Pages

27 April 2013

సుబ్బులు కోసం -1,2,3,4 (ఫన్నీలు)


1
కురిసేటి వానవి
మండు వేసవిలోన,
మంచగంధపు చెక్క
పరిమళము నీవు,.
సుబ్బులు పులకింతవై,  నన్ను హత్తుకోవా,..

ఎండిపోయిన ఏరు,
ఏటి ఒడ్డున రాళ్లు,,
అక్కడక్కడ చెమ్మ,.
నీ ఆనవాలు,.
సుబ్బులు, ఊహవై మిగలబోకు,..

3
రెయిలింగ్ పైనెక్కి,
ముందు వెనుకకు ఊగి,.
రాత్రి కురిసిన వాన,.
చిత్తడిలో నేను,..
సుబ్బులు,.హండిచ్చి తప్పుకోకు,..

3
రేగిపోయిన జుట్టు,
ఎర్రబడిన కళ్లు,.
చండ్ర నిప్పుల జాణ,
దుమ్ములేపెను లోన,.
సుబ్బులు,..నా గుండె నమలబాకు,..

 4
ఎండమావులు లేవు
పిల్ల మేఘము రాదు,
నీటిచుక్కల జాడ కానరాదు,.
నల్లని బుగ్గలలో మెరసేటి లోయలలో
సుబ్బులు, నన్ను దూకనివ్వు,..

( నిజంగా ఇవన్ని అర్థంలేనివి,.పై నాలుగు లైన్లలో ఎదో ఒకటి రాసి,.చివరిలో అలా ముగించండం,..)

24 April 2013

బానిస తత్వం



తలవంచుకు బతకాలనే,
లొంగుబాటు సిద్దాంతపు,
తొలిపాఠం చెబుతుంది,
ఉమ్మనీటి తొట్టె నీకు,..

ఇరుకిరుకు మార్గాలలో
సర్దుకుంటు సాగాలనే
సత్యం భోధిస్తుంది నీకు,
ఈ లోకపు సింహద్వారం,..

బెరుకన్నది, పొగరన్నది,
వయసన్నది,సుఖమన్నది,

ఆకలైన,రోగమైన
కీర్తీ కండూతియైన,
సేవాదృక్పథమైనా,.
స్వార్థం, పరమార్థం
ప్రతిది ఒక లొంగుబాటు,...

ఉద్వేగం ఏదైనా,
అనుభూతులు ఎన్నైనా,.
గుణమైనా,వ్యసనమైన.,.

విశ్వాసం లొంగుబాటు,
విజయకాంక్ష లొంగుబాటు.,.
జ్ఞానం ఒక లొంగుబాటు

లొంగుబాటు లేని బతుకు 
లేదెక్కడ లోకమందు,..

ఆరడుగుల నేలకో,
చితిమంటల జ్వాలకో,
తప్పనిసరి లొంగుబాటే,.
నీ దేహపు చివరి సాక్ష్యం,...

21 April 2013

ఉపసంహరణ



1
పరమ దయాళువైన, నా తండ్రీ,
చిందిచబడిన నీ రక్తము,
మానవజాతి సమస్త పాపాలను,
తరతరాలుగా తుడుస్తూనే వుందని,
విశ్వసిస్తున్నాం, నీ ముందు మోకరిల్లి,.

2
ప్రజల్ని, ప్రభుత్వాలను
నిర్లిప్త సమాజాలను
పశ్చాత్తాప ప్రకటనలను
ప్రతి దాన్ని కవిత్వకరించి,
సరిపుచ్చుకునే నాలాంటి కవులను
క్షమించకు తల్లీ, క్షమించకు
స్రవిస్తున్న నీ పసి రక్తంతో
తనివితీరా శపించు,
సమస్త జగత్తు మూల్యం చెల్లించేటట్లు.,.

3
విలువలు క్షీణిస్తూనే వుంటాయ్,
విశ్వం విస్తరిస్తూనే వుంది,.
అపార కరుణా కృపా సముద్రుడై,
ఆ భగవంతుడు,.
ప్రతి వారిని క్షమిస్తూనే వుంటాడు,.
క్షమించకుడని వారిని కూడా,.

4
ఈ మనుషుల మీద పిచ్చిప్రేమతో
మారతారనే, మిగిలిన కాస్తా నమ్మకంతో
బహుశా, శాపాన్ని ఉపసంహరించుకుందేమో,..
దైవస్వరూపమైన ఆ చిన్నారి మనస్సు,.
అమ్మా, నీకు ధన్యవాదాలు...

14 April 2013

100% కవి



అంతరాంతరాళ లోతుల్లోకి,
ఎప్పుడన్నా తొంగి చూసుకున్నప్పుడు,
అక్కడ నీకో మనిషి కనిపించాలి,.

దురదృష్టవశాత్తు,.
కువకువలాడుతూ,
అక్కడకూడా కవిత్వమే రెపరెపలాడుతుంటే,..

ఓ నా ప్రియమైన కవి,.
విను నా చివరి మాట,..
ఇక మనిషిగా నువ్వు మరణించినట్లే,.....

10 April 2013

ఉగాది పచ్చడి



స్నానం చేసి రాగానే,.
ఉగాది పచ్చడి పెట్టింది, మా ఆవిడ.

