Pages

26 November 2012

టీచర్ ను చూద్దామని.....( ఒక పేరడి )



అంత గొప్ప టీచర్ ఎలావుంటాడో చూద్దామని అతని ఇంటికి వస్తారు

అక్షరాలకి జీవంపోసి దయ నింపేవాడూ
మెదళ్లని శుభ్రం చేసి సౌందర్యం అద్దేవాడూ

వాక్యాలని బండగా లోపలకి కుక్కి ,
స్వప్నాలను  గునపాలతో పొడిచి నిద్రలేపేవాడు.

ధైర్యంగా, అందంగా, చురుకుగా ఉండివుంటాడని 
తమ లోపలి భావాన్ని వెలుపల ధ్రువపరచుకోడానికి అతన్ని చూడబోతారు

రోజూ చూసే ఇంటిలోని, వీధిలోని మనుషుల్లో ఒకడుగానే 
ఆ టీచర్ వాళ్ళకి ఎదురౌతాడు
పెరిగిన గడ్డం, నోట్లో బ్రష్ , అడ్డదిడ్డంగా కట్టిన లుంగీ ,భుజం మీద తువ్వాలుతో, వాళ్లవిడను తిడుతూనో,వంటింట్లో కాఫీ కలుపుతూనో,..

అసహనం, ఆదుర్దా, బద్దకం,స్వార్థం, చిట్లిన ఆశలు,
లాంటివి కొంచంకొంచెం అద్దుకుని,

ఎపుడూ చూసే నమూనాల్లో ఒకడుగానే టీచర్ వాళ్ళతో మాట్లాడతాడు



ఇతనూ మనలాంటివాడే కదా అనుకొంటూ 

భ్రమలు చెదిరి , పిచ్చి నవ్వొకటి నవ్వుకొంటారు. 
బహుశా, చదవు చెప్పేది ఇతను కాదేమో,..
ఏ దివ్యభయాలో ఇతన్ని వశపరచుకొని, వాహిక చేసుకొన్నాయని 
తాజా సమాధానంలోకి నిదానంగా తేటపడతారు 

ఉపాధ్యాయుడిని  నిజంగా ఎవరు కనిపెట్టగలరు 
పైపై నడతల నివురు లోపలి మూర్ఖత్వపు బొగ్గుని ఎవరు తాకగలరు 
తన కోపాగ్ని ఎవరినీ దహించరాదనే ,ఎవరి వీపు చీట్లరాదనే,

దయచేత నటిస్తున్నాడని తెలుసుకోగలరు

తనలో నిదానంగా ఫలదీకృతమౌతున్న రేపటి పిల్లల భవిష్యత్తుని,

అతను మొరటుగా మట్టిలా దాస్తున్నాడని ఊహించగలరు 

అతనిలాంటి మరొక టీచరు మినహా, బాధిత పిల్లల మినహా 
అతని అంతరంగంలోకి సునాయాసంగా ఎవరు చొరబడగలరు

అందుకే చూడవచ్చిన వాళ్లకి వీడ్కోలు చెబుతూ 
'మీరు రావటం సంతోషం, మళ్ళీ కలుద్దాం ' అని టీచర్ అంటున్నపుడు
అతని కళ్ళవంక ఎపుడూ చూడకండి 
బుగ్గి పాలైన వేలాది పిల్లల  బెంగ వాటిలో ముసురుకొని వుంటుంది.
------------------------------------------------
బి.వి.వి.ప్రసాద్ గారు, ఆకాశం కవితా సంపుటికి ఇస్మాయిల్ అవార్డ్  అందుకొన్న మంచికవి. వారు రాసిన కవిని చూద్దామనికి పేరడిగా రాసినదే పైన మీరు చదివింది,.ఒక విలక్షణ శైలిలో సాగిపోయే వారి అసలు కవిత ఇది.

బివివి ప్రసాద్ ll కవిని చూద్దామని ll


కవి ఎలావుంటాడో చూద్దామని అతని ఇంటికి వస్తారు
అక్షరాలకి జీవంపోసి దయ నింపేవాడూ
పదాలని శుభ్రం చేసి సౌందర్యం అద్దేవాడూ

వాక్యాలని నిద్రలేపి స్వప్న సంచారం చేయించేవాడూ

దయగా, అందంగా, చురుకుగా ఉండివుంటాడని 
తమ లోపలి కవిని వెలుపల ధ్రువపరచుకోడానికి అతన్ని చూడబోతారు



రోజూ చూసే ఇంటిలోని, వీధిలోని మనుషుల్లో ఒకడుగానే 
కవి వాళ్ళకి ఎదురౌతాడు
కాస్త నమ్రతా, గర్వం, మరికాస్త జాలీ, కోపం 
కొంచెం లౌక్యం, కొంచెం భోళా 
ఎపుడూ చూసే నమూనాల్లో ఒకడుగానే కవి వాళ్ళతో మాట్లాడతాడు



ఇతనూ మనలాంటివాడే కదా అనుకొంటూ 
భ్రమలు చిట్లిన నవ్వొకటి నవ్వుకొంటారు 
బహుశా, రాస్తున్నది ఇతను కాదు
ఏ దివ్యభావాలో ఇతన్ని వశపరచుకొని, వాహిక చేసుకొన్నాయని 
తాజా సమాధానంలోకి నిదానంగా తేటపడతారు 



కవిని నిజంగా ఎవరు కనిపెట్టగలరు 
పైపై నడతల నివురువెనుక తేజోరాశిని ఎవరు తాకగలరు 
తన అగ్ని ఎవరినీ దహించరాదనే దయచేత నటిస్తున్నాడని తెలుసుకోగలరు
తనలో నిదానంగా ఫలదీకృతమౌతున్న రేపటి కవితల్ని 
అతను మొరటుగా మట్టిలా దాస్తున్నాడని ఊహించగలరు 
అతనిలాంటి మరొక కవి మినహా, కవిత్వప్రేమికుడు మినహా 
అతని అంతరంగంలోకి సునాయాసంగా ఎవరు చొరబడగలరు



అందుకే చూడవచ్చిన వాళ్లకి వీడ్కోలు చెబుతూ 
'మీరు రావటం సంతోషం, మళ్ళీ కలుద్దాం ' అని కవి అంటున్నపుడు
అతని కళ్ళవంక ఎపుడూ చూడకండి 
తనని వాళ్ళు చూడలేకపోయారన్న బెంగ వాటిలో ముసురుకొని వుంటుంది


వారి కవితలు చదవాలనుకుంటే  లింక్   

6 comments:

  1. emti saar maameedapaddaaru ?

    ReplyDelete
  2. దుర్గేశ్వర గారు బ్లాగు కి స్వాగతం,..నేనూ టీచరేనండి,.ఏదో సరదాగా రాశానండి,..

    ReplyDelete
  3. అతని కళ్ళవంక ఎపుడూ చూడకండి
    తనని వాళ్ళు చూడలేకపోయారన్న బెంగ వాటిలో ముసురుకొని వుంటుంది


    adbuthamgaa raasaru prasad gaaru.manchi poem present cheinanduku meeku thanks bhaskar

    ReplyDelete
  4. nenu upayoginchina padalu saripovu aa bhaavaniki .good bhaskar

    ReplyDelete
    Replies
    1. తనోజ్, ధన్యవాదాలు,..ప్రసాద్ గారి బ్లాగ్ లోని కవితలు చదవండి,..చాలా బాగా రాస్తారు వారు.

      Delete
  5. emmana varnisthaara meeru.......nijanga bagunnayi mi postlu

    ReplyDelete