మన దేశంలో నాణేల చరిత్ర లేదా సేకరణ అనగానే దాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించుకోవచ్చు.
1) 1835 కు ముందు ముద్రించబడిన నాణేలు
2) 1835 – 1947 కాలం లో ముద్రించబడిన నాణేలు
(వీటినే బ్రిటిష్ ఇండియా నాణేలు అంటారు)
3) 1947 తరువాత ముద్రించబడిన నాణేలు
( వీటిని రిపబ్లిక్ ఇండియా నాణేలు అంటారు.)
ఈ టపాలో బ్రిటిష్ ఇండియా నాణేల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1834 నాటికి సుమారు భారతదేశమంతా(కొన్ని సంస్థానాలు,ఫ్రెంచ్,డచ్ ప్రాంతాలు కాకుండా) ఈస్టిండియా కంపెనీ వారి పాలన క్రిందకు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. అప్పటికే బ్రిటిష్ వారు నాణేలను ముద్రిస్తున్నప్పటికి, వాటిని మూడు ప్రెసిడెన్సీల నుంచి (మద్రాసు, బొంబాయి,కలకత్తా) మూడు రకాలుగా వెలువడుతుండేవి, వాటి పేర్లు,బరువులు,రూపాలు రకరకాలుగా వుండేవి,(వాటిని గురించి మళ్లీ చెప్పుకుందాం.) మూడు ప్రెసిడెన్సీల నుంచి ఒకే రకమైన నాణేలను ముద్రించాలని నిర్ణయించాక, వాటి బరువు,లోహం,డిజైన్ వీటికి సంబంధించి వేయబడిన కలకత్తా మింట్ కమిటి అనేక సూచనలు చేసింది, అవన్నీ దాదాపుగా అమలు చేయబడ్డాయి, జరిగిన ముఖ్యమైన మార్పు బంగారు, వెండి నాణేల మీద బ్రిటిష్ రాజు బొమ్మని ముద్రించడం. అందువలననే భారతదేశనాణేల చరిత్రలో 1835కు అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది.
అప్పుడు బ్రిటిష్ రాజు కింగ్ విలియం నాలుగు. కమిటిని నియమించింది కూడా ఈయనే. నాణేల మీది రోమన్ అంకెలలో నాలుగుని IIII ఇలా వేసేవారు.కారణం తెలియదు నాకు. King william IIII పేరుతో మనకు దొరకే అన్ని నాణేలు పై కూడా 1835 సంవత్సరమే వుంటుంది.
మొత్తం ఐదుగురు రాజుల బొమ్మలతో నాణేలు వెలువడ్డాయి,
1) కింగ్ విలియం – 4 ( 1835 సంవత్సరం లో మాత్రమే ముద్రించబడ్డాయి)
2) క్యీన్ విక్టోరియా (1840 – 1901 వరకు ముద్రించబడ్డాయి)
3) కింగ్ ఎడ్వర్డ్ - 7 (1903 - 1910 వరకు ముద్రించబడ్డాయి)
4) కింగ్ జార్జి – 5(1911 - 1936 వరకు ముద్రించబడ్డాయి)
5) కింగ్ జార్జి – 6 (1938 - 1947 వరకు ముద్రించబడ్డాయి)
కింగ్ విలియం 4 జీవిత విశేషాలు.,
మూడవ జార్జి మూడవ కొడుకైన విలియం హెన్రీ, 1765,ఆగస్ట్ 21 జన్మించాడు. 1831 సెప్టంబర్ 8 న అధికారంలోకి వచ్చిన విలియం 4, 1837,జూన్ 20 మరణించాడు. ఇతని కాలంలో మొత్తం ఎనిమిది రకాల నాణేలు వెలువడ్డాయి.వాటి వివరాలు చూద్దాం.
మొదటి నాణేము.,. డబుల్ మోహర్*
( బంగారు నాణెం,..ముప్పై రూపాయలకు సమానం)
దీని బరువు 23.32 గ్రాములు,వ్యాసం 32.5 మిల్లీమీటర్లు
దీని బొమ్మ భాగంలో King william IIII తలభాగం వుంటుంది, పైన పేరు,క్రింద సంవత్సరం వుంటుంది.
అచ్చుభాగంలో సింహం, ఈతచెట్టు బొమ్మ వుండేది,.
( మన రిజర్వ్ బ్యాంక్ గుర్తులో సింహం బదులు పులి వుంటుంది.) క్రింద విలువ ఇంగ్లీష్, ఉర్దూలలో వుంటుంది. పై భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు ఉంటుంది.
రెండవ నాణేము.,. మోహర్ *
( బంగారు నాణెం,..పదిహేను రూపాయలకు సమానం)
దీని బరువు 11.66 గ్రాములు,వ్యాసం 26 మిల్లీమీటర్లు
(వివరణ డబుల్ మోహర్ లానే)
మూడవ నాణేము..,.రూపాయి (వెండి నాణేం)
దీని బరువు 11.66 గ్రాములు,వ్యాసం 30.5 మిల్లీమీటర్లు
దీని బొమ్మ భాగంలో King willum IIII తలభాగం వుంటుంది, క్రింద పేరు వుంటుంది.
అచ్చు భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు, సంవత్సరం ముద్రించేవారు.
నాలుగవ నాణేము ,...అర్థరూపాయి* ( వెండి నాణేము)
దీని బరువు 5.83 గ్రాములు,వ్యాసం 24.6 మిల్లీమీటర్లు
(వివరణ రూపాయి లాగానే)
ఐదవనాణేం,..పావు రూపాయి (వెండి నాణెం)
ఈ నాణెం 1840 లో వెలువడినప్పటికి కాయిన్ పై 1835 అనే వుంటుంది.
దీని బరువు 2.91 గ్రాములు,వ్యాసం 20 మిల్లీమీటర్లు
(వివరణ రూపాయి లాగానే)
ఆరవ నాణెం .,.అర్థ అణా (రాగి నాణెం
దీని బరువు 12.95 గ్రాములు,వ్యాసం 31.2 మిల్లీమీటర్లు
దీని బొమ్మ భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి లోగో ,సంవత్సరం వుంటుంది.
అచ్చు భాగంలో ఈస్ట్ ఇండియాకంపెనీ పేరు ముద్రించేవారు
ఏడవ నాణెం .,.పావు అణా (రాగి నాణెం
దీని బరువు 6.47 గ్రాములు,వ్యాసం 6.47 మిల్లీమీటర్లు
(వివరణ అర్థ అణా లాగానే)
ఎనిమిదవ నాణెం .,.1/12 అణా (రాగి నాణెం
దీని బరువు 2.16 గ్రాములు,వ్యాసం 17.5 మిల్లీమీటర్లు
(వివరణ అర్థ అణా లాగానే)
(* గుర్తుండేవి నా దగ్గర లేనివి)