Pages

5 September 2013

ఔరంగజేబ్ తన ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరం

అనువాదం - కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 

    

ప్రపంచ చరిత్రలో ప్రసిధ్ది చెందిన ఉత్తరాలలో ఇది ఒకటి, ముల్లా సాలె అనే చిన్ననాటి గురువు, కొలువులో గొప్ప ఉద్యోగం ఇవ్వమని అర్జి పంపినపుడు, తన స్వహస్తాలతో ఔరంగజేబ్ రాసిన తిరుగు సమాధానమిది,. దీనిని తెలుగులో మొదటిసారి 1910 లో అనువదించి,.భారతి మాస పత్రికలో ప్రచురించారు,.

మీరు నాకు అనావశ్యక మైనట్టి అరబ్బీభాష నేర్పుటయందు పెక్కు సంవత్సరములు నిరర్థకముగ గడిపి కోమలమైన నా బుద్ధిని, తీక్ష్ణమైనట్టి నా స్మరణశక్తిని వ్యర్థపుచ్చితిరి. జీవితమునందెన్నడును ఉపయోగపడని భాష రాజపుత్రులకు నేర్పుటకు పది పన్నెండు వత్సరములు వెచ్చించుటయు, ఆభాషయందు నన్ను వైయాకరిణిగను, ధర్మశాస్త్ర జ్ఞు నిగను చేయ యత్నించుటయు నెంత హాస్యాస్పదములు. 

ఉపయోగమైన విద్యలును, జ్ఞానమును బాలకులకు వారి వారి బుద్ధిననుసరించి చిన్ననాడు నేర్పుటయందు కాలము గడుపుటకు మాఱుగా మా గురువులవారగు మీరు మా బాల్యమును వ్యర్థపుచ్చితిరిగదా! అయ్యో! భూగోళజ్ఞానమా ఏమియును లేదు. పోర్చుగలు, హాలండు, ఇంగ్లండు మొదలగు దేశములు కొన్ని కలవనియు, అవి ఆయా స్థలము లందు కలవనియు, నాకు నేర్పితిరా? ఆ దేశములు ద్వీపములా, ద్వీపకల్పములా, సమభూమియందున్నవా, లేక ఎత్తుస్థలములందున్నవా యన్న సంగతులు నాకు తెలియ వలదా? చీనా, పారసీకము, పెరు, తార్తారి మొదలైనదేశముల రాజులు హిందూదేసపు బాదుషహా పేరువిని గజగజ వణికెదరని నా ఎదుట మీరు చేసిన ముఖస్తుతి వలననే దేశ దేశ చరిత్రములన్నియు నాకు తెలిసినవనుకొంటిరా? ఈ జగత్తుమీదనున్న వేరువేరు రాజ్యములెవ్వి? అందలి ఆచారవిచారములు, రాజ్యవ్యవహారములు, మతములు నెట్టివి? ఆ యా రాజ్యములను గల సంపత్తులును, విపత్తులును, ఆ యాదేశము సంపద్విపత్తులలో, ఆ దేశస్థు ల యొక్క ఏ యే గుణావగుణములవలన ఎట్టి యెట్టి మార్పులు గలిగినదియు, ఎట్టి మహత్కారణములచే గొప్పరాజ్యములు తలక్రిందగునదియు అను మహద్విషయములు చరిత్రాధ్యయనములేకయే మా కెట్టుల తెలియ గలవు? ఈ విషయములు మాకు నేర్పితిరా?
రాజపుత్రులు పైని వర్ణింపబడినట్టి యత్యంతావశ్కములగు వివిధ విషయములను నేర్చుకొని జ్ఞానసంపన్నులై తమ బుద్ధిని వికసింపజేయవలను. కావున రాజపుత్రులయొక్క జ్ఞార్జనకాలమగు బాల్యదశయందలి యొక్కొక్క క్షణము మిక్కిలి విలువ గలదియని యెఱింగి నా బాల్యదశను మీరు చక్కగ వినియోగపఱచితిరా? మీరు నాకు లేనిపోనట్టియు, బుద్ధినిభ్రమింపజేయునట్టియు లౌకికవ్యవహారమునకు నిరుపయోగకరమైనట్టియు పరభాషాజ్ఞానము గఱపుటయందే కృతకృత్యులమైతిమని తలంపలేదా? మొదట పరకీయ భాషనొకదానిని నేర్పి దాని మూలముగా శాస్త్రములు, ధర్మవివేచనము, న్యాయనీతి మొదలైన యావశ్యకములైన విద్యలనేర్పుట సులభమని తలంచితిరా? ఈయావశ్యకములగు విద్యలన్నియు మీరు నాకు నామాతృభాషలోనే నేర్పియుండకూడదా?

