మహా అయితే
ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?
ఏం మిగులుతుంది?
***
చూస్తున్నకొద్దీ వింటున్నకొద్దీ
మనుషులు పాతబడతారు
ప్రేమ-స్నేహం-ఆత్మీయత
ఏదో కలిసినట్లే,లేదా
కలిపినట్లే ఉంటుంది
దాపరికాలు, నటనలు మొగమాటాలు
వెలసిపోయిన
మంచితనం కావచ్చు లేదా
మలినంలేనితనం కావచ్చు
మొలకెత్తి నిలబడుతుంది.
మోసం చేయనివాడు
చేయలేనివాడు
ఎప్పుడూ తలెత్తుకునే నిలబడతాడు.
ప్రేమించటం ఆదరించటం మాత్రమే
తెలిసినవాడి చేతివేళ్ళెప్పుడూ
కరుణతో స్నేహహస్తాల్ని అనిదిస్తూనే ఉంటాయి.
మోసపోతామని అనుకునే
వాడొకడు- సమర్ధుడితో
సంస్కారంతో స్నేహం చేయటానిక్కూడ
భయపడతాడు.
చేతివేళ్ళభాష,కళ్ళలో ఆత్మీయత
ఒంటరితనం తెలిసిన ఆత్మీయుడొకడు
అన్నీ తెలిసీ,సహించీ,భరించి
స్నేహితుడ్ని ప్రేమిస్తూనే ఉంటాడు.
స్నేహం కలిపినట్లు, కలిసినట్లు
మనుషులందరూ కలవలేరు.
అప్పుడప్పుడూ
అక్కడక్కడా
ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది.
అయినా మహా అయితే
ఇద్దరిమధ్య ఏం జరుగ్తుందని?
కన్నీళ్ళు,అవమానాలు,ఒంటరితనాలు
జ్ఞాపకాలు గాయాలు కలగలిసిన
'కరచాలనం' అనే
స్పర్శ ఒకటి మిగులుతుంది.
కరచాలనంకూడా
మలినమేనంటే
మలినం మనిషి చేతులమధ్యలేదు
మనసుతెలియని కళ్ళు
కరుణతెలియని నోళ్ళుకలవాళ్ళమధ్యే
మనుషులు మరణిస్త్తుంటారు
మరణించారు
మరణిస్తారు
మనిషితనపు మహా సౌందర్యపు
స్పర్శకూడా తెలియదని
తెలుసుకునేలోపు
కొన్నిజీవితాలు ముగిసిపోతాయ్.
స్పర్శిస్తున్నయని అనుకుంటేనే
మరికొన్ని జీవితాలు 'మాయాలో
మాయమవుతాయ్,
మహా అయితే ఇద్దరిమధ్య ఏం జరుగుతుంది?
ప్రేమ మిగులుతుంది కానీ!
-పలమనేరు బాలాజి
No comments:
Post a Comment