Pages

18 May 2013

సరే, ఇలా మొదలెడదాం



1
విలపించడం ఆగిపోయిన క్షణాలు
కొన్ని గడిచిపోయాక,
మిగిలిన కన్నీళ్లను,
చన్నీళ్లతో జాగ్రత్తగా కడుక్కుని,
అంతే ఆసక్తికరమైన మొఖంలో,
అసంపూర్ణమైన చిరునవ్వుని అద్దుకొని,
నీ ముందు నిలబడి,
తెచ్చిపెట్టుకున్న కొద్దిపాటి బింకంతో,
నేనంటానిలా,.సరే మరో సారి ప్రయత్నిస్తానని,.

2
కొద్ది విరామం తరువాత,
సంరంభాన్ని పక్కకు నెట్టి,
నేనిలా మొదలు పెడతాను,.

నిద్రపోనివ్వని రాత్రులింకా,
పూర్తిగా జ్ఞాపకాలుగా మిగలకముందే, మరవక ముందే
మళ్లీ మళ్లీ ఇలాగే అర్థంకాకుండా మిగుల్తుంన్నదుకు,.
నీ మౌనాన్ని చేధించేందుకు,
మళ్లీ మళ్లీ మాట్లాడుతుంటాను,.
దశాదిశా, తలాతోకా లేకుండా,.

3
మార్మికమైన నీ మొఖాన్ని,
ఏటవాలుగానో, నిటారుగానో పైకెత్తి,
స్థితఃప్రజ్ఞమైన నీ చూపుల్ని,
కనపడని తెంపరితనంగా,
భ్రమపడుతున్న,నా కనులలో నింపుతూ,.
అదే జాలితో,........అంతులేకుండా
మళ్లీ రాయడం మొదలుపెడతావు, నువ్వు.
నా పిచ్చితనాన్ని కూడా,
నీ అక్షరాలలోకి వంపుకుంటూ,...

4
అవే పురాతన ప్రాకృతిక పరిమాళాల్లో,
వెలుగుల్ని నింపుకున్న పసి అరిచేతుల కాంతుల్లో,
నక్షత్రాలు పూస్తున్న లేత బుగ్గల్లో,
ఫాసినేటింగ్ దివారాత్రాల్లో,
ఏకాంతాల్లో,అక్షయ మధుపాత్రల్లో,
చిట్లిపోయి,చీదరపుట్టించే
ఏవో కొన్ని పెదాల /పాదాల చివరి తడుల్లో,.
నీడనివ్వని వాక్యచ్ఛాయల్లో,
దాహం తీర్చక ఊరించే,
కవిత్వపు ఎండమావుల్లో,.
మూసపోసిన పునరుక్త పదవిన్యాస దిగ్భ్రమ భావనల్లో,.
కలాన్ని ముంచి, సుతారంగా సిరానద్దుకొని,.

కరుకు ఖడ్గఛ్చాలనంతో,
కనబడని కదన వ్యూహంతో,
సర్రున చీలుస్తూ,హృదయాన్ని,.
మాటలమూకల తోకల వంకర తీయక,.
దుఃఖాన్ని ద్విగుణీకృతం చేస్తూ,రాస్తూ,.
మళ్లీమళ్లీ రాస్తూ,కోస్తూ,...

5
ఇంకెలా చెప్పాలో  తెలియక దుఃఖిస్తానో,
నిగూఢమైన నీ రాత మర్మాన్ని,
శోధించలేక రోధిస్తానో,.
కొద్ది క్షణాల విరామానంతరమో,
పూర్తిస్థాయి విరమణాంతరమో,.
మరోసారెప్పుడన్నా, మళ్లీ చెబుతాను,.

6
ఇక, ఆ తరువాత
నీ ముఖహృదయ భావనలు,
అక్షరాలుగా మారే, ఓ నిరంతర ప్రక్రియను
తరచితరచి చూస్తూ,
మూలాలను ఎలా పట్టాలో అన్వేషిస్తూ,,
వున్న తేడాలను విశ్లేషిస్తూ,.
ఇంకేమనాలో అర్థంకాక, ఇలా అంటానిప్పుడు,..
డెఫనెట్లీ, సమ్ థింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ

5 comments:

  1. Replies
    1. లక్ష్మీ రాఘవ గారు, ధన్యవాదాలండి,..

      Delete
  2. Replies
    1. అవును,..ధన్యవాదాలు తనోజ్,..

      Delete