Pages

14 October 2020

ఆమెలో.... ఆమెతో...ఆమె లా..ఆమె కోసం. : ANIL DYANI

మనం అనుకున్నది అనుకున్నట్టు జీవించడం ఒక పద్ధతి.అలాగే మన పద్ధతి కి అనుకూలంగా ఎదుటి వ్యక్తులు జీవించాలి అని ఆలోచించే విధానం కూడ ఒక పద్ధతి,అయితే అలా ఉండమని చెప్పేటువంటి సందర్భంతోనే ఇబ్బందులు వస్తాయి.నువ్వు నిజం అనుకుంటున్నది ఎందుకు నిజమో చెప్పాలి,అవతలి వ్యక్తి అందుకు ఒప్పుకోవాలి. ఈ మధ్యలో వాదాలు ప్రతి వాదాలు తర్కం ఇలా చాలా రావొచ్చు.వచ్చినప్పటికీ మనం మన భావన మీదనే నిలబడి ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉంటే అది మనలో మనం నమ్మిన సిద్ధాంతం మీద మరింత నమ్మకాన్ని పెంచుతుంది.

మన సాహిత్యం లో విభిన్న కోణాల్లో జీవితాన్ని నిర్వచించి తమ తమ అభిప్రాయాల్ని సాహిత్యం ద్వారా వెల్లడించిన అనేకానేక సంఘటనలు ఉన్నాయి. వేమన తాను చూసిన లోకాన్ని అనుభవించిన జీవితాన్ని,ప్రజలకి అవసరమైన జీవన విధానాన్ని కొన్ని చిన్న చిన్న పాదాల ఖండికల రూపంలో చెప్పాడు.ఆఖర్లో జనం ఎవరూ వినరేమో అని తనకి తానే ఒక పాదం లో తనపేరు పెట్టుకుని అంతా తనకే చెప్పుకున్నాడు.తనమీద తనకి నమ్మకం లేక కాదు అదో పద్ధతి అంతే. ముందు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తానే పూర్తిగా నమ్ముతున్నట్టు విశ్వాసం కలిగించే ప్రక్రియ అది.తెలుగు సాహిత్యం లో ఈ రోజున అది ఒక ఎన్నదగిన శతకం.
ఈ రోజున మనం జీవిస్తున్న ప్రపంచం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది.గంట గంట కి ఒక కొత్త ఒరవడి వస్తుంది.అనేక దేశాల ప్రభావం జీవన స్థితి గతుల్లో మార్పు.భౌతిక వాంఛల పట్ల వ్యామోహం పెరగడం.ప్రాపంచిక విషయాల్లో కొత్త కొత్త వ్యక్తీకరణలని తమ తమ జీవితాల్లోకి తీసుకోవడం. పని వత్తిడో లేక జీవన విధానం నచ్చి నచ్చక పోవడం ,ఆధ్యాత్మిక వాదుల పెరుగుదల,ప్రజల పట్ల వారి భయాందోళనలు ఇలా ఒకటేమిటి మనిషి తాను బతుకుతున్న అన్ని కోణాల్లోనుంచి అలా కొత్త మాటనో లేక వికాసాన్నో కోరుకుంటున్నాడు ,లేదా అందుకుంటున్నాడు వీటిల్లోనే మళ్ళీ తనను తాను వ్యతిరేకించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి.ఈ సంధిగ్దత ఎప్పటికి విడిచిపోదు.దీనికి మందు ఒక్కటే రెండు వైపులనుంచి ఆలోచన చేసి ఒక మధ్యే మార్గాన్ని చెప్పి అందులో సమస్యని దాని పరిష్కారాన్ని ఇస్తే అది కాస్త ఉపశమనం ఇస్తుంది అలా ఇచ్చే ప్రయత్నంలో రాయబడినవే ఈ "బేకారీలు"
బేకారీలు అనగా నేమి ఇరవై మార్కుల ప్రశ్న. లోతైన ప్రశ్న పెట్టడానికి చాలా సరదాగా పెట్టారు గాని పేరుకి తగినట్టు ఇవి అంత తెలికైనవి కావు,చాలా గొప్పవి మనం.మాట్లాడుకోదగినవి.వీటిల్లో "ఆమె" కథా నాయకుడు, మూల సూత్రం అంతా ఆమె . అతను ఏదో ఒక భ్రమలో ఉంటాడు.నిజం ని చూసి అబద్దం అనుకుంటాడు,అబద్దాన్ని నిజం అనుకుంటాడు.ఏదీ లోతుగా వెళ్ళడు అంతా గాలి వాటం ఏది పైకి మెరుగ్గా అనిపిస్తుంది అని అనుకుంటే దానిలోకి వెళతాడు.దాని వెనక ఉండే లాభనష్టాలు అతనికి పట్టవు. తద్వారా అతను చిక్కుల్లో పడతాడు ఆ పడటం అనేది అతని యొక్క ఉనికికి ప్రమాదం అవుతుంది.ఈమె అతణ్ణి సరిదిద్దే పని పెట్టుకుంటుంది.
ఇది దీర్ఘ కావ్యం కాదు,అలా అని మామూలుగా ఒక తెల్లకాగితం మీద రాసేసిన కవిత కూడా కాదు .ఇవి కొన్ని ఆలోచనల సమాహారం.ఇది సరైన భాగాహారం, ఇదో మేలుకొలుపు, జబ్బు ఏంటో తెలియని వాడికి ఎక్కడో అనుకోకుండా దొరికే ఔషధం.ఈ క్రింది పాదాలను చదవండి ఒక్కసారి.
"మనుషుల్ని ప్రేమిస్తూనే ఉండాలి
అమయకత్వానికి జాలిపడ్డా
మూర్ఖత్వానికి సిగ్గు పడ్డా
అహంకారంతో అణచబడ్డా
జ్ఞానానికి గర్వ పడ్డా
ద్వేషానికి గాయపడ్డా
మరిచిపోకు,మనుషుల్ని ప్రేమిస్తూనే ఉండాలి అంటుందామె,
పాలిండ్లని కొరికిన పసిబిడ్డను
పక్కకు తీసి,ప్రేమతో గుండెలకు హత్తుకుంటూ".
"కన్నతల్లి ప్రేమకన్నా అన్నమేది పాపలకి" అంటాడు వేటూరి ఒక పాటలో ఈ లోకంలో దేన్ని ప్రేమతో పోల్చాలి అన్నా సరే అది ఖచ్చితంగా తల్లి ప్రేమతో పోల్చాల్సిందే అందుకే ఇక్కడ ఆమె తనని తాను పోల్చుకుంటుంది.నువ్వు ఎన్ని నిందలు పడినా, గాయపడిన,లేక ఇతరుల వల్ల అవమానపడినా సరే నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నీ ప్రేమని వదలొద్దు తల్లి పాలిచ్చే స్థితిలో ఉన్నప్పుడు తానెంత హింస పడుతున్నా దాన్ని అలవాటుగా మార్చుకుని తన రోజూవారి పనుల్లోకి మళ్ళీ అలవాటుగా వెళ్లి పోవడం మనమూ నేర్చుకోవాలని చెప్పడం చాలా బావుంటుంది.నిజానికి మన కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు ఉంటాయి కానీ మనం చూడం,చూసినా మనం అన్వయించుకోలేము అలాంటి సందర్భంలో మనకి కాస్త ఇలాంటి వాక్యాల అవసరం ఉంటుంది. సాహిత్యం ప్రాపంచిక జ్ఞానంతో పాటుగా మానసిక విజ్ఞానం కూడా పెంచుతుంది.ఈ బెకారీల్లో ఆమె కూడా అదే నేర్పుతుంది.
"అతనొక వజ్రాన్ని కొన్నాడు
గదంతా కాంతి పరచుకుంది
ఆమె ఒక వాక్యాన్ని కనుగొన్నది
జీవితం ప్రకాశవంతమైంది
నిజమే,వాక్యపు వెలుగు వజ్రానికెప్పుడూ రాదు."
ఇది మరో ఆణిముత్యం. ఎన్ని మిణుగురు పురుగుల వెలుతురు వెన్నెల కి సమానం .ఎంత ఎగిరినా అక్కడక్కడ ఉంటూ వెలుతురు పంచే మిణుగురులు కాంతినివ్వలేవు.అలాగే ఎన్ని వజ్రాలు ఉన్నా వాటి వెలుతురు ఒక్క వాక్యపు వెలుగుతో సమానం కాదు కదా. ఇది పై పై వాక్యాలు గా చూస్తే కనుక భౌతికంగా వెలిగేది వజ్రం వెలుతురులో చూస్తే వజ్రం అందాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు కానీ,బుద్ధి వెలిగించే ఒక్క వాక్యము దాన్ని మించిన రెట్టింపు కాంతితో వెలుగుతుంది.అది బయటకి కనబడకపోయినా సరే ఎవరికి వారికి స్వానుభవం లోకి వస్తే తెలుస్తుంది.అదే ఇక్కడ కవి చెబుతున్నాడు నీలో వెలిగే వాక్యం అది నిన్ను చీకటిలోనుంచి వెలుగులోకి తీసుకుపోతుంది అక్కడ నీకు నువ్వు కనబడొచ్చు,లేదా సమాజంలో కుళ్లు కనబడొచ్చు లేదా నీ చుట్టూ చూడని సమాజాన్ని నువ్వు చూడోచ్చు. అలా చూడడం కూడా అలా విద్య కదా.అది మనం ఆచరణలోకి తెచ్చినప్పుడు మనం కోరుకున్న ప్రపంచం మనముందు కనబడుతుంది.కానీ ఇది అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు.ఆచరణ కావాలి అలవాటుగా చేసుకుంటూ పోయేది కాదు.
"ఎందుకనోయ్ గొప్ప వ్యక్తులకు
దూరంగానే ఉండమంటావు, అసహనంగా అడిగాడతను
కాస్తంత దూరం నుంచి వెలిగించు కుంటేనే
నువ్వూ, ఓ దీపమై వెలుగుతావ్
లేకుంటే,ఆ గొప్ప మంటలో భాగమవుతావ్
అంటుందామె,చలి ఉదయాన పొయ్యి రాజేస్తూ"
ఇక్కడ ఆమె రాజేసింది పొయ్యి కాదు. మెడదనే నెగడు. మనిషికి మనిషే మిత్రుడు,ప్రేమికుడు,స్నేహితుడు,శ్రేయస్సు కోరేవాడు, కొండకచో శత్రువు కూడాను. ఆమె జీవితాన్ని మొత్తం చూసింది కాబట్టే అతనితో ఇలాంటి మాట చెబుతుంది. ఎవరైనా సరే నువ్వు వారికి దూరంగా ఉండు. దగ్గరకి పోతే వారి అసామాన్య వెలుగులో నువ్వు కలిసిపోయి నీ ఉనికి ని పోగొట్టుకుని సామాన్య వ్యక్తిగా మిగిలి పోతావు, అదే దూరంగా ఉంటూ ఆ వెలుగులో నిన్ను నువ్వు సరిదిద్దుకుని సానబెట్టుకుంటే నీకోక అస్తిత్వం ఉంటుంది.నిన్నూ నలుగురూ గుర్తిస్తారు అంటుంది ఆమె.నిజమే కదా రోజు వారి సహవాసాల్లో ఎన్ని పగుళ్ళు చూస్తున్నాం,ఎన్ని మనస్పర్థలు చూస్తున్నాం,ఎన్ని వింటున్నాం అన్ని మన చుట్టున్న మనుషుల మధ్యనే కదా .అందుకే మనం మనపని చూసుకుంటూ సాధ్యమైనంత దూరం గా ఉంటే కావాల్సినప్పుడు కలవొచ్చు,మనకి అంతగా కలవనప్పుడు దూరంగానూ ఉండొచ్చు. కాబట్టి అతనే కాదు మనమూ ఆమె మాట పాటించవచ్చు.అది ఆరోగ్యానికి చాలా మంచిది కూడానూ.
"వాడు కత్తి పట్టుకున్నాడు - తప్పలేదు
కాస్త ఆలస్యంమైనా
వీడూ కత్తినే చేపట్టాడు-తప్పులేదు
వాడు కులం కార్డునో,మతం మత్తునో
ఆయుధంగా మలుచుకున్నప్పుడు తప్పదు-
వీడు దాన్నే ఆశ్రయిస్తాడు తప్పుకాదు
కావాలంటే ఏ చరిత్ర అయినా చదువుకో అంటుందామె,కాస్తంత విరక్తి గా చూస్తూ".
ఆమె విరక్తి కి చాలా అర్ధం ఉంది.అందులో ప్రపంచ చరిత్ర ఉంది,అందులోనే మన ఊరి రాజకీయం ఉంది,మనలో చాలా మంది దుఃఖం ఉంది,బాధ అక్షరం నిండా పరుచుకుని ఉంది.ఎంత బాధ ఆమెకి మనిషి ,మనిషి మధ్య కులం గోడలు మొలిచి మతం కత్తులు యుద్ధంకోసం పరితపిస్తూ ఉంటే ఆమె విరక్తి గా కాక ఎలా ఉంటుంది. నిజమే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అణా మహా కవి మాటలు ఇక్కడ కూడా స్ఫురణకు వస్తాయి .ప్రపంచ చరిత్రలో సగం యుద్దాలు కీర్తి కోసమే అయితే మిగతా సగం మతం వ్యాప్తికి జరిగాయి.ఇప్పుడు అవే యుద్దాలు మత ప్రాతిపదికన మన చుట్టు జరుగుతూ ఉన్నాయి.ఉంటూనే ఉన్నాయి.వాటికి మనిషి మానసికంగా బానిస కావడం అనేది మరో ఐరనీ. మనిషి ప్రలోభాలకు చాలా సులభంగా లొంగిపోతాడు,అంతకన్నా తేలిగ్గా భక్తి కి లొంగుతాడు .భక్తికి లొంగేవాళ్ళ మెజారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.కాబట్టే మతం,కులం ఎన్నో ఏళ్లుగా మన మీద స్వారీ చేస్తున్నాయి.అదే ఆమె విరక్తి .దీనికి విరుగుడు మందు ఇప్పటికి రాదు మనుషుల్లో వాళ్ళంతట వాళ్లే మారితే తప్పా మరో అవకాశం లేని రుగ్మత అది చూద్దాం మనం ఆశావహులం కదా ఇప్పుడైనా ఒక విత్తనం నాటితే అది ఎప్పటికైనా ఫలితం ఇస్తుంది.కనీసం అప్పుడైనా ఆమె విరక్తి స్థానంలో కాస్త ఆనందం చూడొచ్చు.
"కత్తికి సానబెట్టు కోవడం కాన్ఫిడెన్స్
పిడికి కూడా పదును పెట్టుకోవడం
ఓవర్ కాన్ఫిడెన్స్ అంటుందామె
తెగిన అతని చేతులకి కట్టు కడుతూ"
ఆమె కి తెలియని విద్యే లేదు.అతను అంతటి అమాయకుడూ లేడు. అచ్చం మనలాగే. మనకి అన్ని తెలుసని మనమే హీరోలమని మనం వాదించే మాటలని బట్టి మనం మన గుర్తింపు కోరుకుంటాం, కానీ ఒక మాటకి రెండు ముఖాలుంటాయని ఒక ముఖం మాత్రమే చూస్తూ మనం మన వాదనని మొదలు పెడతాం.అది కూడా ఒక భావన ని నెత్తిన పెట్టుకొని మరీ మొదలు పెడతాం .దాని మొదలు చివర మనకి తెలియవు మనకి ఎక్కడో ఒక వేరు ముక్కో,ఆకు చివరి భాగమో కనబడుతుంది దాన్నే పట్టుకుని సప్త సముద్రాలు,జీవనదులూ ఈదుకుంటూ మనం వాదం చేసుకుంటూ పోతాం ఆమె అదే అంటుంది, బాబు నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అని. నీకు తెలిసింది కొంత మాత్రమే తెలియవలసింది ఇంకా బోలెడంత ఉంది అని. ఈ సూత్రం నేటి సోషల్ మీడియా వీరులకి బాగా అన్వయించవచ్చు.రచయిత కి ఆ ఉద్దేశ్యం లేకపోవచ్చు కానీ ఈ బేకారిని చదివిన వారికీ మాత్రం ఇప్పటి వాస్తవ పరిస్థితికి అన్వయించుకోకుండా ఉండలేరు.ఇక్కడ అందరమూ ప్రవచన కారులమే కానీ సమస్య పరిష్కారం చూపలేని సిద్ధాంత కర్తలం ఆమె వీళ్ళందరిని చూసి పడీ పడీ నవ్వుతుంది అతను పిడి ని పదును పెట్టుకుంటూ ఉంటే.అతనిది మితి మీరిన ఆత్మ విశ్వాసం అని అతనికి కలిగిన దెబ్బలకి మందు పూసే ఆమెకి తెలుసు. అతనికి తెలియడానికే చాలా సమయం పడుతుంది.ఈలోగా అతని పేరు మీద చాలా దెబ్బలు,గాయాలు రాసిపెట్టి ఉంటాయి తెలుసుకునే సమయానికి అతనే తెలుసుకుంటాడు గాయపడ్డ ప్రతీసారి ఆమె ఎలాగూ మందు పూస్తుంది కదా.
ఈ పుస్తకం నిండా ఇలాంటివి 280 ఉన్నాయి.ఒకటి చదివి ఇంకోటి చదివేలోగా ఈ లోపు మొదట చదివింది లోపల గొడవ చేస్తుంది. చూడు ఇది నువ్వే అనుకుంటా అని కంగారు పెట్టిస్తుంది, మనం ఆలోచనలో పడిపోతాం మార్పు కోసం ఎదురు చూస్తాం.కొన్నిసార్లు నిస్సహాయులమై నిలబడిపోతాం ఎందుకంటే మనం ఇప్పటికి ఒక కుక్క తోకపట్టుకుని చాలా దూరం ఈదుకుంటూ వచ్చేస్తాం కానీ వెనక్కి పోవడానికి దారి వచ్చిన దారికంటే క్లిష్టంగా ఉంటుంది.అప్పుడు కూడా ఆమె నీకు అవసరమైన ఒక బేకారిని ఎక్కడో రాసిపెట్టే ఉంటుంది. కాబట్టి పుస్తకం అంతా చదవాలి.ఇది ఒక రహస్య నిధి ని వేటాడేందుకు అవసరమైన మ్యాప్ లాంటిది నీకు అవసరం అయిన అన్ని ఓకే చోట ఉండవు అక్కడొకటి ఇక్కడొకటి ఉంటాయి అన్ని అవసరం అయినవే, దేన్ని వదిలే వీలు లేదు,వదల్లేవు ఎందుకంటే రాబోయే నిధి నిన్ను ఊరిస్తూ ఉంటుంది కదా.ఈ పుస్తకము మొత్తాన్ని ఓకే ఒక మాటలో చెప్పే ప్రయత్నం చేశారు భాస్కర్.కె. నిజానికి అన్ని బెకారీల్లో ఆమె లేదు, ఆమె ఉన్న బేకారీలు మాత్రమే పబ్లికేషన్స్ వాళ్ళు తీసుకుని గుది గుచ్చిన పుష్పగుచ్చాన్ని మనకి అందించారు. అందుకు వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
" నీ కిటికీ లోనుంచి ప్రపంచాన్ని చూడు
స్వతంత్రుడివి అవుతావు
నీ కిటికీనే ప్రపంచం అనుకుంటే
మూర్ఖుడివి అవుతావు"
ఇది సత్యం .ఇదే సత్యం. నేర్చుకోవాల్సింది,నేర్పాల్సినది.ఎవరికైనా ఎలాగైనా ఎక్కడైనా ఇదొక పాఠం గా బోధించాలి.
