ఈ రోజు హిరోషిమానగరం పై అణదాడి జరిగిన రోజు
(ఆగస్ట్ 6,1945), ప్రపంచశాంతిని కోరుకుంటూ, వెలువడిన ఒక చిన్నపుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.
నా తొలి పుస్తకసమీక్ష ఇది.
సడాకో,కాగితపు పక్షులు – 35 పేజీల చిన్న పుస్తకం,
ఒక యధార్థ కథ. చదివినంత సేపు కంటతడి పెట్టించి అణుయుధ్ద ప్రమాదాలను, ప్రభావాన్ని
ఆవేదనతో తెలియచేస్తుంది.
హిరోషిమా నగరంలో నివసించిన ఒక చిన్నారి పాప,
సడాకో. అణుబాంబు ప్రమాదం నుంచి బయటపడేనాటికి సడాకో వయసు 2 సంవత్సరాలు. రేడియో
ధార్మిక ధూళి తాకిడికి గురైన ఆ పాప 11సంవత్సరాల వయస్సు దాకా ఆనందంగానే గడుపుతుంది,
పరుగు పందెంలో కళ్లుతిరిగి పడిపోయేవరకు. బడి నుండి నేరుగా ఆసుపత్రిలోని అణువ్యాధుల
ప్రత్యేకవిభాగంలో చేర్చబడుతుంది. రేడియో
ధార్మికత వలన లుకేమియా(రక్తకాన్సర్)కి
గురైందని వైద్యులు నిర్ధారిస్తారు.
జబ్బులోపడ్డ ఎవరైన వేయికాగితపు పక్షులు చేస్తే, దేవుడు
వారిని ఆరోగ్యవంతులని చేస్తాడని స్నేహితురాలు చుజూకో, ఒక బంగారు రంగు కాగితపు
పక్షిని బహుమతిగా ఇస్తుంది. కొత్త ఉత్సాహం, కొండత నమ్మకంతో సడాకో సుసాకి పక్షులు
చేయడం మొదలుపెడుతుంది. సడాకో అన్న మాసాహిరో వాటిని దారంతో పైకప్పుకి వేలాడాదీస్తుంటాడు.
అవి గాలికి ఊగుతూ ఆపాపకి మరింత నమ్మకాన్ని కలిగిస్తుంటాయి. ఆసుపత్రిలో పరిచయమైన
కెంజి అనే పాప మరణంతో దిగులు పడిపోయిన సడాకో తరువాత మరణించబోయేది నేనేనా అని
అందరిని అడుగుతుంది. వేయి పక్షులు పూర్తిచేయి, నీకేమి కాదని దైర్యం చెప్తారు
అందరు.
ముదిరిన వ్యాధితో, సహకరించని చేతులతో,బంగారు రంగు
కాగితపు పక్షిని గుండెలకు హత్తుకోని, గాలికి ఊగుతున్న 644 పక్షులను చూస్తూ,ఒక్కసారి
బలంగా ఊపిరితీసుకోని, కళ్లుమూసుకుంటుంది, ఆ చిన్నారి కళ్లు ఇక మళ్లీ
తెరుచుకోలేదు.1955 అక్టోబర్ 25 వ తేదిన సడాకో మరణించింది.
హిరోషిమా శాంతి ఉద్యానవనంలో, రెండు చేతులతో
కాగితపు పక్షిని పట్టుకొన్న సడాకో స్థూపాన్ని బడి పిల్లలందరు చందాలు పోగుచేసి, కట్టిస్తారు.
దానిపైన ఇలా రాసివుంది.
ఇవే మా కన్నీళ్ళు.
ఇవే మా వేడుకోళ్ళు.
ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలి.
10 రూపాయల ఈ చిన్న పుస్తకానికి మూలం ఎలీనార్
కోయిర్ రాసిన
sadako and the thousand paper cranes.
దీనిని తెలుగులోకి అనువదించినది కె.సురేశ్,
ప్రచురణ జన విజ్ఞాన వేదిక ప్రచురణల విభాగం.
ఏ పాపము తెలియకుండానే యుద్దానికి బలైన ఇలాంటి
చిన్నారులెందరో.
శాంతిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు చదవాల్సిన
పుస్తకం ఇది.