Pages

30 June 2012

మనకో బాల్యం వుండేది

మనం ఆడిన ఆటల గుర్తుపడతారా మీరు, పేర్లు రాయగలరా ?



అప్పుడెప్పుడో ,
మనకో బాల్యం వుండేది,
మన సొంతమైన, ఓ అందమైన చిన్నతనం
మనల్నిప్పుడు చిన్నబుచ్చే ,
అందకుండా ఊరించే,
జీవితపు గొప్పదనం.

నిక్కర్లు,
లంగా,జాకెట్లు,
ఫ్రాకులు, టీ షర్ట్ లు
వాటి కోసం ఏడుపులు,
కొట్లాటలు,అలగడాలు.
ఏమైన గుర్తొచ్చాయా, మీకు.

ఎండాకాలం సెలవలు,
ఎండి పోయిన చెరువుల్లో ఆటలు,
అమ్మమ్మ, నాయనామ్మల ఇల్లు,
తిరగలి మోతలు, జొన్నరొట్టెలు,
ఇంటి ముందు అరుగులు,
అరుగుల పై మాటలు,
ఏమైన గుర్తొచ్చాయా, మీకు.

చెప్పులు లేకుండా పరుగులు,
కోతికొమ్మచ్చిలు,
వెన్నెల్లో దొంగ – పోలీస్ పాట్లు,
గోడలపై మనం చేసిన ఫీట్లు,
తేలు కుట్టిన గాట్లు,
అగ్గి పెట్టె ఓకులు,గోళీల గొడవలు,
వంగుల్లు, దూకుళ్లు,
ఏమైన గుర్తొచ్చాయా, మీకు.

(మీ అనుభూతులు రాస్తే వీటికి కలుపుతానండి) 


29 June 2012

ఒకానొక ఫీలింగ్ – 24

నిను చేరిన, ఆ నిదురను
ఆపలేక ఆపకుంటే,
కళ్ళు తుడిచి, చెరపకుంటే,
నా వడిలో ఆదమరిచి,
నిదురించ నీవు వస్తే,
లాలించి, జోలపాడి,
వాలుతున్న నీ కనులను,
ప్రేమ తోటి ముద్దాడి,
నీ కోసం నే పాన్పుకానా, సుమా.

28 June 2012

జ్ఞాపకాల దివ్వె


సంధించిన
సంధిగ్ధపు
ఆలోచన రూపు నీవు.
సంఘర్షణ
సమరానికి
అంకురాగ్ని నీవు.
జారుతున్న
కాలానికి
జ్ఞాపకాల దివ్వె నీవు.

ఒకానొక ఫీలింగ్ – 21



నాకేదో కావాలని,
వెంటాడి,వేటాడి
అవిశ్రాంతంగా
వెతుకుంటున్నప్పుడు,
నాకేమి ఇవ్వలేదది.
అన్ని వదలి,
విశ్రాంతిగా, సేదతీరుతున్నప్పుడు,
పెనుగాలై, చుట్టుకుంటుందది.

27 June 2012

చెరగని నవ్వు నీది,


చెరగని నవ్వు నీది,
చెదిరిన మనసు నాది.
తేలికయిన మనసు తోటి,
తుళ్లుతున్నవలపు నీది.
భారమైన వేదనతో,
కుంగుతున్నమనసు నాది.
ఆ నింగిని తాకేటి,
      మధురమైన ఊహ నీది.
అగాధపు లోతుల్లో,
శిధిలమైన మనసు నాది.

26 June 2012

జర్నీ


ఒక సుదూర ప్రయాణం,
ఎడతెగని ప్రణయం ఇది.

సాగుతూనే వుందిది,
కీకారణ్యపు చిక్కులతో,
ప్రయాసభరిత మార్గాలలో.

అనేకానేక అవాంతరాలను అధిగమించి 
కఠిన శిలా పరివేష్ఠిత పర్వత శ్రేణులను
అధిరోహించి మాత్రమే
ఆ స్వామిని సమీపించినట్లు
అవును, ఈ యాత్ర సంక్లిష్టమైనదే.

