Pages

28 March 2016

BEKAAREELU 46-55

46
ఆ రాత్రికి ఆమె
నిదుర దీపాన్ని వెలిగించింది.
కనీసం
కలల కాంతిలోనైనా విహరించాలని.
180915

47
కారణం తెలియదుకాని
ఎప్పటికి
మొదటి మెట్టుపైననే
నిలబడి కూడా
ఆకాశాన్ని అంటుకునేవాడు
కారణజన్ముడనే నమ్ముతాను.
290815

48
నాకు తెలుసు,
నువ్వు నా గురించే
ఓ అక్షరాన్ని ఆశ్రయిస్తావని.

49
పరిష్కారంలేని సమస్యను
ఎప్పటికి గుర్తించకు,

గుర్తించాక,
ఇక జీవితముండదు.
సమస్య తప్ప.
280815


50
1
నాటకం నడుస్తున్నప్పుడు,
మధ్యలో దూరి ఎప్పుడూ నవ్వకు.
ఖచ్చితమైన ఎక్స్ ప్రెషన్ తో
ఓ రాంగ్ డైలాగ్ నడుస్తున్నప్పుడు కూడా
తన్నుకొచ్చే నవ్వునైన,
నొక్కేసి చూస్తుండు, గంభీరంగా.

2
సోదంతా ఎందుగ్గానీ,
ఇంతకీ నువ్వు పాత్రవో, ప్రేక్షకుడివో
నిర్ణయించుకోమంటూ
చిరాకుగా వెళ్ళిపోయిందామె
.26/8/15

51
ఎవడితో జతకడుతుందో కానీ,
అనుక్షణం
విశ్వం నీళ్లాడుతూనే వుంది,
నిరంతర కాల ప్రసవ సమయాల్లో కూడా.


52
అతను
జీవితాన్ని దయతలిచాడు.

చెట్టు కొమ్మకు
దేహాన్ని వేలాడదీసి.

53
నేననుకున్నాను
చూడగానే నిన్ను
నువ్వే గుర్తుకు రావాలని.
ఎవరికో రెప్లికావై
 మిగులుతున్నప్పుడు
అసలైన నిన్ను,
నేనెప్పటికీ హత్తుకోలేనేమో
250815

54
కనుక్కోబడని తోవలాగ
అతను మిగిలిపోయాడు,
నడిచేవారు తోడు లేక.
150815

55
ఇలా లాభం లేదంటూ,
అతనన్నాడు.,

కళ్లల్లో వత్తులేసుకు
కనిపెట్టుకుండేవాళ్లు కాదు,
తుప్పుపట్టిన కత్తిని సానపెట్టేది.

కసిపట్టి వేటాడుతూ,
కాటేసే వాళ్ల మధ్యకెళ్శాలి.
రాపిడిలో పడి రాటుతేలుతేలాలంటే,

గుర్తుంచుకో,
దురదృష్టవంతుడవైతే
మెడ విరిచిన పిట్టలా రాలిపోతావ్.
ఈవెన్,
 పూర్తిగా తుప్పుపట్టాకైన జరిగేదిదేననుకో.


14/8/15

No comments:

Post a Comment