Pages

5 January 2014

నిజాం నాణేలు - 1

భారతదేశ చరిత్రలో నైజాం నాణేలయెక్క ప్రాముఖ్యత చెప్పుకోతగ్గది. చివరి మొఘలాయిల బలహీనతలు దేశంలో కొత్త రాజరికాల పాలనలకు దారితీసింది. అలా ఏర్పడిన వాటిలో హైదరాబాద్ రాజ్యం ఒకటి. ఆ రోజులలో భారతదేశం మొత్తం మీద నాణేలు ముద్రించే స్థాయి గల సంస్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఈ ఎనిమిదింటిలో కూడా రాజ్యం మొత్తానికి అవసరమైన నాణేలు, కరెన్సీని ముద్రించిన సంస్థానం ఇదొక్కటే. ఈ సంస్థానం ఎంత విశాలమైనదంటే ప్రస్తుతం తెలంగాణాగా పిలవబడుతున్న ప్రాంత విస్తీర్ణం 1948 నాటికి కూడా దీనిలో సగం కంటే తక్కువ.


నిజాం నాణేల గురించి  తెలుసుకునేముందు రాజ్యచరిత్రను అలా చూసొద్దాం.
క్రీ..1538లో బహమనీ రాజ్యము విచ్ఛిన్నమై అయిదు భాగములుగా చీలి అయిదుగురు సుల్తానుల హస్తగతమయ్యింది. అహమ్మద్నగరములో నిజాం షాహీలు, బిరార్‌ (మహారాష్ట్ర)లో ఇమాద్షాహీలు, బిజాపూర్, బీదర్లలో (కర్ణాటక) ఆదిల్షాహీలు, బరీద్షాహీలు, గోల్కొండ (ఆంధ్రప్రదేశ్)లో కుతుబుషాహీలు రాజ్యాలను సుస్థిరం చేసుకున్నారు.
కులీకుతుబ్ షా రాజ్యం ఔరంగజేబు హస్తగతం కాబడ్డ తరువాత, అతని సేనానులలో ముఖ్యుడైన ఘాజియొద్దిన్ఖాన్ఫీరోజ్జంగ్, దక్కన్ సుభాల ఏకీకరణలో ముఖ్యపాత్ర వహించాడు (కుతుబ్ షా పై విజయంలో కూడా). గొల్కండ తెలుగు రాజ్యం మరియు మహారాష్ట్ర, కర్నాటక, తమిళ ప్రాంతాలు కలసిన ఆరు దక్కన్ సుభాలకు వీరి కుమారుడు నిజాం ముల్ ములక్ ఆసఫజా బహాదూర్ ని రాజప్రతినిధిగా నియమిస్తూ 1713లో మొఘల్ చక్రవర్తి ఫరఖ్ షయార్ ఫర్మాన్ జారీ చేసారు.

నిజానికి నిజాముల్ ములక్ అసప్ జాహీ( Nizam-ul-mulk Fateh Jung ) అసలు పేరు మీర్ఖమ్రొద్దిన్సిద్దికీ ( Mir Qamar-ud-Din Siddiqi) 1724 (అసఫ్ జాహీ బిరుదు స్వీకరించిన సంవత్సరం) నుంచి పూర్తి స్థాయి స్వతంత్రసంస్థానంగా అవతరించిన హైదరాబాద్ సంస్థానం, అధికారికంగా ఏనాడు స్వతంత్రంగా వున్నట్లు చెప్పుకోలేదు, కేవలం 1947 ఆగస్ట్ 15 నుంచి  17 సెప్టంబర్ 1948 వరకు మాత్రమే స్వతంత్ర రాజ్యమిది. 1798 దాకా మొఘలాయిలపేరుతోను, ఆ తరువాత బ్రిటిష్ వారి పేరుతోను నిజాములు రాజ్యాధికారం చేసారు. దాదాపు 227 సంవత్సరాల సుధీర్ఘకాలం ఏడుగురు నిజాముల పరిపాలన కొనసాగింది. ఆ బిరుదు అసఫ్ జాహీ నే వీరి వంశం పేరుగా పిలవబడింది. 1763 దాకా ఔరంగాబాద్ రాజధానిగా కొనసాగిన ఈ రాజ్యం, మరాఠాల ప్రాభల్యం తదితర కారణాలతో  
రాజధాని హైదరాబాద్ కి మారింది.

ఆ ఏడుగురి నిజాముల పేర్లు - వారి పరిపాలనా కాలాలు

మొదటి నిజాం - నిజాం ఉల్ ముల్క్ (1724 – 1748)


రెండవ నిజాం - నిజాం ఆలీఖాన్ ( 1762 – 1803)

మూడవ నిజాం -  సికిందర్ జా ( 1803 – 1829)

నాలుగవ నిజాం -  నజీర్ ఉద్ దౌలా (1829 - 1857)

ఐదవ నిజాం -  ఆఫ్జల్ ఉద్ దౌల (1857 - 1869)

ఆరవనిజాం -  మిర్ మహబూబ్ ఆలీ పాషా (1869 - 1911)

ఏడవ నిజాం - మిర్ ఉస్మాన్ ఆలీఖాన్ (1911 - 1948)

 కుట్రలకు, ఆందోళనలకు పెట్టింది పేరైన హైదరాబాద్ సంస్థాన రాజకీయ చరిత్రను పక్కన పెట్టి నిజాం నాణేల విషయానికి వస్తే దీన్ని మొత్తం మూడు ముఖ్యభాగాలుగా విభజించుకోవచ్చు.

(సశేషం)


1 comment: