Pages

Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

19 July 2015

పురుగులు



భిన్న దృష్టికోణాల భేదాలు
అభిప్రాయాలను దాటి
ప్రిస్టేజీ పోరాటాలుగా
మలుపు తిరుగుతున్నప్పుడు,
దాడి, ప్రతిదాడి పర్వాల పర్వర్షన్లో
వదిలేస్తున్నదేందో
వంకర చూపునొదిలి తిన్నగానే
చూడడాన్ని నిజంగానే నేర్చుకోవాలి.

నచ్చడాలు, నచ్చకపోవడాలు
ఇష్టాయిష్టాలు
లాభనష్టాలు, కోపతాపాలు
వ్యక్తిగతాల నుంచి సామాజికాలుగా
మార్పుచెందుతున్నప్పుడు
మరో పరిణామ సిద్దాంతాన్ని
కొత్తగా కనుక్కోవాలి.

తొక్కబడ్డ శవాల
ఇంగితజ్ఞానాల అవగాహనల్లో
పదేపదే మునిగి తేలుతున్నప్పుడు
విలువల గురించి చింతించేవాడు
చర్వితచర్వణంగా చచ్చేచావులను
తప్పుకునే మార్గాలను వెతికిపట్టుకోవాలి.
లేకుంటే
సిద్దం చేసుకున్న సమాధుల్లో దూరి
జీవితాంతం తనతో  తానే మాట్లాడుకుంటూ

తనకు తానే ఓ కాలక్షేపమై మిగిలిపోవాలి.

17/7/2015

7 July 2015

|| సూచన||



హేయ్,
ఆలోచన  అదృష్టం కాదు,
అనర్థమని
నెత్తినోరు కొట్టుకుంటుంటే,

అర్థంలేని
బండ బతుకని
హేళనచేశావ్ కదా!

చుట్టుకుపోయిన
ఆక్టోపస్ చేతుల్లాంటి ఆలోచనల మధ్య
బిగసుకుపోయిన మెదడునాళాల వేదన సాక్షిగా
ఇప్పుడైన ఒప్పుకుంటావా!

అంతా అయిపోయాక
తీరుబడిలో తప్పోప్పుల పట్టికేసుకుంటే
అదింకో తెగని ఆలోచన కదా!

అందెందుకు గాని ఇంకా
నడువ్, ఇపుడైనా కాస్తంత నిరాలోచనగా.


24/6/15

5 July 2015

అబార్టెడ్



సందేహపు స్పర్శలతో
చలికాలపు నెగడై
కోరికలను రగిలిస్తుంది
రూపుదిద్దని వాక్యమొకటి.

అక్షరాల కుప్పల మధ్య
తొలియవ్వన రసతీవ్రత
లోపించిన లిటరేచర్
శృంగభంగమై రొప్పుతుంది.

నలగని దుప్పటి చితిపై
దుఃఖ యజ్ఞపు సమిధై
ఫలించని వాక్యరోదన
కవన విషాదమై పుష్పిస్తుంది.
5/6/15

2 July 2015

నాన్సెన్స్



ఒక అర్థరాత్రి
పలచటి వెలుతురు లాంటి మెలకువలో
కనురెప్పలపై  పెదవుల బరువుతో
తెరవబడని కనుల బాధ,
తెలుసో లేదో నీకు.

వెంటాడే నీడలాంటి గాయంలో
ఘాటైన కారం లాంటి వాక్యపు రుచి
ఎరుగుదువో లేదో నువ్వు.

మూతులపై ముచ్చటగా
విరబూసే నవ్వుల మతలబులో
రహస్య విషాద
విష లోకపు తీరని దిగుల్లు
ఓదార్చే గుండె తడిని
స్పర్శించావో లేదో నువ్వు.


20 June 2015

ఎరలు


కాళ్లకు బంధాలేసుకొని
కళ్లకు గుర్రపుగంతలేసుకుని
లక్ష్యాలవైపుకి పయనించడం
అద్భుతం అని కొనియాడబడుతుంది.

సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు
వీటన్నింటి గురించి  ఏమీ మాట్లాడకు.
గద్దెకి అనించి కూర్చోవడాన్ని
మించిన విలువ ఇక్కడేం లేదిప్పుడు.

పిడికిలి పైకెత్తి పెల్లుబికే పోరాటాలలో
క్రియాశీలకాలే, కరవాలాలకు ఎర్ర కళనిస్తాయి.
పులిజూదంలో పావులైనాక
పసికందైనా, పులినోట్లో పలావుముక్కే.

జీవితాన్ని అజ్ఞాతంలో మగ్గపెట్టినా
మరణాన్ని మెరిపించడం
పాతదైనా, ఇప్పటికి లేటేస్ట్ ఫ్యాషనే.

నేలపాలైన ఓ పాలస్వప్నమా!
తప్పిపోయిన తోవలను
తిరిగి దొరకపుచ్చుకోవడం

 ఏ సమాధికి వీలుకాదు.

15/6/2015

4 March 2015

ఎ వే


ఓ కవీ
నడుస్తుండు.

కారుమబ్బై కురుస్తుండు
కోపమస్తే కరుస్తుండు
ఎర్రపూల ముళ్లబాటను
జనం గుండెపై పరుస్తుండు
బూర్జువాల బూటు కాళ్లను
తుండుగుడ్డై తుడుస్తుండు.
ఓ కవీ నడుస్తుండు.

వెచ్చని చిరునవ్వుల ఉద్యమమై
సమూహపు హృదయాల మధ్య
చొచ్చుకుపోతూ వ్యాపిస్తు ఉండు.
కారుతున్న కన్నీటి చుక్కల్లో
ఓ ఓదార్పు అశ్రువై
ఆ దుఃఖపు బుగ్గలపై
పరామర్శగ మిగులుతుండు.
ఓ కవీ నడుస్తుండు.

నీకు నువ్వే శోకమయ్యి
నీకు నువ్వే స్వప్నమయ్యి
అంతరాగ్నికి సమిధవయ్యి
పతా తెలియని పిట్టవయ్యి
కొలిమిలోపల కాల్చబడ్డ
పదును పెరిగిన శక్తివయ్యి
ఓ కవీ నడుస్తుండు.

రాతలోనే రాలిపోక
సమాజంలో బతుకుతుండు

దివ్వెలాగా వెలుగుతుండు.

3 March 2015

ఇన్ సైట్


ఎంగలి బీడి ముక్కలను
పోగుచేసుకొని
జేబులో దాచుకొని
అప్యాయంగా తడుముకునే వాడికి
వాటి విలువ తెలిసే వుండాలి.

తాగిపారేసిన
 ఖాళీసీసాలలో మిగలిన
చివరి చుక్కలను
అదే పనిగా
అరచేతిలోకి తట్టుకొని
నాలికతో రుచిచూసేవాడికి
అక్కడేదో ఆనందం దొరికే వుండాలి.

పనికిమాలిన ఊహలతో
కొట్లాడి, కొట్లాడి
కాలం కుంపటిలో కాళ్లు కాల్చుకుని
కవిత్వమై మిగలేవాడికి కూడా
ఖచ్చితంగా సురామయమైన రుచేదో
వ్యసనమై మిగలేవుండాలి.

విభిన్నదృశ్యాల
వైవిధ్యాలనో, వైరుధ్యాలనో  విశ్లేషించుకుంటూ
సహజాతాలతో తృప్తిచెందేవాడికి,
అంతర్ ప్రపంచాల మధ్య
అనువైన వాతావరణం ఒకటి
వెల్లివిరుస్తూనే వుండివుండాలి.
సృజనాత్మక సరాగాలను మీటుకుంటూ.

ప్రతిది మనకు అవగతము కాకపోవచ్చునుగాని.


28 February 2015

అనవసరం


వొలికిపోతున్న ఊపిరిశబ్థాలను
వెచ్చగా అక్కున చేర్చుకొని
చిరురోమాల పులకరింతల మధ్య
మరంత గట్టిగా అదుముకుంటాను
నిన్ను హృదయపు లోతుల్లలోకి.

ఇక్కడ భాష శరీరాలది కాదు
అని చెప్పడానికి సాక్ష్యం లేదు.
అమలిన ప్రేమభావనల
ఋజువుల ప్రకటనలకై
ఆరాటం అసలే లేదు.

ఒక స్పష్టమైన విభజన రేఖల
ఒప్పంద పత్రాలపైన సంతకాలు
చేసినట్టే లేదా చేయనట్టే.

అయోమయం మొదలైయ్యేది
ఒక గందరగోళ దృశ్యాన్ని
విప్పి చూపుకోలేని మనసుల నుంచే.

చెరిగిపోయిన కలల రాతను
మళ్లీ రాసుకునేంత మురిపం లేదు.
అసలు దానికై ఎలాంటి ప్రయత్నం లేదు.

మరి  ఇప్పుడు హఠాత్తుగా ఇదేంటని అడిగతే

చెప్పడానికి సరైన సమాధానమూ లేదు.

27 February 2015

ట్రాష్


నాకర్థంకాదు
నీలో రెండు మనిషి
నాకు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.
ఒక్కో పార్శ్వంలో ఒక్కో రూపాన్ని
నువ్వంత జాగ్రత్తగా
ఎలా హాండిల్ చేస్తున్నావో నన్న
విషయం నాకిప్పటికి.

