Pages

22 September 2012

నేనెలా నిష్క్రమించగలను, సుమా....

అలలుఅలలుగా,
తెరలుతెరలుగా,
ఏ వెన్నల నవ్వులైతే,
అలా పరుచుకుని,
ఈ శూన్య హృదయాన్ని,
జీవజలంతో నింపుతాయో....
నా ఆనందాలన్నింటిని మోసుకొని,
ఏ మోము అయితే,
ఈ చుట్టుపక్కలే తిరుగుతూ,
ఉల్లాసాన్ని నాపై పన్నీరులా చిలుకరిస్తుందో.....
అలాంటి, నీ సమక్షాన్ని వదలి,
నేనెలా నిష్క్రమించగలను, సుమా....
నేనిక్కడనుంచి.

21 September 2012

దేశమును ప్రేమించుమన్నా,,,,,


అవినీతి వటవృక్షపు ఊడలు,
నరనరాల్లో చొచ్చుకుపోతూ,
ఆకాశంలా విస్తరిస్తున్నప్పుడు.....
అసత్యపు పలుకులు
ప్రియమైన సత్యాలై,
అనుక్షణం హృదయాన్ని,
అగ్నిలా లోభరుచుకుంటున్నప్పుడు......
ఎదుటివాడిని ద్వేషించడమే,
దేశభక్తిగా కీర్తించబడుతున్నప్పుడు...
ఎవరెవరి కారణాలకో,,
లక్ష్యమే తెలియని అమాయకులు బలవుతున్నప్పుడు...
దేశం ముసుగులో,
సమాధులు మాత్రమే
నిర్మించబడుతున్నప్పుడు.........
దేశాన్ని ప్రేమించడమంటే,
తోటి మనిషిని ప్రేమించడం అని తెలిసికూడా,
గుండెలోతుల్లో  దాన్ని,
గుప్తనిధిలా దాచేస్తున్నప్పుడు......
ఎందుకని నేను దేశాన్ని ప్రేమించాలి ??
ఒకే ఒరలో వేల విరుద్ధతల ఖడ్గాలను,
ఇముడ్చుకున్న ఈ దేహం,
సాఫల్యతావైఫల్యాలను,
ఎలా విశ్లేషించగలదు, నా పిచ్చిగాని,.
దేశాన్ని ప్రేమించాలనే వుంది,
ఎందుకనే ప్రశ్న,తొలుస్తూనే వుంది.
సంఘర్షణల్లో పడి కొట్టుకుంటున్నందుకో,
సంఘర్షణే లేక బతుకుతున్నందుకో.....
అయినా, ఇదంతా నాకెందుకు...
దేశమనే సంకుచితత్వం,
మెదడుని ఉన్మాదంతో ఊపనంతవరకు,
నా దేశాన్ని ప్రేమిస్తూనేవుంటాను, నేను......
-----------------------------------
 నేడు గురజాడ 150 వ జయంతి
అందరికి  " ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవ శుభాకాంక్షలు "

20 September 2012

వేయి పడగల సర్పఛ్చాయ


ఏ బ్రాంతి చేతనైతే నేను జ్ఞానవంతుడనని,
ప్రకృతిలో ప్రత్యేకతలను ఆపాదించుకొని,
ఈ సృష్టి సమస్తాన్ని,
ఖండఖండాలుగా,
విభజించుకొని మురిసిపోతున్నానో......
జాగ్రత్స్వప్న సుషప్తాలతో నిర్మితమై,
షడ్వికార సహితమై శోభిల్లు శరీరాన్నే,
ఈ విశాల విశ్వానికి దిక్సూచిగా,
అభివర్ణించుకొని ఆనందపడుతున్నానో.......
నిరంతరమూ, నదీజలము వలే,
చంచలచిత్తముతో,
పాతాళము వైపునకే పరుగిడుతున్నానో....
బహురూపాలతో, వాయులక్షణాలతో,
అహంకార,అసంపూర్ణాలతో
మదాంధకారాన మగ్గుచున్నానో.......
తొలగింపబడజాలని,
మాయా మేఘాలతో ఆవరించబడిన,
సూక్ష్మాతి,సూక్ష్మమైన ఈ దేహము,
వేయి పడగల సర్పఛ్చాయను వీడి,
బ్రాంతీరహితమై మనగలదా, ప్రభూ.......
---------------------------------
జాగ్రత్త, స్వప్నం, సుషప్త (గాఢ నిద్ర) - మూడు అవస్థలు
జన్మ,వృధ్ధి,పరిణితి,క్షయము,వ్యాధి,నాశనము - షడ్వికారాలు.

