Pages

14 March 2013

మూడు సందిగ్ధాలు




ఎలాగోలా జీవిస్తున్నామని,
అప్పుడప్పుడు నిట్టూరుస్తుంటాం,.
ఎలా బ్రతికినా,.
అది ఎలాగోలాలో ఓ భాగమని ,
మనమెప్పటికి గుర్తించలేం,.

మరణానికి ఫలానిది కారణామని,
తేలికగా చెప్పేస్తుంటాం,.
బలమైన ఓ కారణాన్ని,
నిజానికి,
మృత్యువే సృష్టిస్తుందన్న  వాస్తవాన్ని,
మనమెప్పటికి అర్థం చేసుకోలేం,..

కుప్పలుతెప్పలుగా కవిత్వాన్ని రాస్తున్నామనుకుంటూ,
ఖుషీ చేస్తుంటాం,
నిజానికి,
కవిత్వమే మనల్ని ఓ పావులా,
వాడుకుంటున్న సత్యాన్ని,
కలల్లో కూడా ఎప్పటికి ఊహించలేం,..

మనకెప్పటికి ప్రశ్నార్థకమై,
మిగిలే మూడు సందిగ్ధాలు,
జీవితం,కవిత్వం,.మృత్యువు,..

8 March 2013

తొక్కలు - 2


స్వంతమైనదెప్పటికి తృప్తినివ్వదు,
కోరినా దక్కనికి శాంతినివ్వదు,.
-----------------
ప్రేమించావా,..సమస్తం సంకుచితమౌతుంది,.
పోరాటాన్ని హత్తుకొని చూడు,
ప్రపంచపథం విశదమవుతుంది,.
---------------------------
పొగిడి, పొగడి పాడు చేసేవాడో,.
తిట్టి,తిట్టి తట్టి లేపేవాడో, వాడు,.

7 March 2013

వదల్లేక,....



నన్నిష్టపడవు అని తెలిసికూడా,
నీ కోసం నిరంతరం గాయపడుతూనే వుంటానిక్కడ,.

భారమైన దిగులు మబ్బుల్ని,
కనురెప్పల మాటున కప్పిపెట్టి,
జోరువానలో కూడా,..
ఆశల దీపాలు వెలిగిస్తునే వుంటానిక్కడ,.


నీకై పరితపించి, పరితపించి,
ఎప్పటికైన నువ్వొస్తావని ఎదురుచూస్తున్నప్పుడో,
ఇంకెప్పడో,
దూరతీరాలకు పయనమై నువ్వలా సాగిపోతావ్,.
ఎప్పటికి నాకందకుండా,
కనురెప్పపాటులో మాయమైపోతావ్,.

కొలనులోని తుంటరి అలజడిలా,
చెదిరిపోయిన నీ రూపం కోసం,
నేనిక్కడ చీకట్ల జలాల్లో,
తడుముకుంటూ, వెతుక్కుంటూ,
నీ రూపాన్ని మరంతగా చెదరకొట్టుకుంటూ,.
తడుముకుంటూ వెతుక్కోవలసిందే,.
అయోమయంగా అన్వేషించాల్సిందే,.

ఏ రాత్రి వేళో కలల్లోకి చొరబడే
నిన్ను,పట్టుకోవాలంటే,
తెల్లార్లు జాగారం చేయాల్సిందే,..
నాకందకుండా జారి పోయిన నీకోసం,
బహూశా, నే జీవితమంతా భ్రమించాల్సిందే,..

( ఒక చిత్తుపేపరు ముక్కలో కనిపించిన ఓ కవితను సృజిస్తుంది రాసింది,. చాలా కాలం క్రింతం)


6 March 2013

భ్రాంతి


లక్ష యధార్థాలు, కోట్ల సత్యాలు,
తారసపడతాయేమోనని,
తపన పడుతున్నావేమో, నువ్వు,.

వున్న ఒక్క యధార్థమూ,
పరిపూర్ణ సత్యమూ,.
నీ ఎదుటే నిలిచినా,
నిరంతరమూ నిన్ను వెంబడించినా,
తృణీకరించబడుతూనే వుంటుంది కదా,..

ఉమ్మనీరై,నిను కమ్ముకున్న
మాయాజ్ఞానపు పొరల మత్తు చేత,.


భ్రాంతి మాత్రమే మిగులుతుంది,
జ్ఞానమన్నది గడ్డిపోచై,.

సోది మాత్రమే సోకుతుంది,
సత్యమన్నది మసకబారి,.

3 March 2013

ద్విపదలు20



భాష పరాయిదౌవుతుంది.
బుర్ర నిదానంగా బానిసౌతుంది,.
-----------------------
స్వార్థం,.మానవత్వం,.
విలోమానుపాతం వాటి బంధం,..
------------------------------------


గుండెల్లో పరభాషా వ్యామోహం,
ఉత్తమాటల మంటల్లో మన మాతృభాష,.
-------------------------------
కమ్మనైనది అమ్మ భాష,
తెలుగు బడిని బ్రతింకించలేమా,.
--------------------------------
రుద్దు, అర్థం కాని చదువు,.
పరమార్థం, అర్థమేలే,.
---------------------------