నేను ఔరంగజేబునకు తత్త్వజ్ఞానశాస్త్రమును నేర్పెదనుఅని మీరు నా తండ్రియగు శహజహాను బాదుషహా గారితో వొకప్పుడనియుంటిరి. మీ రనేకసంవత్సరములకు బ్రహ్మ, ఆకాశము, ఖటపటములు, మొదలైన నీరస శబ్దములచే నేదోయొక విషయము నాకు బోధింప యత్నించినట్లు నాకు జ్ఞాపకమున్నది. ఆ విషయమును గ్రహింపవలయునని నేను పెక్కు పర్యాయములు యత్నించితిని. కాని యందువలన నా జ్ఞాన భాండారమునకును, రాజ్యకర్తృత్వమునకును, ఏమి లాభము కలిగినది? మీరి తేప తేప యుచ్చరించుచున్నందున నీరసములును, పలుకుటకు కఠినములును అగు ఖటపటాది పదములు కొన్ని నాకు జ్ఞాపకమున్నవి. కాని వానితోసంబంధించిన, విషయచర్చ మాత్రము నేను ఎప్పటిదప్పుడు మర చిపోవుచుంటినని మీఱెరుగరా? నేడు ఆవిషయచర్చ జ్ఞాపకమున్నను దాని వలన నాకు ప్రయోజనమేమి? ఇట్లు మీరు కోమలమైనటువంటి నా బుద్ధిని, చురుకుదనమును, వ్యర్థము చేసితిరిగాదే?

నిజముగా నిరుపయోగములైనను మీరు ఆవశ్యకములని తలచిన ఈ విషయములు మీరు నాకు నేర్పినందున మీకు మాత్రమొక లాభము కలిగినది. మూఢులును, అజ్ఞానులును అగు మావంటివారికి మీరు సర్వజ్ఞులనియు, సర్వశాస్త్రపారంగతులనియు, అత్యంతపూజ్యగురువర్యులనియు, నిరథకగౌరవభావమును కొంతకాలమువఱకు పుట్టింపగలిగితిరి. అందువలన పెక్కుదినములవఱకు మీ మాటను మేము మన్నించుట తటస్థించెను.

రాజులను వ్యర్థముగా స్థుతించుట, సత్యమును తలక్రిందు చేయుట, నక్కవినయములు నటించుట యను గుణములు మాత్రము మీయందు చక్కగ వసించుచున్నవి. మిమ్ముల నేను నారాజసభయందు, ఒక సరదారునిగ నియమింపవలయునని మీరు కోరితిరిగదా. మీ యొక్క ఏ గుణమును జూచి నేను మీకాపదవినొసగవలయును? మీరు నాకు రాజకీయ, సైనిక, వ్యావహారికవిద్యలలో నేవిద్య నేర్పితిరని మిమ్ములను నేను గౌరవింతును? నన్ను నావశ్యకములైన విద్యలలో బారంగతునిజేసి యుండిన యెడల సికందరు (అలెగ్జాండరు) బాదుషహాకు పరమపూజ్యగురువర్యుడగు మహావిద్వాంసుడైన అరిస్టాటుల్‌ ఎడలగల పూజ్య భావమునే చూపియుందును. అట్టి యుపయోగకరములగు శిక్షణ గాని లాభకరములగు విద్యలనుగాని నేను మీవలన బడయలేదు. కావున మీ విషయమై గౌరవముగాని, పూజ్యభావముగాని నాకు లేదు. మీరు వచ్చిన త్రోవనే వెళ్ళుడు. మీ పల్లెటూరిలోనే దేవుని స్మరణ చేసికొనుచు కాలము గడుపుడు. మీరు నా రాజసభలో ప్రవేసింపకూడదనియు, మీరెవరో ఇచ్చటివారెవరికిని తెలియకూడదనియు
 నా యభిప్రాయము.

--------
ఈ - మాట పత్రిక వారికి కృతజ్ఞతలతో,.-----

8 comments:

  1. What the letter states applies to 99% of the teachers in profession today - particularly in AP. None of these teachers has any qualification to teach or interest to teach. All they can do is beat kids with a stick! It is a nightmare to get out of school without getting beaten - in Govt schools in particular. These teachers show their discontent in life on the kids and I was one of those guys who was the receiving end - beaten numerous times for nothing. Wished I had a stick to beat them back!

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు మీ వేదనలో నిజముంది,... నిజానికీ ఉత్తరం ప్రతి ఉపాధ్యాయుడు,.విద్యావేత్తలు అందరు చదవవలసిన వాటిలో ఒకటి,.. మీ స్పందన సంతోషం కలిగించింది,.. ధన్యవాదాలండి,.

      Delete
  2. But there are limitations to teachers........as they are supposed to teach the already decided syllabus curriculum by Govt. They themselves cant decide what to teach and what not. If they have such power, many students in India might have become scholars, Still there are many great teachers dedicated to their profession who guided their students in a such a way that they could prosper in their life with good character and riches as they shine in their careers. THANKS TO EACH AND EVERY ONE OF SUCH TEACHERS ON EARTH.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన మాటలలో నిజాయితీ వుందండి,. ధన్యవాదాలు అజ్ఞాత గారు,..

      Delete
  3. అద్భుతమైన సేకరణ, చాలా బాగుంది,

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమా గారు,..

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete