అది 1990 ఎండాకాలం లో ఓ సాయంకాలం.
కవిత్వం గురించి చదవడం, వినడమేగాని,
రాయాలనిగాని,రాసే ధైర్యం గాని లేదు.
భాష పైన పట్టు, పదాలతో పరిచయంకాని
చాలా తక్కువ.(ఇప్పుడైన అంతేలేండి)
అప్పట్లో ఓ ఇద్దరు కవయిత్రులు పుంఖానుపుంఖాలుగా భావం తక్కువైనా,అందమైన
అక్షరాలతో వాళ్ల దృష్టిలో
అధ్భుతంగా రాసి నాపైన పారేస్తుండేవాళ్లు.
వాళ్లెవరో మీకీపాటికి అర్ధమైందనుకుంటాను.
అమాయకపు అక్క, (చి)చక్కని చెల్లి.
వీళ్ల దెబ్బకి నాలో ఆవేశం,ఉక్రోషం,కుళ్లు, అసూయ.
చీ..... వీళ్లేనా కవిత్వం తో కబుర్లు చెప్పేదని,
నేను కూడా రాయాల్సిందేనని శపధించుకొన్నాను.
ఇంకేముంది, పాత నోట్సులలో పేపర్లు,పెన్సిల్
తీసుకోని మిద్దెక్కాను.
రోజులు గడిచిపోయాయి.
ఎన్ని పేజీలు చినిగాయో,ఎన్ని పెన్సిల్లు ఆరిగాయో
మొత్తం మీద ఒకటో,రెండో కవితలు రాసి క్రిందకి దిగా.
అప్పుడు అంటుకొన్న కవిత్వం ఇప్పటికి
అప్పుడప్పుడు కాల్తూనేవుంది.
ఓ సంవత్సరం నా కవిత్వం దెబ్బకి వాళ్లిద్దరూ ఊరొదిలి వెళ్లిపోయారు.నేనూ,
నా కవిత్వం కంపు భరించలేక అటకపైన అట్టపెట్టలో ఆ నోట్సును భూస్థాపితం చేశా.
మొత్తం మీద అలా నా కవిత్వం లో మొదటి అంకం (90మార్చ్-91డిసెంబర్) ముగిసింది.
వీలైతే ఆ కవితల్లో కొన్ని పరిచయం చేస్తా.
ఇప్పటికి నా ఏ కవితైన వారు అంటించిన మంటే .
(సశేషం)