Pages

1 April 2013

ద్రోహపు వేటు



1
పైపై పూతలు ముఖమంతా
పులుముకున్న మేధావొకడికి,
హఠాత్తుగా సూర్యోదయమైంది,.
పొలికేకలేస్తాడు,.విశ్వానికిదే తొలిరోజని,.
బిక్కమొఖమేసుకుని, బిగుసుకుపోతాడు,.
దివారాత్రాలు శ్రమిస్తున్న, ఓ శ్రామికుడు,.
అంత జ్ఞానాన్ని ఒక్కసారిగా జీర్ణించుకోలేక,.

2
కన్నీళ్లతో కవిత్వాన్ని కడుగుతూ,
కమనీయం చేయాలనే భ్రమలతో,.
హృదయాన్ని పరిచే అమాయకుడొకడుంటాడు,.
కములుతున్న వేదనతో  నిండిన మనసుని,
మొద్దుకత్తితో  కైమాకొట్టే కసాయి వాడొకడుంటాడు.

చీల్చుకొచ్చిన గుండెను జుర్రుకుంటూ,
రక్తం కారుతున్న పెదాలను,
నాలుకతో తడుముకుంటూ,
ఆనందించేవాడోకడుంటాడు,.
వాడినేమనాలో అర్థం కాక,
తలగొక్కోనేవాడోకడుంటాడు,.
3
తోటి వాడిని ప్రేమించమన్నందుకు,
మేకులు కొట్టి,బల్లేలతో పొడిచి,
శిలువపై వేలాడదీసిన  చరిత్ర మనది,.
దూరమెంతైనా, క్షణకాలమన్నా
స్మరించుకోవలసిన సందర్భాలుంటాయ్,.

4
కోటి కలల కన్నబిడ్డ భవిష్యత్తుకై,
మధనపడి,తపన చెంది,
ఏవో నాలుగు పాత మంచి మాటలు ,
మనసు చంపుకుని,చెప్పుకున్న పాపానికి,
నాలుక తెగ్గోయడానికి సిద్దపడ్డ,
ఆధునిక కొడుకుల కాలం నడుస్తున్నప్పుడు,
తండ్రీ ! నువ్వు నోరుమూసుకో !!
5
ఏ దివ్యాత్మల దర్శనాలు
మాట్లాడించాయో నిన్ను,
ఈ నిరంకుశత్వపు, స్వేచ్ఛాకాలాల మధ్య,.

ద్రోహులకు, మాయాజ్ఞానులకు
ఎరుపు తివాచీలు పరుస్తున్నలోకాల మధ్య,.

తండ్రీ ! నువ్వు దుఃఖించకు !!

6
దుఃఖించాడానికి మాత్రం,
ఇక్కడేమి మిగిలింది కనుక,.
కవిత్వమనే పేరుతో,
కులుకుతున్న కుటిలాక్షరాలు తప్ప,.

అసలైన సత్యం ఇంత త్వరగా తారసపడినందుకు,..

సంతోషించు, తండ్రీ !  నువ్వు సంతోషించు !!

2 comments:

  1. బాగుంది మీ కవితాగ్రహం భాస్కర్జీ..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వర్మగారు,..మీ అభినందన ఆనందదాయకం,.

      Delete