Pages

25 January 2014

తండ్రీ, నిను తలచి,....


1
ఆరిపోతున్న ఆశలతో
అస్తమించని ఆలోచనలతో
కిటికి ఊచలనానుకొని
 ఎన్ని సాయంత్రాలను ఉరి తీసావో నువ్వు,
ఒక్క చేతివ్రేలి పట్టుకోసం.

సముదాయించలేని చేతులను చుట్టుకొని
బల్లిలాకరుచుకొని,
ఎగిరిపడుతున్న తల్లి డొక్కలతో
ఎన్నిసార్లు పంచుకున్నావో నువ్వు,
 ఎగిసిపడుతున్న నీ కన్నీటి వరదల్ని.

ఎన్నెన్ని వెన్నలకాంతుల పలకరింపుల్ని
బేకార్ గా బహిష్కరించావో,
నిశ్శబ్థనిశాచరుడివై, జీవంలేని రాత్రులెమ్మట.

ఎంతలా వెంపర్లాడుతూ వెతుక్కున్నావో
ఒకానొక శైశవ స్పర్శానుభూతి
శకలాల కోసం, జ్ఞాపకాల అగాధాలలో
నిన్నునువ్వు వదులుకుంటూ,చిధ్రంచేసుకుంటూ.

2
ఎదురుచూపు – ఎంత చిన్నమాట.
భరించలేనంత బాధను ఎంత నిర్దయగా నింపుతుందో,
బతుకు కుంపట్లపై నీరు పోస్తూ.
కనికరము లేని కౌగిలింతై ఎలా కడతేరుస్తుందో మరి,
నిరీక్షణల కాష్టాలపై నిన్ను.

రోజు వెంట రోజు రాజుకుంటూ,
ఆరనివ్వని నిప్పులగుండాల వెంట,
జాలి చూపక ఈసడించే లోకమెంట,
స్వహింసజ్వాలా పతాకమై
ఎగురుతుండు,ఎగురుతుండు
చీకిపోయి,చినిగిపోయి
బతుకు విరగే దాకా – గడువు ముగిసే దాకా.

పాశాన్ని తెంచుకోలేవు, ప్రేమను పంచుకోలేవు
మిత్రమా, అలా రగులుతుండు, బూడిదై రాలిపోయేదాకా.

3
ఓ తండ్రీ, ఏ తపస్సులచేత కాలం తరలిపోతుందో,
తడబడని అడుగులతో, అనంతాలవైపుకి

తనను అటు నడవనివ్వు, కాస్తంత నిబ్బరంగా.

2 comments: