1
దారిచూపే వాడొకడు,
వెంటనడిచేవాడొకడు
రాసేవాడొకడు,చదివేవాడొకడు
వెంపర్లాడుతూ
వెంటాడేవాడొకడు
ఇచ్చేవాడొకడు,అనుభవించేవాడొకడు
వెతికేవాడొకడు,నసుగుతూ
బతికేవాడొకడు
అసంతృప్తే కదా,,,ఈ
జీవిత చోదక రాగం
2
వేకువై వెలిగే
వాడొకడు,చీకటై బతికేవాడొకడు
అతి తెలివితేటలతో
తర్కించేవాడొకడు
చచ్చుపుచ్చు తలపులతో
తల్లడిల్లేవాడొకడు
ప్రేమించేవాడొకడు,
పొడిచి చంపేవాడొకడు
నిరంతర తుత్తరతో
చిత్తకార్తె కుక్క ఒకడు
బలహీనతే కదా.,.ఈ బతుకు
అసలు పాట
3
అడుక్కుతింటూ
అలమటించేవాడొకడు
అన్నీ వున్నా,
అర్రులుచాచే వాడొకడు
కొరుక్కుతింటున్న కోరికలతో
కుష్టురోగై
మిగిలేవాడొకడు
ఏమి సాధించామంటూ
ఏడుస్తూ
వెళ్లిపోయేవాడొకడు
దరిద్రమే కదా,., ఈ
లోకపు దివ్యగీతం.
4
విర్రవీగువాడొకడు,భ్రమించువాడొకడు
సేవలో ఒకడు, కీర్తికై
ఒకడు
తనను చూసి తాను
మురియువాడొకడు
మూర్ఖత్వమే మేలను
మేధావి ఒకడు
జ్ఞానినంటూ డప్పుకొట్టువాడొకడు
అమాయకత్వమే కదా,., ఈ
మనిషి మూలతత్వం.