19 September 2012

ఐదు పైసల ఆత్మకథ (An auto biography of Five paisa)



భారతదేశానికి చెందిన ఐదు పైసలు అను నేను 1957 వ సంవత్సరంలో జన్మించాను. పుట్టిన కొత్తల్లో బొద్దుగా, ముద్దుగా వుండేదాన్ని నేను. అందరూ నన్ను అపూరూపంగా ఐదు నయాపైసలు అని పిలుస్తుండే వారు. నన్ను క్యూప్రో నికెల్ లోహం తో తయారు చేసేవారు, అవును, ఇంతకీ మీకు ఆ క్యూప్రోనికెల్ లో ఏఏ లోహాలు వుంటాయో తెలుసా(75 శాతం రాగి, 25శాతం నికెల్).... 4 గ్రాముల బరువుతో, చతురస్త్రాకారంలో వుండేదాన్ని. మూల నుంచ మూలకు నా పొడవు 22 మిల్లీమీటర్లు. అప్పట్లో తీసిన ఓ ఫోటోను చూపిస్తాను వుండండి. భలే వుంది కదూ..1957 నుండి 1963 వరకు నా బాల్యం ఆనందంగా గడిచిపోయింది.
1964 నాటికి కొత్తదనం పోయింది కదా, అందుకే నాలోని నయా ను తొలగించేసి, ముద్రించేవారు. నన్ను తయారుచేసే లోహంలో ,బరువు లో , రూపంలో ఎలాంటి  మార్పేమి చోటు చేసుకోలేదులేండి. 1964.65,66 సంవత్సరాలలో ఇలానే వెలువడ్డానండి. అప్పటి ఫోటోని కూడా చూద్దాం రండి.

1967 వచ్చేసరికి, నా కష్టాలు ప్రారంభమైనాయండి. నన్ను తయారుచేసే లోహాన్ని మార్చి, అల్యూమినియంలో ముద్రించడం మొదలు పెట్టారు. మెరపు వుంది కాని, కొద్ది కాలానికే అది పోయేది, బరువు కూడా 1.5 గ్రాములు చేసేసారు,.  సైజులో , రూపంలో పెద్దగా మార్పులేమి లేవులే,..1967 నుండి 1978 వరకు ఇదీ నా రూపు. కొంచెం బాధగా అనిపించినా  తప్పదు కదా, సర్దుకుపోయేదాన్ని,


1972 – 1984 మధ్యకాలంలో నాలోని ఐదును పెద్దగా వేయడం మొదలుపెట్టారు. మీలో ఎక్కువ మంది నన్ను ఇలానే చూసివుంటారేమో... నేను నడివయస్సు దాటుతున్నానేమో. అనే సందేహం నాలో కూడా మొదలై నన్ను బాధించడం ప్రారంభమైన దశ ఇది. పిల్లలకు ఓ చిన్న బొరుగుముద్దనో, ఓ చాక్లేట్ మాత్రమే ఇవ్వగలిగానిప్పుడు.
అప్పటి నా రూపం ఇలా వుండేదండి, 1.5 గ్రాముల అల్యూమినియం నాణెంగా....

అయితే ఈ కాలంలో నాజీవితంలో ఆనందాన్నిచ్చే సంఘటనలు కొన్ని జరిగాయండి. వాటిని మీతో పంచుకోకపోతే నాకు తృప్తిగా వుంటుందా,  చెప్పండి. అవేమిటో చెప్పగలరా మీరు, నేనే చెప్పేస్తానులెండి.
ఐక్యరాజ్యసమితి కి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారి నినాదాలైన "అందరికి ఆహారము,పని" నినాదం తో 1976లోను, "అభివృద్ది కోసం పొదపు" నినాదం తో1977 లోను, "అందరికి ఆహారము, నివాసం" నినాదంతో 1978లోను, అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా 1979 లోను ప్రత్యేకంగా నా నాణెలను విడుదల చేసారు. నా జీవితం లో నేను అందుకున్న గొప్ప గౌరవాలవి. ఏ నాణెనికైనా అంతకన్నా కావలసినది ఏముంటుంది, చెప్పండి.వీటినే కమోరేటివ్ నాణెలు అంటారండి. వాటిని చూపిస్తాను, రండి.
1977

