Pages

29 November 2013

అవ్యక్తం


1
ఎదురుచూస్తునే వుంటాం మనం,
కళ్లువిప్పార్చుకొని, ఇంకొన్ని ఆశలు కూర్చుకొని,
ఆ చివరాఖరి చూపులు
మళ్లీ తెరుచుకోకుండా, మూసుకొనేదాకా.

2
ఎన్ని కష్టాలు, తలలకెత్తుకొని తిరుగాడిన దుఃఖాలనుంచి
విముక్తినొందే సమయాలను మళ్లీమళ్లీ తలుచుకుంటూ
వదిలిపోయిన చిరునవ్వుల చివరిస్పర్శల పలకరింతలను
పదిలంగా దాచుకొని, దాచుకొని
పగలకుండా, ఓదార్చుకుంటున్న
ఓ పురా హృదయాన్ని, కొత్తగా పునర్మించుకోలేక
వదలని వేదనను, హత్తుకొని సముదాయించుకొంటూ

3
ఎన్నెన్ని ఆలోచనలు సమసిపోయాయో
ఏ ఏ అనుభూతులు వదలిపోయాయో
ఎన్ని జీవితకాంతులు,అలా చూస్తుండగానే ఆరిపోయాయో
లెక్కలకందని,లెక్కించలెన్నన్ని తారకల్లా తెల్లారిపోయాయో
ఒక హృదయసాక్ష్యానికి, తార్కాణంగా మిగలడానికి కాకపోతే
ఎందుకిలా, ఇక్కడే చూస్తుండిపోతాం.
దేన్నీవదలకుండా, ఎటూ కదలకుండా.
4
మొదలుకావడంలో మన ప్రమేయమే లేనట్లు
పయనమంతా మనమే చేసినట్లు, భరించినట్లు
ఇహలోకబంధాలు వదిలించుకొని,
ఇకరా అని, ఎవరో పిలిచినట్లు,

ఒక్కొక్క అంశాన్ని ఎంత జాగ్రత్తగా,
పునఃసమీక్షించుకుంటుంటామో కదా, మనం.

మనకు మనమే ఒక వైభోగవంతమైన వలయాన్ని,
కందకంలా నిలుపుకొని, కనులముందు

ఎంతగా విలపిస్తామో మరి,. దాన్నిదాటలేక.

( సారంగ పత్రికలో ప్రచురితం)
https://www.facebook.com/groups/kavisangamam/permalink/662363693816386/

28 November 2013

ఐసాన్ తోకచుక్క కథ ఈ రోజుతో ముగుస్తుందా ?


నవంబర్ 21న ఐసాన్ ఫోటో
ఈరోజు (నవంబర్ 28) రాత్రి 11.45కి సూర్యునితో ముఖాముఖి సమావేశం కానున్న ఐసాన్ తోకచుక్క,. తన సుధీర్ఘయాత్రను క్షేమంగా పూర్తి చేయాలని కోరుకుంటూ,.

సెప్టంబర్24,2012 న ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ఆప్టికల్ నెట్ వర్క్(ISON) దాదాపు గురుగ్రహం ఆవల వుండగానే కనుగొనబడిన ఐసాన్ తోకచుక్క ఈ రోజు (నవంబర్ 28) సూర్యునికి అత్యంత సమీపంలోకి రాబోతుంది. బహుశా తొలిసారి సూర్యసందర్శనకు వచ్చి బుధగ్రహం కక్ష్యను దాటి సూర్యునికి కేవలం 11లక్షలకిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించబోతున్న ఈ ఐదు కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న తోకచుక్క  2,700 0 C సూర్యుని వేడిని,సౌరగాలులను,బలమైన ఆకర్షణను తప్పించుకుని బతికిబట్టకట్టగలుగుతుందా, అనే సందేహాలకు ఈ రోజు సమాధానం వచ్చే అవకాశం వుంది., సూర్యుడినుంచి తప్పించుకోవడానికి తన వేగాన్ని గంటకు నలభైవేలమైళ్ల నుంచి  పెంచుకుంటూ ఈ రోజు తన అత్యధికవేగం ఎనిమిది లక్షల ముప్పైమైళ్ల వేగానికి ఈ రోజు పెంచబోతుంది. ఈ ప్రయత్నం సఫలమైతే అది తన యాత్రను సజావుగా సాగించగలుగుతుంది లేకపోతే  ఊర్ట్ మేఘ ప్రాంతంలో మొదలై సూర్యైక్యంతో ఐసాన్ కథ ముగిసిపోతుంది.






క్రింది పరిణామాలు సంభవిచే అవకాశం వుంది.

పూర్తిగా సూర్యుడిని గుద్దుకొని, దానిలో కలిసిపోవచ్చు.
చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి,  అనేక తోకచుక్కలుగా మారి బయటపడవచ్చు.
తనచుట్టు వున్న మంచు పదార్దాలు పూర్తిగా ఆవిరైపోవడం వలన తోకను కోల్పోయి కేవలం చిన్నశకలంగా మిగిలిపోవచ్చు.
తన కక్ష్యను మార్చుకోవచ్చు.
అన్ని తట్టుకొని తనలాగా తిరిగిరాగలిగితే అత్యంత సుందరమైన,ప్రకాశవంతమైన  తోకచుక్కగా మనకు దర్శనమివ్వవచ్చు.
ఐసాన్ విజయం సాధించాలని కోరుకుందాం.


BEST OF LUCK ISON

27 November 2013

తోకచుక్కల చరిత్ర


ఈ విధంగా తోకచుక్కలు మొత్తం మీద మన సూర్యకుటుంబం యొక్క పరిధిని దాదాపు ఒక కాంతి సంవత్సరానికి విస్తరించాయి. ఐసాన్ తోకచుక్క పూర్వపరాలు తెలుసుకునేముందు, తోకచుక్కల చరిత్రను కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
అంతరిక్షాన్ని మనుషులు కొన్ని వేల సంవత్సరాలుగా పరిశీలిస్తూ, వాటి ఖచ్చితమైన గతులలో నియమబద్ద గమనాన్ని వీక్షిస్తూ, నక్షత్రాలకు,గ్రహాలకు,చంద్రునికి సంబంధించిన అనేక విషయాలను,ఆకాశ మార్పులను తెలుసుకోగలిగారు. కాని ఎటువంటి కట్టుబాట్లు లేకుండా,. హఠాత్తుగా వచ్చే తోకచుక్కలు మనిషిని అనాదిగా భయపెడుతూనే వుండేవి.



వీటిని గురించి మొదటిసారి శాస్త్రబద్దంగా ఊహచేసింది, క్రీ.పూ 350 మధ్యకాలంలో జీవించిన ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్. ఇవి అంతరిక్షానికి సంబంధించినవి కావని, భూ వాతావరణంలోని గాలిలో జరిగే కొన్ని చర్యల కారణంగా మండే విస్ఫూలింగాలని ప్రతిపాదించాడు. అంత పెద్ద తత్వవేత్త చెప్పడం చేత,. దాదాపు 1800 సంవత్సరాలు అదే వేదంలా చలామణి అయ్యింది.

ఆ తరువాత దీన్ని గురించి కొంచెం శాస్త్రీయ పరిశోదన మళ్లీ మొదలుపెట్టింది, 1473 లో గ్రీకు ఖగోళశాస్త్రవేత్త రెజియో మాంటనస్. ఈయన చేసిన పని అప్పుడు వచ్చిన ఒక తోకచుక్క సమాచారాన్ని,అది ఏరోజు ఏరాశిలో వుందో గమనించి, దాన్ని రికార్డు చేయడం
.
గిరోలామో ఫ్రాకాస్టోరో                                 పీటర్ ఏపియన్                     


ఇటలీకి చెందిన గిరోలామో ఫ్రాకాస్టోరో, ఆస్ట్రియాకు చెందిన పీటర్ ఏపియన్ లు 

 1532లో  వచ్చిన ఒక తోకచుక్కను పరిశీలించి, తోకచుక్క తోక ఎప్పుడు సూర్యుడికి వ్యతిరేఖదిశలో వుండటాన్ని కనుగొన్నరు. తోకచుక్కలకు సంబంధించి గొప్పఆవిష్కరణ ఇది. దీనివల్ల సూర్యుడికి,తోకచుక్కకి మధ్య ఏదో సంబంధం వుండితీరాలి అని నిర్ణయించగలిగారు.

