Pages

Showing posts with label కవి పరిచయం. Show all posts
Showing posts with label కవి పరిచయం. Show all posts

12 November 2012

కవి పరిచయం -1


శిష్ ట్లా ఉమామహేశ్వర రావు ( 1912 – 1953)


మారో మారో – మారో మారో
ఒకటి రెండూ – మూడు నాలుగు
మారో మారో – మారో మారో
...................................

తెలుగు సాహిత్య చరిత్రను మలుపు తిప్పిన నవ్య కవిత తొలిపాదాలివి.  ఆధునిక వచన కవిత్వానికి ఆద్యుడు, మరుగున పడిన మహాకవి, శిష్ ట్లా ఉమామహేశ్వర రావు రాసిన ఈ కవిత పూర్తి భాగము ఈ నాటికీ అలభ్యమే. 1933, బరంపురంలో జరిగిన అభినవాంధ్ర కవి పండిత సదస్సులో  శ్రోతలను ఉర్రూతలూగించి, శ్రీశ్రీ, ముద్దు కృష్ణ, నారాయణ బాబు లాంటి ఆనాటి ఔత్సాహిక కవులకు రాచమార్గం చూపిన కవిత కూడా ఇదే. (దీని స్ఫూర్తితో
I even I ఎత్తుగడతో రాసినదే  మహా ప్రస్థానం తొలి కవిత నేను సైతం....) 

20 సంవత్సరాల వయస్సులో బెనారస్ హిందూ యూనివర్సిటీ నందు ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ పూర్తి చేసిన శిష్ ట్లా, 1912 గుంటూరు మంచాళ అగ్రహారంలో జన్మించాడు.

గుంటూరు లో వెల్కం ప్రెస్ నుంచి శాంతిని అనే పత్రికతో తన సాహితీసేవను ప్రారంభించిన శిష్ట్ లా , విష్ణు ధనువు, నవమి చిలక అనే కవితా సంకలనాలను, సిపాయి కథలు, ఆంగ్లో ఇండియన్ కథలు, కాళింగి పాటలు వంటి రచనలు చేశారు, స్త్రీ జీవిత చిత్రణ చేస్తూ, పుట్టిటి పిల్ల, ఆడవాళ్లు , జ్ఞాపకాలు ....అనే ఖండికలు రచించారు. పాద నియమాలు, మాత్రా ప్రస్తావన, అక్షర గణబంధ చందస్సు వంటి వాటితో సంబంధం లేకుండా ఆధునిక కవితను నెత్తిన పెట్టుకొని నలిగిపోయారు, శిష్ ట్లా. నవమి చిలుకలో  ఇలా రాస్తారు,
నవమి చిలుక కులికుతూ పలికింది,
పలుకులో నవ్య నవ్య నవ్య కవిత్వం  రాలింది.
ఇది నూతనములో బహునూతన కవిత్వం,
అందుకనే ఇది పూర్వకవిత్వం కాదు,
ఇది నవ్య కవిత్వం కదా,
అంటూ కొత్తమార్గం పట్టిస్తాడు కవిత్వాన్ని.

. తెలుగుదేశంలో నిన్ను కమ్యూనిస్ట్  పార్టీ వాళ్లు మహాకవి అని దుమారం రేగిస్తున్నారు,నిజమైనా మహాకవి నువ్వా,నేనా అని శ్రీశ్రీని నిలదీసాడట శిష్ ట్లా. శ్రీశ్రీ కూడా గురజాడకు పెద్దపీట వేసినా,.ఒకానొక సందర్భంలో శిష్ ట్లా నవ్యకవిత్వానికి, ఆద్యుడని ఒప్పుకోక తప్పలేదు.ఎంతో ప్రతిభ వున్నప్పటికీ, నాజూకూతనం,ప్రాపకం లేకపోవడం వలన ప్రాచుర్యంలోకి రాలేకపోయాడంటారు విమర్శకులు. ఈనాడు అతి నవీనులమని బోరవిరుచుకుని తిరుగుతున్న అతినవీనులకు కూడా నవీనుడు శిష్ ట్లా,.ఏనాడో అతి నవీన మార్గాలలో కవిత్వం రాసి లోకం చేత విస్మరించబడ్డాడు అంటారు,..శ్రీరంగం నారాయణబాబు. సమకాలీన కవులను ఉత్తేజపరచడంలో అగ్రస్థానంలో వున్న శిష్ ట్లా ,సార్వకాలీన గుర్తింపు పొందలేక పోవడానికి ఎన్ని కారణాలున్నాయో, చరిత్ర చెప్పాల్సిందే.
కేవలం నలభై ఏళ్ల వయస్సులో నిలకడలేని జీవితం, విపరీతమైన తాగుడు కారణంగా మరణించాడు.
చరిత్రలో ఎంత మరుగున పడ్డా, ఈ రోజు మనం చూసే మహాకవులు, ఆధునిక,ఆధునికాంతర కవిత్వాలు, ఏ ఆంక్షలూ లేని వచన కవిత్వమంతా అతని భుజాలపై నిలబడి వెలుగుతున్నవే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.