Pages

26 October 2012

మహాప్రస్థానం


బడుగు బలహీనవర్గాల చైతన్యం కోసం,
పీడిత తాడిత ప్రజల యోగక్షేమాల కోసం,
రాజ్యహింసకు వ్యతిరేఖంగానో,
ఉగ్రవాదాన్ని తుదిముట్టించడానికో,
పోరాటాలు జరుగుతూనే వుంటాయ్.
కళ్లు మూసుకొని బతికేవారో,
ఆశలతో చచ్చేవారో,
ఉపదేశాలతో జనాన్ని నెట్టేవారో,
మహాప్రస్థానమంటూ,
మరోచీకటి వైపుకి పయనించేవారో..
తారసపడుతూనే వుంటారిక్కడ.
కొత్తకొత్త వలలు విసరబడుతుంటాయ్,
నీ బ్రతుకు కోసమే,
కొన్ని మాటలు చెప్పబడుతుంటాయ్.
కాళ్లకింద నలిగిన ఎర్రపుష్పాల పరిమళం,
మత్తుగా నడవమంటుంది,
ఎందుకో,ఒకటర్థంకాదు,
మనకోసమే వచ్చే వాడి,
అసలు వ్యూహాన్ని మనమెప్పడికి చేధించలేమా..
మన జీవితాన్ని మార్చేవాడి,
అసలు రంగుని మనమెప్పడికి, చూడలేమా....
రాజ్యమేలేని రాజ్యం గురించి,
ఇక్కడెవ్వడు మాట్లాడడు.
మా రాజ్యం రావాలనేవాడో,
మనోడు రాజు కావలనేవాడో తప్ప.
రక్తంలో ముంచిన జీవితాలను,
అక్షరాలల్లో కుదించి,
ఇంకొందర్ని కదిలించి,
వారి రక్తం కోసం ఆశగా ఎదురుచూసే వారి
కాలాల్నెందుకు దాటలేక పోతున్నామో....
వాడ్ని చంపింది ఎవరో,
పోస్ట్ మార్టం మాత్రం ఏం చెబుతుంది.
పోలిస్ తూటానో, పదునైన అక్షరమో.
అంతులేని యుద్దాలు నడుస్తూనే వుంటాయ్.
అవును, శాంతి ఇక్కడ విరామం మాత్రమే...
తుదిలేని పోరాటమే శాశ్విత సత్యం,
కారణాలేవైనప్పటికి.
చరిత్ర కొన్ని సార్లు నిజం చెబుతుంది,
మరికొన్ని సార్లు అబద్దమూ చెబుతుంది.
ఎక్కువగా వక్రీకరణా అయుండచ్చు,
కానీ ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతూనే వుంటుంది.
ఆధిపత్యం కోసమో,అనవసరపు సిధ్దాంతం కోసమో..
బలహీనుడెప్పుడూ వేటాడబడుతూనే వుంటాడని,
ప్రతి బలహీనుడు,
 తనకన్నా బలహీనుడ్నే వెతుక్కుంటాడని.

25 October 2012

పిల్లల ట్రెక్కింగ్


కనిగిరి, ప్రకాశం జిల్లాలో ఒక చిన్న స్థాయి పట్టణం. చారిత్రికంగా ఖడ్గతిక్కన యుద్దానికి వచ్చింది. కనిగిరి రాజు కాటంరాజు పైకే,  కాటం రాజుల కాలంలోదాదాపు 400సంవత్సరాల క్రింతం పక్కనే వున్న కొండలలో ఒక దుర్గంన్ని నిర్నించబడింది, దాన్నే లోదుర్గం  అంటారు. ఈ లోదుర్గానికి కనిగిరి నుంచి రెండు మార్గాలు వున్నాయి. వాటిలో ఒక మార్గం ఇది. దసరా శెలవల్లో పిల్లలతో   ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి, ఆ దారిలో కొంత దూరం వెళ్ళి వచ్చాను, ఆ వీడియోనే ఇది, ఇంకో రెండు కిలోమీటర్లు నడవాలి, అక్కడికి వెళ్లాలంటే,...మరోసారి మీకు అసలు లోదుర్గంలో ఏముందో చూపిస్తాను. ఇంకా, నేను కూడా చూడలేదులేండి.

