Pages

13 May 2012

నాకై ............(కవిత, దీన్ని చదవడం అనవసరం)


ఆ ఇద్దరి కోసం..............
ఆ ఇద్దరి కోసం,
కాదు,కాదు........
ఆ మూడు కవితల కోసం,
కాదు,కాదు........
నా కోసం,కేవలం నాకోసం,
నాకై
మత్తుతో రాస్తున్నానో,
మోహంతో రాస్తున్నానో,
మొహమెత్తి రాస్తున్నానో…….
ఇదంతా రాయాల్సిందే,
నాతో నేను పంచుకోవల్సిందే.
నిశ్చయంగా., 
నాది కవిత్వమే కాదు,.
(అది కొత్తగా చెప్పాలా అని నవ్వుకోకండి.)
ముందుగానే చెప్పేస్తున్నా.,
నిర్భయంగా,నిస్సంకోచంగా.

ఇంత కన్నా పిచ్చిపని
మరొకటి లేనప్పుడే,
ఇటు చూడండి.
పరికిస్తారో,
పఠిస్తారో,
తెలివిగా తప్పుకుంటారో,
మీ చేతుల్లోనే వుందంతా.
--------------
మతి తప్పిందా?
రక్తం ఇంకి పోయిందా?
పక్కన్నోని చూసి
పొర్లిపొర్లి
ఏడవడమేకాని,
పరుషమైన పదాలతో
తెగడడమే కాని,
పొగడడమా!!!!!
నా తెలుగు మస్తిష్కం
పెటేల్మని పేలిపోయి,
రాత్రికి రాత్రే
బ్రైన్  ట్రాన్స్ ప్లాంటేషన్
జరిగిపోయిందా!
తెలుగు జాతి మనదంటూ,
ఎక్కడ నుంచో.....పాట.
నన్ను నాకు గుర్తుచేస్తున్నా,
పక్కన్నోన్ని పొగిడి పాడైపోకని,
అడ్డుపడుతున్నా, హెచ్చురిస్తున్నా.......
హృదయాన్ని తాకిన
హెరాయిన్ లాంటి ఆ కవిత్వం,
నరనరాలని మెలితిప్పుతుంది.
తప్పదిక,
నిర్ణయమైపోయింది.
ఆ కవితల్ని పొగడాల్సిందే.
ఇక ముందుదేది నాది కాదు.
-----------
నిద్రను కూడా
వేటాడిన కవిత్వం,
తనువునంతా
తడిమిన కవిత్వం,
నిప్పై దహించింది,
నీరై దాహార్తిని తీర్చిందది.
నాణ్యమైన కవిత్వం,
నిఖార్సయిన కవిత్వం,
ఆ కవిత్వం.
నా దృష్టిలో నాకది,
నచ్చిన కవిత్వం.
ఇంత, ఎంత,
అని కాకపోయినా,
అంత సీనుందా అని,
అన్నా కొందరు,
నాకై నాకది
మంచి కవిత్వం.
గాడిదలు
నముల్తూనే వుంటాయ్,
గడ్డి పరకలు
మొలుస్తూనే వుంటాయ్.
పక్కనోళ్లనైతే
పట్టి పట్టి చూసేవాన్నే,
దూరాల వల్లే
దగ్గిరై రాస్తున్నానేమో!
----------- 
మహా కవిత్వమని
మురిసి పోయి,
నాల్గుకవితల కోసం
నలభై రూపాయలిచ్చి,
అర్ధం కాకపోయినా,
రోజుల తరబడి
కుస్తీ పట్టి,తపస్సు చేసి,
వ్యాఖ్యానిస్తూ,
అర్ధమైనట్లు నటిస్తూ,
తలలు బాదుకొనే కవిత్వం కాదది.
మొహమాటపు సమీక్షలు
సమగ్రంగా చదివి,
వందరూపాయల పుస్తకం కొని,
విలపించె కవిత్వమూ కాదది.
నాణ్యమైన కవిత్వం,
నిఖార్సయిన కవిత్వం,
నాకై నాకది
మంచి కవిత్వం.
-----------------
ఒకే భావాన్ని
అన్నిసార్లు,
సూటిగా, స్పష్టంగా
గురితప్పకుండా
లక్ష్యాన్ని చేధించినట్లు
గుండెల్లో గుచ్చాలా !
ఫరీదా,
ఇలా అడిగినందుకు క్షమించు,
వీలైతే నన్నూకొంచెం ప్రేమించు,
కుదరకపోతే,
కనీసం, ఫిరోజ్ తో స్నేహించు.(స్నేహం చేయించు.)
నీకై......ఫరీదా,
ఇంతకంటే ఎక్కువ
నాకిక నిషిధ్దం.
------------
నేను  నా దేవుడు
ఆటలు ఆడుకుంటూ,
పాటలు పాడుకుంటూ,
పేదరాశి పెద్దమ్మ కధలు వింటూ,
తెరలుతెరలుగా నవ్వుకుంటూ,
గగనంలో విహరిస్తూ,
నన్ను కూడా,
మీతో తిప్పుతున్నావా, ప్రభూ !
తలపులను తడుముతూ,
ఆసాతం నములుతూ,
సాగుతున్న ఆ కవిత్వాన్ని,
శాశ్వితంగా నాలో,
పుట్టుమచ్చై మిగిల్చావా, ప్రభూ!
ఎంత దయాహృదయం నీది, తండ్రీ !
నేన్నిక్కడ అక్షరాలు లిఖిస్తూ,
కవిత్వమని భ్రమిస్తూ,
అరమోడ్పు కన్నులతో ఆస్వాదిస్తుంటే,
పనిచేస్తున్న
పసిపిల్లల కష్టం చూసి,
అలసిపోయిన నా దేవుడు,
అక్కడ దుఃఖిస్తున్నాడు.
నేనేమి అర్ధించకపోయిన,
నన్ను తలుచుకొనే, నా దేవుడు.
------------
ఖాళీగా వున్నప్పుడే,
మీకేమీ చేయాలని తోచనప్పుడే,
మనసు పాత్రలోని
మధువంతా ఇంకినప్పుడే,
ఇంకేమీ మిగలనప్పుడే,
ఇంకేమీ రాయలేనప్పుడే,
తీరిగ్గా, నింపాదిగా
ఖాళి దోసిళ్ళతోటి,
మృదుమధురంగా
ముద్దాడండి, ఆ కవిత్వాన్ని.
ఆదియందు వాఖ్యముండెను,
జీవమై, చైతన్య దీపమై,
ఆ వాక్యమే, కవితై వర్ధిల్లెను.
------------------------------
రాత్రంతా నా కవితలు
కుములుతూనే వున్నాయ్.
కలత నిద్రలో
అప్పుడప్పుడు
వెక్కుతూనే వున్నాయ్.
కలవరిస్తూ,పలవరిస్తూ
నన్ను నిమిషనిమిషానికి,
దెప్పుతూనే వున్నాయ్.
మెలుకువోచ్చినప్పుడు,
మిడిగుడ్లేసుకుని,
మిర్రిమిర్రి చూస్తున్నాయ్.
ఆ మూడు కవితలు చూశాక,
అర్ధమైపోయింది వాటికీ,
నా రాతల సంగతి.
------------------
గడ్డం మీద చేతుల్తో,
చేతుల్లో పెన్నుల్తో,
పుస్తకాలపై ఫోటోల్తో,
మడతనలగని చొక్కాల్తో,
సాహిత్యప్రబంధ బంధు
బిరుదాంకిత కవిత్వం,
ఆధునిక,ఆధునికాంతర
అయోమయ కవిత్వం,
నాకొద్దుతల్లి,వద్దు.

విరహాన్నో,ప్రేమనో,
ఇంకోదాన్నో,మరోదాన్నో
అర్ధంకాని పదాల్తో,
ఉత్కృష్ట భాషాపదబంధాల్తో,
తుడిచి పారేసే
పాకీ పేపర్ల కవిత్వం,
ప్రాస కోసం ప్రాకులాడే
పిచ్చి కవిత్వం,
శబ్ధరత్నాకరాల్ని
వెతికించే కవిత్వం,
నాకొద్దుతల్లి,వద్దు.

ఒక్క వాఖ్యాన్ని
నాలుగుముక్కలు చేసి,
నీలిగే, మూలిగే
నానీల కవిత్వం,
తెలిసిన పది పదాల్తో,
పైకి, క్రిందికి,
క్రిందికి, పైకి,
అటు నుంచి ఇటుకి,
ఇటు నుంచి అటుకి,
తిప్పి తిప్పి రాసే,
నాలాంటి తిక్క కవిత్వం
అసలొద్దుతల్లీ, వద్దు.
గుండెను గుప్పెట్లో బంధించి,
కలల్ని పేపర్లపై పరిచే కవిత్వం,
రకరకాల గజ్జి కవిత్వం,
మాటల్ని అమ్మేకవిత్వం,
ముంచే కవిత్వం,
మూతులు నాకే కవిత్వం,
మేకప్పుల మస్కా కవిత్వం,
పాడు చేసే కవిత్వం,
పిక్కల కవిత్వం,
పేరుంటేనే గొప్ప కవిత్వం,
పక్కలో కవిత్వం,
తొక్కలో కవిత్వం
నాకొద్దుతల్లీ,వద్దు.
పాపం శమించుగాక,
కవిత్వమా! నన్నుక్షమించు.
               ----------------------               
నడిరోడ్లో
నడుము మీద చేతులేసుకొని,
నగ్నంగా నిలబడి,
నా కళ్లలోకి సూటిగా,
నవ్వుతూ చూస్తూ ,
నడిరాత్రంతా,
నా అక్షరాలను
పీకి పీకి
పందిరేసిన దెయ్యం వాడు,
ఆ నల్లపిర్రలవాడు.

మట్టి వాసన వాడు,
పూలహారమై,
అమ్మ మెడలో
పరిమళించే వాడు,
వీది వీదంతా,
వర్షమై కురిసేవాడు,
ఇల్లంతా రొచ్చుచేసి,
రచ్చచేసే వాడు,
నా వాడు కాని వాడు,
ఆ కలువ కన్నుల వాడు,
వాడు, నల్లపిర్రల వాడు.
  
ఆ కమ్మని పదాల వాడు,
నిరంతర శోధకుడు వాడు,
వాడు అని ఏడ(ఎక్కడ) వాడాలన్న,
దాని పేటెంట్ నాదేనంటూ,
కోపంతో వణికేవాడు,
నన్ను గేలి చేసేవాడు,
ఓ చిన్ని భూతం వాడు,
కవిత ఇంట దీపం వాడు,
కవిత్వానికే వెన్నల వాడు,
ఆ నల్ల పిర్రలవాడు,
నా వాడు కాని వాడు.
--------------------
చిన్న చిన్న పదాల్లో,
చిలిపి మాటల్లో చిక్కిన,
చిక్కనైన కవిత్వం, ఆ కవిత్వం.
రాయడానికే
భయపడేటట్లు చేసి,
నా భావాలను చిన్నాభిన్నం చేసిన,
గ్రహశకలం, ఆ కవిత్వం.

ఆస్వాదిస్తే
రసానుభూతుల్తో
మనసు పాత్రను నింపే,
పరుషమైన పండు వెన్నల, ఆ కవిత్వం.

పంటి బిగువన దాయలేని,
ప్రసవవేదన, ఆ కవిత్వం.
సముద్రగర్భ కల్లోలగీతం
సునామీ, ఆ కవిత్వం.

స్పందనా సాహిత్య,
ఝరీ ప్రవాహమే,ఆ కవిత్వం.

ఏదీ చెప్పకుండ,
అన్నీ విప్పి చెప్పే,
బోసిపాప చిరునవ్వులే, ఆ కవిత్వం.

మాదాకవళం తల్లీ,
అని విన్నప్పుడు,
పదాలతో కాదు,
మెతుకులో కడుపునింపే,
మానవత్వం, ఆ కవిత్వం.
గుండె మంటలాంటి కవిత్వం,
కొంచెం,కొంచెంగా కాల్చే కవిత్వం.

ఇంత, ఎంత,
అని కాకపోయినా,
అంత సీనుందా అని,
అన్నా కొందరు,
నాకై నాకది
మంచి కవిత్వం.

