Pages

20 November 2012

ఒక మంచి కవిత ,. నేనూ - నా దేవుడు.


కవి - ఖాదర్ మోహిద్దీన్
1
చడీ చప్పుడూ లేకుండా నేనే 
చక్కా వెళ్లి చక్కిలిగిలి పెట్టి వచ్చాను


నా దేముడు నవ్వుతున్నాడు
నవ్వులు నవ్వులు నవ్వులు గా
నా దేముడు పరవశిస్తున్నాడు
పువ్వులు పువ్వులు పువ్వులుగా
నా దేముడు పరిమళిస్తున్నాడు
 
2
నా దేముడు
తన బట్టలు పాపం
తనే ఉతుక్కుంటున్నాడు
ఈ రోజు నేను పునీతున్ని అవుతున్నాను
 

నా దేముడు
అమ్మమ్మ చెబుతూన్న పేదరాసి పెద్దమ్మ కథని
శ్రద్ధ గా ఆలకిస్తున్నాడు
ఈ రోజు నా దేముడు హాయిగా
ఆదమరచి నిదుర పోతాడు
 

4
నా దేముడు
హాయిగా కలగంటున్నాడు
ఆయన కలలోకి నేను అడుగు పెట్టాలి
ఆ హాయి నా పెదవులపై దరహాసమై వెలగాలి
నా దేముని కల సెలయేరులా సాగాలి
 

5
పాపం నా దేముడు
పదే పదే అలసిపోతున్నాడు
పసి పిల్లలు ప్రతి రోజూ
రాళ్ళు మోస్తూన్నారు
 

6
నా దేముడు
అశాంతితో అలమటిస్తున్నాడు
అయినదానికీ , కానిదానికీ నేను
ఆయనను అర్ధించటం మానివేశాను
 

7
నాట్యం చేస్తున్నాడు నా దేముడు
ఆయన చెవుల నిండా
పసిపాపల నవ్వుల పువ్వులు
 

8
నా దేముడు
క్షమాభిక్ష కోసం నా ప్రార్థన
ఆసక్తిగా ఆలకిస్తున్నాడు
నేనేమో మరికాసిని పాపాల కేసి
ఆబగా చూస్తున్నాను
 

9
నా దేముడు
అందరి పనులూ
అస్తమానం తనే చేస్తుంటాడు
మన పనులు మరెవరూ మనలా చేయనే లేరని
ప్రతీసారీ మనం ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాం
 

10
నా దేముడు అన్నీ తెలిసీ
అడుగుతున్నాడు నన్నే ప్రతిదీ
చెప్పేస్తూనే ఉంటాను ఏది అడిగినా
నాకు మాత్రమే తెలిసినట్టు


11
నా దేముడు నా ఇంటికి
ఎంచక్కా కిటికీలు బిగిస్తున్నాడు
ఇపుడు నా కళ్ళకు ఆకాశం
ఎంత స్పష్టంగా కనిపిస్తుందో !


12
ప్రతీ మెతుకు మీదా నా దేముడు
నా పేరును లిఖిస్తున్నాడు
నేను మాత్రం ఎప్పటిలాగానే
నా కష్టార్జితం అనే భ్రమతోనే సుఖిస్తున్నాను
 
13
నా దేముడు అస్తమానం
నన్నే తలచు కుంటున్నాడు
నేనేమో నిత్యం సిగ్గుతో తల వంచుకుంటున్నాను


14
నిజానికి నేనూ - నా దేముడూ సయామీ కవలలం
నేనూ - నా దేముడూ నింగీ నేలలం
నేనూ - నా దేముడూ సృష్టి అనే నాణానికి బొమ్మా బొరుసులం
నేనూ- నా దేముడూ చీకటీ వెలుగులం
నేనూ - నా దేముడూ .....
------------------------------------------------------------
విజయవాడ కి చెందిన ఖాదర్ మోహిద్దీన్ , పుట్టుమచ్చ బ్లాగ్ లోనుంచి సేకరించిన కవిత ఇది,. నాకు చాల చాలా నచ్చిన కవితలలో ఇది ఒకటి,  మీకు నచ్చుతుందని ఇలా ,.

1 comment:

  1. పద్మార్పిత గారు, ధన్యవాదాలండి, మంచి కవితను మెచ్చినందకు.

    ReplyDelete