నాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి.
నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరుగదంతాను.
చిన్నయ్యసూరి బాలవ్యాకరణాన్ని
చాల దండిస్తాను.
ఇంగ్లీషు భాషా భాండారంలో నుండి
బందిపోటుంజేస కావల్సిన
మాటల్ని దోస్తాను.
నా యిష్టం వచ్చినట్లు జేస్తాను
అనుసరిస్తాను నవీనపంథా, కానీ
భావకవిన్మాత్రము కాన్నే, నే
నహంభావ కవిని.
నిజం *పట్టాభి*
ఓ బోగంచానా, నీవు
సంఘానికి వేస్టు పేపరు బాస్కటువా
మష్టు మషాణము పడవేయునట్టి దిబ్బవా
నిన్నుగవురవిస్తున్నా నేను
నీలోనే నాకు జీవితం నిజంగా
సరిగ్గా ప్రతిఫలిస్తున్నది
ఇతర స్థలాలలోన అంతా నాటకం గొప్ప
అబద్ధం
పూజారియబద్ధం
పరపురుషుని జూచి తలవ్రాల్చే
పతివ్రత సతీత్వంమబద్ధం
యోగులబద్ధం, అందరూ అబద్ధం
సర్వమబద్ధం
కానీ నీవుమటుకు ఓ బోగంచానా
ముసుగులేని నిష్టురమగు నిజానివి
నీడపడనటువంటి నిర్మలమగు నిజానివి.
No comments:
Post a Comment