గాడిదలు
నముల్తూనే వుంటాయ్,
గడ్డి పరకలు
మొలుస్తూనే వుంటాయ్.
-------------------
శ్రీశ్రీలు, సినారేలు
బాలగంగాధర్ తిలక్ లు,
బైరాగో, శివారెడ్డో
నగ్నమునులో, దిగంబర కవులో
కాదులే తల్లీ, వీళ్లు
మామూలు కవులు ,
నాకు నచ్చిన
మంచి కవితల తల్లులు వీళ్లు.
వీలైతే,
వాళ్లకూ కాస్తా...
ఆ మహాకవుల సరసన చోటివ్వు తల్లి.

 పొగడ్తలతో
పొగరు దరి చేరకుండా,
వాళ్లు, వాళ్లు గా నిలచి
వాళ్లు రాసే మంచి కవిత్వం కోసం,
ఆ ఇద్దరి కోసం,
నా భావలనూ మొత్తంగా
వారికే ఇవ్వు, తల్లి
కొత్తగా నేనేమి రాయనక్కర్లేదు,
వారి కవితలను వెంటాడితే చాలు,
నన్ను నేను తడుముకున్నట్లే.

వాళ్లకు మరంతా వెలుగునివ్వు,
మంచి తలపులివ్వు,
మధుర భావనలనివ్వు,
స్ఫూర్తినివ్వు,
సంకల్పమివ్వు,
గుండెను తడిమే ఆర్తినివ్వు,
మరంతా రాసే శక్తినివ్వు,
వీలైతే,
వాళ్లకూ కాస్తా...
ఆ మహాకవుల సరసన చోటివ్వు తల్లి.
------------
పొగడడం కూడా
ఆనందంగా వుంటుందా ?
ఇంత అద్భుతంగా వుంటుందా !
రాసి రాసి అలుపొచ్చినా,
కొంచం విసుగొచ్చినా,
ఇంకా రాయాలనే వుంది కాని,
దీర్ఘ కవితై దిష్టి తగుల్లుదేమోనని,
ఎక్కడో చిన్న భయం.
ఓపిక లేదనేది వేరే సంగతి.

ఇదేమి యోగ్యతాపత్రం కాదు.
దిశా నిర్ధేశ పత్రం అంతకన్నా కాదు.
సరాదగా రాసుకున్న
ఓ పెద్ద ప్రయోగపత్రం.
ఆ మూడు కవితలకిది
ఓ చిన్న ప్రశంసాపత్రం.
నాకై నాకిది పరీక్షాపత్రం.

ఇంత సోది చెప్పాకైన,
విషయం చెప్పాలిగా....
నేను నా దేవుడు(పుట్టుమచ్చబ్లాగ్)
నీకై లో కొన్ని(లిఖిత బ్లాగ్)
నల్ల పిర్రల వాడు(లిఖిత బ్లాగ్)
ఈ కవితలు మూడు నాకు నచ్చాయ్.
ఇంత దాకా ఎవరైన
ఈ నస భరించివుంటే,
ఇంకా బ్లాగుల పై విరక్తి చెందకుండా వుంటే,
పై మూడు కవితలు చదివి,
హ్యపిగా రిలీఫ్ ఫీల్కాండి.

ఓ ఇద్దర్ని పొగిడి,
గుర్తింపు కోసం,
నీ కవిత్వం పన్నిన కుట్రా ఇది !!!
కాదు తల్లీ, కాదు.
నాది కవిత్వమే కాదని,
ఆదియందే నిర్ణయమైనది తల్లి.

.........ఇంతటితో ముగించడమైనది.
చదివిన వారికి ధన్యవాదములు........




4 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. meeru maree bhayapetesthunnaru, ika rayakunda.

    ReplyDelete
  3. ika bhayapettanandi bhayapadakandi sorry emaina thappuga cheppunte ... saradhaki rasaanu meeru parichayam lekunna meevi chadivaka saradha manishani anipisthenu ala rasaanu anthe :)

    ReplyDelete
  4. parvaledandi, chadavandi - rayandi - keep watching.
    you are most welcom.
    thank you sir.

    ReplyDelete