బడుగు బలహీనవర్గాల చైతన్యం కోసం,
పీడిత తాడిత ప్రజల యోగక్షేమాల కోసం,
రాజ్యహింసకు వ్యతిరేఖంగానో,
ఉగ్రవాదాన్ని తుదిముట్టించడానికో,
పోరాటాలు జరుగుతూనే వుంటాయ్.
కళ్లు మూసుకొని బతికేవారో,
ఆశలతో చచ్చేవారో,
ఉపదేశాలతో జనాన్ని నెట్టేవారో,
మహాప్రస్థానమంటూ,
మరోచీకటి వైపుకి పయనించేవారో..
తారసపడుతూనే వుంటారిక్కడ.
కొత్తకొత్త వలలు విసరబడుతుంటాయ్,
నీ బ్రతుకు కోసమే,
కొన్ని మాటలు చెప్పబడుతుంటాయ్.
కాళ్లకింద నలిగిన ఎర్రపుష్పాల పరిమళం,
మత్తుగా నడవమంటుంది,
ఎందుకో,ఒకటర్థంకాదు,
మనకోసమే వచ్చే వాడి,
అసలు వ్యూహాన్ని మనమెప్పడికి చేధించలేమా..
మన జీవితాన్ని మార్చేవాడి,
అసలు రంగుని మనమెప్పడికి, చూడలేమా....
రాజ్యమేలేని రాజ్యం గురించి,
ఇక్కడెవ్వడు మాట్లాడడు.
మా రాజ్యం రావాలనేవాడో,
మనోడు రాజు కావలనేవాడో తప్ప.
రక్తంలో ముంచిన జీవితాలను,
అక్షరాలల్లో కుదించి,
ఇంకొందర్ని కదిలించి,
వారి రక్తం కోసం ఆశగా ఎదురుచూసే వారి
కాలాల్నెందుకు దాటలేక పోతున్నామో....
వాడ్ని చంపింది ఎవరో,
పోస్ట్ మార్టం మాత్రం ఏం చెబుతుంది.
పోలిస్ తూటానో, పదునైన అక్షరమో.
అంతులేని యుద్దాలు నడుస్తూనే వుంటాయ్.
అవును, శాంతి ఇక్కడ విరామం మాత్రమే...
తుదిలేని పోరాటమే శాశ్విత సత్యం,
కారణాలేవైనప్పటికి.
చరిత్ర కొన్ని సార్లు నిజం చెబుతుంది,
మరికొన్ని సార్లు అబద్దమూ చెబుతుంది.
ఎక్కువగా వక్రీకరణా అయుండచ్చు,
కానీ ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతూనే వుంటుంది.
ఆధిపత్యం కోసమో,అనవసరపు సిధ్దాంతం కోసమో..
బలహీనుడెప్పుడూ వేటాడబడుతూనే వుంటాడని,
ప్రతి బలహీనుడు,
తనకన్నా బలహీనుడ్నే వెతుక్కుంటాడని.