Pages

23 September 2013

గుగాగీలు - 9


  
# శిష్యా ,ఇంతకాలమూ,.
నన్ను కీర్తిస్తూ,.కాల్లోత్తుతూ,కాకాలుపడుతూ,
ఆహో,,.నీ శుశ్రూషలకు మెచ్చాను,.కోరుకో నాయనా,.కోరుకో,,.
నీకేం కావాలో కోరుకో,. వరమిచ్చేస్తానిక, నీకు,...

@ గురవు గారు,. మహాకవిని కావలనే నా కలను ,
మీ మహిమతో తీర్చేయండి,.స్వామి,..
అంటూ నాలిక బయట పెట్టాడు శిష్యుడు,.

# అయ్యో,.నాయనా ,,ఎంత పని చేస్తివిరా,.
నాలికలపై గీస్తే కవులయ్యే రోజులా ఇవి.,
ఇవే శుశ్రూషణాలు,.ఏ కాకాలు తీరిన కవుల దగ్గరో,.
పత్రికాదుర్గాల దగ్గరో,,.కవితా ముఠాధిపతుల దగ్గరో,.
చేసుంటే,,.ఈ పాటికే పెద్దకవిగా వెలిగిపోయేవాడివిగదరా,.
నన్ను, క్షమించు శిష్యూ,,క్షమించు,.


18 September 2013

సత్యావస్థ


1
ఒకానొక సంధ్యా సమయం నుంచి,.
మరొక సాయంత్రానికి,. కాలాలు నడిచిపోయాక,.
అన్నింటిని తెంపుకుంటూ, గడిచిపోయాక,,
కొన్ని ప్రయాణాలు ముగిసిపోయాక,,
వొంటరి లోకాల్లోకి,. విసిరివేయబడ్డాక,.
నెమరేసుకుంటూ, మునిగిపోతున్నప్పుడు,
జ్ఞాపకాల సంద్రాలలోకి,.మిత్రుడా !
తప్పనిసరి తీరం కవిత్వమై తీరుతుంది,
కాస్తంత ఆసరాగా మిగలడానికి,.
కాదంటావా,. మరి నువ్వు.

2
వాక్యాలకు విలువేం వుంటుందిక్కడ,
ధిమాక్ ఖరాబ్,.చేయడానికేసే లెక్కలే తప్ప.

చేతనొస్తే నీకు,.అప్రతిహతంగా ఆఘ్రాణించు,
సంభాషించుకున్న చేతులను,ముఖాలను
కొన్ని శరీరాలను,.ఇంకొన్ని మాటలను,
రువ్వుకున్న నవ్వుల్ని,పారేసుకున్న కవిత్వాన్ని,.
పువ్వుల్లాంటి మనుషులు మోసుకొచ్చిన,
ఆ అతీంద్రియ పరిమళాల గుభాళింపుని,.
లోపల్లోపలి లోపల్లలోకి,
గుండెల నిండా బలంగా పీల్చుకో,.
ఆల్ మోస్ట్,. అదేనేమో కదా జీవితం.
3
నేనైతే ఇంతే అనుకున్నాను,.నిన్నటిదాకా.,
జ్ఞాపకం అంటే నిశ్చల ఛాయాచిత్రమని,
చూసి చూసి మురియడానికి,
తలుచుకుంటూ తడవడానికి తప్ప,.
మరేముందని అందులో అంతగా గొప్పని,.

మాట్లాడుతూ,మురిపిస్తు
కవ్విస్తు,కవిత్వీకరిస్తూ
విభేదిస్తూ,విశ్లేషిస్తూ,
కోస్తూ,కాలుస్తూ,.

ఒరేయ్ హౌలాగా,.ఇప్పుడు చెప్తా విను,.
జ్ఞాపకమంటే మనిషిరా,.
కొన్నిసార్లు అంతకంటే ఎక్కువేననుకో,.
స్థిరపరుచుకో, ఈ సత్యాన్ని,ఇక.. ఈ జీవితానికి


8 September 2013

ఇదో లెక్క



చినుకుకు భయపడి,
గొడుగు విప్పేవాడు,
చలి పుట్టిందని,
రగ్గు కప్పేవాడు,
చెమట చుక్కను,
ఎన్నడూ రుచి చూడని వాడు,.
 ఏం అనుభవిస్తాడు,.ఏం ఆస్వాదిస్తాడు.,

రోగం వస్తుందని,
కడుపు మాడ్చేవాడు,.
సంపదల్ని కూడబెట్టి,
కోరికలు కాల్చేవాడు,.
మనిషి మనిషిని,
నిరంతరం పీడించేవాడు,.
ఏం అనుభవిస్తాడు,. ఏం ఆస్వాదిస్తాడు,.

నవ్వులు కురిపించని వాడు,.
దుఃఖాన్ని పలికించని వాడు,.
సందేహాలతో చచ్చేవాడు,.
స్వార్థంతో బతికేవాడు,.
ఏం అనుభవిస్తాడు,. ఏం ఆస్వాదిస్తాడు,.

అనుభవించు - ఆస్వాదించు
ఈ చిన్న జీవితాన్ని ప్రేమించు,.

సులభవాచకం,.7/9/2013

5 September 2013

ఔరంగజేబ్ తన ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరం

అనువాదం - కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 

    

ప్రపంచ చరిత్రలో ప్రసిధ్ది చెందిన ఉత్తరాలలో ఇది ఒకటి, ముల్లా సాలె అనే చిన్ననాటి గురువు, కొలువులో గొప్ప ఉద్యోగం ఇవ్వమని అర్జి పంపినపుడు, తన స్వహస్తాలతో ఔరంగజేబ్ రాసిన తిరుగు సమాధానమిది,. దీనిని తెలుగులో మొదటిసారి 1910 లో అనువదించి,.భారతి మాస పత్రికలో ప్రచురించారు,.

మీరు నాకు అనావశ్యక మైనట్టి అరబ్బీభాష నేర్పుటయందు పెక్కు సంవత్సరములు నిరర్థకముగ గడిపి కోమలమైన నా బుద్ధిని, తీక్ష్ణమైనట్టి నా స్మరణశక్తిని వ్యర్థపుచ్చితిరి. జీవితమునందెన్నడును ఉపయోగపడని భాష రాజపుత్రులకు నేర్పుటకు పది పన్నెండు వత్సరములు వెచ్చించుటయు, ఆభాషయందు నన్ను వైయాకరిణిగను, ధర్మశాస్త్ర జ్ఞు నిగను చేయ యత్నించుటయు నెంత హాస్యాస్పదములు. 

ఉపయోగమైన విద్యలును, జ్ఞానమును బాలకులకు వారి వారి బుద్ధిననుసరించి చిన్ననాడు నేర్పుటయందు కాలము గడుపుటకు మాఱుగా మా గురువులవారగు మీరు మా బాల్యమును వ్యర్థపుచ్చితిరిగదా! అయ్యో! భూగోళజ్ఞానమా ఏమియును లేదు. పోర్చుగలు, హాలండు, ఇంగ్లండు మొదలగు దేశములు కొన్ని కలవనియు, అవి ఆయా స్థలము లందు కలవనియు, నాకు నేర్పితిరా? ఆ దేశములు ద్వీపములా, ద్వీపకల్పములా, సమభూమియందున్నవా, లేక ఎత్తుస్థలములందున్నవా యన్న సంగతులు నాకు తెలియ వలదా? చీనా, పారసీకము, పెరు, తార్తారి మొదలైనదేశముల రాజులు హిందూదేసపు బాదుషహా పేరువిని గజగజ వణికెదరని నా ఎదుట మీరు చేసిన ముఖస్తుతి వలననే దేశ దేశ చరిత్రములన్నియు నాకు తెలిసినవనుకొంటిరా? ఈ జగత్తుమీదనున్న వేరువేరు రాజ్యములెవ్వి? అందలి ఆచారవిచారములు, రాజ్యవ్యవహారములు, మతములు నెట్టివి? ఆ యా రాజ్యములను గల సంపత్తులును, విపత్తులును, ఆ యాదేశము సంపద్విపత్తులలో, ఆ దేశస్థు ల యొక్క ఏ యే గుణావగుణములవలన ఎట్టి యెట్టి మార్పులు గలిగినదియు, ఎట్టి మహత్కారణములచే గొప్పరాజ్యములు తలక్రిందగునదియు అను మహద్విషయములు చరిత్రాధ్యయనములేకయే మా కెట్టుల తెలియ గలవు? ఈ విషయములు మాకు నేర్పితిరా?
రాజపుత్రులు పైని వర్ణింపబడినట్టి యత్యంతావశ్కములగు వివిధ విషయములను నేర్చుకొని జ్ఞానసంపన్నులై తమ బుద్ధిని వికసింపజేయవలను. కావున రాజపుత్రులయొక్క జ్ఞార్జనకాలమగు బాల్యదశయందలి యొక్కొక్క క్షణము మిక్కిలి విలువ గలదియని యెఱింగి నా బాల్యదశను మీరు చక్కగ వినియోగపఱచితిరా? మీరు నాకు లేనిపోనట్టియు, బుద్ధినిభ్రమింపజేయునట్టియు లౌకికవ్యవహారమునకు నిరుపయోగకరమైనట్టియు పరభాషాజ్ఞానము గఱపుటయందే కృతకృత్యులమైతిమని తలంపలేదా? మొదట పరకీయ భాషనొకదానిని నేర్పి దాని మూలముగా శాస్త్రములు, ధర్మవివేచనము, న్యాయనీతి మొదలైన యావశ్యకములైన విద్యలనేర్పుట సులభమని తలంచితిరా? ఈయావశ్యకములగు విద్యలన్నియు మీరు నాకు నామాతృభాషలోనే నేర్పియుండకూడదా?

నేను ఔరంగజేబునకు తత్త్వజ్ఞానశాస్త్రమును నేర్పెదనుఅని మీరు నా తండ్రియగు శహజహాను బాదుషహా గారితో వొకప్పుడనియుంటిరి. మీ రనేకసంవత్సరములకు బ్రహ్మ, ఆకాశము, ఖటపటములు, మొదలైన నీరస శబ్దములచే నేదోయొక విషయము నాకు బోధింప యత్నించినట్లు నాకు జ్ఞాపకమున్నది. ఆ విషయమును గ్రహింపవలయునని నేను పెక్కు పర్యాయములు యత్నించితిని. కాని యందువలన నా జ్ఞాన భాండారమునకును, రాజ్యకర్తృత్వమునకును, ఏమి లాభము కలిగినది? మీరి తేప తేప యుచ్చరించుచున్నందున నీరసములును, పలుకుటకు కఠినములును అగు ఖటపటాది పదములు కొన్ని నాకు జ్ఞాపకమున్నవి. కాని వానితోసంబంధించిన, విషయచర్చ మాత్రము నేను ఎప్పటిదప్పుడు మర చిపోవుచుంటినని మీఱెరుగరా? నేడు ఆవిషయచర్చ జ్ఞాపకమున్నను దాని వలన నాకు ప్రయోజనమేమి? ఇట్లు మీరు కోమలమైనటువంటి నా బుద్ధిని, చురుకుదనమును, వ్యర్థము చేసితిరిగాదే?

నిజముగా నిరుపయోగములైనను మీరు ఆవశ్యకములని తలచిన ఈ విషయములు మీరు నాకు నేర్పినందున మీకు మాత్రమొక లాభము కలిగినది. మూఢులును, అజ్ఞానులును అగు మావంటివారికి మీరు సర్వజ్ఞులనియు, సర్వశాస్త్రపారంగతులనియు, అత్యంతపూజ్యగురువర్యులనియు, నిరథకగౌరవభావమును కొంతకాలమువఱకు పుట్టింపగలిగితిరి. అందువలన పెక్కుదినములవఱకు మీ మాటను మేము మన్నించుట తటస్థించెను.

రాజులను వ్యర్థముగా స్థుతించుట, సత్యమును తలక్రిందు చేయుట, నక్కవినయములు నటించుట యను గుణములు మాత్రము మీయందు చక్కగ వసించుచున్నవి. మిమ్ముల నేను నారాజసభయందు, ఒక సరదారునిగ నియమింపవలయునని మీరు కోరితిరిగదా. మీ యొక్క ఏ గుణమును జూచి నేను మీకాపదవినొసగవలయును? మీరు నాకు రాజకీయ, సైనిక, వ్యావహారికవిద్యలలో నేవిద్య నేర్పితిరని మిమ్ములను నేను గౌరవింతును? నన్ను నావశ్యకములైన విద్యలలో బారంగతునిజేసి యుండిన యెడల సికందరు (అలెగ్జాండరు) బాదుషహాకు పరమపూజ్యగురువర్యుడగు మహావిద్వాంసుడైన అరిస్టాటుల్‌ ఎడలగల పూజ్య భావమునే చూపియుందును. అట్టి యుపయోగకరములగు శిక్షణ గాని లాభకరములగు విద్యలనుగాని నేను మీవలన బడయలేదు. కావున మీ విషయమై గౌరవముగాని, పూజ్యభావముగాని నాకు లేదు. మీరు వచ్చిన త్రోవనే వెళ్ళుడు. మీ పల్లెటూరిలోనే దేవుని స్మరణ చేసికొనుచు కాలము గడుపుడు. మీరు నా రాజసభలో ప్రవేసింపకూడదనియు, మీరెవరో ఇచ్చటివారెవరికిని తెలియకూడదనియు
 నా యభిప్రాయము.