ఇప్పటికిప్పుడే మనం
ఎదో ఒకటి మాట్లాడుకుందాం
అవగాహన రాహిత్యాల గురించో
ఫెయలైన  పరఫెక్షన్ గురించో,
నాన్సెన్సికల్ పర్టిక్యులారిటీ గురించో
పర్వర్షన్లలో ప్యూరిటి గురించో
ఆ, ఇప్పుడకి మాట్లాడుకుందాం.

మొన్న మధ్యాహ్నం కలిసినప్పుడు
ఎలా వున్నామో,
ఇప్పుడూ అలానే ఉన్నందుకు
పొల్లికింతలతో దుఃఖిద్దాం.
మారకుండా కొట్టుకుపోతున్నందుకు.

 చివరగా
ఓ నిర్ణయమైతే తీసుకోవాలి,
ఆ రెండో మనిషి కనబడకుండా
గంతలు కట్టుకొని బతకడం గురించి.

ఆలోచించు.

26 February 2015

ద టచ్



ఉవ్వెత్తున ఎగసిపడుతున్న
అలల వేదన లాంటిదై
మూసివున్న కనుల మీద
తెరవనివ్వని బలమైన కాంతిలాంటిదై
ఆ స్పర్శ.

బాధతో కూడిన నవ్వునిచ్చే
కరుకు చక్కలిగిలిలాంటిదై
ఆమడపిల్లల ఆలనలో
ఆవిరైన రాత్రిలాంటిదై
ఆ స్పర్శ.

లేత చేతులపై
ఎర్రెర్రగా కాల్చిన లోహపు రేకుదై
నీరు పోసిన చెట్టుకొమ్మ
చర్మాన్ని చీరేసిన గాటులాంటిదై
ఆ స్పర్శ.

గుండెను చీల్చుకు చొరబడుతున్న
ఆ అభావపు స్పర్శ
మగదో, ఆడదో తెలియట్లేదు కాని,
ఆ సంవేదనలోని నిరంతర సంగమాన్నే
ఇక జీవితంగా మార్చుకోవాలేమో.

4 August 2014

అనేకాలు


దాటుకొచ్చిన దూరాలు ఎప్పుడూ సగాలే.
తాబేలా, కుందేలా అనేది చరిత్రకొదిలెయ్.

ఎంతగా విస్తరిస్తావో, అనేది ముఖ్యం కాదు 
ఎంతగా కురుస్తావు అనేది ఎదురుచూపుల ప్రశ్న.

స్వాగతించు రాయలేకపోవడాన్ని,
నీ వరకు నీవైనా,.
దాన్నే హత్తుకోవడానికీ ప్రయత్నించు.

ఇంతకాలం రాసి రాసి, దేన్ని ఉద్దరిస్తున్నావో
ఏ భ్రమల్లో పడి అక్షరాల్లో దొర్లుతున్నావో.

ఇక ఇప్పుడైనా,.. నీకింద పడి 
ముక్కలైన జీవితాల శాపనార్థాలు వింటుండు.

బద్దలుకొట్టుకున్న హృదయాల్లో ఏమీ మిగలదు.
కొట్టుకుపోతున్న దేహాల్లో ప్రాణమూ వుండదు.
అదే వదిలిపోయాక, కవిత్వమూ విగతమే.
Oh,. still are you available ?

2 August 2014

ఫ్యూజ్ లెస్



మళ్లీ అలాగే చెప్పుకుందాం
అదీ ఏ జన్మానిదైనా అంతేకదా!
కొన్ని రాకల వెనుక కారణాల మీద
ఎన్ని పిచ్చి గీతలు గీసుకున్నా
మధుర గీతాలు రాసుకున్నా
ఎవడికొరిగేది ఏంటో ఎవడు నిర్థారిస్తాడు?

ఒక అశోకుని లెక్క యుద్ద వీరుడై
 దుఃఖపు దారిని ఎన్నుకుని
శవాల కుప్పల మధ్య కుములుతున్న
జనుల గుండెల రగిలింతల గాయమైన
దేశపు దేహాల సందోహాల సందేహ హేల భరిస్తూ.

తధాగతా, మళ్లీ ప్రేమ గురించే మాట్లాడు
ఒక మంత్రగాడి మాదిరి ఈ జనుల చెవుల్లో
పదే పదే తడుతు హృదయపు తలుపులను.
లంజల దిబ్బల మతపూతలు మట్టికొదిలి.

యేసు దేవా, ముళ్లకిరీటపు రక్తదాహాల నేల
ఇంకా అలాగే చెర్నాకోలై చెలరేగుతూనే వుందే,
పొరుగువాడి మిస్సైల్ల దాడికి చెదిరిన
అవయపు చెత్తకుప్పల
శత సహస్ర సంప్రోక్షణల్లో
నిరంతర విషాద స్తోత్రమై, జీవితం.

ఇక చెప్పడానికి, ఏం వుంటుది ప్రవక్తా!
చీకట్లలో నెలవంకవై నువ్వు చూస్తూనే వున్నప్పుడు.