Pages

14 November 2016

ఖలీల్ జిబ్రాన్- అనువాదం: మృత్యుంజయరావు పిన్నమనేని

ఇసుక-నురుగు   

ఇసుకా నురుగుల మధ్యన
ఈ తీరాల వెంబడి అనాదిగా నడుస్తున్నాను
 పెనుకెరటం నా పాదముద్రలను తుడిపేస్తుంది
పెనుగాలి నురగను ఊదేస్తుంది
 సముద్రమూ తీరమూ మాత్రం
 ఎప్పటికీ అలాగే ఉంటాయి. 3:1

 గుప్పిట్లో పొగమంచును మూశాను
 తెరిస్తే అదొక క్రిమిగా మారింది
 మళ్ళీ మూసి తెరిచాను, అదొక క్రిమిగా మారింది
మళ్ళీ మూసి తెరుద్దును గదా
 అక్కడొక మనిషి
దిగులుగా పైకి చూస్తూ నిలబడి ఉన్నాడు
 మళ్ళీ మూసి తెరిస్తే అక్కడేమీ లేదు పొగమంచు తప్ప
కానీ.... నేనొక అతిమధురమైన సంగీతం విన్నాను. 3:2

జీవగోళంలో లయతప్పి కంపిస్తున్న
 చిన్నితునక లాగా నన్ను నేను ఊహించుకున్నాను. 
ఇప్పుడు తెలుస్తోంది ... నేనే ఒక గోళాన్ని
 జీవమంతా చిన్న తునకలుగా
నాలోనే లయబద్ధంగా కదులుతోంది. 3:3

వారు మెలకువతో ఉండి నాకో మాట చెప్పారు
నువ్వూ, ఈ నీ ప్రపంచమూ
 అనంతమైన సముద్రతీరంలోని ఒక ఇసుక రేణువు”.
నా కలలోనుంచి నేను వారికి బదులిచ్చాను
 “నేనొక అనంతమైన సముద్రాన్ని
విశ్వాలన్నీ నా తీరంలోని ఇసుకరేణువులు” 3:4

 నేను ఒకేఒక్కసారి మూగబోయాను.
నువ్వెవరు? అని నన్నెవరో అడిగినప్పుడు. 3:5

దేవుడి తొలి తలపు ఒక దేవత
 అతడి తొలి పలుకు ఒక మనిషి 3:6

గాలీ అడవీ 
మనకు మాటలు నేర్పకముందు
 కొన్ని లక్షలేళ్ళు
మనం తడబడుతూ, పరిభ్రమిస్తూ, ఆరాటపడ్డ జీవులం
మరి నిన్న మొన్న నేర్చిన మాటలు 
మనలోని ప్రాచీనతను ఎలా వ్యక్తీకరించగలవు? 3:7

 సింహిక ఒక్కసారే మాట్లాడింది.
 “ఇసుకరేణువంటే ఎడారి
ఎడారంటే ఇసుకరేణువు.
 మరిక మాట్లాడక ఊరుకోండి
నేనది విన్నాను కానీ ఏమీ అర్ధం కాలేదు. 3:8

 నేనొకసారి ఒక స్త్రీమూర్తి ముఖం చూశాను
 ఆమె కింకా కలగాల్సిన సంతానం ఉన్నారనుకున్నాను
అదే ఒక స్త్రీ నాముఖం చూసి
 తను పుట్టకముందే చనిపోయిన
 నా తండ్రి తాతల గురించి తెలుసుకోగలిగింది 3:9

మేధోజీవులు నివసించే గోళంగా
 నన్ను నేను మార్చుకోకపోతే
 నేనొక పరిపూర్ణ మానవుణ్ణి కాలేను


 ప్రతిమనిషి గమ్యమూ అదే కదా! 3:10 

No comments:

Post a Comment