24 October 2012

మనిషి కళ



ఇలానే వుండాలని శాసించేదేదైనా వుందా,
మనల్ని మనమే ఇలా నిర్ధేశించుకుంటున్నామా...
జీవితం, అంత సంక్లిష్టమైనది కాదు,
అని తెలిసికూడా,
ఇలా ఉచ్చులో చిక్కినట్లు,
విలవిల లాడుతుండాల్సిదేనా...
సాధారణమైన బతుకు సత్యాలను,
అసాధారణంగా ఊహించుకొంటూ,
ఇలా బిక్కచచ్చిపోవలసిందేనా....
ఒక మామూలు సరళరేఖను,
లక్ష వక్రాలుగల వృత్తంగా మార్చి,
మెడకు బిగించుకొని,
ఉరికంభానికి వేలాడుతున్నట్లు,
గిజగిజ లాడుతుండాల్సిందేనా....
అలానే బతకడం,
మనిషికి మాత్రమే చేతనయైన,
ప్రత్యేక కళమో,కదా....
దేవుడిచ్చిన ఐదుపైసల పాత్రకి,
వందరూపాయల ఓవరాక్షన్ తో ,
అభాసుపాలైన నాటకం కదూ,.
నేటి మన జీవితం..

20 October 2012

తాలిబాన్లు మీకు ధన్యవాదాలు,



ఒక తుపాకీ గుండుతో
కేవలం ఒక్క ఆడపిల్లపై దాడి చేసి
ఇంత చైతన్యాన్ని రగిల్చినందుకు,
తాలిబాన్లు మీకు ధన్యవాదాలు.

అమ్మకడుపు గడప దాటకుండానే,
ఆడపిల్లలిక్కడ వధించబడుతుంటారు.
బడి నీడన ఎదగకుండా,
తాలిబాన్ తండ్రులు అడ్డుకొంటుంటారు.
యువ తాలిబాన్లు
యాసిడ్ దాడులు చేసేస్తుంటారు.
అత్యాచారాలు జరిపేస్తుంటారు.
తాలిబాన్ సోదరులు
పరువు హత్యలు చేసేస్తుంటారు.
ప్రతి మగాడిలో ఇక్కడ
ఓ తాలిబాన్ నిద్రిస్తుంటాడు
అవసరాన్ని బట్టి స్పందిస్తుంటాడు.

మరంత చైతన్యం కోసం,
స్ఫూర్తివంతమైన మార్గాన్ని నిర్మించడం కోసం,
తాలిబాన్లూ, వీలైతే
మరికొంతమంది మలాలాలను కాల్చేయండి,
అప్పుడైనా ప్రతి ఆడపిల్లకూ,
బడి అవసరం గుర్తొస్తుంది,
జనాలకి వీథికెక్కి ప్రశ్నించే ధైర్యమూ వస్తుంది.

స్వచ్ఛమైన మీ మూర్ఖత్వం,
ప్రపంచానికి మేలే చేసింది,
మీ పాకిస్తాన్ కు మరీ ఎక్కువగా....

ముసుగేసుకున్న మా మూర్ఖత్వం,
నిరంతరం మమ్మల్ని ముంచేస్తూనే వుంది.

మలాలాలున్నారిక్కడా వేలాదిగా,
నీలా ప్రశ్నించేవారో, పోరాడేవారో,
కనీసం వాటికి, అండగా నిలబడేవారో,
ఒక్కరూ లేరనిపిస్తుంది, మలాలా.....
ఇక్కడ పుట్టనందుకు, అభినందనలు.

ఆడపిల్లల చదువు గురించి
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు ఖర్చుపెడితే
ఇంత ప్రచారం సాధ్యమవుతుంది
ఇంత ప్రభావాన్ని చూపగలుగుతుంది,

మాలాలా , నీ రక్తం బొట్టు విలువ
కోటానుకోట్ల ఆడపిల్లల కంటి వెలుగులని,
అర్థమయ్యే వుంటుంది నీకీపాటికే

అందుకే ఆసుపత్రి మంచంపై
ప్రశాంతంగా కనిపిస్తున్నావ్,
నీ లక్ష్యాన్నిక్కడ పరుగులుతీయిస్తున్నావ్.

