Pages

5 January 2015

కవితాత్మక వాక్యం

చదివిన కవిత్వ సంపుటి :- 24 (కవి సంగమం)
"
రసాత్మకం, కళాత్మకం భాస్కర్ కొండ్రెడ్డి కవితాత్మక వాక్యం"
కవిత్వ సంపుటి పేరు :- "వాక్యం " (An expression of thought )
సంపుటి రాసిన కవి పేరు:- "భాస్కర్ కొండ్రెడ్డి "
సంపుటిని పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి 

____________________________________________________________________

"
వాక్యం " కవిత్వ సంపుటి నన్ను చేరుకోగానే అనుకోకుండా ఆఖరి పుటలోకి నా చూపు వెళ్ళిపోయింది.నా కన్ను అలాగే పుట చివరంటా సాగింది. గాలి వేదన, శిలల దుఃఖం, ఆకాశ రోదన ఎవరైనా విన్నారా,అనుభవించారా, కలగన్నారా అనే ప్రశ్నలు సంధించిన కవిత "విలోమగీతం"-నన్ను నా ఆలోచనను విలోమం చేసేసింది.కవి పై ప్రశ్నలను కవిత్వం చేసిన వైనం సాధారణంగా భాస్కర్ పాటించే టెక్నిక్ కి భిన్నంగా వుంది వొకింత తాత్విక వూహలోకి మనల్ని తీసుకెలుతుంది.
"గాలికెదురుగా ఎగిరే పక్షులు
 పక్షులా, ఆ రెండు రెక్కలు
గాలి గుండెను చీల్చినప్పుడు
గాయపడినా గాలి వేదన
విన్నవా,నువ్వెప్పుడైనా?

వట్టిపోయిన ఏటిలోన
నీటి ధారల జాడ కోసం
ఎదురుచూసి,ఎదురుచూసి
ఎండిపోయిన శిలల దుఃఖం
అనుభవించావెప్పుడైనా?

నింగినొదిలి,నేలరాలి
చిధ్రమైన మేఘమాలిక
చావు కష్టం కళ్ళార చూసి
అంతులేని ఆకాశ రోదన
ఛాయనైనా, కలగన్నావా నువ్
?
గాలి,నీరు,ఆకాశం ఈ మూడు పంచభూతాల్లో ముఖ్యమైన మూడంశాలు.ఈ మూడు అప్రాణులే.అయినా ఇవి ఈ ప్రపంచ గమనానికీ కీలకమైన అంశాలు. సున్నితమైన పక్షి రెక్కలు గాలిని కోస్తూ ఎగిరేటప్పుడు గాలి పడే వేదన సున్నిత మనస్కుడైన మనిషికీ,నీటికోసం ఎదురు చూసే కఠినశిలలు ప్రేమతడి కోసం నిరీక్షించే మనిషికి,నింగి నుండి నేల రాలిన మేఘం అన్ని కోల్పోయాననుకున్నా మనిషికీ ప్రతీకలుగా చేసి అప్రాణులైన గాలి,నీరు,ఆకాశంలకు మానవ దుఃఖ ఆరోపణ చేసి ఒక గొప్ప శిల్పాన్ని సాధించాడు.

"చెట్టు,చేమ,గాలి,ధూళి
నింగి,నేలా,నీరు,నిప్పు
వాగు,వంక,ఎండిన డొంక
ఇవే కాదోయ్!పర్యావరణమంటే"
పర్యావరణమంటే నువ్వు,నేను కూడా- అని ఒక ఉద్బోధను  మనకు "కన్ఫ్యూజన్"లేకుండా,పర్యావరణ "సారాంశం"ను "బాధ భాష"తో చెప్పిన కవి భాస్కర్ కొండ్రెడ్డి.

