Pages

22 April 2014

ద గ్రేట్ స్టుపిడిటి



నా కిప్పుడు జనం కావాలి.

పల్లకీలో ఎక్కించి,.
ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే
బలిసిన భుజాలు లాంటి జనాలు.

రెండు మెతుకులు కూడు కోసం,
కుక్కల్లా  కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు.

పొదుగుల నుండి రక్తం పిండుతున్నా
ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు.

రెండు కాగితాలకు,  ఓ క్వార్టర్ మందుకో
తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,

నాకిప్పుడు జనం కావాలి.

మనుషులమనే మరిచిపోయిన
గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి
ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు
అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు
మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,
సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు.

నాకిప్పుడు జనం కావాలి.

కళ్లుండి చూడని జనాలు,
మెదడుండి ఆలోచించని జనాలు,
కాళ్లూ చేతులూ వుండి
పనిచేయని సోమరి జనాలు.
బతుకంటే ఏంటో తెలియని జనాలు,
బతకడం చేతకాని జనాలు,

బీజమూ లేక, అండమూ రాక
కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే
నపుంసకుల్లాంటి జనాలు కావాలి.

నాకిప్పుడు జనం కావాలి.
నేననుకొనెట్లు మాత్రమే ఆడగల
బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు.

2
ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి.
ఎంత మంది దొరకచ్చిక్కడ?


19 April 2014

అర్థసత్యం



పైకి చెప్పుకోలేని ప్రేమను నొక్కిపెట్టి,
నవ్వుతూ చూస్తాను, నేను నీ వైపుకి
ఎంత నిస్సహాయుడివి నాన్నా, నువ్వని.

ఇంకేమీ చేయలేక,
ఆ కుర్చీ రెక్కలకు పట్టిన దుమ్మును,
చేత్తోనలుపుకుంటూ, నాలుగు మాటలతో పాటుగా
 నీ దుఃఖాన్ని కూడా రాల్చుకుంటావ్.

ఆరిపోయిన దీపమై నేను కూడా,
ఒక పొగలాంటి నిట్టూర్పుతో,
నీ నిష్క్రమణను స్వాగతిస్తాను.

లోపలి మంటల జోలికిపోక,
బహుశా నువ్వు నా నవ్వునే
జ్ఞాపకంగా మిగుల్చుకుంటావేమో! నన్నొదిలి.

నేనిక నీ దుఃఖాన్ని ఏరుకొని తలకెత్తుకుంటాను.

ఆ రాత్రికి ఇక.

తొక్కలు



కవిత్వాన్ని ప్రేమగా హత్తుకొని,
ఇక ఆ తరువాత,

దాని కుత్తుకను కోసి,
కౌగిలించుకొని, కన్నీరు కారుస్తూ,
బిజిలీ లేని గలీజు ఎలీజీలను
గజిబిజిగా రాసుకుంటూ,
సానుభూతి పొందేవాడుంటాడే,
 వాడురా, కరుడుగట్టిన కవంటే.

కవిత్వం ఎదగకూడదు,

పూర్తిగా చావకూడదు.

తొక్కలు



అట్లకాడ కాల్చిన లాంటి ఓ మాటతో
మనసు మీద వాతలేస్తావ్.

ఎలా రాయాలో లేపనాన్ని,
నీకు గాయం కాకుండా.


చెబుతావా మరి నువ్వు, నాకు.

ఎనోమలి



వాడొక చినుకులాగా రాలినప్పుడు
మొలకెత్తే విత్తులా వున్నప్పుడు
విచ్చుకున్న పువ్వులాగా నవ్వినప్పుడు
విరజిమ్ముతున్న నిప్పై రగిలినప్పుడు
వాడొక తేడాగాడు.

సులభ్ కాంప్లెక్స్ తలుపు మీద రాతలా లేనప్పుడు
తుపుక్కున్న ఉమ్మిన పాన్ మరక కానప్పుడు
జిల్ జిల్ జిగాలో ముడుక్కుని కూర్చున్నప్పుడు
బురదలో పందిలా దొర్లనప్పుడు
వాడొక తేడాగాడు.

కాస్తంత బుర్రను వెలిగించుకున్నప్పుడు
మైకాన్ని వదిలి మాట్లాడినప్పుడు
బాధ్యతకు నిలబడి బతికినప్పుడు
గుండెల్ని తెరుచుకుని హత్తుకున్నప్పుడు
మానసిక దుర్భలత్వాన్ని వదలుకున్నప్పుడు
వాడొక తేడాగాడు.

సవాలక్షా మాడాగాళ్లకు,
మాయదారి మీటాగాళ్లకు
అప్పుడయినా, ఇప్పుడైనా 
అక్కడైనా, ఇంకెక్కడైనా

వాడెప్పుడూ నిఖార్సయిన తేడాగాడే.