నిశ్చయంగా తెలుసు నాకు,
నీవు నవ్వుతూ బయటకొస్తావ్,
నిర్భయంగా సంచరిస్తావ్.
శాంతి దూతవై విహరిస్తావ్.

మలాలా చనిపోకుండా కాల్చినందుకు.
తాలిబాన్లూ మరొక్కసారి ధన్యవాదాలు మీకు,


19 October 2012

ఆలోచన.....

ఒక్క నిమిషం నిడివిగల  ఈ యానిమేటడ్ షార్ట్ ఫిల్మ్ చాలా సార్లు ఒక వైపు నుంచి మాత్రమే పయనించే మన ఆలోచనలను గుర్తుచేస్తుంది. మీ  అందరి కోసం.........

15 October 2012

దాహం,...నీరు విలువైనది. కాపాడుకుందాం



మంచి టేకింగ్ తో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్,  ఏమి చెప్పాలనుకుందో నాకర్థం కాలేదు కాని, బాగుందనిపించింది, దాదాపు 7 నిమిషాల ఈ ఫిల్మ్ ను చూడలనుకుంటే ,పైన క్లిక్ చేసేయండి.
నీరు మనకు ప్రాణాధారం,..
పొదుపుగా వాడండి....
నీటి విలువను గుర్తించండి.....

13 October 2012

ఇస్ట్ లు అను ....



రాత్రంతా కమ్మని కలలు కనీ కని,
పగలంతా శ్రమించీ, కష్టించీ,
రక్తం ధారపోసీ, పోసి
కన్నకలలకు,
ఎరుపు రంగు పులిమే,
చారిత్రక తప్పిదిస్ట్,
మన కమ్యూనిస్ట్.

ఎడాపెడా
వాడిపారేస్తుంటారందరు.
విజ్ఞానమో,వినాశనమో
సుఖిస్తారో, నశిస్తారో
ప్రయోగమే కుటుంబం,
ఆలోచనలే ఆస్థి.
ఎవరికీ పట్టడు,
ఎవరినీ పట్టించుకోడు.
 మన సైంటిస్ట్

ముగ్గులేస్తూ మొగుడు,
పడక్కుర్చీలో పెళ్లాం.
మాటలెక్కువ,
మార్పు తక్కువ.
మగజాతిని చీల్చిచెండాడే,
ఉద్రేకిస్ట్
మన ఫెమినిస్ట్.

ఒకడి చేతిలో పెన్ను,
ఇంకొకడి చేతిలో గన్ను.
లక్ష్యమేదైన,
గురిచూసి కాల్చడమే, రాయడమే
సిద్దాంతమేదైన,
ఎటో వైపుకి
జనజీవితాన్ని నడిపించడమే,
ఎవర్నో ఒకర్ని వణికించడమే,
మావోయిస్ట్  -  జర్నలిస్ట్.

వాడి గోల వాడిదే,
అదో ప్రపంచం.
రంగులో,  తలపులో
గీతలో, రాతలో
వ్యసనమో, అదే జీవితమో
లోకమే పట్టని,
పిచ్చి మా లోకం.
నిరంతర స్వప్నిస్ట్
మన ఆర్టిస్ట్.

అందరిలో
అప్పుడప్పుడు తొంగిచూస్తుంటాడు,
పక్కనోడి కష్టాలు,
పైకి పలకరింపులు.
వాడి మనసులో కిలకిలలు.
బయట పడని
లోపలి మనిషి,
మనందరిలో మనిషి,
శాడిస్ట్.

12 October 2012

నో కామెంట్స్ ప్లీజ్............


