యేం జేస్తాడండి? ఉభయ పార్టీల వకీళ్ళు ఆడించే అబద్ధాలూ చేయి పీకేటట్టు రాసుకుంటాడు.
వాదిని బాధించే నిజం వాది తరుఫు వకీలుకి అక్కర్లేదు. ప్రతివాదిని బాధించే నిజం ప్రతివాదికి అక్కర్లేదు. క్రాసెగ్జామినేషను ఆరంభమయ్యేసరికి యెంతటి సాక్షీ కవిత్వం ఆరంభిస్తాడు. అంచేతనే పెద్దమనుషులు బోనెక్కడానికి భయపడతారు.
కొందరికి అబద్ధం రుచి, కొందరికి నిజం రుచి. చాలామందికి రెండింటి కలగలుపు రుచి. ఇది లోక స్వభావం. కనక అవసరం కలిగి నప్పుడు తణుకూ బెణుకూ లేకుండా అబద్ధం ఆడవలసిందే.
డామిట్ కథ అడ్డంగా తిరిగింది.

ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు
ఇక్కణ్ణుంచి బిచాణా ఎత్తివెయ్యడమే బుద్ధికి లక్షణం
నేను ఏమో ఉద్యోగాలూ ఊళ్లూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది
కిస్ మిస్ శలవలు
వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వొదుల్తాయి
అట్నుంచి నరుక్కురమ్మన్నారు
నేనంటే వాడిక్కడుపుడుకు
ఈ మాటు వొంటరిగా చూసి వొక తడాఖా తీస్తాను
మాతండ్రికి మాచెడ్డ కోపం. పాసు కాలేదంటే యెవికలు విరగ్గొడతాడు
కర్రపట్టుకుని చెమ్డాలెక్కగొడతాడు
తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు యాకరు బెట్టు.
మాటమాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు
లెక్క జరూరుగుందండి
పొటిగరాపుల కరీదు
ఇచ్చారు కారటండి
కోవటి దుకాణమా? కస్పాబజారులోగాని, ఇటువేపు లేదు.
స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ?
మాటలతో కార్యం లేదు. మొల్లో సెయ్యెట్టి నిలుచున్నపాట్న పుచ్చుకొమ్మన్నారండి
సొమ్మియ్యకపోతే నా ఆబోరుండదండి
ఇంకా ఎవడో కోన్కిస్కాహే ఆడాలో ఉన్నానంటావేమిటి?
నామనసు కనిపెట్టజాలినారుకారు గదా
వీడెవడో మాగొప్పవాడనుకుంటున్నావేమిటి?
మీరు శెలవిప్పించిన రెండువందలూ ఇప్పిస్తే...
ఒక నిర్ణయంమీద నిలవని మనిషిని యేవన్నమ్మను?
వేళాకోళం ఆడుతున్నావూ?
యేవిటి సాధనం?
నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా?
సానివాళ్ళకి కర్ణపిశాచి ఉంటుంది కాబోలు
యేమి నీతయిన మనిషి యిది!
ముట్టుకోనివ్వకుండా ఎత్తు ఎత్తింది


1 comment: