Pages

28 March 2016

బేకారీలు 66-75

66
రసహీనమైనాక
పోయమ్స్ కూడా
ఆత్మహత్యలనే
ఆశ్రయిస్తాయి.
ఫేస్ బుక్ గోడలపై వేలాడుతూ)
26/6/15

67
రాయంగా రాయంగా
రాయడంలోని లోపాలు
మరంత బలంగా అర్థం కావాలి
రాత మీద రోత పుట్టి వదిలేసేంతగా.

అలా కాలేదంటే
యూ ఆర్ ఎడిక్టడ్ అని
కొత్తగా వేరెవ్వరో చెప్పక్కర్లేదు.

ఒకే పనిని అదే పనిగా చేస్తున్నా
నువ్వు ఆనందంగానే వున్నావంటే
నువ్వు బాల్యాన్ని అధిగమించావనే.
నీకు అభినందనలు.


68
ఆనందం
అణువంతైన దొరక్కుండా,
కేవలం
తెలివైనవాడివని అనిపించుకోవడానికి
సాహిత్యంలో మునకలెయ్యకు,

దానికంటే
ఊరికే కూర్చోని
వెర్రిబాగులోడివనిపించుకున్నా ఫరవాలేదు.


69
ఆలోచనల పీకని నొక్కేసాక
ప్రశ్నను పారేసాక,
అనుసరించడమే మార్గమైనాక,
మతమైతే ఏంది?
మార్కిజమైతే ఏంది?

70
నాటకీయత చేర్పులేకుండా
సత్యమైనా ఇక్కడ పొర్లుదండాలు పెట్టాల్సిందే.
వాస్తవాన్ని వాస్తవంగా కాక
కాస్త వాపునద్దుకుని
పోపులాగా ఘమాయించాల్సిందే.

అబ్బే, అప్పటిదాకా ఎవడికీ
ఏది తలకెక్కదు.

ఒరే బండరాయా
చెప్పిచెప్పి, నోరెండిపోతున్నాది కదరా
వున్నదున్నట్టే  చెప్పేటోడికేం వుంటాదిరా, విలువ.

మసాలాలు లేకుండా చికెనీలు
సెంటిమెంట్ పండకుండా కవిత్వాలు
కళ్లు మండకుండా తలస్నానమెందిరా, భయ్.

71
కవిత్వాన్ని ప్రేమగా హత్తుకొని,
ఇక ఆ తరువాత,

దాని కుత్తుకను కోసి,
కౌగిలించుకొని, కన్నీరు కారుస్తూ
బిజిలీ లేని గలీజు ఎలీజీలను
గజిబిజిగా రాసుకుంటూ,
సానుభూతి పొందేవాడుంటాడే,
వాడురా, కరుడుగట్టిన కవంటే.

కవిత్వం ఎదగకూడదు,
పూర్తిగా చావకూడదు.


72
కాల్చిన అట్లకాడ లాంటి ఓ మాటతో
మనసు మీద వాతలేస్తావ్.

ఎలా రాయాలో లేపనాన్ని, 
నీకు గాయం కాకుండా.

చెబుతావా మరి నువ్వు, నాకు



73
ఎప్పుడూ చిగురించనే లేని
ఓ రాయి ముందు
భక్తితో నిలబడి, ప్రార్థిస్తుంటాను.

నాకో పువ్వుని బహుమతిగా ఇవ్వమని.

ఆ ప్రక్కనే వున్న 
ఓ పూలచెట్టు వంకైనా చూడక
నిర్లక్ష్యం చేస్తూ


74

ఇంతకీ సాహిత్యమో, కవిత్వమో ఏం చేస్తాయోయ్.
పోని ఇది చెప్పు ఓ వాక్యం ఏం చేస్తుందో.
తలనొప్పి సంగతి పక్కన పెట్టి, 
ఉదాత్తంగా ఆలోచిస్తే, సాయంకాల కలాపోసనలా,

నిజానికవి ఏం చేస్తాయో తెలియదు కాని,
అవకాశాలు కొన్నైతే వుండచ్చేమో ఇలా.

నువ్వు గుర్రం అయితే,
అది రౌతై పరుగులు తీయిస్తుంది నిన్ను.
తన లక్ష్యం వైపుకి.

నువ్వే రౌతైతే నీ కోసం గుర్రమై,
నిన్ను గమ్యాన్ని చేరస్తుందది.

నీవు రాయైతే, రప్పైతే
పోని స్థితః ప్రజ్ఞుడివైతే,.
అది కూడా అదేనై అక్కడే కూర్చుంటుంది మరి.



75
మరంత కంఫర్ట్ గా రాసుకుంటాను.
నువ్వు,

 నన్ను కవివి కావు అన్నప్పుడు


No comments:

Post a Comment