నా బ్లాగ్ లో ి కామెంట్లు  పెట్టెను  ఈ రోజు నుంచి తొలగించాను, కాబట్టి ఇక నుంచి నాకు కామెంట్లు వచ్చే అవకాశం లేదు. బ్లాగర్ల కుటుంబంలో కామెంట్లు వలన ఒకరికొకరు ఎంతో దగ్గిరైన ఫీలింగ్ ను నేను కోల్పోతున్నాననే బాధ వున్నప్పటికి,  కొంత కాలం వ్యాఖ్యలు లేకుండాకొనసాగుదామను కుంటున్నాను. నాకు వచ్చిన మొదటి కామెంట్  
మిత్రుడు రవిశేఖర్ నుంచి, రవి శేఖర్ కు ధన్యవాదాలు, అత్యంత ఆత్మీయంగా దగ్గర దగ్గర నా ప్రతి కవితకు కామెంట్లు వుంచి ప్రోత్సహించిన జలతారువెన్నల గారికి హృదయపూర్వక దన్యవాదాలు,  మిత్రులు శ్రీ గారు, ఫాతిమాగారు, పద్మార్పిత గారు, రాజీ గారు,సీత గారు, సాయి గారు, ప్రేరణగారు, సృజన గారు, తనోజ్ గారు, పూర్వ ఫాల్గుణి గారు, రమేష్ గారు, సుభ గారు, అనురాధ గారు, మంజు గారు,భారతి గారు, వనజవనమాలి గారు, వీణా లహరి గారు, లాస్య రామకృష్ణ గారు, రసజ్ఞ గారు,ప్రియగారు, కావ్యాంజలి గారు, స్కై గారు, లక్ష్మీ రాఘవ గారు, హర్ష గారు, పంతుల గోపాలకృష్ణగారు, యోహంత్ గారు, కల్యాణ్ గారు, ప్రతి ఉదయం గారు, కష్టేఫలి గారు, అనికేత్ గారు, కెక్యూబ్ వర్మగారు,మాధవరావుగారు,భోనగిరి గారు,సంతు గారు, బోర్న టు పెర్ఫామ్ గారు,లక్ష్మీదేవిగారు, చిన్నిగారు, యస్.కె.ఎన్. ఆర్ గారు,జ్యోతిర్మయి గారు, శశిర గారు, శివరామ్ ప్రసాద్ గారు,రంగాచార్యులు గారు,మధు మోహన్ గారు,రాజ్ కుమార్ గారు,శశికళ గారు, పల్లాకొండల రావు గారు, శ్యామలీయం గారు,శిరీష గారు, జాన్ హైడ్ కనుమూరి గారు,పురాణపండ ఫణి గారు, రాజేష్ గారు,నిషిగంధ గారు, సుజాత గారు,వెంకట్ రాజారావు గారు, విజయ్ మోహన్ గారు, నారాయణ స్వామి గారు,యన్. యస్. మూర్తి గారు, చిన్ని ఆశ గారు, వల్లూరి రాఘవ గారు.వల్లి గారు.కృష్ణ గారు, రవి గారు, రవి గార్లపాటి గారు,చిన్ని గారు. లోకేష్ శ్రీకాంత్ గారు,బుద్దా మురళీ గారు, శ్రీనివాస్ నయనాల గారు, జ్యోతిర్మయి మాధవి గారు,రామ్ మోహన్ గారు, క్రాంతి కుమార్ గారు, ప్రిన్స్ గారు,పరిమళం గారు, సాంబు గారు,బాలకృష్ణారెడ్డి గారు,మాలా కుమార్ , శృతి రుద్రాక్ష్ గారు, కల్యాణ్ గారు,ఆదిత్య చౌదరి గారు, జిలేబి గారు, కరుణాకర్ గారు,కొంత మంది అజ్ఞాతలు,......... ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, మీ అందరు మీ అభిమానాన్ని అప్పుడప్పుడన్నా నా బ్లాగ్ లోకి తొంగి చూసి ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. నాకు వచ్చిన చివరి కామెంటు సుభ హాసిని గారిది,  వారి వ్యాఖ్య ఏమిటో తెలుసా,,......హ,హ,... నో కామెంట్.... అని.

11 October 2012

కట్టుడు పళ్లు



2 నిమిషాలు సాగే ఈ షార్ట్ ఫిల్మ్ హృద్యంగా వుంటుంది, నాకు బాగా నచ్చింది, మీరూ చూడండి, .....

10 October 2012

ఎలివేటర్ ఫీలింగ్స్




4 నిమిషాల ఈ షార్ట్ ఫిల్మ్  సరదాగా సాగుతుంది, కొన్ని సార్లు మనం తీసుకొనే అతి జాగ్రత్తలను గుర్తుచేస్తుందిది.
ఓపిక వుంటే చూసేయండి మరి.