--------
ఈ - మాట పత్రిక వారికి కృతజ్ఞతలతో,.-----

ఉపాధ్యాయునికి ఒక ఉత్తరం|| అబ్రహం లింకన్||




నాకు తెలుసు - అతను చాలా నేర్చుకోవాలి. మనుషులంతా దయామయులు, నిజాయితీపరులు కారని అతను గ్రహించాలి. అదే సమయంలో లోకంలో దుర్మార్గులతో పాటు మంచివాళ్ళు ఉంటారనీ, స్వార్ధ రాజకీయవాదులతో పాటు, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే నేతలూ ఉంటారని అతనికి తెలియజేయండి. శత్రువులతో పాటు మిత్రులు ఉంటారన్న విషయం అతడికి నేర్పండి.

నాకు తెలుసు - అతను నేర్చుకోడానికి ఇంకా సమయం పడుతుంది. కాని ఆయాచితంగా లభించిన ఐదు డాలర్ల కన్నా, కష్టపడి సంపాదించిన ఒకే ఒక్క డాలరు ఎంతో విలువైనదని అతడు గ్రహించేలా చూడండి. అతనిని ఓటమిని తెలుసుకోనివ్వండి. గెలుపుని ఆనందించడం నేర్పండి. అసూయకు అతడిని దూరంగా ఉంచండి. నేర్పగలిగితే, స్వచ్చమైన నవ్వులోని రహస్యాన్ని అతడికి నేర్పండి. అలాగే పుస్తకాలు చేసే అద్భుతాల గురించి అతడికి చెప్పండి. ప్రకృతిని ,. ముఖ్యంగా నీలాకాశంలోని పక్షులను, తేనెటీగలను,పర్వతాలలోని పచ్చని దారులలోని పూలని ,ఆస్వాదించేందుకు అతడికి తగిన సమయమివ్వండి. మోసం చేయడం కన్నా, విఫలమవడంలోనే ఎంతో గౌరవం ఉందని అతడికి బడిలో నేర్పండి. ఇతరులు ఎందరో తప్పు అన్నప్పటికీ, తన స్వంత భావాలపై నమ్మకం ఉంచుకోమని చెప్పండి. అతను సౌమ్యులతో సౌమ్యంగానూ, కఠినాత్ములతో ధృడంగాను వ్యవహరించేటట్లు చూడండి.

కేవలం స్వప్రయోజనం కోసమే ఒకరితో ఒకరు కలిసే మనుషులను అనుసరించకుండా, వారికి దూరంగా ఉండగలిగే స్థైర్యాన్ని మా అబ్బాయికి ఇవ్వండి. ఇతరులు చెప్పేవాన్నీ విని, వాస్తవం అనే చిక్కంలో వడపోసి, వాటిలోని మంచిని మాత్రమే గ్రహించడం అతడికి నేర్పండి. మీకు వీలైతే బాధలలోను అతడు నవ్వగలిగేలా చూడండి. అయితే కన్నీరు కార్చడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతడికి నేర్పండి.

నిత్యశంకితులను తిరస్కరించడం అతనికి నేర్పండి. అలాగే అతి మంచితనం
 పట్ల అతడిని అప్రమత్తం చేయండి. తన కష్టానికి, తెలివికి సరైన గౌరవం ఇచ్చే చోట పనిచేయడం అతడికి నేర్పండి. కాని అతను తన హృదయానికి, ఆత్మకి వెలకట్టకుండా చూడండి. అల్లరి మూకల ప్రేలాపనలని పట్టించుకోకుండా, ఎదురొడ్డి పోరడడం అతనికి నేర్పండి. 

అతనితో మృదువుగా వ్యవహరించండి. కాని గారాబం చేయవద్దు. ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తనవుతుంది. అతడిని ధైర్యంతోను, సహనంతోను మెలగనివ్వండి. నిరంతరం తనపై తను గొప్ప విశ్వాసం అలవర్చుకోడం అతనికి నేర్పండి. అప్పుదే అతనికి మానవ జాతిపై విశ్వాసం కలుగుతుంది. వీటన్నింటిలోను మీరు నేర్పగలిగినవి ఆ పసివాడికి నేర్పండి”.


(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో )

(
స్వేచ్చానువాదం! 15 ఏప్రిల్ 2000 నాటి

వార్త దినపత్రిక యొక్క మొగ్గ అనే పేజీలో ప్రచురితం)
http://aanimutyaalu.blogspot.in/ వారికి కృతజ్ఞతలతో,..