Pages

28 March 2016

బేకారీలు 31-35

31
సాధారణాన్ని అసాధారణంగాను
అసాధారణాన్ని సాధారణంగాను చేసే
ఓ మేధోదృష్టుంటుంది,
వీలైతే వెతికిపట్టుకోవాలి.

ఎందుకంటే
అది నిన్ను భిన్నుడ్ని చేస్తుంది.
తరువాత ఖిన్నున్ని చేసినా, సరే.

32
తెల్లగా వుంది కాబట్టి
ప్రత్యేకంగా గుర్తించావు కాని,

వెలుగుని తనలో
గుది గుచ్చుకొని
నిండా పరుచుకున్న
నల్ల చందమామను
చూసావా నువ్వుప్పుడన్నా.
220915

33
కురుస్తున్న మేఘాన్ని 
వెతికేవాడెవ్వడోయ్,
హృదయం
ఇక్కడ ఎడతెరిపిలేకుండా
తడుస్తున్నప్పుడు.


34
ఒక అబద్దం గురించి
ఎంత నిజాయితీగా మాట్లాడుకున్నా,
దాన్నెప్పటికి నిజం చేయలేం.

ఒక అనుమానం రేకెత్తించుకున్నాక
ఎంత నమ్మకంగా నమ్మినా
దాన్ని సమూలంగా అణిచేయలేం.
060915

35

అతను
విజయానికి
బాటేసుకున్నాడు,

తనను తాను
తివాచిగా పరుచుకుని,
కాళ్ల ముందు.
040915



No comments:

Post a Comment