"స్వప్న లోకపు స్వేచ్ఛా యానం
యథార్థ జగత్తు దుఃఖపు గానం
కొట్టుకొచ్చిన సృజనాత్మక రాతలు
ఎత్తుగడలలా ఎత్తులలోన
కూరుకు పోయిన అసలు రహస్యం, 
ధగధగ మెరసే కవుల తలలకూ
వెనకవున్న ఎన్నో సొట్టలు
తెలుసా? నీకేమయినా."
ఇలా కవిత్వం కాని కవిత్వం రాస్తున్న వాళ్ళని నిర్మొహమాటంగా ప్రశ్నించిన కవి , కుహనా కవిత్వాన్ని కవులను నిలదీసి, నిగ్గుదేల్చే కవిత్వం రాస్తున్న కవి భాస్కర్ కొండ్రెడ్డి

" ఏ ఏ రసాయనాలు కలసి నిర్మిస్తాయో వాక్యాలను,
ఏ అచేతన చర్యా ఫలమై, వాక్యం నను హత్తుకొందో
ఏ అనుభూతులు వాక్యమై ప్రతిఫలిస్తాయో
ఏ అదృశ్యాలను వీక్షించి అంతర్నేత్రాలు,
సిధ్ధపరుస్తాయో నా వాక్యాలను"

"వాక్యం రసాత్మకమ్ కవిత్వమ్"-అన్నాడు జగన్నాథుడు.
రసాత్మక వాక్యాల నిర్మాణానికీ ఏ రసాయానాలు అవసరమో తిలక్ "నవత-కవిత లో చెబుతూ "కవిత్వం ఒక ఆల్కెమీ,
దాని రహస్యం కవికే తెలుసుఅని అంటాడు."నా వాక్యం నాది కాదు"-అని భాస్కర్ కొండ్రెడ్డి వినయంతో అంటున్నా ఈ కవికీ కూడా కవిత్వ అల్కెమీ తెలుసు అనే నా మాటను "వాక్యం" కవిత్వ సంపుటి నిజం చేస్తున్నది.
"లోతుల్లోకి పయనిస్తున్నప్పుడు
ప్రతిదీసంతోషాన్నివ్వలేదు
దుఃఖానికీ హేతువై మిగల లేదు" అనే ఈకవి మాటల్ని అర్థంచేసుకోగలిగితే కవి కవిత్వ తాత్వికతలోకి మనం సులభంగా చేరుకోగలం.

"జలకాలాటల మునకల్లో
నీకు కనిపించే నీరు వేరు.
దాహాన్ని తీర్చేటప్పుడు
ఆ అమృతజల తీరు వేరు.
ముంచేస్తున్నప్పుడు మృత్యువై 
ఆ అలల లయల రీతిమారు
వస్తువు వొకటే అయినా ఆ క్షణంలో దాని పరిస్థితి వొక్కో సందర్భంలో వొక్కోలా వ్యహరించే అవకాశం వుందని,మనిషి కూడా ఆయా సందర్భాల్లో ఆయా రీతిగా వ్యవహరిస్తాడు అని చెప్పడానికి కవి నీటిని సాదృశ్యం చేస్తూ పరొక్షంగా మనిషి స్వభావాన్నీ వ్యాఖ్యానిస్తాడు 'సందర్భం"-అనే కవితలో.ఇట్లా ఒక దాన్ని సాక్షాత్కరింపచేయాడానికి మరో దాని స్వభావాన్ని కవిత్వం చేయడం భాస్కర్ కొండ్రెడ్డి లో కనిపిస్తుంది.ఇదొక శిల్ప రహస్యం.అందుకే ఈ కవికీ కవిత్వ ఆల్కేమీ తెలుసు అని నేనంటున్నది.