అవధులు లేని అంతరాళాలలో,
అదృశ్య తీరాలకు,వొంటరి లోకాలకు
ఓ దారి తప్పిన శకలం,
నిర్జర నిశీధీ రోదసీలలో,
అనంతానంత దూరాలకు సాగినట్లు...
అవును, ఈ యాత్ర సుధీర్ఘమైనదే.

తల్లి గర్భంలోకి, ప్రవేశించక పూర్వం
బయటి ప్రపంచాలలో,
హాయిగా, ఆనందంగా
విహరించడం కాదు కదా ఇది.

25 June 2012

ఓ మంచి పాఠం,ద్విపదలు



ఓ మంచి పాఠం నేర్పిపోయింది.
గత కాలపు చేదు కష్టం.
=============
నరనరాల్లో నింపింది, విధేయత.
బానిస మనసు చదువులివి.
===============
చదువిచ్చింది ఏమోగాని,
అనుభవం జీవితాన్నిచ్చింది.
================
ఎవరబ్బా, ఈ దారి వేసింది ?
కొండెక్కుతుంది, చదువు.

24 June 2012

స్వాతంత్ర్య భారతదేశపు తొలి నాణేలు కథ.



ఆగస్ట్ 15,1947 మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికి, 1950 వరకు దేశంలో బ్రిటిష్ నాణేలే వాడుకలో వుండేవి. మొదటిసారిగా 1950 ఆగస్ట్ 15 న, అశోకుని స్తూపం లోని  గుర్తులతో తో మన తొలి నాణేలు మెట్రిక్ విధానంలో విడుదల చేయబడ్డాయి.
1950 నుంచి1957 వరకు వున్న ఏడు రకాల నాణేలను ఫ్రోజోన్ సీరీస్ (The Frozen Series 1950-1957 )గా వ్యవహరిస్తారు. వాటి లోని నాణేలు

1. ఒక రూపాయి నాణెము .


one rupee reverse.

one rupee obverse.

ఇది నికెల్ తో తయారైన నాణెము. దీని పైన ఒక వైపు మన జాతీయ చిహ్నం, మరో వైపు ధాన్యపు కంకి గుర్తు వుండేది.

2. అర్థ రూపాయి(8annas) నాణెము.( పై వివరణ దీనికి కూడా)



3. పావు రూపాయి (4 annas )నాణెము( పై వివరణ దీనికి కూడా)


4. రెండు అణాల నాణెము


ఇది క్యూప్రోనికెల్ తో తయారైన నాణెము. దీని పైన ఒక వైపు మన జాతీయ చిహ్నం, మరో వైపు ఎద్దు వుండేది.
ఎద్దు కూడా అశోకుని స్థూపం నుంచి తీసుకున్నదే.



5. ఒక అణా నాణెము. ( పై వివరణ దీనికి కూడా)



 6. అర్థ అణా నాణెము. ( పై వివరణ దీనికి కూడా)





7. ఒక పైస్(Pice)  నాణెము.

Bronz
గుర్రం కానీలనే వారు వీటిని. ఇది కాంస్యం తో తయారైన నాణెము. దీని పైన ఒక వైపు మన జాతీయ చిహ్నం, మరో వైపు గుర్రం వుండేది.
గుర్రం కూడా అశోకుని స్థూపం నుంచి తీసుకున్నదే.

ఈ అణాల లెక్క చూద్దాము   ఒకసారి.
ఒక రూపాయికి పదహారు అణాలు. (1 Rupee = 16 Annas)
ఒక అణాకు నాలుగు పైస్(పావు అణాలు)(1 Anna = 4 Pice)వీటిని కానీలు అంటారు.
ఒక పైస్ కు మూడు పైసాలు. (1 Pice = 3 Pies)వీటిని దమ్మిడిలు అంటారు.
మొత్తం మీద రూపాయికి 64 కానీలు లేక 192 దమ్మిడిలు  వస్తాయి. దమ్మిడిలు అన్ని నాణేలలో తక్కువ విలువ కలిగినవి." దమ్మిడి కి కొరగాడు" అనే మాట మనం కూడా విన్నదే కదా. వీటిని మనం ముద్రించలేదు.
కొంచం తికమకగానే వుంటుందిప్పుడు, ఈ లెక్క.
ఈ తలనొప్పులు ఎందకనేమో, 1957 నుంచి రూపాయికి వంద పైసల లెక్కకి వచ్చేసాం(దశాంశ పద్దతికి).


22 June 2012

నేను అలానే : సారా టీజ్డేల్



కల్లోల కడలి లో,
వదలి వెళ్ళారు, నా వాళ్ళు.
నాకో నామాన్ని, ఈ రూపాన్ని,
హృదయనాదాన్ని,
వణికిపోతున్న ఓ ఆత్మదీపాన్ని,
నాకు అప్పగించి.

ఏ నిశీధీ తీరాల్లోకో,
చేరాల్సిన ఆ జ్యోతి,
ఇంత ఉజ్వలంగా,
దేదీప్యమానంగా ప్రకాశిస్తుందంటే నేడిలా,
నన్ను హృదయానికి,
ప్రేమగా హత్తుకున్న వారిదే కాని ఆ ఖ్యాతి,
సమాధుల్లో నిద్రిస్తున్న,
రక్తబంధాలది కాదు అని,
చెప్పగలను నేను, నిశ్చయంగా.

అస్థిత్వమే లేక రగులుతున్న,
ఓ మామూలు కొయ్య ముక్క,
కొట్టుకొనిపోతూ కూడా,
సముద్రపు నీలి అలల మధ్య,
రాత్రింబగల్లు,
ప్రకృతి అద్దిన సౌందర్యంతో,
కొత్త కాంతులు ఎలా వెదజల్లుతుందో,
అద్భుత దృశ్యాలకు ప్రతీకగా,
ఎలా నిలుస్తుందో,
నేనూ అలానే........
------------------------------------

(ఇది  నా తొలి అనువాదము, ప్రేరణ ఇచ్చింది N. S. మూర్తి గారి అనువాదలహరి బ్లాగ్. 

స్వేచ్చానువాదమో, అను సృజనో, ఏమంటారో నాకు తెలియదు కాని, నా పైత్యం కొంత కలసిపోయింది దీనిలో. సారా టీజ్డేల్ గారికి, N. S. మూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.)

Driftwood… Sara Teasdale




My forefathers gave me

My spirit’ shaken flame,
The shape of hands, the beat of heart,
The letters of my name.


But it was my lovers,
And not my sleeping sires,
Who gave the flame its changeful,
And iridescent fires.

As  the driftwood burning,
Learned its jeweled blaze
From the sea’s blue splendor
Of colored nights and days.

14 June 2012

ఒక హంబుల్ బిగెనింగ్


మెల్లమెల్లగా, మొత్తంగా
మొద్దు బారుతున్నట్టున్నా.....
ఏవేవో బంధాలు, సంబంధాలు,
నావి కాని అనుబంధాలు.......
స్పందనా రహిత తీరాల వైపుకి
బరబర ఈడ్చుకెల్తున్నట్లున్నాయ్.

అగోచరమైన సరిహద్దులేవో,
గోడలై అడ్డుపడుతున్నాయ్.
లోపల్లోపలే,
పొరలు పొరలుగా,
పేరుకుపోయిన స్వార్ధాల్ని,
ఘనీభవించిన స్తబ్ధతల్ని,
బద్దలుకొట్టుకుంటూ,
కోడిపిల్లలా,
ప్రకృతిలోకి పరుగెత్తలనిపిస్తుంది.

ఓ కొత్త ఐడెంటిటి కోసం.
సరికొత్త మన కోసం.
మనదైన జీవితం కోసం.
ఒక హంబుల్ బిగినింగ్ తో.
========================
next post :  భగ్నప్రేమ లేఖ (సుమనోగతం)

13 June 2012

గోదాట్లో వెన్నల,ద్విపదలు



మానవత్వం ముఖం చాటేసింది.

కాటువేసిందా,కులసర్పం

==============
మెరుగైన సమాజమంటే,
మాటల్ని అమ్ముకోవడమేనా ?
==============
కాలు తగిలి రాయి వనితయ్యిందా ?
ఇప్పుడైతే పుండైదేమో,...
===============
నీ నవ్వు గోదాట్లో వెన్నలన్నా,
పాపం పిచ్చిది, గుండెల్లో గుడి కట్టింది.

