Pages

12 January 2014

అర్భకుడు


 అస్పష్ట భావ ప్రవాహలకు,
సరైన పదాలను కూర్చలేక,
ముందు వెనకలుగా మాటలు,
పొర్లి పొర్లి, తడబాటు సిగ్గు,
నోరు తెరవకుండా చేస్తున్నప్పుడు.

విముఖత  పెంచుకోవాలి
ఇక మాటలు పట్ల .

కష్టాన్ని అనుభవించకుండా,.
విరుగుతున్న ఎముకల శబ్ధాన్ని,
అక్షర జలపాతమై దూకించగల,
నేర్పుగల శక్తులకు  కేంద్రం కాలేక,
వాక్యాలను అనంతశూన్యంలో సృష్టించలేక
మరోసారి ముడుచుకుంటాను,
నేను నీ ముందు,. నాకు తెలుసు,
నీ చూపులు అప్పుడు మరంత గుచ్చుతాయని.

మాటలు పట్ల విముఖత
మరంతగా పెంచుకోవాలి.
వీలైతే అక్షరాల పట్ల కూడా.

రాపిడిలో వేడుంటుంది,
వేదనలో కూడా, అదే వేడి.
వదలకుండా వెంటాడుతుంది.

స్వేచ్ఛాత్మల సంచారాన్ని,
వెలువడుతున్న కవనోష్ణాన్ని,
కీటకాలు అడ్డుకోలేవ్,
ఎంత పిచ్చిగా డీకొట్టినా.

రాలిపడే అగ్గికీలల్లో కాలిపోతూ,
నేనడగలేను, ఒక క్షమాపణను,
నేనడగలేను, నీ ప్రేమల మాటను,
నేనడగలేను, నీ స్నేహపు చేతిని,.

 దుఃఖపు రతిలో వ్యర్థమైన రాత్రిని
పూయించలేను మళ్లీ, నేనెప్పటికి,
నీకు బహుమతి గా మిగల్చడానికి,
నా తప్పులను విప్పుకుంటా వేడుకోవడానికి.

అంటుంటారు కొంతమంది జనులు,
సమయానుసార కర్మల నిమిత్తం,
అక్కడ మొదలు పెట్టి, ఇక్కడ ముగించామని.
మొదలు ముగింపుల్లో  సాదృశ్యతలు  అర్థంకాక.
అర్థమైనా సరే, ఆ అభేధతను వొప్పుకోలేక.

దుఃఖపు కోపం నుంచి, రహస్య ఏకాంతం దాకా,
సైకోటిక్ సుషుప్తు నుంచి కవితా మెలుకువ దాకా,
క్షమాపణల నుంచి వీడ్కోలు దాకా,
మెదిలిన పోయెం నుంచి రగిలిన గాయం దాకా,
నేనూ అంతే మిత్రమా మరి, ఎప్పటికి.

నేను అంతే మిత్రమా మరి, ఎప్పటికి.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/686852261367529/

1 comment:

  1. దుఃఖపు కోపం నుంచి, రహస్య ఏకాంతం దాకా,
    సైకోటిక్ సుషుప్తు నుంచి కవితా మెలుకువ దాకా,
    క్షమాపణల నుంచి వీడ్కోలు దాకా, excellent.

    ReplyDelete