మనిషి మరణిస్తాడు.మరణించిన పిదప అతన్నో,ఆమెనో పాంచభౌతికం చేస్తారు.అది సహజంగా జరిగే ప్రక్రియ.నేల తల్లిని చీల్చుకోని వచ్చిన ధాన్యపుగింజ తనరూపును మార్చుకొని మనకు ఆహారంగా మారిపోతుంది.అట్లా మారిపోయే ప్రక్రియకు ఈ కవి కొత్త అర్థాన్ని చెబుతూ,అందులోని మర్మాన్ని విప్పుతూ 'త్యాగం "అనే కవిత రాశాడు.
"తన దేహాన్ని కోల్పోతూ
నీకు నైవేద్యమైపోయింది కదూ
ఆ చిన్ని ధాన్యపుగింజ.
నవ్వుకుంటున్నావా,పిచ్చివాడా!
ఆ బలి దానం వెనుక అసలు కథ తెలియని వెర్రివాడా!
తనలాంటి వేలాది బిడ్డల కోసం
తన నేల తల్లి కోసం
బలమైన నిన్ను ,సారంగా ఆ మట్టిలో కలపడం కోసం"
ఆ దాన్యపు గింజ మనకు ఆహారం కావడం వెనుక వుండే రహస్యం రాబోయే తరం కోసం అని అనటంలో ఎంతటి ఆశాభావాన్ని ప్రకటించాడో అర్థం చేసుకోవచ్చు.

శరీరంలో ప్రతి భాగం సమర్థవంతంగా పనిచేస్తేనే మనిషి జీవితం సజవుగా నడుస్తుంది.అట్లాగే మనిషి హృదయంలోని అనుభూతులు,భావాలు స్పష్టమైన ఆకృతితో ఒక రూపు దిద్దుకోవాలంటే అక్షరాలు, పదాలు,వాక్యాలు సహకరించాలి.ఇందులో ఏ ఒక్కటి సహకరించలేదంటూనే కవి "సమ్మె"అనే మంచి కవిత రాశాడు.
"ఎదుగుడు"-అనే కవితలో మనిషి ఎదుగుడుకు అవసరమైన వాటిని ప్రస్తావిస్తాడు.

మార్మికత కూడా ఈకవి కవిత్వంలో ఒక ఆకర్షణీయ అంశం.
"కొద్ది విరామం తరువాత,సంరంభాన్ని పక్కకు నెట్టి
నేనిలా మొదలు పెడతాను
నిద్ర పోనివ్వని రాత్రులింకా,
పూర్తి ఙ్ఞాపకాలుగా మిగలక ముందే మరవక ముందే
మళ్లీ మళ్ళి ఇలాగే అర్థం కాకుండా మిగుల్తున్నందుకు"-
ఇలా కవి మార్మికంగా సరే ఇలా మొదలెడదాం అని అంటాడు.తన నిగూఢతని అద్భుతంగా ఒక మర్మత్వంతో వ్యక్తీకరించే చాతుర్యం భాస్కర్ కొండ్రెడ్డి లో ఈ వాక్యం ను పరిశీలిస్తే తెలియక మానదు.

అద్వైతం ఒక వైదాంతిక సిద్ధాంతం.దాన్ని కూడా కవిత్వ పరిధిలో నిర్వచిస్తూ,అంతా ఏ మాత్రం కలసి వుండే అవకాశం లేనప్పుడు,క్రిక్కిరిసి పోయినప్పుడు,ఏమి లేని చోటు కోసం మానవుని అన్వేషణ,తపన ఆరంభమవుతుందనే సత్యాన్ని చెబుతూ
 "నిబ్బరమైన సావులాగా
బతుకంటే భావ ప్రాప్తిలాగుండాలోయ్
క్షణకాలమే కదా! ఆ అద్వైతం."- అని అద్వైతకాలం స్ఖలన సుఖం లా క్షణభంగురమే అన్న ఆలోచనను పఠితలకిస్తాడు.

"వెత "-అనే కవితలో లిబరలైజేషన్,ప్రవయిటేజేషన్,గ్లోబలైజేషన్ అనే వాటి కత్తి వాదరకు బలయిపోయిన వాళ్లలో రైతులు మొదటి వరుసలోని వాళ్లు.వాళ్ళ స్వరంలో నాలుగే నాలుగు వాక్యాలలో వాళ్ల వేదనాత్మక దుఃఖాన్ని సమర్థంగా చేప్పి ఆ రైతుల చావులకీ వొక వైవిధ్యంతో తక్కువ పదాలతో అత్యద్భుతంగా అభివ్యక్తం చేస్తాడు.
'కళ్లంలో ధాన్యం గింజ, కళ్ళలో సుడి తిరిగింది
నే నాటిన బి.టి మొక్క, పిడి బాకై పొడిచేస్తుంది
నే చల్లిన పురుగుల మందే, నాపాలిట విషమయ్యింది
నే మోసిన ఎరువుల బస్తా నాశవానికి పక్కయ్యింది"
ఇంత విషాదాన్ని ఈకవి ఎట్లా చేప్పాడో ఆలోచిస్తే రైతుల ఆత్మ హత్యల కారణాల స్పష్టీకరణను ఎవరైన గుర్తిస్తారు.

ఈ కవికి కవిత్వం అంటే ఎంతో యిష్టం.అందుకే ఈ సంపుటిలో అవసరం లేకపోయిన కవిత్వ ప్రస్తావన చేస్తూ మంచి కవిత్వానికీ నిర్వచనం చెబుతూ,"ఓ.సి కవిత్వం", "ఙ్ఞానిజం", "సత్యావస్థ", "100%కవి", ఏ డిక్లరేషన్ ఆఫ్ పొయెట్, "నిస్తేజం" మున్నగు కవితల్లో కవి తనదైన ఆలోచనను కవిత్వం గురించి చెబుతూనే వచ్చాడు.

"ఎండిపోయిన కన్నీటి చారలు తప్ప
 దగ్ధమైన కలల బూడిద తప్ప
"ఏమి మిగిలిలేవు ఇక్కడ  - అని"శూన్యం"గా భావించే ఈ కవి ,
'నీకెందుకోయి,కవీ,.ఆ కవిత్వం,  వదులుకోలేవటోయ్, నీవా పైత్యం"-అని కవిత్వం కాని దాన్ని నిరసించే కవి,
"ఏది గమ్యం?ఏది సత్యం? మిత్రమా! నాకేది మార్గం"
-అంటూ సంశయంలో పడ్డ కవి,
'అనంతవిశ్వం పద్మవ్యూహం , విఙ్ఞానమొక తీరని దాహం' గా భావించే కవి ఎవరంటే భాస్కర్ కొండ్రెడ్డినే.
"రోబొ కింగ్"-అనే కవితలో "ఆధునిక భారత దేశ అత్యున్నత ఆవిష్కరణవని మానవ రోబో వని, నిష్క్రియాపరుడైనా ప్రస్తుత భారత ప్రధానిని సైతం వ్యంగ్యంగా వ్యాఖ్యానించే సాహసాన్ని ఈ కవి ప్రదర్శించి ప్రజల వైపు నిలబడతాడు.
ఈ కవికీ కవులపైనే కాదు తన పైన తానే సెటైర్ వేసుకోగల నిబ్బరం కూడావుంది.
"ఖాళీ గా వున్నావు కదా!
అరకానీ ఖర్చు కాదు,  కవిత్వం రాసుకొమ్మన్నాడు.
పాతికవేలెట్టి, పుస్తకం అచ్చొత్తేదాక
పొగడ్తలకు పొంగిన, పిచ్చి మనసు ఊరడిల్లలేదు'.-ఇలా పుస్తకం వేసింతరువాత కవులు పడే బాధని చమత్కరించాడు.
నిజంగా ఈ కవి ముఖస్తుతి ని ముఖసుత్తి అని రాశాడేమోనని అనుకొంటున్నాను.అన్నింటికి మించిన మత్తు నిచ్చేది ముఖస్తుతేనని,దీని నుంచి బయటపడేసే డీ-అడిక్షన్ సెంటర్ లేదని కవి మానవ బలహీనతని అద్భుతంగా ఆవిష్కరించాడు. "మూడు సందిగ్ధాలు"-అనే కవిత జీవితం,కవిత్వం, మృత్యువు ఈ మూడు మనకెప్పటికీ ప్రశ్నార్థకమై మిగిలే మూడు సంధిగ్ధాలు అనే తాత్విక భావాన్ని చెబుతూ,మరణానికి కారణాన్ని మృత్యువే సృష్టిస్తుందని,కవిత్వమే మనల్ని పావుగా వాడు కొంటుందని,ఎలాగో ఒకలాగు బ్రతికిన అది జీవితంలో మనంగుర్తించలేనిదని ఈ కవి ఊహ చేసిన తీరు నా అన్ని సందేహాలను తునా తునకలు చేశేసింది.

ఒకే తలుపుకీ చెరొపక్క గడియలు పెట్టుకొని కలసి జీవిస్తున్న మనుషుల మనస్తత్వాన్ని ,వారిలో వుండే ద్యైధీ వైరుధ్యాన్ని "బంధం"-అనే కవితలో కవి చిత్రించిన వైనం కవికి గల మనస్తత్వ పరిశిలన ను తెలియచేస్తున్నది.
"నేను చెప్పింది నీకు అర్థం కాదో
అర్థం కానట్టు నటిస్తావో
నాకెప్పటికి అర్థం కాదు.
మాట్లాడుకుంటునే వుంటాం,తిట్టుకుంటుంటాం
మనమెప్పుడూ
అద్భుతంగా కలసి జీవిస్తునే వుంటాం కదా!"
ఒకే తలుపుకీ చెరొపక్క గడియలు పెట్టుకొని.*


దరిద్రాన్ని,దైవత్వాన్ని
,సంపదల్నీ,సైతానుల్నీ,
విషాదాన్ని,విస్మయాన్ని,
కమ్మని కలల్నీ,కల్లోలాల్నీ,
కాలకూట విషాన్ని,కేరింతల్నీ ఒకే చోట కలి కుట్టిన వాడు భాస్కర్ కొండ్రెడ్డి.
శిథిల శరీరాన్ని, సౌందార్యాన్ని,
 కాల బిలాల్ని,కరిగే జీవాన్ని,
విద్వేషాన్ని,విఙ్ఞానాన్ని,
సృష్టి రహస్యాల్నీ,వినాశానాన్ని,
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని,శతృత్వాన్ని ఒకే వరుసలో కలిపి నాటేసే కవి భాస్కర్ కొండ్రెడ్డి.

కన్నిటిని,కవిత్వాన్ని ,
రక్తమోడుతున్న దేహాన్ని ఒకే కొయ్యకు వేలాడదీయాలనుకున్న కవి భాస్కర్ కొండ్రెడ్డి

జీవిత గతి తార్కిక క్రమాన్ని కవిత్వం చేసిన ఈ కవి "కవిత్వం గురించి తనకేమి తెలియదని,రాయడం తనకెప్పుడూ చేత కాదని అన్నా అదంతా వినమ్రతతో అన్నదే కానీ,"వాక్యం"-ఆయన మాత్రమే రాయ గల కవిత్వమని నేనుఅంటున్నా.వొక విన్నూతన దోరణిలో కొన్ని కవితలున్నా అవి ఈ సంపుటికీ ఒక అలంకారమేనని చెబుతున్నా.సంపుటిని కూడా వొక కొత్త ఒరవడిలో తాను ఎవరికైతే సంపుటి ఇవ్వాలనుకున్నాడో వారి ఛాయ చిత్రాన్ని సంపుటి వెనుక అట్ట పై ముద్రించి యివ్వటం ఎంతో శ్రమ.అట్లాంటి శ్రమ తీసుకున్న ఈ కవిని అభినందిస్తూ...వచ్చే మంగళ వారం మరో సంపుటితో కలుద్దాం.

No comments:

Post a Comment