 టైకో

1577లో ప్రఖ్యాత డేనిష్ ఖగోళశాస్త్రవేత్త టైకోబ్రాహీ పురాతన మైన దృష్టివిక్షేపాన ద్వారా తోకచుక్క భూమికి ఎంత దూరంలో వుందో లెక్కించడానికి ప్రయత్నించాడు,. అవి చందమామకంటే దాదావు నాలుగైదురెట్ల దూరంలో వున్నాయని నిర్ణయించాడు. ఇది వాస్తవానికి చాలా దూరంలో వున్నప్పటికి, అరిస్టాటిల్ ఆలోచనలను సమూలంగా తుడిచిపెట్టగలిగింది.
తోకచుక్క భూమికి సంబంధించినది కాదు, అంతరిక్షవస్తువని తేల్చగలిగింది.
 కెఫ్లర్


తోకచుక్కల కక్ష్యలను తొలిసారి అంచనావేసే ప్రయత్నం చేసింది,.టైకో శిష్యుడు జర్మన్ శాస్త్రవేత్త జోహనెస్ కెఫ్లర్. తోకచుక్కలు సూర్యకుటుంబం మీదుగా సరళరేఖా మార్గాలలో పయనిస్తూ సౌరకుటుంబాన్ని దాటివెళ్లిపోయే  అంతరిక్షవస్తువు అని , అవి సౌరకుటుంబానికి చెందినవి కావని భావించాడు.


1664లో వచ్చిన తోకచుక్కని పరిశీలించిన ఇటలీ శాస్త్రవేత్త గియోవాన్ని బొరేలి తోకచుక్క సూర్యుడుచుట్టు తిరిగి, వేరే దిశలో వెళ్లడాన్ని గమనించాడు. తోకచుక్క కక్ష్య సరళరేఖగా లేదని, అనంతగా విస్తరించే ధీర్ఘవృత్తాకారం (పెరాబోలా) లో వుంటుందన్నాడు. ఒకసారి వచ్చివెళ్లిన తోకచుక్క మరలా వచ్చే అవకాశం లేదని భావించాడు.

 ఎడ్మండ్ హేలి

1680లో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతిపాదించాక, న్యూటన్ స్నేహితుడైన ఎడ్మడ్ హేలీ  1682లో కనిపించిన ఒక తోకచుక్క ని క్షుణంగా పరిశీలించి, పాత తోకచుక్కల చరిత్రని అధ్యయనం చేసి,1456,1607లో కనిపించిన తోకచుక్కల మార్గం, దీని మార్గం ఒకేలా వుండటాన్ని గమనించి, తోకచుక్కలు సూర్యుని చుట్టు తిరగడం నిజమైతే ఈ తోకచుక్క మళ్లీ 1758లో కనిపిస్తుందని అంచనావేసాడు. దాని కక్ష్యను పరిశీలించి ఇది సుధీర్ఘమైన ధీర్ఘవృత్తాకార కక్ష్యలో పోతుందని, దాని వ్యాసం సూర్యునికి, అప్పటికి తెలసిన చివరి గ్రహం శని కంటే మూడురెట్లు ఎక్కువవుండాలని లెక్కించాడు. హేలీ 1742 లో మరణించాడు. ఆ తరువాత 1725 డిసెంబర్ 25 వతేది అదే కక్ష్యలో అదేతోకచుక్క మళ్లీ దర్శనమియ్యడంతో, తోకచుక్కలు సూర్యకుంటుంబానికే చెందిన సుదూరబంధువులు అనేది నిరూపితమైపోయింది. ప్రతి 76 సంవత్సరాలకు కుపియర్ బెల్ట్ నుంచి ఒకసారి వచ్చేఆ తోకచుక్క హేలి తోకచుక్కగా ప్రసిద్దమైపోయింది.

1986 హేలి తోక చుక్క


హేలితోకచుక్క కక్ష్యా మార్గం

26 November 2013

ఈ శతాబ్దపు తోకచుక్క - 2

ఆస్టరాయిడ్ బెల్ట్ - 

 సూర్యుడు నుండి రెండు నుండి నాలుగు ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో,. అంగారకుడు మరియు గురు గ్రహాల కక్షల మధ్య గులకరాయి సైజు నుంచి,. 950 కి.మీ పొడవు,వెడల్పు వరకు గల కొన్ని వేల బండరాళ్లు వివిధ ఆకారాలలో సూర్యూని చుట్టు వాటి వాటి కక్ష్యలలో పరిభ్రమిస్తున్నాయి. వాటి మొత్తం ద్రవ్యరాశి చందమామలో సగం వుండవచ్చు. వాటిలో అతిపెద్ద గ్రహశకలం పేరు సెరిస్. ఏ రోజుకైన భూమిని నాశనం చేయగల శక్తిగల వాటిలో వీటిని లెక్కిస్తుంటారు. ఇక్కడ నుంచి తోకచుక్కలు వచ్చే అవకాశమేమి లేదు.






క్యూపియర్ బెల్ట్ 

30 AU నుంచి 60 AUవరకు వుండే ప్రాంతాన్ని క్యూపియర్ బెల్ట్ అని అంటారు. ఈ ప్రాంతంలో వుండే వస్తువులను ట్రాన్స్ నెఫ్ట్యూన్ ఆబ్జెక్ట్ అని కూడా అంటారు. మొన్నటి దాకా ఒక గ్రహంగా భావించబడిన ఫ్లూటో, ప్రస్తుతం ఒక ట్రాన్స్ నెఫ్ట్యూన్ ఆబ్జెక్ట్.  వీటిలో కొన్ని ఫ్లూటో కంటే పెద్దవి కూడా వుండవచ్చు. ఇప్పటివరకు అనేక శకలాలను కనుగొన్నారు. తోకచుక్కలు వచ్చే ప్రాంతాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతం నుంచి వచ్చే తోకచుక్కల పరిభ్రమణ కాలం 200 సంవత్సరాలలోపుగా వుంటుంది. ప్రసిద్ధతోకచుక్క హేలీ ఈ ప్రాంతానికి చెందినదే.




ఊర్ట్ మేఘప్రాంతం  

సూర్యుడి నుండి 20,000 AU నుంచి 55000 AU దూరం వరకు రెండు భాగాలుగా వ్యాపించివుండి, సూర్యకుటుంబం చివరి సరిహద్దుగా భావించబడుతున్న ఈ ప్రాంతం మంచు ముద్దలతో కూడిన విస్తారమైన శకలాలతో నిండి తోకచుక్కల రిజర్వాయర్ గా భావించబడుతుంది.  ఇవి సూర్యకుటంబం ఏర్పడినప్పటినుండి ఏ మాత్రం మార్పులేకుండా వున్న ప్రాథమిక పధార్థం వుండటం వల్ల వీటిని శోధించడం ద్వారా సూర్యకుటుంబానికి చెందిన రహస్యాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తుంటారు. అక్కడినుంచి వచ్చే తోకచుక్కలు మోసుకొచ్చే విషయాలకై అందుకే వారు అంతగా ఎదురుచూస్తుంటారు. ఇక్కడినుండి వచ్చే తోకచుక్కల పరిభ్రమణ కాలం 200 సంవత్సరాలనుండి లక్షసంవత్సరాల వరకు వుండవచ్చు. ఇప్పుడు వస్తున్న ఐసాన్ తోకచుక్క ఈ ప్రాంతానికి చెందినదే. దీని పరిభ్రమణకాలం ఎంతో ఖచ్చితంగా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. 10,000 సంవత్సరాలని ప్రస్తుతానికి ఊహిస్తున్నారు. ఊర్ట్ క్లౌడ్ ప్రాంతంలోని మొత్తం శకలాల ద్రవ్యరాశి భూమి కంటే వంద నుండి 400 వందలరెట్లు వుండవచ్చని ఒక అంచనా. ఇది సూర్యకుటుబం ఏర్పడంగా మిగిలిన పదార్థంగా భావిస్తున్నారు.


25 November 2013

ఈ శతాబ్దపు తోకచుక్క - 1


ఒకసారి మనం తలెత్తి ఆకాశం వంక చూస్తే,. ఓ రాత్రివేళ,.అత్యంత పురాతనమైన విజ్ఞానశాస్త్రానికి మనం దారులు తెరిచినవారమవుతాం,.

నులకం మంచం మీద పడుకొని, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు లెక్కించుకుంటూ,. ఖగోళ కథలను చెప్పుకుంటూ నిద్రపోవడం,. ఒక పాత కాలపు జ్ఞాపకం గా గుర్తువస్తున్నప్పుడు, ఎలా కోల్పోతున్నామో, రాత్రిపూట ఆకాశాన్ని అని అర్థమవుతుంది.

చందమామ తప్ప మనం గుర్తించగలిగిన ఆకాశ కాంతులేవి లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఆకాశదర్శనానికి కొంత ఆసక్తిని అద్దడానికి దాదాపు ఒక కాంతి సంవత్సరం దూరం నుంచి వస్తున్న తోకచుక్క ఐసాన్. దీన్ని గురించ కొంచెం తెలుసుకొనే ముందు కొన్ని ఖగోళవిషయాలను గురించి తెలుసుకుందాం.



మనవిశ్వం 
ప్రస్తుతం మనకు తెలిసి ఒకే విశ్వాన్ని విశ్వసిస్తున్నాం,. ఒకానొక అనంతమైనశక్తి ద్రవ్యరాశి గా మారే పరిణామంలో బిగ్ బాంగ్ సిద్దాంతం ప్రకారం దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వ ఏర్పడినట్లు చెప్తున్నారు. క్షణక్షణం విస్తరిస్తున్న ఈ విశ్వం అంతకంతకు పెరుగుతూపోతూవుంది,. ఒక ప్రత్యేక అవధి దగ్గర ఈ వ్యాకోచం ఆగిపోయి తిరిగి సంకోచించడం మొదలవుతుందనేది, ఒక ఊహ.  విశ్వం ఎంత పెద్దదో ఊహకందదు కానీ దీనిలో రెండువందల బిలియన్ల గెలాక్సీలలో(1011) దాదాపు 3*1023నక్షత్రాలు వున్నట్లు ఒక అంచనా.దీని వ్యాసార్థము దాదాపు 46బిలియన్ల కాంతి సంవత్సరాలని ఒక అంచనా.(కాంతి సంవత్సరము అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరము 9.5*1012కిలోమీటర్లు)


మన గెలాక్సీ (మిల్కీవే / పాలపుంత)

దాదాపు లక్షకాంతి సంవత్సరాల పొడవు, 3వేల కాంతి సంవత్సరాల వెడల్పుతో మన సూర్యుడులాంటి నక్షత్రాలను షుమారు 100 నుంచి 400 బిలియన్లలను కలిగివుంటుంది మన గెలాక్సీ వయస్సు షుమారు 12.6 బిలియన్ సంవత్సరాలు,.మన సూర్యుడు ఈ గెలాక్సీ కేంద్రానికి దాదాపు, 27వేల కాంతి సంవత్సరాల దూరంలో వుండి,. కేంద్రం చుట్టు ఒక సెకనుకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. సర్పిలాకారంలో వుండే మన పాలపుంతకు దగ్గరగా వుండే మరో గెలక్సీ సోదరుడు ఆండ్రోమెడా దాదాపు 2.5 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో వుంది.

మన సూర్యకుటుంబం 

 పుస్తకాలలో మనం  చదువుకుంటున్నట్లు సూర్యుడు అనే నక్షత్రం దాని చుట్టు తిరిగే ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు ఇవన్ని కలిపితే మన సూర్యకుటుంబం. మన గెలాక్సీలో మధ్య రకానికి చెందన ఒక మధ్యవయస్సు తార సూర్యుడు. మన సూర్యకుటుంబం దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీన్ని కొలవడానికి ఆస్ట్రనామికల్ యూనిట్స్ సరిపోతాయి. ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే భూమికి సూర్యుడికి మధ్యదూరం (15కోట్ల కిలోమీటర్లు,. కాంతి సంవత్సరాలలో చెప్పాలంటే 500 కాంతి సెకనులు) సూర్యుడికి మన సూర్యకుటుంబంలో చివరి గ్రహం నెఫ్య్టూన్కి మధ్యదూరం 4.3 బిలియన్ కిలోమీటర్లు అంటే 4 కాంతి గంటలు. ( గంటలో కాంతి ప్రయాణించే దూరం దాదాపు 100కోట్ల కిలోమీటర్లు) లేదా 30 AU.  
సూర్యకుటుంబంలో లెక్కకుమిక్కిలిగా చిన్నాపెద్ద రాళ్లు,మంచుగడ్డలు,మరుగుజ్జుగ్రహాలు తిరిగే ప్రాంతాలు మూడు వున్నాయి.
1.     ఆస్టరాయిడ్ బెల్ట్ ప్రాంతం
2.     క్యూపియర్ బెల్ట్ ప్రాంతము
3.     ఊర్ట్ క్లౌడ్ ప్రాంతము.

