Pages

25 January 2014

తండ్రీ, నిను తలచి,....


1
ఆరిపోతున్న ఆశలతో
అస్తమించని ఆలోచనలతో
కిటికి ఊచలనానుకొని
 ఎన్ని సాయంత్రాలను ఉరి తీసావో నువ్వు,
ఒక్క చేతివ్రేలి పట్టుకోసం.

సముదాయించలేని చేతులను చుట్టుకొని
బల్లిలాకరుచుకొని,
ఎగిరిపడుతున్న తల్లి డొక్కలతో
ఎన్నిసార్లు పంచుకున్నావో నువ్వు,
 ఎగిసిపడుతున్న నీ కన్నీటి వరదల్ని.

ఎన్నెన్ని వెన్నలకాంతుల పలకరింపుల్ని
బేకార్ గా బహిష్కరించావో,
నిశ్శబ్థనిశాచరుడివై, జీవంలేని రాత్రులెమ్మట.

ఎంతలా వెంపర్లాడుతూ వెతుక్కున్నావో
ఒకానొక శైశవ స్పర్శానుభూతి
శకలాల కోసం, జ్ఞాపకాల అగాధాలలో
నిన్నునువ్వు వదులుకుంటూ,చిధ్రంచేసుకుంటూ.

2
ఎదురుచూపు – ఎంత చిన్నమాట.
భరించలేనంత బాధను ఎంత నిర్దయగా నింపుతుందో,
బతుకు కుంపట్లపై నీరు పోస్తూ.
కనికరము లేని కౌగిలింతై ఎలా కడతేరుస్తుందో మరి,
నిరీక్షణల కాష్టాలపై నిన్ను.

రోజు వెంట రోజు రాజుకుంటూ,
ఆరనివ్వని నిప్పులగుండాల వెంట,
జాలి చూపక ఈసడించే లోకమెంట,
స్వహింసజ్వాలా పతాకమై
ఎగురుతుండు,ఎగురుతుండు
చీకిపోయి,చినిగిపోయి
బతుకు విరగే దాకా – గడువు ముగిసే దాకా.

పాశాన్ని తెంచుకోలేవు, ప్రేమను పంచుకోలేవు
మిత్రమా, అలా రగులుతుండు, బూడిదై రాలిపోయేదాకా.

3
ఓ తండ్రీ, ఏ తపస్సులచేత కాలం తరలిపోతుందో,
తడబడని అడుగులతో, అనంతాలవైపుకి

తనను అటు నడవనివ్వు, కాస్తంత నిబ్బరంగా.

24 January 2014

వర్చ్యూవాలిటి


మిధ్యాప్రతిబింబ చిత్రాల సమాహారాల
ప్రపంచాన్ని పదాలల్లోకి వంపుకొంటూ,
మరింత వెక్కిలి పువ్వైన జ్ఞాన రక్తపు సౌందర్య,
వివర్తిత ముఖాన్ని చిట్లించుకొని ప్రదర్శిస్తూ,
పరిధిలేని పరమాత్మల తత్వం ఎక్కించుకొని,
వాటంగా దొరికినదాన్ని వాటేసుకుని,
దమ్మరా దమ్,. చరణ సౌందర్యాల 
మహోన్నత మహత్యాల దిగ్భ్రాంతుల దివ్యత్వం
మేలుకొలుపుకొని, రియలిజం అంటించుకొని,
సర్వజగత్తు హిత కాంక్షా సుందరంలో పందిలా దొర్లే 
సగటు జీవుల దుర్భారావస్థను చూడలేక,
కనులు మూసుకొని, పడిపడి నవ్వుతూ,
ఇంకాస్తా స్వమూత్రవిస్కీపాన మహోదృత మత్తులో
ఊగిపోతు, కాగి పోతూ, చిలకరిస్తూ పవిత్ర పదాలను,
స్మృతి మరకల మలిన వస్త్రాన్ని కప్పుకొని,
కొడుకుల సజీవదహనంలో కాలిపోతు కేకలేస్తున్న,
ఓ ప్రాచీనభాషా మృతికి ప్రకటించుకోరా ప్రగాలికస్,.
ఎప్పుడో చచ్చిన మృతభాషను తలచుకుంటూనో,
ఇంకా పుట్టని ఓ అండ భాషలోనో శుభాకాంక్షలిలా,.
మెస్చుటా షికోతోయ్,..మెస్చుటా షికోతోయ్.

23 January 2014

స్థితి


విచ్చుకుంటున్న శిలాజాల పువ్వుల్లో,
ఏ పరిమళాన్ని ఆశించానో మరి.
దుఃఖపు మగతల ముడులు విప్పుకుంటూ.

