హైకూ అంటే
చంద్రుణ్ణి చూపించే వేలు, ఏరు దాటాక దిగవిడిచే తెప్ప.
చంద్రుణ్ణి చూపించాక వేలు అవసరం లేదు. ఏరు దాటాక తెప్ప అవసరం లేదు. తనని తాను
రద్దు చేసుకుని, తను అదృశ్యమైపోయి, స్వతస్సిద్ధ
వస్తు తత్వాన్ని (thing-in-itself) ఆవిష్కరించటం హైకూ అనే
కవితా ప్రక్రియ ప్రత్యేక లక్షణం. ఇదే దీన్ని మిగతా కవితా ప్రక్రియల్నించి
వేరుచేస్తుంది.
ప్రాకృతికవస్తువులతో
మన మౌలికమైన ఐక్యాన్ని సిద్ధింపచేసుకునే ఈ అనుభవాన్నే “జెన్”
లేదా ‘హైకూ అనుభవం’ అంటారు.
వస్తువు మనలో తన్ను తాను చూసుకుంటుంది. మనం వస్తువులో మన నీడని చూసుకుంటాం. విషయి
కీ(subject) విషయానికీ(object) మధ్య
సరిహద్దు చెరిగిపోతుంది. కవి ప్రకృతితో తాదాత్మ్యాన్ని సిద్ధించుకుంటాడు. విశ్వంతో
తాదాత్మ్యాన్ని సాధించినప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది.
నిజమైన
కవిత్వానుభవంలో ఆత్మ, పర భేదాలు లయిస్తాయి.
అనుభవించే మనస్సూ, అనుభవింపబడే వస్తువూ, వేరువేరు కాదు. రెండూ కలిసి ఒకటే అనుభవం. ఇది అంతర్‌జ్ఞాన సంబంధమైంది (intuitive).
హేతుబుద్ధికి (reason) సంబంధించింది కాదు.
అనుభూతి పరమైంది. తార్కికమైన ఆలోచనలతో దీనికి సంబంధం లేదు. ప్రతి వస్తువుకీ దాని
సారభూతమైన అస్తిత్వం ఉంటుంది. మన అస్తిత్వాన్ని దానితో ఐక్యం చేసినప్పుడే దాన్ని
తెలుసుకోగలం. ఇది బుద్ధితోకాని తర్కంతో కాని కలుషితం కాని ప్రత్యక్ష అనుభవం
ద్వారానే సాధ్యం. మనస్సూ, వస్తువూ ఐక్యం సాధించగలిగే ఈ
అనుభవాన్ని జపానీయ బౌద్ధులు “జెన్” అన్నారు.
“జెన్” అనగా ధ్యానం. ఈ అనుభవం
ఆత్మాశ్రయమూ(subjective) కాదు, వస్త్వాశ్రయమూ
కాదు. ఏక కాలమందు రెండూనూ. నిజానికి కవిత్వానుభవమంటే అవశ్యకంగా ఇదే. విషయీ,
విషయ భేదాలు చెరిగిపోయినప్పుడే కవిత్వం ఉద్భవిస్తుంది. కాసిరెర్(Cassirer)
డ్యూయీ(Dewey), పౌండ్ (pound), ఎలియట్ (Eliot), లాంగర్ (Langer), వంటి ఇటీవలి పాశ్చాత్య సౌందర్యవాద తాత్వికులు (Aesthetic
Philosophers) ఈ పర్యవసానానికే వచ్చారు.
ఐతే, ఈ
కవిత్వానుభవం వివరణ ద్వారా కాని, ఆలోచన ద్వారా కాని, అలంకారాల ద్వారా కాని, ప్రవచనాల ద్వారా కానీ,
అభివ్యక్తీకరించబడదు. దీనికి పదచిత్రం (image) ఒక్కటే సాధనం. ఆ ప్రత్యేక కవిత్వానుభూతితో స్పందించే పదచిత్రమొక్కటే ఈ
హైకూ అనుభవాన్ని పట్టివ్వగలదు.
పదచిత్రమనేది
ఐంద్రియకం(sensuous).
ఇంద్రియ జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. హేతుబుద్ధికి సంబంధించింది
కాదు. లోతైన అనుభూతుల్నీ(feelings), భావాల్నీ(emotions)
ఆవాహించే శక్తి పదచిత్రానికుంది. కవిత్వానుభవాన్ని పద చిత్రాలు
స్ఫురింపచేసినట్లు బౌద్ధికమైన ఆలోచనలు స్ఫురింపచేయలేవు. కనక, హైకూ ప్రాణం పదచిత్రంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. మూర్తమూ (concrete),
ఇంద్రియ గ్రాహ్యమూ ఐన పదచిత్రం ఏ విధమైన వివరణ సహాయం లేకుండా హైకూలో
భాసిస్తుంది.
ఉదాహరణకి
హైకూ కవితా పితామహుడు, 17వ శతాబ్దంలో జీవించిన
జపానీయ కవి ‘బషో’ ప్రసిద్ధ హైకూ
ఎండిపోయిన
కొమ్మమీద
కాకి ఒంటరిగా కూచుంది,
చలికాలపు సాయంత్రం.
కాకి ఒంటరిగా కూచుంది,
చలికాలపు సాయంత్రం.
ఈ
పదచిత్రంలో ఇచ్చిన మూడు వస్తువులూ – ఎండిపోయిన కొమ్మా,
ఏకాకి కాకీ, చలికాలపు సాయంకాలమూ – ఒకే రకమైన అనుభూతిని ప్రసరిస్తున్నాయి. ఈ మూడింటినించి సమానంగా ఉబికే
అనుభూతి గాఢతకు మనం చలించకుండా ఉండలేము. ఈ మూడు మూర్తమైన వస్తువుల ద్వారానే ఆ
హైకూలోని చలికాలం సాయంత్రపు ఒంటరితనపు దిగులుని అనుభూతించగలుగుతున్నాం. ఇది వేరే
విధంగా, అంటే వట్టి బౌద్ధిక ప్రక్రియలద్వారా సాధ్యం కాదు.
ఇది ప్రత్యక్ష ఐంద్రియక అనుభూతి. ఇది ఆత్మాశ్రయం కాదు. మనస్సూ, వస్తువూ, రెంటి కలయిక వల్ల ఉద్భూతమైంది.
విశ్వహృదయంలో ప్రవేశించి, దానిలో ఐక్యమవటమంటే ఇదే.
హైకూలో మనకు
కనిపించేవి ప్రత్యేక ప్రాకృతిక దృశ్యాలైనా, వాటి
ద్వారా మనం సార్వత్రిక భావాల్ని అందుకోగలుగుతున్నాం. ప్రతి విశేష (particular)
వస్తువు వెనకా సార్వత్రిక(universal) సత్యం
దాగి ఉంటుంది. విశేష, సార్వత్రికాల సమ్మేళనమే హైకూ. విశేష
అనుభవాల నించి సార్వత్రిక సత్యాలకు చేరవేస్తుంది.
ఆత్మ, ప్రకృతుల
కలయిక వల్ల సాధించే ఇటువంటి దర్శనాన్ని అభివ్యక్తం చెయ్యటానికి హైకూయే సరైన రూపమని
అభిజ్ఞుల అభిప్రాయం. హైకూ అనుభవం వంటి ఆత్మిక అవిష్కృతి కొన్ని క్షణాలకన్నా
ఎక్కువసేపు నిలవదు. దాని అభివ్యక్తికి మూడు పాదాల హైకూ సరిపోతుంది.
17 వర్ణాల
నియమం తెలుగులో పాటించడం అసాధ్యం. జపానీయ భాషలో ఏకవర్ణ పదాలెక్కువ. తెలుగులో
బహువర్ణ పదాలు జాస్తి కనక, జపానీయ భాషను అనుకరించటం తెలివి
తక్కువ.
బషో
చెప్పినట్టు వెదురుచెట్టు గురించి తెలుసుకోవాలంటే, నీ
మనస్సునీ, ఆలోచనల్నీ త్యజించి, వెదురులోకి
ప్రవేశించు. ఇది హైకూ మార్గం.
నిజంగా హైకూ
అనేది పద్యం కాదు; సాహిత్య ప్రక్రియే కాదు. అది సైగ చేస్తున్న
చెయ్యి; సగం తెరిచిన ద్వారం; శుభ్రంగా
తుడిచిపెట్టిన అద్దం; ప్రకృతికి తిరిగి వెళ్ళే మార్గం. మన
సహజ తత్వానికీ, జలతత్వానికీ, ఆకాశతత్వానికీ,
ఒక్కమాటలో చెప్పాలంటే, మన బుద్ధ తత్వానికీ
తిరిగి వెళ్ళే మార్గం.
“జెన్”
అనే పదాన్ని రెండర్థాలలో ఉపయోగిస్తుంటారు : 1. ప్రాకృతిక వస్తువులతో ఐక్యమౌతూనే మన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే
మనఃస్థితి. 2. బౌద్ధ తాత్త్వికుడైన బోధిధర్ముడు (క్రీ.శ. 470-534)
మహాయాన సిద్ధాంతాలను నిత్య జీవితానికి అన్వయించిన పద్ధతి.
నిజానికి
జెన్ అనేది ఒక జీవిత పద్ధతి. మన నిత్య జీవితంలో ప్రతి ఆచరణలో, ప్రతి
క్షణమూ అనుసరించదగ్గది. ఈ తాత్త్విక వైఖరి జపాన్ జాతి జీవనంలోనే గొప్ప మార్పు
తీసుకువచ్చింది. ఒక మహత్తరమైన సంస్కృతిని సృష్టించింది. సామాన్యజనం మనస్తత్వాన్ని
కూడా సున్నితపరిచింది. ఒక జాతి జాతినీ సౌందర్యారాధకులుగా మలిచింది.
దీన్ని
బట్టి ఒక విషయం సులువుగా బోధపడుతుంది. ఎవరుపడితే వారు హైకూ రాయలేరు. దానికి ఒక
విధమైన మానసిక వైఖరి కావాలి. ప్రకృతి యెడల అపారమైన ప్రేమా, అంతర్ముఖత్వమూ,
రెండూ ఏకకాలమందు అవసరం. ప్రాపంచిక లంపటాలయందు విముఖత్వమూ, ప్రశాంతమైన మనఃస్థితీ, సుకుమారమైన అనుభూతీ, ప్రపంచం నశ్వరమనే అవగాహనా, దాని నుంచి ఉబికిన జాలీ –
ఇటువంటి మానసిక లక్షణాలున్నవారు కాని హైకూ రాయలేరు.
కనక
మిత్రులు ప్రసాద్ గారు ‘నేను హైకూలు రాశాను. చూస్తారా?’
అని అడిగినప్పుడు నాకేమీ విస్మయం కలగలేదు. స్వభావరీత్యా హైకూ
రాయగలిగిన చాలా కొద్ది మంది కవుల్లో ఈయనొకరు.
వర్షం
క్షణం పూచే నీటి పూలతో
ఊరు నిండిపోయింది.
క్షణం పూచే నీటి పూలతో
ఊరు నిండిపోయింది.
అనటంలో
చేతనా సౌకుమార్యమూ, సౌందర్యం క్షణికమనే అవగాహనా, దీన్నించి పుట్టిన ఒక విషాదమూ స్ఫురిస్తాయి. సుకుమారమైన అనుభూతిని జెన్
రసజ్ఞులు ‘మియాబీ అంటారు. సౌందర్యపు క్షణికత్వాన్ని
తెలుసుకున్నప్పుడు కలిగే దిగులుని ‘అనారే’ అంటారు.
గోడలో పూచిన
పూవు
పరిచయం చేసింది
మా గోడను.
పరిచయం చేసింది
మా గోడను.
ఇంతకాలం
ఉపేక్షించిన గోడని ఆకస్మికమైన, క్షణికమైన పూవు పరిచయం
చేసింది. హైకూలాగే! కవిత్వానుభూతీ, పదచిత్రాల సమన్వయం ఇక్కడ
మీరు గమనిస్తారు. ద్రష్టా, దృశ్యమూ అనుభూతి ఏకతా సాధించాయి.
పూవు లేదు
నేను లేను
సౌందర్యం ఆవరించింది.
నేను లేను
సౌందర్యం ఆవరించింది.
ఇదే జెన్
సమాధి!
ఎప్పుడూ
విస్మయంతో
పూలని నేను
నన్ను పూలూ
పూలని నేను
నన్ను పూలూ
ద్రష్టకీ, దృశ్యానికీ
తేడాయేమిటి?
ఈ హైకూ
పుస్తకం వానతో మొదలై, చివర్న వానతో ముగుస్తుంది.
నాకు మల్లేనే ప్రసాద్ గారికి వానంటే ఇష్టమనుకుంటాను.
వాన
వెలిసింది
తీగపై
చిన్నిప్రపంచాలు వేలాడుతున్నాయి.
తీగపై
చిన్నిప్రపంచాలు వేలాడుతున్నాయి.
ఒక జెన్ “కోఅన్”
(ప్రహేళిక) ఉంది. శిష్యుడు గురువుగారిని ప్రశ్నించాడు. ‘స్వామీ, తమరింత స్పష్టంగా ఎలా చూడగలుగుతున్నారు?’
సమాధానం : ‘కళ్ళు మూసుకున్నాను కనక.’ బైటి కళ్ళు మూసుకొని, లోని కళ్ళు తెరిస్తే కాని హైకూ
రాయలేరు.
(శ్రీ బి.వి.బి. ప్రసాద్ ‘దృశ్యాదృశ్యం’ కు భూమికగా రాసిన వ్యాసం)
(ఇస్మాయిల్ గారికి,. బివివి ప్రసాద్ గారికి కృతజ్ఞతలతో)
No comments:
Post a Comment