1978



1979

1976

 వృద్దాప్యం సమీపించింది,నాకు., నా బరువు కూడా కేవలం ఒక గ్రాముకి తగ్గిపోయింది. నా చివరి దశే ఇది, 1984 నుంచి 1994 వరకు కొనసాగిన ఈ దశలో, నా పరిస్థితి అత్యంత దయనీయమని చెప్పుకోవచ్చు. పిల్లలు నన్ను హేళనగా చూడటం మొదలైంది. ఆఖరికి బిచ్చగాళ్లు కూడా నన్ను చూసి ముఖం తిప్పుకుంటున్నారిప్పుడు. నాకు బాధగానే వుండేది, వారికేమి చేయలేక పోతున్నానని. ఈ ప్రపంచానికి , నా ఆఖరిచూపులు 1994లోనే, నా జీవితం ముగిసిపోయింది,42 ఏళ్ల వయసులో... నాకు తెలుసు ఇక ఏనాటికి, నేను మీ దగ్గరకు రాలేనని,....

ఎక్కడైనా మీకు నా శకలాలు తారసపడితే, ఒక్కసారైనా ఆప్యాయంగా తడమండి, మీ పిల్లలకో, మనవళ్లకో నన్ను చూపించి, మీ జ్ఞాపకాలను వారికి పంచండి. ఇదే నేను మీకు చెప్పగలిగే ఆఖరుమాట, గుర్తుంచుకుంటారు కదా, మితృలారా.......సెలవిక..............


18 September 2012

మిగిలిపోయిన జ్ఞాపకం.


తేనెలోలికే నవ్వులతో,
చక్కెర కలిపిన మాటలతో,
ముద్దముద్దకు, ఓ ముద్దుపెట్టి
అమృతాన్ని తినిపిస్తావ్, నువ్వు....
ఆరగించింది, అరిగిపోయి

చాలా కాలమైపోయినా,
గిలిగింతలు పెడుతూ,
ఇంకా మురిపిస్తూనే వుంది, సుమా..
మిగిలిపోయిన జ్ఞాపకం.

17 September 2012

వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?


చూపులతో మంత్రించేవాడు,
స్వప్నాలను నియంత్రించేవాడు,
వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?
అంకుశంతో మెదడుని లోభరిచేవాడు,
గుండె లోతుల్లుకి గాలం వేసి,
మనుసుని చేజిక్కించుకొనేవాడు,
వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?
దేహాన్ని అల్లాడించేవాడు,
ఈ దాహాన్ని తీర్చేవాడు,
వాడొక్కడేనా ఇంకెవరన్నా వున్నారా ?

16 September 2012

ఆ వెచ్చని ముచ్చట్లు


దోరగా వేసిన తలుపు,
నక్కినక్కి,
జాగ్రత్తగా వినాల్సోస్తుంది,
మత్తుగా, మృదువుగా సాగే,
ఆ వెచ్చని ముచ్చట్లు.
 ఏ అలికిడికి,
నిశ్శబ్ధం బెదిరి,
శబ్ధాలు ఆగిపోతాయేమోనని,
ఆ ఏకాతం భగ్నమవుతుందేమోనని,
భయంగా, వస్తువునై నేను....,
అక్కడ ఆ ఒంటరి గదిలో,
రాత్రికబుర్లు చెప్పుకుంటూ,
విశ్రాంతిగా పవళించివున్నాయ్,
నలిగిన మల్లెలు, చెదిరిన దుప్పటి.

ఓజోన్ పొర మనకేం ఇచ్చింది ??


ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణా దినోత్సవ శుభాకాంక్షలు



ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. భూమ్మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్నిరూపొందించారు.
తర్వాత 1995 నుంచి ప్రతి సంవత్సరం  ఓజోన్ పొర రక్షణ కోసం రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్‌పై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఈ తేదీని ఓజోన్ పరిరక్షణ దినంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు.

సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల 
బారినుండి, సకలజీవరాశులును కాపాడుతున్న 
రక్షణాకవచం ఓజోన్ పొర.మూడు ఆక్సిజన్ 
పరమాణువులు కలసి ఓజోన్ అణువుని 
ఏర్పరుస్తాయి.
భూమి పై నుంచి 20నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటో ఆవరణం కింది భాగంలో ఓజోన్ పొర 
వుంటుంది.మొదటి సారిగా 1913లో దీనిని గుర్తించిన  
ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు హెన్రీ  బైసన్  మరియు  చార్లస్ ఫాబ్రే లు. 
తరువాత బ్రిటిష్ శాస్త్రవేత్త డబ్సన్ దీనిపైన విస్తృతమైన 
పరిశోధనలు నిర్వహించారు. ఆయన గౌరవార్థం ఓజోన్
 
శాతంను డబ్సన్ యూనిట్లలో కొలుస్తారు.
సూర్యుని నుండి  వెలువడే  ప్రమాదకర  కిరణాలను
 
97 నుంచి 99 శాతం వరకు
 అడ్డుకుంటాయ్. 
ఓజోన్‌ తరిగి పోయే విధానం ప్రధానంగా
మూడు దశలలో  జరుగుతుంది.
మొదటి దశః మానవ సంబంధిత కార్య కలాపాల 
వల్ల ఈ సి.ఎఫ్‌.సి ఉత్పత్తి జరిగి వాతావరణంలోని 
ఓజోన్‌ పొరకు చేరతాయి .
రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సి ని విచ్చిన్నం చేసి  క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.
మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ పొర తరిగి పోయేటట్లు చేస్తాయి.
మనం మితిమీరిన స్థాయిలో ఇంధనాల్ని వాడడం వల్ల నత్రజని ఆక్సైడ్‌లు వాతావరణంలో పేరుకుపోతాయి. మితిమీరిన మోతాదులో ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వాడితే అందులో ఉపయోగించే ఫ్రియాన్‌ వంటి ఫ్లోరీన్‌ సంబంధిత వాయువుల పరిమాణం గాలిలో ఎక్కువ అవుతుంది. టైర్లు, రబ్బర్లు, ఇతర ఆధునిక ప్లాస్టిక్కుల వాడడం వల్లనూ, వాటిని కాల్చినపుడు క్లోరీన్‌ సంబంధిత సేంద్రియ పదార్థాలు వాతావరణంలో పెరుగుతాయి. ఇలా నత్రజని, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ పదార్థాలు ఎక్కువయితే వాతావరణంలో మునుపెన్నడూ జరగని విధంగా రసాయనిక చర్యలు జరుగుతాయివాటి కారణంగా ఓజోన్ పొర పలుచబడుతుంది. 



15 September 2012

వేయిరూపాయల నాణెం చూసారా !!!



రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు త్వరలో వేయి రూపాయల నాణెం ను విడుదల చేయబోతున్నారు.
తంజావూరు బృహదీశ్వరాలయం నిర్మించి వేయి సంవత్సరాలైన సందర్భంగా దీనిని ముద్రిస్తామని రెండేళ్ళుగా ఊరిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు ఈ నాణెం బుకింగ్ ను ప్రారంభించింది.



ఇండియన్ గవర్నమెంటు మింట్, ముంబై వారు ముద్రిస్తున్న ఈ నాణెం ప్రూఫ్ సెట్      ( ఒక వేయి రూపాయిలు మరియు ఐదు రూపాయల నాణెలు) ఖరీదు 4875 రూపాయలు. అన్ సర్క్యూలేటెడ్ సెట్ ఖరీదు 4535 రూపాయలు. ఈ ఐదు రూపాయల నాణెం ఇప్పటికే చలామణీలో వుంది. కావలసిన వారు ఈ లింక్ ను చూడండి.

ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు

ఇంజనీరింగ్ దిగ్గజం శ్రీ మెక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టంబర్ 15 వ తేది వెంకమ్మ, శ్రీనివాస శాస్త్ఱ్రి దంపతులకు జన్మించారు. వారి పుట్టినరోజునే మనం  ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నాం.
ఆధునిక భారతదేశంను తీర్చిదిద్దిన తొలితరం మహానుభావుడు విశ్వేశ్వరయ్యకు 
జన్మదిన శుభాకాంక్షలు.









 తపాలా శాఖ వారు విశ్వేశ్వరయ్యగారి పై విడుదల చేసిన స్టాంప్ మరియు ఫస్ట్ డే కవర్
















1955 వ సంవత్సరంలో  పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతులుమీదగా  భారత రత్న అవార్డు అందుకుంటున్న విశ్వేశ్వరయ్య గారు.

14 September 2012

అలుపెరగని పయనం.


నవ్వుకుంటూ,
నీతో నువ్వు మాట్లాడుకుంటూ,
ఈ శుష్క ప్రపంచాన్నొదిలి,
పరుగెడుతూ, గెంతులేస్తూ
అలుపెరుగక పయనిస్తున్నావ్.
ఎక్కడికో మరి....
మెత్తని చేతుల్లోకా....
చెక్కిళ్ళ మెరుపుల్లోకా.....
ఆ హృదయపు లోతుల్లోకా.....
ఎక్కడికో మరి....

13 September 2012

జ్వాలా జలము


జ్వాల వలే వేదనను,
జలము వలే స్వాంతనను,
ఏక కాలంలో
పరిచర్యా, పరితాపాలను
చూపగల నేర్పు,
నీ ప్రేమ జ్వాలా జలమునకు తప్ప
అన్యులకు సాధ్యమా,.. సుమా!!

12 September 2012

తేనెల తేటల మాటలు


 


 " తేనెల తేటల మాటలతో "  అంటూ మా పాఠశాల విద్యార్థినులు  ఆలాపించిన గీతం వీడియో  ఇది. 
  ఓ చిన్న ప్రయత్నం చేశాను, ఇలా కొన్ని మంచి పాటలను చిత్రీకరించి , కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన
శ్రీ గుంటూరి భాస్కర రావు గారు మా పాఠశాలకు బహుకరించిన ప్రోజెక్టర్ సహాయంతో  చుట్టుపక్కల గ్రామాలలో ప్రదర్శించాలని 
అనుకుంటున్నాము. అక్షరాస్యత, పర్యావరణం, మద్యపానం లాంటి అంశాలతో వారి పిల్లలపై   
చిత్రీకరించిన పాటలు,
తల్లిదండ్రులను కొంత ఆలోచింపచేస్తాయని ఆశ.
చిత్రీకరణ ఎలా వుందో మీరే చెప్పాలి,.......

10 September 2012

మా పాఠశాలలో ఆటలపోటిలు



జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, దిరిశవంచ గ్రామంలో జరిగిన ఆరు మండలాల ఆటలపోటీల సందర్భంగా తీసిన వీడియో ఇది. దాతలందరికి మా కృతజ్ఞతలు.

6 September 2012

నీడల లోతులు.



పయనించే మబ్బుల వెనక,
ఏ విషాదపు వేదనున్నదో,.
రగులుతున్న నిప్పుల సెగలో,
ఏ దుఃఖపు నీడలు కలవో,.
స్వప్నించే రంగుల వలలో,
ఏ మోసపు లోతులు కలవో,.

5 September 2012

my teacher, happy teachers day


మా సార్

ముళ్ళ పొదల్లో  ఇరుక్కున్న
నా ఆలోచనలకు
వెలుగు బాటను చూపి ,
తానక్కడే మిగిలి పోతాడు.

తన స్వప్నాల్ని
నా బుర్ర లోకి నెట్టి
నిశ్శబ్ధం గా  నలిగి పోతాడు.

నా జీవితాన్ని
నా చేతుల్లో పెట్టి
నా వంక చూడకుండానే
వెళ్లి పోతాడు.

నా లక్ష్యంనా మార్గం,
నా స్వప్నంనా జ్ఞానం,
అన్నీ  తానై,
మౌనం గా మురుస్తూ ,
మనసులో మెరిసిపోతాడు.
ఓ జ్ఞాపకం గా మిగిలి పోతాడు.