దేనికోసమో వేచిచూస్తుంటాం, ఆత్రుతగా
చాలా సార్లు అదిచ్చే ఆనందం స్వల్పమని
తెలిసికూడా, అంతే మరుపుతో.

దేన్ని సంతోషమంటావు అనడిగితే,
సరైన సమాధానం కోసం వెతుక్కునే దగ్గరే
మిగిలిపోతున్నాను,  ఎంత ఆలోచించినా.

అలా అనిపించక పోయినా,
వదిలివేయబడ్డప్పుడు,
విరుగుతున్నహృదయాన్ని వంచించే
ఓ తప్పనిసరి వీడ్కోలుగీతం,
ఆనందంగానే వున్నాననుకోవడం,

ఎన్ని ప్రణాళికలతో సిద్ధంగా వున్నా.
ఒక దగ్గర ఆగిపోతుంది జీవితం.
మళ్లీ మొదలుపెట్టాలనుకున్నప్పుడు,

అక్కడే ప్రారంభించాలనుకోకు.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/693682210684534/

12 January 2014

అర్భకుడు


 అస్పష్ట భావ ప్రవాహలకు,
సరైన పదాలను కూర్చలేక,
ముందు వెనకలుగా మాటలు,
పొర్లి పొర్లి, తడబాటు సిగ్గు,
నోరు తెరవకుండా చేస్తున్నప్పుడు.

విముఖత  పెంచుకోవాలి
ఇక మాటలు పట్ల .

కష్టాన్ని అనుభవించకుండా,.
విరుగుతున్న ఎముకల శబ్ధాన్ని,
అక్షర జలపాతమై దూకించగల,
నేర్పుగల శక్తులకు  కేంద్రం కాలేక,
వాక్యాలను అనంతశూన్యంలో సృష్టించలేక
మరోసారి ముడుచుకుంటాను,
నేను నీ ముందు,. నాకు తెలుసు,
నీ చూపులు అప్పుడు మరంత గుచ్చుతాయని.

మాటలు పట్ల విముఖత
మరంతగా పెంచుకోవాలి.
వీలైతే అక్షరాల పట్ల కూడా.

రాపిడిలో వేడుంటుంది,
వేదనలో కూడా, అదే వేడి.
వదలకుండా వెంటాడుతుంది.

స్వేచ్ఛాత్మల సంచారాన్ని,
వెలువడుతున్న కవనోష్ణాన్ని,
కీటకాలు అడ్డుకోలేవ్,
ఎంత పిచ్చిగా డీకొట్టినా.

రాలిపడే అగ్గికీలల్లో కాలిపోతూ,
నేనడగలేను, ఒక క్షమాపణను,
నేనడగలేను, నీ ప్రేమల మాటను,
నేనడగలేను, నీ స్నేహపు చేతిని,.

 దుఃఖపు రతిలో వ్యర్థమైన రాత్రిని
పూయించలేను మళ్లీ, నేనెప్పటికి,
నీకు బహుమతి గా మిగల్చడానికి,
నా తప్పులను విప్పుకుంటా వేడుకోవడానికి.

అంటుంటారు కొంతమంది జనులు,
సమయానుసార కర్మల నిమిత్తం,
అక్కడ మొదలు పెట్టి, ఇక్కడ ముగించామని.
మొదలు ముగింపుల్లో  సాదృశ్యతలు  అర్థంకాక.
అర్థమైనా సరే, ఆ అభేధతను వొప్పుకోలేక.

దుఃఖపు కోపం నుంచి, రహస్య ఏకాంతం దాకా,
సైకోటిక్ సుషుప్తు నుంచి కవితా మెలుకువ దాకా,
క్షమాపణల నుంచి వీడ్కోలు దాకా,
మెదిలిన పోయెం నుంచి రగిలిన గాయం దాకా,
నేనూ అంతే మిత్రమా మరి, ఎప్పటికి.

నేను అంతే మిత్రమా మరి, ఎప్పటికి.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/686852261367529/

11 January 2014

చెమరింపు



నానా క్లేశములు తిరుగుతున్న,
ఆ వడిలిపోయిన కన్నుల బెదురులో
మాటకు తోడు దొరకని, ఆ తీరిక తనపు హింసకు,
ఖాళీ కుర్చీనే ఓదార్పు చేయకు.

కారిపోయి, కాగిపోయి
విసిగివేసారి పోయి జీవితంతో
ముడతలు తేలిన ముఖంలో
దాచుకున్న దుఃఖపు గీతలు
పలికించే శోక రాగాల వేదనలు
వినలేము మనము,కాసింత ప్రేమ లేకుండా.