కారం మరిచావోయ్, అన్నానో లేదో
రెండు తిట్లు తిట్టింది.

తీపి తగ్గిందంటే,
నవ్వుతూ ఓ ముద్దు పెట్టింది,.

రుచుల ఆరే,.
పచ్చట్లో నాలుగు,
మా ఆవిడలో,. రెండు..

7 April 2013

ఎందుకనో స్త్రీలు,,...



1
కట్టుబాట్లకు భయపడి
కోటికలల వెలుగుల్ని,

ఆటుపోట్ల లయలకు
సంగమిస్తూ జీవితాన్ని,

ఆంక్షలకు బద్దులై
అంతులేని ఆకాంక్షలను,

పూలు రాలుతున్నంత సహజంగా,
ఎందుకో వదులుకుంటారు, స్త్రీలు.


2
మోయలేని భారాల్ని
అనంతమైన వేదనల్ని,
క్షోభిస్తూ వ్యసనాల్ని,

నిశ్శబ్ధ దుఃఖాల్లోకి
మౌన పయనాల్ని,

భూదేవంత సహనంతో
ఎందుకో భరిస్తారు, స్త్రీలు.

3
ఒడిదుడుకులు లేకుండా
ఒక ప్రవాహం నుంచి మరో ప్రవాహానికి,

చప్పుళ్లు చేయని చిరునవ్వులతో
ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచానికి,

కించిత్ విషాదచ్ఛాయలు లేకుండా
ఒక పేరు నుంచి మరో పేరులోకి,

స్నేహ సంభాషణలంత సాధారణంగా,
ఎందుకో బదలాయించబడతారు, స్త్రీలు,.


4
ముందుగా సిద్దపడటం వల్లో
మరెందుకో తెలియదుగాని,

అపరిమిత మేధాతనమో,
బలీయమైన ప్రేమ బంధమో,
తప్పించుకోలేని అమాయకత్వమో,ఏమోగాని,

అరక్షణంలో,
తమని తాము మార్చుకుంటారు, స్త్రీలు,...

లిప్తపాటులో,
శక్తివంతమైన అస్థిత్వాన్ని,బలిస్తారు స్త్రీలు.

1 April 2013

ద్రోహపు వేటు



1
పైపై పూతలు ముఖమంతా
పులుముకున్న మేధావొకడికి,
హఠాత్తుగా సూర్యోదయమైంది,.
పొలికేకలేస్తాడు,.విశ్వానికిదే తొలిరోజని,.
బిక్కమొఖమేసుకుని, బిగుసుకుపోతాడు,.
దివారాత్రాలు శ్రమిస్తున్న, ఓ శ్రామికుడు,.
అంత జ్ఞానాన్ని ఒక్కసారిగా జీర్ణించుకోలేక,.

2
కన్నీళ్లతో కవిత్వాన్ని కడుగుతూ,
కమనీయం చేయాలనే భ్రమలతో,.
హృదయాన్ని పరిచే అమాయకుడొకడుంటాడు,.
కములుతున్న వేదనతో  నిండిన మనసుని,
మొద్దుకత్తితో  కైమాకొట్టే కసాయి వాడొకడుంటాడు.

చీల్చుకొచ్చిన గుండెను జుర్రుకుంటూ,
రక్తం కారుతున్న పెదాలను,
నాలుకతో తడుముకుంటూ,
ఆనందించేవాడోకడుంటాడు,.
వాడినేమనాలో అర్థం కాక,
తలగొక్కోనేవాడోకడుంటాడు,.
3
తోటి వాడిని ప్రేమించమన్నందుకు,
మేకులు కొట్టి,బల్లేలతో పొడిచి,
శిలువపై వేలాడదీసిన  చరిత్ర మనది,.
దూరమెంతైనా, క్షణకాలమన్నా
స్మరించుకోవలసిన సందర్భాలుంటాయ్,.

4
కోటి కలల కన్నబిడ్డ భవిష్యత్తుకై,
మధనపడి,తపన చెంది,
ఏవో నాలుగు పాత మంచి మాటలు ,
మనసు చంపుకుని,చెప్పుకున్న పాపానికి,
నాలుక తెగ్గోయడానికి సిద్దపడ్డ,
ఆధునిక కొడుకుల కాలం నడుస్తున్నప్పుడు,
తండ్రీ ! నువ్వు నోరుమూసుకో !!
5
ఏ దివ్యాత్మల దర్శనాలు
మాట్లాడించాయో నిన్ను,
ఈ నిరంకుశత్వపు, స్వేచ్ఛాకాలాల మధ్య,.

ద్రోహులకు, మాయాజ్ఞానులకు
ఎరుపు తివాచీలు పరుస్తున్నలోకాల మధ్య,.

తండ్రీ ! నువ్వు దుఃఖించకు !!

6
దుఃఖించాడానికి మాత్రం,
ఇక్కడేమి మిగిలింది కనుక,.
కవిత్వమనే పేరుతో,
కులుకుతున్న కుటిలాక్షరాలు తప్ప,.

అసలైన సత్యం ఇంత త్వరగా తారసపడినందుకు,..

సంతోషించు, తండ్రీ !  నువ్వు సంతోషించు !!