Pages

6 November 2013

ఆలూరి బైరాగి || శ్రీరంగం నారాయణ బాబు||

 విస్మరించబడిన మహాకవి శ్రీరంగంనారాయణ బాబు గురించి బైరాగి వ్రాసిన కవిత.,.. బైరాగిగారి గొప్పకవితలలో  ఇదొకటి. నారాయణబాబు ప్రభావం బైరాగి మీద స్పష్టంగా కనిపిస్తుందంటారు,. And his death only a symbol

సంజ్జ్ఞ సరిహద్దున లో మాంచాల లోయలోన
నీడలు కూడే చోట,
గడియారపు ముండ్ల జంట కడపటి కౌగిలిలో
మత్తిలి మసకలాడే చోట,
అగణితగణిత చిహ్నాలు, ఆకాశపు శాఖలపై పొంచి
చంక్రమించే చోట,
వివేకపు విరిగిన గద్దెపైన,ఆరాచకపు రాచరికాన
తలక్రిందుగ తపస్సు చేస్తున్నవాడు,
జాడీబీడీల చండీహోమ ధూమకుండలిలోంచి
ఖండిత ఖడ్గమృగాలు, గండర గండ బేరుండాలు చూస్తున్నవాడు,
ఆకలిని మేస్తున్నవాడు,
భూతాభూత జ్యోతిష్కుడు, సంతతాన్య చేతస్కుడు
అతడే ఊఱ్ధ్వరేతస్కుడు, హర్షామర్షాలు లేని మహర్షి,
ఉద్ర్గంథాలు తలదిండ్లుగా నాడు నేడులు క్రీడించిన చింకిచాప,
అప్సరసల సవాయిహాయి,
స్వాప్నిక సంయోగాల స్వేదదుర్భర జాగరణాలు,
కాశీమజిలి కథల రాశీభూత సురతశ్రమలు,
పౌరాణికపు పయోరియా ఊసే బోసినోట
కదిలే కవితా క్రిములు,
ఎండిన ఇసుకపై కోరిక కుంటిచేప
అంతరంగపుటరలలో ఉపనిషత్తులు,మార్క్సు,ఫ్రాయిడ్,
వాత్స్యాయనుడు,హెవలక్ ఎలిస్,లీలావతి,
అయిన్ స్టీన్, కాళిదాసు,జేమ్సుజాయిస్
ఆదిమ నిషాదుని విషాదానికి బీటనిక్కుల నిషాతోడు,
అవచేతనపు టెక్సరేలో, ఈడిపస్ కాంప్లెంక్స్
గర్భకోశపు ద్విపటిలో, తల్లివంటి చీకటిలో
స్వరతి నిరత బాలకుడు, దోషకశాచాలితుడు.

అతని మనసు క్యూబిస్ట్ బేబిలోను,
వెర్రిపీరులు, శివలింగాలు, సింధూర చర్చిత శిలలు,
రక్తాంబరధారుడాతడు, రక్తాక్షుడు, ఆదిశక్తి ఆరాధకుడు
జీవిత శ్మశానంలో కవితా శవసాధన చేస్తున్నాడు,
ఝల్లుమనే కంకాళాలు, ఘల్లుమనే కపాలాలు
గుహ్యతాంత్రిక గుహలలో భైరవ మంద ప్రతిరవాలు
ఆటవిక పటహ ఘోసలు,... టోటెమ్లూ
అగ్నిచుట్టు నర్తించే దిగంబర శూలధరులు
ఆఫ్రికాలో అర్థరాత్రి.

నిర్జన మానసాన అడుగులసడి పడిపడిమ్రోగ
నీడల్లో ఒదిగిఒదిగి పోతున్నాడు నేరస్తుడు,
హఠాత్తుగా సందు మలుపు తిరుగగానే
బుగ్గమీసాల పత్తేదారు హేండ్సప్ అని అరిచాడు.


No comments:

Post a Comment