నెట్టకు అమ్మలను ఒక వైపుకు,
నింపకు  ధైన్యాన్ని చివరి దశలో,.
గొడుగై నిలిచి, వడిలో పాపను చేసి ,
కాంతి నింపులేవా నాయానా,.. ఓ పూటైనా.


అమ్మలోపలి బిడ్డకు అమ్మై లాలించినవాడు,
హృదయానికి పొదుముకొని
దుఃఖమై నిలిచినవాడు ధన్యుడు,.

అమ్మకు అమ్మకాని వాడు వ్యర్థుడు.

10 January 2014

||సమాంతరం||

ఒక్కడుంటాడు, ఈ ప్రపంచంలో
నన్నూ ప్రేమించేవాడు,. ఏమీ ఆశించకుండా.
ఈ అన్వేషణంతా దాని కోసమేమో,.

నేను ప్రేమించే మనిషికోసం
ఎదురుచూస్తుంటాను, కొన్ని లెక్కలేసుకొని.
ఒక్కరైన తారసపడరు.

ఏదో ఒకటి వదులుకోవాలలి,
ఒక గూటికి చేరాలంటే, మేమిద్దరం.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/685817018137720/

బేకారీలు – 5


అదృష్టము నెత్తికెక్కి
అల్పుడి పంట పండి
మహరాజై మండించినట్లు,

జన్మాంతరమున గుణనిధి
శివుని కృపకు పాత్రుడై
కుబేరుడై జన్మించినట్లు,

రాజకీయ క్రీనీడల క్రీడలలోన
ధూర్తులు, దుష్టులు, నికృష్టులు
చేటులు, నటులు, విటులు
పీఠమర్థక నైపుణ్యులు
పీఠాలపై కొలువైనట్లు,
ప్రజలను పాలించినట్లు,

కాలమున మారిన కోతులు
మనుజులై మురిసినట్లు,

ఖర్మకాలగ, జనుల జాతకములలోన
కిస్మత్తు కిక్కెక్కి, ఒకానొక మహర్ధశనందు,
చెత్తకవనములు చైరెక్కగలేవా!
 యశస్సుబొంది చిరస్థాయిగా నిలవగలేవా!
ఆచంద్రతారార్కకీర్తిని మూటగట్టుకు మెరవగలేవా!

7 January 2014

రిప్పు



ఏనాడు గుర్తించలేని గుప్పెడు అభిమానం,
దుఃఖమై పొంగి కన్నీరు కార్చేస్తుంది.

చలిగాలుల చిక్కులు తప్పించుకోలేక
అన్నీ మూసుకున్న శరీరం వంటరిగా,
రేపటి కోసం ఎదురుచూస్తుంది,
భవిష్యత్తుపై కించిత్ బాధలేక.

ఆగిపోయిన పెళ్లి పెనుభూతమై
కావలికాస్తుంది, నిరంతరం వేటాడి
ఇక ఈ రాత్రి శవజాగరణానందంలో.

ఏ బంధాలు బలహీనతలు స్పష్టమై
గీతలు గీసుకుంటాయో చెరగకుండా,

విడవడిన చేతులు, చుట్టుకోలేక వంటిని
ఎక్కడ కాపుకాసాయో, నిన్ను ఎత్తుకుపోను

కమిలిన మెడలు సాక్ష్యాల కొరకు,
పగిలన మది పెంకులు కాష్టాల కొరకు.

మిత్రుల కన్నీరు కాసిన జ్ఞాపకాల కొరకు.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/683848108334611/

5 January 2014

నిజాం నాణేలు - 1

భారతదేశ చరిత్రలో నైజాం నాణేలయెక్క ప్రాముఖ్యత చెప్పుకోతగ్గది. చివరి మొఘలాయిల బలహీనతలు దేశంలో కొత్త రాజరికాల పాలనలకు దారితీసింది. అలా ఏర్పడిన వాటిలో హైదరాబాద్ రాజ్యం ఒకటి. ఆ రోజులలో భారతదేశం మొత్తం మీద నాణేలు ముద్రించే స్థాయి గల సంస్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఈ ఎనిమిదింటిలో కూడా రాజ్యం మొత్తానికి అవసరమైన నాణేలు, కరెన్సీని ముద్రించిన సంస్థానం ఇదొక్కటే. ఈ సంస్థానం ఎంత విశాలమైనదంటే ప్రస్తుతం తెలంగాణాగా పిలవబడుతున్న ప్రాంత విస్తీర్ణం 1948 నాటికి కూడా దీనిలో సగం కంటే తక్కువ.


నిజాం నాణేల గురించి  తెలుసుకునేముందు రాజ్యచరిత్రను అలా చూసొద్దాం.
క్రీ..1538లో బహమనీ రాజ్యము విచ్ఛిన్నమై అయిదు భాగములుగా చీలి అయిదుగురు సుల్తానుల హస్తగతమయ్యింది. అహమ్మద్నగరములో నిజాం షాహీలు, బిరార్‌ (మహారాష్ట్ర)లో ఇమాద్షాహీలు, బిజాపూర్, బీదర్లలో (కర్ణాటక) ఆదిల్షాహీలు, బరీద్షాహీలు, గోల్కొండ (ఆంధ్రప్రదేశ్)లో కుతుబుషాహీలు రాజ్యాలను సుస్థిరం చేసుకున్నారు.
కులీకుతుబ్ షా రాజ్యం ఔరంగజేబు హస్తగతం కాబడ్డ తరువాత, అతని సేనానులలో ముఖ్యుడైన ఘాజియొద్దిన్ఖాన్ఫీరోజ్జంగ్, దక్కన్ సుభాల ఏకీకరణలో ముఖ్యపాత్ర వహించాడు (కుతుబ్ షా పై విజయంలో కూడా). గొల్కండ తెలుగు రాజ్యం మరియు మహారాష్ట్ర, కర్నాటక, తమిళ ప్రాంతాలు కలసిన ఆరు దక్కన్ సుభాలకు వీరి కుమారుడు నిజాం ముల్ ములక్ ఆసఫజా బహాదూర్ ని రాజప్రతినిధిగా నియమిస్తూ 1713లో మొఘల్ చక్రవర్తి ఫరఖ్ షయార్ ఫర్మాన్ జారీ చేసారు.

నిజానికి నిజాముల్ ములక్ అసప్ జాహీ( Nizam-ul-mulk Fateh Jung ) అసలు పేరు మీర్ఖమ్రొద్దిన్సిద్దికీ ( Mir Qamar-ud-Din Siddiqi) 1724 (అసఫ్ జాహీ బిరుదు స్వీకరించిన సంవత్సరం) నుంచి పూర్తి స్థాయి స్వతంత్రసంస్థానంగా అవతరించిన హైదరాబాద్ సంస్థానం, అధికారికంగా ఏనాడు స్వతంత్రంగా వున్నట్లు చెప్పుకోలేదు, కేవలం 1947 ఆగస్ట్ 15 నుంచి  17 సెప్టంబర్ 1948 వరకు మాత్రమే స్వతంత్ర రాజ్యమిది. 1798 దాకా మొఘలాయిలపేరుతోను, ఆ తరువాత బ్రిటిష్ వారి పేరుతోను నిజాములు రాజ్యాధికారం చేసారు. దాదాపు 227 సంవత్సరాల సుధీర్ఘకాలం ఏడుగురు నిజాముల పరిపాలన కొనసాగింది. ఆ బిరుదు అసఫ్ జాహీ నే వీరి వంశం పేరుగా పిలవబడింది. 1763 దాకా ఔరంగాబాద్ రాజధానిగా కొనసాగిన ఈ రాజ్యం, మరాఠాల ప్రాభల్యం తదితర కారణాలతో  
రాజధాని హైదరాబాద్ కి మారింది.

ఆ ఏడుగురి నిజాముల పేర్లు - వారి పరిపాలనా కాలాలు

మొదటి నిజాం - నిజాం ఉల్ ముల్క్ (1724 – 1748)


రెండవ నిజాం - నిజాం ఆలీఖాన్ ( 1762 – 1803)

మూడవ నిజాం -  సికిందర్ జా ( 1803 – 1829)

నాలుగవ నిజాం -  నజీర్ ఉద్ దౌలా (1829 - 1857)

ఐదవ నిజాం -  ఆఫ్జల్ ఉద్ దౌల (1857 - 1869)

ఆరవనిజాం -  మిర్ మహబూబ్ ఆలీ పాషా (1869 - 1911)

ఏడవ నిజాం - మిర్ ఉస్మాన్ ఆలీఖాన్ (1911 - 1948)

 కుట్రలకు, ఆందోళనలకు పెట్టింది పేరైన హైదరాబాద్ సంస్థాన రాజకీయ చరిత్రను పక్కన పెట్టి నిజాం నాణేల విషయానికి వస్తే దీన్ని మొత్తం మూడు ముఖ్యభాగాలుగా విభజించుకోవచ్చు.

(సశేషం)