11
సంభాషణ పొడిగించలేక,
పొడిబారిపోయి
గొంతు విశ్రమించింది.
మౌనం మరంత బలంగా
మాట్లాడటం మొదలెట్టింది.
12
ఇది నాది అనుకుని
భ్రమపడటమే తప్ప,
ఏదీ నీకు చెందదని
అర్థమయ్యే రోజుకు,
ఆశ్రయమిచ్చిన
దేహం కూడా
నీది కాకుండాపోతుంది.
131015
13
చంటోడొకడు
ఏడుస్తున్నాడు
తననెవరూ
పట్టించుకోలేదని.
వృద్దుడొకరు
విలపిస్తున్నాడు
తగిన
గుర్తిపు లేకుండా
మరణిస్తున్నానని.
ఎదుగుదల
ఓ
జీవితకాలభ్రమ.
14
గోచరం కానిదేది
దృశ్యమై మిగలలేనట్లు.
నాలిక తగలకుండా
రుచుల్ని అనుభవించలేనట్లు.
జీవితపు తడి అంటుకోకుండా,
వాక్యం కవిత్వమై వెలగలేదు.
15
నమ్ముకున్న బతుకుల్ని
కబళించే చీకట్ల భయంతో
వణికిపోతుంది,
ఆరిపోతున్న దీపం.
No comments:
Post a Comment