(ఇంకా వుంది)

24 November 2013

రెండు మైలురాళ్లు


సారంగలో నా కవిత అవ్యక్తం,.

http://magazine.saarangabooks.com/2013/11/22/%E0%B0%85%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%82/#comment-5080


అనువాదలహరిలో నా కవిత అధిభౌతికం కు మూర్తి గారి అనువాదం,..

http://teluguanuvaadaalu.wordpress.com/2013/11/23/metaphysical-bhaskar-kondreddy-telugu-indian/

20 November 2013

ఆత్మకథ ||తిక్కవరపుపట్టాభిరామిరెడ్డి||



నాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి.
నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరుగదంతాను.
చిన్నయ్యసూరి బాలవ్యాకరణాన్ని
చాల దండిస్తాను.
ఇంగ్లీషు భాషా భాండారంలో నుండి
బందిపోటుంజేస కావల్సిన
మాటల్ని దోస్తాను.
నా యిష్టం వచ్చినట్లు జేస్తాను
అనుసరిస్తాను నవీనపంథా, కానీ
భావకవిన్మాత్రము కాన్నే, నే
నహంభావ కవిని.

నిజం *పట్టాభి*

ఓ బోగంచానా, నీవు
సంఘానికి వేస్టు పేపరు బాస్కటువా
మష్టు మషాణము పడవేయునట్టి దిబ్బవా
నిన్నుగవురవిస్తున్నా నేను
నీలోనే నాకు జీవితం నిజంగా
సరిగ్గా ప్రతిఫలిస్తున్నది
ఇతర స్థలాలలోన అంతా నాటకం గొప్ప అబద్ధం
పూజారియబద్ధం
పరపురుషుని జూచి తలవ్రాల్చే
పతివ్రత సతీత్వంమబద్ధం
యోగులబద్ధం, అందరూ అబద్ధం
సర్వమబద్ధం
కానీ నీవుమటుకు ఓ బోగంచానా
ముసుగులేని నిష్టురమగు నిజానివి

నీడపడనటువంటి నిర్మలమగు నిజానివి.

19 November 2013

సారాంశం


1
ప్రపంచంలో నీకేం కనిపిస్తుందో,.
అడ్డదిడ్డమైన నసుగుళ్లతో,.
అడ్డంపడే ప్రశ్నలతో,.
ఇలా అడిగేవారెవరికి,.అందనంత దూరంలో.
2
ఒక ద్వేషంలో ఏముంటుందో,
ఒక స్వార్థంలో ఏముంటుందో,
ఒక కష్టంలో ఏముంటుందో,
ఒక దుఃఖంలో ఏముంటుందో,
నువ్వెప్పటికి అనుభవించలేవ్,అది నీది కానప్పుడు,.
ఎవరికి బదలాయించనూ లేవ్,అది నీదైనప్పుడు.
3
అసలు ప్రేమంటే ఏంటని,
జ్ఞానానికి అర్థముందా అని,
లోకాన్ని వెతికే వెర్రా అని,.
ఇదంతా పిచ్చాఅని,.
అప్పుడప్పుడు మెదలే ప్రశ్నలు,.

హేయ్,.హేహేయ్,.
తెలిసిందేంది,.తెలియనిదేంది,.
కవిత్వం కొమ్ములతో కుమ్ముతున్నప్పుడు,
ఇక్కడ ప్రపంచాలండవ్,.
కనబడని వింతలోకాలక్రింద దాక్కొన్న,
కొంత చెత్త నీకప్పుడు,. గురువవుతుంది,.

కాని,కాకపోని,. మనకి మనమే అలా,.
జబ్బలు చరుచుకో, కాస్తా హుషారుగా వున్నప్పుడు.
నోరెండినప్పుడు, తలతీసి తాకట్టుపెట్టుకో.
ఏదీ చేతకానప్పుడు మోకరిల్లు, పోయేదేంలేదులే.

గెలుపు,ఓటిమి,.స్వపక్షం,విపక్షం,
అస్మదీయుడు,తస్మదీయుడు,.
ఎవరులేరు,.ఏదీ లేదు జీవితానికి,.
ఇదొక జీవితం అంతే,.

విశేషాణాలు,అలంకారాలు,. ఎక్సెట్రా ఎక్సెట్రా,
నీ కల్పితాలు,. నీకు మాత్రమే అవి,.
జీవితానివి కావు,. అని కూడా అర్థంకాని,.

వెర్రివెధవవోయ్ నువ్వు.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/656564704396285/