తొక్కలు


నేను జీవితం గురించి మాట్లాడతాను,
నువ్వు కవిత్వం కధలు చెబుతుంటావు.

మూడువేల ఏడో సారి కలిసినప్పుడు కూడా,
నువ్వు కవిత్వమే మాట్లడతావు.
నేను జీవితాన్నే వింటుంటాను.


గుగాగీలు-15


@ గురువుగారు, పుస్తకమొకటి దొరికింది,
భాష తెలియదు.. ఏం పుస్తకమో ఇది,.
మీ దివ్యదృష్టితో చూసి సెలవిస్తారా స్వామి.

#ఇది కవిత్వ పుస్తకంరా,. నాయినా

@ఆహ, మీ దివ్యదృష్టి అమోఘం స్వామి,
క్షణం లో చెప్పేసారు, సమాధానాన్ని.

#ఒరేయ్ పిచ్చి శిష్యా,. దివ్యదృష్టలేదు,
గాడిదగుడ్డు లేదు,. ప్రపంచంలో ఎక్కడైనా సరే,.
అక్షరాలు తక్కువ, ఖాళీలు ఎక్కువ వుండే
ఒకే ఒక్క పుస్తకం,,. కవిత్వమేరా,.

ఒకటో తరగతి అక్షరాల బుక్కు తరువాత.,

16 April 2014

వివక్ష



ఎంత ప్రేమగా పట్టుకున్నాను దాన్ని.

నా చేతులతో లాలనగా నిమురే లోపే,
విసురుగా ఎగురుతూ,
నా నల్లటి చేతులపై తెల్లటి గీతలు రక్కుతూ,
తెల్లటి రెట్టేసి ఆ తెల్ల పిట్ట
ఎంత అహంకారంగా ఎగిరిందది.
నా రంగుని అవమానిస్తూ.

ఒకే ఒక్కదెబ్బ,
మెడవిరిగి, రెక్కలు తపతపమని కొట్టుకుంటూ
చచ్చింది, ఆ తెల్లపిట్ట.

2
వీడి చేతులు పడిపోను
బంగారంలాంటి దాన్ని పొట్టనబెట్టుకున్నాడు
మట్టిగొట్టుకుపోతాడు ఈ రాక్షసుడంటూ
తిడుతూ, శాపనార్థాలు పెడుతూ
దుమ్మెత్తిపోస్తుంది లోకమై
మూలనకూర్చున్నముసల్ది
ఇంకేమీ చేయలేక.

15 April 2014

ద్వైతాద్వైతం



ఒక దుఃఖానికి సంబంధించిన మాట
నేను నీలా వుండటం.

నీలా వుండాలనుకోవడంలో
  తప్పేమీ లేదేమో కాని,
నేనే నీలా మారిపోవడంఒక విషాదం
నా జీవితం తాలూకూ చారిత్రికవిషాదం.

నువ్వు పలుకుతుంటావ్ నాలో
నువ్వు నవ్వుతుంటావ్ నాలో
నువ్వే, నువ్వే ప్రతిక్షణం నేనై రగిలే క్షణంలో
అది నా తాలూకూ మరణభావన.

సాదృశ్యతలు సామాన్యమేనైనా
 నేనే అదృశ్యమైపోయాక,
ఇక వేటిని వెతుక్కోవాలి నేను నాలో,
నిరంతరం నిన్ను తప్ప.

చేతులారా, నిన్ను నాటుకున్న పాపానికి
నా దేహం ఇప్పడిక నా పాలిటి సమాధి.
జీవమై నువ్వే ప్రవహించుకో ఇక.
పాలించుకో ఇక, ఈ నీ రాజ్యాన్ని.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/737613559624732/?stream_ref=21

10 April 2014

అమ్మమనసు



ఆ నాలుగు పిచ్చుకలు,
అక్కడక్కడే తచ్చాడుతున్నాయ్,
కిచకిచమని అరుస్తూ, చాలా సేపటినుంచి.

వాటి విన్యాసాలను చూస్తూ,
చాపమీద బద్దకంగా పడుకొని
జంతుప్రేమతో ఆనందిస్తున్నాను, నేను.

అయ్యో, ఆకలేస్తుందా పిచ్చుకలూ అంటూ,
కాసిన నూకలు చల్లాక మా పాప,

కొంచెం తిని, ఇంకొన్ని నోటికి కరుచుకొని
గూటిలోని వాటి పిల్లల కోసం,
సంతోషంగా ఎగిరిపోయాయి
కిచకిచ కృతజ్ఞతలతో.

 ఎందుకో చాలా విషయాలు
నాకెప్పటికి అర్థంకావు.