1.
ఎందుకూ...? అనడిగితే ఏం చెప్పగలం
కొందరలా రాలిపడతారంతే.
జీవితం ఇరుకు దారుల గుండా
సాగుతున్నప్పుడు
నాలుగు దిక్కుల్నీ చొక్కా జేబుల్లో దాచుకొని
దుస్తులకంటుకునే పల్లేరు కాయల్లా
కొందరలా బతుకులని హత్తుకుంటారంతే
2.
నీదే దేశం? నువ్వెవరూ?
అని వాళ్ళు నిన్ను ప్రశ్నించరు
వారి చేతుల్లో ఉన్న కొన్ని
సూర్యుడి ముక్కలని
నిశ్శబ్దంగా నీ నోటికందిస్తారు
అకలి తీరిందా?
అనికూడా వాళ్ళు ప్రశ్నించరు.
వారికి సమాధానాలు తీస్కోవటం
నచ్చదేమో అనుకుంటావ్ నువ్వు
3.
పాత్రలనిండు గా మరిగే నీటిలో
నువ్వు ఊహించే కొన్ని తృణ దాన్యాలను
నీ మనసులో చల్లుతూ
వెలుగురేఖలని నాలుగు వైపులా పాతి
మార్మిక వ్యవసాయ క్షేత్రాలుగా
వాళ్ళు పరుచుకుంటారు
మళ్ళీ ఎప్పుడు మొలకెత్తుతారూ?
అన్న ప్రశ్నగా నువ్వు నిలబడి పోతావు
4.
హఠాత్తుగా తమ మొహాలపై
ముసుగులు తొలగించిన కొందరు
ఒకనాడు మరణించిన నీ ప్రేయసి మాటలుగా
నీ పెదవులపై కాస్త చోటుని వెతుక్కొని
తమ వెచ్చని కంబళ్ళలో దాచిన
కొన్ని కలల్ని నీ కను రెప్పలపై సున్నితంగా అద్దుతారు
తమ తలల్ని కదిలించే గడ్డిపరకలకి
కొంత వేసవినిచ్చి బదులుగా
కాస్త శీతాకాలాన్నితీస్కొని నిద్రిస్తూ...
మనుషులను తీవ్రంగా ప్రేమించాలని
నిశ్చయించుకుంటావు
5.
ఒక్కొక్క సారి జనం తప్ప మనుషులెవరూ లేని
నగరాల విశాల విఫణుల్లో
నువ్వు సంచరిస్తున్నప్పుడు
నీ హృదయం దొంగిలించ బడుతుంది
"గుండెలేని వాడుగా ఎవరూ నన్ను
ఎవరూ నిందించరేం..?
"
అన్న నీ ప్రశ్నకి మర్రి చెట్టు పైని గబ్బిలం
ఫక్కున నవ్వుతుంది
6.
కాలం ఆగిన కొన్నిసంవత్సరాలకి
నీ జీవితం ఒక ఆకలి పాటగా
యుద్దభూమిలోని చివరి సైనికుడి గొంతునుండి
గాలికి బహుమతిగా ఇవ్వబడుతున్నప్పుడు
మనిషి మనిషిగానే బతికేందుకు ఆకలి అత్యావశ్యకము
అనే తీర్మాన పత్రంగా మారిపొయి
కొన్ని నిశ్శబ్దాల పాటు నిలిచి పోతావ్
చివరిగా కాలం మళ్ళీ
అరిగిన బండి ఇరుసులా శబ్దం చేస్తూ కదిలాక
కొండపై పశువులు మేపే పిల్లవాడొకడు
నిన్ను గాలిపటంగా ఎగరేస్తాడు.
No comments:
Post a Comment