12 June 2012

ఈ బంధం దృడమైనది....


నేను చెప్పింది,
నీకు అర్ధం కాదో,
అర్ధం కానట్టు నటిస్తావో,
నా కెప్పటికి అర్ధం కాదు.
మాట్లాడుకుంటూనే వుంటాం,
నవ్వుకుంటాం, తిట్టుకుంటాం.
అద్భుతంగా కలసి
జీవిస్తూనే వుంటాం కదూ,
మనమెప్పుడూ...
ఒకే తలుపుకి చెరో పక్క,
గడియలు పెట్టుకొని.

11 June 2012

ఒకానొక ఫీలింగ్ – 19


కన్నీటి చుక్క ఒకటి,
చెక్కిలి పై జారుతుంటే,
ఎలాగోలా,సేకరించగలిగాను.

ఆనందభాష్పాలు రాలుతుంటే,
ఏరి జాగ్రత్త పరచగలిగాను.

కాలం చెక్కిలి పై జారి,
గతం రాలి పోతుంటే,
నిస్సహాయంగా మిగిలిపోయాను.

10 June 2012

గత 86 సంవత్సరాలలో బంగారం ధరల్లో మార్పులు.








కొద్ది సంవత్సరాలుగా బంగారం ధర పెరుగుతూనే వుంది.

1925 లో 10గ్రాముల బంగారం రూ18.75 పై మాత్రమే.

మొదటి సారిగా 50 రూపాయలు దాటింది 1943 లో. 

1959 లో వంద రూపాయలను, 1980 లో వేయి 

రూపాయలను, 2007 లో పదివేల రూపాయలను, 2011 

లో ఇరవై వేల రూపాయలను, 2012 లో ముప్పైవేల 

మార్క్ ను అధిగమించింది. 2000 సం నుంచి 2007 సం 

మధ్య బంగారం కొన్నవారు ఎక్కువ లాభాలు ఆర్జించినట్లు

 కనిపిస్తుంది. కొన్ని సార్లు అనిపిస్తుంది, వృధాగా బట్టలు, 

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కంటే బంగారమే మేలని. 

9 June 2012

ఒకానొక ఫీలింగ్ – 18


ఈ నిశీధి జీవితాన,
కాంతి కిరణమవుతావని,
కలలు కంటూ,
కవితలల్లితే,
మెరుపల్లే మురిపించి,
గాఢాంధకారమే, మిగిల్చావా !!  సుమా,
నువ్వు నాకు.

ఒకానొక ఫీలింగ్ - 17


అలా చూస్తావెందుకు ?
జ్వలించే అగ్నిలా, కోపంగా.

అది గుండెల్లో గుచ్చుకొని,
మస్తిష్కంలో ఏదో నరం కదిలి,
ఉత్సాహం ఆవిరై,
కన్నీరొలికి,
నిస్సత్తువ ఆవరిస్తే,

అలా చూస్తావెందుకు ?
ప్రభాత హిమపాతమై, జాలిగా.

8 June 2012

ఇదో ...బ్రతుకు,,,.......kavitha-20,,,


దేనికో ఒకందుకు,
నిరంతరం నన్ను నేను,
నిందించుకోంటూ వుండాల్సిందే.

అర్ధం లేని ప్రశ్నలతో,
జీవిత పరమార్ధం కోసం,
అనుక్షణం, నన్ను నేను,
వేధించుకొంటూ వుండాల్సందే.

సర్దిచెప్పుకుంటూ,సమర్దించుకొంటూ,
నన్ను నేను, దహించుకొంటు,
మౌనంగా కన్నీటి రాత్రులలో
నలిగిపోవలసిందే.
ఎవడికో ఒకడికి,
నన్ను నేను అప్పచెప్పుకోవలసిందే.

అలవికాని భారాలను పైకెత్తుకొని,
ఏ శోధనలనో భరిస్తూ,
ఎడతెగని రాపిడికి,
నాలో నేను, కుమలాల్సిందే,
స్వప్నాలతో సంభోగిస్తూ,
నాలో నేను, కలవాల్సిందే,
క్షుభితనై, భ్రష్టనై
నా లోకి, నేనే.