బహుశా ఎప్పటినుంచో చాలా ఈ ప్రపంచాన్ని అధ్యయనఁ చేసిఉంటారు భాస్కర్.ఈ భౌతికశాస్త్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాలా కవిత్వాన్ని రాశారు.రాసిన ప్రతీ వాక్యం చదివిన పాఠకుడిలో ఎక్కడో ఒక చోట గుచ్చుతుంది. బేకారీలు రాసినా,గుగాగీలు రాసినా అన్నింటిలో ఒక తాత్వికత, ఒక చిన్న చురక మరికొన్ని చోట్ల ఒక పెద్ద చెంప దెబ్బ కొట్టి గాని వదలరు.ఏది చేసినా ఆలోచనతో చేస్తారు. కవిత్వం ఎంత బాగా రాస్తారో అంతే బాగా ఫోటోగ్రఫీ చేయగలరు.ఈయన కన్ను చాలా ప్రత్యేకమైనది. ఈ బేకారీలు ఈయన రాసినా మూలం ఎక్కడా చెడిపోకుండా భావం మొత్తం ఆయన మాటలే వినబడేలా సంపాదకీయం చేశారు, పిన్నమనేని మృత్యుంజయరావు గారు, శ్రీ సుధా మోదుగు గార్లు ఇద్దరూ ఈ పుస్తకం సంపాదకులు .వాస్తవానికి ఇలాంటి పుస్తకాన్ని పట్టుకోవాలంటే కాస్త భయం ఉంటది కానీ వీళ్ళు మాత్రం దాన్ని చాలా ప్రేమగా హత్తుకున్నారు ఎక్కడ అతి అనిపించే వాక్యమో లేక మాటో కనబడదు.చాలా షార్ప్ ఎడిటింగ్ ఉంది వీళ్ళ ఆలోచనల్లో అదే పుస్తకం నిండా పరచుకుంది.భాస్కర్ గారి మొదటి కవితా సంపుటి "వాక్యం".ఎవరి పుస్తకం కి వారి ఫోటోనే ముఖచిత్రం గా వేసి ఒక ప్రయోగం చేశారు.దానికి ఏమాత్రం తీసిపోనిదీ పుస్తకం.ఇలాంటివి ఇతర భాషల్లోకి అనువాదం కావాలి.మన ఆలోచన బలం మిగతా ప్రాంతం వారికి కూడా తెలుస్తుంది. ఇలాంటివి రాస్తూ కవిత్వాన్ని కూడా కాస్త పట్టించుకోవడం వంటివి భాస్కర్ గారు చేయాల్సిన అవసరం ఉంది.ఆమె చాలా చోట్ల దారి తప్పినట్టు కనబడుతుంది కానీ తప్పి పోయింది ఆమె కాదు మనమే అందుకే ఆఖరి అట్ట మీద ఆఖరి మాటగా ఇలా అంటారు
" మార్పే సత్యం
తర్కమే జ్ఞానం
ప్రస్నే మార్గం
సత్యజ్ఞాన మార్గమే జీవితం"
కవి కోరిక నెరవేరు గాక.
కథనో,కవిత్వాన్నో కానుకగా పొందొచ్చు.కానీ జ్ఞానాన్నీ మాత్రం కొనుక్కోవాలి.ఈ పుస్తకం కొనుక్కుని చదవండి.

No comments:

Post a Comment