Pages

14 November 2016

ఖలీల్ జిబ్రాన్ - అనువాదం :మృత్యుంజయరావు పిన్నమనేని

3:11

ముత్యం...
ఇసుకరేణువును చుట్టి వున్న
వేదన నుంచి నిర్మితమైన ఆలయం.

మరిమన దేహాలను
ఏ ఆరాటం ఏ రేణువు చుట్టూ నిర్మించింది?

3:12

 దైవం నన్నొక చిన్న గులకరాయిని చేసి
 ఈ అద్భుతమైన సరస్సులోకి విసిరినప్పుడు
 దీని ఉపరితలాన్ని
 అసంఖ్యాకమైన వలయాలతో చికాకు పరిచాను
అడుక్కంటా చేరగానే అచేతనమై పోయాను.


3:13

నాకు నిశ్శబ్దాన్నివ్వు
ఈ నిశిరేయి అంతు చూస్తాను.

 3:14

నా దేహాత్మలు
పరస్పరం ప్రేమించుకొని పెళ్లాడినప్పుడు
 నేను ద్విజుడి నయ్యాను

3:15

గతంలో నాకు తెలిసిన మనిషొకడుండేవాడు
అతనివి పాము చెవులు కానీ పాపం మూగవాడు
యుద్ధంలో అతని నాలుక తెగిపోయింది
ఒక గొప్ప నిశ్శబ్దం ఏర్పడే ముందు
 మనిషి ఎలాంటి పోరాటాలు చేస్తాడో నాకప్పుడు తెలిసింది.

అతను చనిపోయాడు
  నాకదేసంతోషం.
ఈ ప్రపంచం మా యిద్దరికీ చాలినంత పెద్దది కాదు.

3:17
స్మృతి సంయోగానికి మరో రూపం

3:18
విస్మృతి స్వేచ్ఛకు మరో రూపం

3:19

మేము...
అసంఖ్యాక సౌర చలనాలతో కాలాన్ని కొలుస్తాము
వాళ్ళు...
చినచిన్న జేబుల్లోని బులిబుల్లి యంత్రాలతో గణిస్తారు.
ఇప్పుడు చెప్పండి..
వారికీ మాకూ ఒకే స్థలకాలాల్లో కలయిక సాధ్యమా!?

3:20

భూమికీ భానుడికీ మధ్యనుండే దూరం
 దూరం కానే కాదని
 పాలపుంత గవాక్షం నుండి

క్రిందికి చూసేవాడికి తెలుస్తుంది.

No comments:

Post a Comment