Pages

20 October 2012

తాలిబాన్లు మీకు ధన్యవాదాలు,



ఒక తుపాకీ గుండుతో
కేవలం ఒక్క ఆడపిల్లపై దాడి చేసి
ఇంత చైతన్యాన్ని రగిల్చినందుకు,
తాలిబాన్లు మీకు ధన్యవాదాలు.

అమ్మకడుపు గడప దాటకుండానే,
ఆడపిల్లలిక్కడ వధించబడుతుంటారు.
బడి నీడన ఎదగకుండా,
తాలిబాన్ తండ్రులు అడ్డుకొంటుంటారు.
యువ తాలిబాన్లు
యాసిడ్ దాడులు చేసేస్తుంటారు.
అత్యాచారాలు జరిపేస్తుంటారు.
తాలిబాన్ సోదరులు
పరువు హత్యలు చేసేస్తుంటారు.
ప్రతి మగాడిలో ఇక్కడ
ఓ తాలిబాన్ నిద్రిస్తుంటాడు
అవసరాన్ని బట్టి స్పందిస్తుంటాడు.

మరంత చైతన్యం కోసం,
స్ఫూర్తివంతమైన మార్గాన్ని నిర్మించడం కోసం,
తాలిబాన్లూ, వీలైతే
మరికొంతమంది మలాలాలను కాల్చేయండి,
అప్పుడైనా ప్రతి ఆడపిల్లకూ,
బడి అవసరం గుర్తొస్తుంది,
జనాలకి వీథికెక్కి ప్రశ్నించే ధైర్యమూ వస్తుంది.

స్వచ్ఛమైన మీ మూర్ఖత్వం,
ప్రపంచానికి మేలే చేసింది,
మీ పాకిస్తాన్ కు మరీ ఎక్కువగా....

ముసుగేసుకున్న మా మూర్ఖత్వం,
నిరంతరం మమ్మల్ని ముంచేస్తూనే వుంది.

మలాలాలున్నారిక్కడా వేలాదిగా,
నీలా ప్రశ్నించేవారో, పోరాడేవారో,
కనీసం వాటికి, అండగా నిలబడేవారో,
ఒక్కరూ లేరనిపిస్తుంది, మలాలా.....
ఇక్కడ పుట్టనందుకు, అభినందనలు.

ఆడపిల్లల చదువు గురించి
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు ఖర్చుపెడితే
ఇంత ప్రచారం సాధ్యమవుతుంది
ఇంత ప్రభావాన్ని చూపగలుగుతుంది,

మాలాలా , నీ రక్తం బొట్టు విలువ
కోటానుకోట్ల ఆడపిల్లల కంటి వెలుగులని,
అర్థమయ్యే వుంటుంది నీకీపాటికే

అందుకే ఆసుపత్రి మంచంపై
ప్రశాంతంగా కనిపిస్తున్నావ్,
నీ లక్ష్యాన్నిక్కడ పరుగులుతీయిస్తున్నావ్.

నిశ్చయంగా తెలుసు నాకు,
నీవు నవ్వుతూ బయటకొస్తావ్,
నిర్భయంగా సంచరిస్తావ్.
శాంతి దూతవై విహరిస్తావ్.

మలాలా చనిపోకుండా కాల్చినందుకు.
తాలిబాన్లూ మరొక్కసారి ధన్యవాదాలు మీకు,