8 October 2012

ఫేస్ బుక్ కష్టాలు



ఒంటి గంట, ఈ షార్ట్ ఫిల్మ్ చూశారా? (12min)

ఒక చిన్న ఐడియాతో రూపొందిచిన ఈ ఫిల్మ్ ఫరవాలేదనిపించింది. కథనం కొంచం నిదానంగా సాగిన చూసి అభినందిచదగిన చిత్రం గానే చెప్పుకోవచ్చు.

7 October 2012

అత్యాశ, .ఆపదలోకి. దారి.....


రెండు నిమిషాల ఈ షార్ట్ ఫిల్మ్ మనిషి అత్యాశని అద్భుతంగా చూపగలిగింది,  నాకు నచ్చిన ఈ ఫిల్మ్ మీకు చూపిద్దామని ఇలా నా బ్లాగ్ నుంచి పోస్ట్ చేస్తున్నాను.

4 October 2012

ఓ అంతరంగం



అదేం కోరుతుందో,
అక్కడేముందో,
తెలుసుకుంటావా?
నువ్వెప్పటికైన.......
ఆ నవ్వుల వెలుగుల్లో,
పరీశీలనగా చూసుకుంటావా??
నీ మనసు మరకల్ని
ఏ నాటికైనా.......
ఆ నులి వెచ్చని,
ఎర్రని జ్వాలల్లో,
ప్రవేశార్హతను ప్రశ్నించుకున్నావా???
నువ్వెప్పుడైన.......

1 October 2012

అంతర్జాతీయ శాఖాహార దినోత్సవ శుభాకాంక్షలు


నేడు ప్రపంచ శాఖాహార దినోత్సవం.

నీలోని మాంసమే,
నీకు ఎక్కువాయే.
చికెన్, మటన్ నీకు,
చావు తెచ్చు.

కంటికి నచ్చిందంతా కడుపులోకి దోపుకుంటే వచ్చేది అజీర్తీ, అనారోగ్యం. శారీరక శ్రమ తగ్గిపోవడంతో, తీసుకొనే ఆహారం కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి లైఫ్‌ స్టైల్‌ డిసీజెస్‌ దరి చేరకూడదనుకుంటే శాఖాహారం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. వెజిటేరియన్‌ స్పెషల్‌ మీ కోసం రోజువారీ దినచర్యలో మనకు కావాల్సిన పోషకాలు ఒట్టి శాఖాహారంలో దొరకవనుకుంటారు. బలం కావాలంటే చికెన్‌ తందూరీ, మటన్‌ మంచూరియా లాగించాలని అనుకుంటారు. నాన్‌ వెజ్‌లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయని, బలంగా ఉండడానికి కావాల్సిన ప్రొటీన్స్‌ లభ్యమవుతాయని అనుకుంటారు. అయితే మాంసాహారంలో పీచు పదార్ధాలు లేకపోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదని న్యూట్రీషియన్స్‌ చెబుతున్నారు. మాంసంలో లభించే ప్రొటీన్స్‌ కన్నా శాఖా హారంలోనే ఎక్కువ లభ్యమవుతాయి. వెజ్‌ వర్సెస్‌ నాన్‌ వెజ్‌ ఈ రెండు ఆహారాల మధ్య తేడా అనేక రకాలుగా ఉంటుంది. కంది పప్పుకి, కోడికూరకు పోటీ పెడితే ఏది గెలుస్తోందో చూద్దాం. వంద గ్రాములు కందిపప్పులో 26 గ్రామలు ప్రోటీన్లు ఉంటే, చికెన్‌లోని వివిధ భాగాలలో లభించే సగటు ప్రోటీన్లు కేవలం 18.4 గ్రాములే. 350 కేలరీలతో కందులే ముందున్నాయి. కోడిలో 159 కేలరీలే లభిస్తాయి. పప్పు ధాన్యాల్లో కార్బో హైడ్రేట్స్‌ 60 గ్రాములుంటే, చికెన్‌లో గుండు సున్నానే. పైగా కంది పప్పుకు కొవ్వు తక్కువే. కోడికి మాత్రం రెండు గ్రాములుంటుంది. ఐరన్‌ మాత్రం రెండింటిల్లోనూ ఇంచుమించు సమానంగానే లభిస్తుంది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎనిమిది గంటలు పడితే, శాఖాహారం నాలుగు గంటల్లోనే అరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థపై కూడా భారం తక్కువ పడుతుంది.